స్వదేశీ కలం | Set up a company in the domestic pens on the name of ratnam | Sakshi
Sakshi News home page

స్వదేశీ కలం

Published Fri, Aug 15 2014 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 11:52 AM

స్వదేశీ కలం

స్వదేశీ కలం

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పట్టణం స్వాతంత్య్రోద్యమ సమయంలో తనదైన పంథాలో పోరాటం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పట్టణం స్వాతంత్య్రోద్యమ సమయంలో తనదైన పంథాలో పోరాటం చేసింది. శాంతి పోరాటం చేసే ఎందరో దేశభక్తుల చేతి ఆయుధంగా మారింది. కత్తితో కాదు కలంతోనే స్వాతంత్య్రం సాధించగలమనేవారికి అండగా నిలిచింది. పదునైన మాటలు, పాటలు ఉద్భవించడానికి తోడ్పడింది. అదే ‘రత్నం’ పెన్ను.

రాజరాజనరేంద్రుడు పరిపాలించిన రాజమహేంద్రవరం (రాజమండ్రి) కోటగుమ్మం సెంటర్ దగ్గరకు అడుగుపెడుతుండగా ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. స్వదేశీ భావన కట్టలు తెంచుకుంటుంది. దేశభక్తి పరిమళాలు గుబాళిస్తాయి. అందుకు కారణం... స్వాతంత్య్ర సమర సమయంలో రూపుదిద్దుకున్న రత్నం పెన్నుల షాపు.
 
స్వాతంత్య్రోద్యమం కదం తొక్కుతున్న సమయంలో 1921లో గాంధీజీ... ‘విదేశీ వస్తువులను నిషేధించి, స్వదేశీ వస్తువుల తయారీపై దృష్టి పెట్టండి’ అని ఇచ్చిన పిలుపును అందుకుని కోసూరి రత్నం అనే స్వర్ణకారుడు  ఏదో ఒక  స్వదేశీ వస్తువు తయారుచేయాలని భావించారు. ముందుగా గాంధీగారి లితోబ్లాక్ ను తయారుచేసి, నాటి మంత్రివర్యులైన కళావెంకట్రావుగారితో కలిసి వార్ధా వెళ్లి, బాపూజీకి స్వయంగా బహూకరించారు. ఆ సందర్భంలో గాంధీజీ... ‘అందరిలోనూ స్వదేశీ భావాలు నాటాలి’ అని సూచించారు. గాంధీజీ ఉపదేశం... తొలి స్వదేశీ కలం ఆవిర్భావానికి కారణమైంది.  
 
పాళీ తయారుచేసి...
రాజమండ్రిలో 1931లో జస్టిస్ కృష్ణమాచారి సబ్‌జడ్జిగా పనిచేసేవారు. ఒకసారి ఆయన వాడే జర్మనీ పెన్ను పాళీ విరిగిపోయింది. ఆయన సన్నిహితులు పెన్నుల తయారీకి రత్నం చేస్తున్న కృషి వివరించి, అక్కడికి వెళ్లమని సూచించారు. రత్నం నివాసానికి కృష్ణమాచారి వెళ్లి పాళీ చూపించారు. మరుసటి రోజు రమ్మని చెప్పి పంపారు రత్నం. ఆ రోజంతా కష్టపడి... కొత్త పాళీలా తయారు చేసి, కృష్ణమాచారికి ఇచ్చారు. ఆయన రత్నంగారిని మెచ్చుకుని, తక్షణం పెన్నుల కంపెనీ ప్రారంభించమని ఒత్తిడి తెచ్చారు.
 
అదే కాలంలో ‘ది హిందూ’ పత్రిక వ్యవస్థాపకులు సుబ్బారావు పంతులు షష్టిపూర్తికి పలువురు సీనియర్ పాత్రికేయులు, ఇతర పెద్దలు హాజరవుతున్న విషయం చెప్పి, ముఖ్యులకు బహుమతి ఇచ్చేందుకు రెండు పెన్నులు తయారు చేయమని కోరారు. దీంతో వెండి గొట్టాలతో, బంగారు పాళీలతో పెన్నులు తయారుచేసి వారికి అందించారు రత్నం సోదరులు. వీటిని చూసిన అక్కడి పెద్దలు, తమకూ పెన్నులు కావాలని ఒత్తిడి చేయడంతో 1932 లో రత్నం పెన్నుల కంపెనీ వ్యవస్థాపనకు తొలి అడుగు పడింది.
 
అక్షరసేవ...
కోసూరి రత్నం, ఆయన సోదరుడు సత్యంతో కలిసి 1932లో ‘రత్నం’ పేరుతో స్వదేశీ పెన్నుల కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ నుంచి వెలువడిన పెన్నుతో బ్రిటిష్ వారిని ఎదిరిస్తూ ఎందరో దేశనాయకులు లేఖాస్త్రాలు సంధించారు. ప్రజలను చైతన్యం చేస్తూ స్వాతంత్య్రోద్యమానికి పురికొల్పిన వేలాది వ్యాసాల రచనకు మాస్టర్ కాపీలను ఈ పెన్నులే అందించాయి. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో అక్షర సేవ చేసింది రత్నం సంస్థ. నాటి ప్రస్థానం నేటివరకూ కొనసాగుతూనే ఉంది.
 
గాంధీగారు గుర్తించిన తర్వాతే...

ఎందరో మహనీయుల ప్రోత్సాహంతో పెన్నుల తయారీ ప్రారంభించిన రత్నం... తాను తయారు చేసిన పెన్నును వార్ధాలో ఉన్న గాంధీజీకి పోస్టులో పంపారు. ఆ పెన్నును తిప్పి పంపుతూ, ‘‘బెంగుళూరు, కలకత్తాల్లో ఇలాగే విదేశీ పెన్నుల విడి భాగాలను అమర్చి విక్రయిస్తున్నా రు. ఇది కూడా అలాంటిదేనని భావిస్తున్నాను’’ అని లేఖ రాశారు. తమ పెన్నులను స్వదేశీ పెన్నుగా బాపూజీ గుర్తించలేదని రత్నం నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో 1935లో అఖిల భారత గ్రామీణ పరిశ్రమల సమాఖ్య అధ్యక్షులు జె.సి.కుమారప్ప రాజమండ్రి వచ్చి పెన్నుల తయారీకి ప్రభుత్వ సహకారం కావాలంటే తమ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, అంతకంటే ముందుగా తనకు ఆ పెన్నులు తయారుచేసి చూపాలని కోరారు.
 
రెండు రోజుల పాటు శ్రమించి రెండు పెన్నులు తయారుచేసి ఆయనకు ఇచ్చారు రత్నం సోదరులు. సుమారు రెండు నెలల తర్వాత 1935 జూలై 16న గాంధీజీ ఆంగ్లంలో స్వదస్తూరీతో రాసిన లేఖ వార్థా నుంచి వచ్చింది. అందులో... ‘‘డియర్ రత్నం, మీరు కుమారప్ప గారి ద్వారా పంపిన పెన్ను అందింది. అందుకు కృతజ్ఞతలు. ఇది నాకు చాలా అవసరం. ఇది విదేశీ పెన్నులకు మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది’’ అని రాశారు. గాంధీ గారు రత్నం పెన్ను వాడుతున్నారన్న వార్త దేశమంతా వ్యాపించింది. దాంతో, అనేకమంది నేతలు రత్నం పెన్నుల కోసం ఎగబడ్డారు. అలా రత్నం పెన్నులకు స్వదేశీ పెన్ను అనే ఖ్యాతి దక్కింది.
 
ఇలా నడుస్తోంది...
యూజ్ అండ్ త్రో పెన్నుల ధాటికి తట్టుకోలేక ఈ కంపెనీ మూత పడే స్థితికి చేరినా, స్వాతంత్య్ర స్ఫూర్తిని పెట్టుబడిగా మలుచుకుని నేటికీ పెన్నుల తయారీని కొనసాగిస్తున్నారు, రత్నం కుమారుడు కె.వి.రమణమూర్తి. పదేళ్లపాటు వ్యాపారం ఒడిదుడుకుల పాలైనప్పటికీ రత్నం బ్రాండ్‌ను కొనసాగించాలనే నిర్ణయంతో పాతకాలం మెషినరీకి పదునుబెడుతూ ఇప్పటికీ పెన్నులు తయారుచేస్తున్నారు. ప్రపంచంలో అతి చిన్న పెన్ను తయారుచేసినందుకుగాను రికార్డులకెక్కారు. బంగారం పెన్నుపై గాంధీగారు, భారతమాత చిత్రాలను గీసిన ఖ్యాతి దక్కింది. స్వాతంత్య్ర ఉద్యమానికి అక్షరరూపం ఇచ్చిన రత్నంగారి కృషి కి నేటికీ ప్రభుత్వ గుర్తింపు లభించకపోవడం కాస్త బాధ కలిగించే విషయమే!

- దేవళ్ల సూర్యనారాయణ మూర్తి, సాక్షి, రాజమండ్రి
ఫొటోలు: వీరభగవాన్ తెలగరెడ్డి

 
ఆవిర్భావం...
‘పిన్ను నుంచి పెన్ను వరకు’ అన్న గాంధీజీ మాటల్లోని ‘పెన్ను’ నాన్నగారిని ఆకర్షించింది. 1922 నుంచి పెన్నుల తయారీ పై దృష్టిపెట్టారు. అప్పట్లో చలామణీలో ఉన్న విదేశీ పెన్నులను అయ్యంగారి శ్రీరామమూర్తి మచిలీపట్నంలోని ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ ల్యాబ్‌లో పరీక్ష చేయించి, అందులో వాడే మూల పదార్థాలను నాన్నగారికి వివరించారు. ముందుగా 14 క్యారెట్ల బంగారంతో పాళీ తయారుచేశారు.  1930 నాటికి స్వదేశీ పెన్నుకు రూపు తెచ్చారు.
 - కె.వి.రమణమూర్తి, (రత్నం కుమారుడు)
 
వీరంతా రత్నం పెన్నులు వాడారు...
ఉమ్మడి మద్రాసు రాష్ట్ర గవర్నర్‌గా, ముఖ్యమంత్రిగా పని చేసిన సర్ కూర్మా వెంకటరెడ్డి నాయుడు, నెహ్రూ,పిఠాపురం మహారాజు ఎం.ఎస్.థామ్సన్, రిజర్వ్‌బ్యాంకు నాటి గవర్నర్ బి.వెంకటప్పయ్య, బెనారస్ మహారాజు విజయానంద గజపతి, నైజాం ప్రభుత్వ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు , భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్, మాజీ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆయన సమకాలీనులు రత్నం పెన్నులను విరివిగా వినియోగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement