సెటైక్ గాడ్జెట్స్ | Setaik Gadgets | Sakshi
Sakshi News home page

సెటైక్ గాడ్జెట్స్

Published Wed, Aug 27 2014 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 12:32 PM

Setaik Gadgets

కిటికీ అద్దం... కరెంటు!

కిటికీ అద్దాలు వెలుగుతోపాటు కొంచెం కరెంటు కూడా అందిస్తే ఎలా ఉంటుంది? ఫొటోలో కనిపిస్తున్న గాజుముక్క ఈ పనే చేస్తుంది. మిషిగన్ స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అభివద్ధి చేశారు దీన్ని. ఈ రకమైన అద్దాల తయారీకి  చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నా పారదర్శకంగా ఉంటూ సౌరశక్తిని గ్రహించేలా చేయగలగడం ఇదే తొలిసారి. మనిషి కంటికి కనిపించని పరారుణ, అతినీలలోహిత కిరణాల్లోని శక్తిని ప్రత్యేక పదార్థాల సాయంతో సేకరించి... గాజు అంచుల్లో ఏర్పాటు చేసే సూక్ష్మస్థాయి సౌరశక్తి ఘటకాలకు సరఫరా చేయడం ద్వారా ఈ అద్దాలు విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ప్రస్తుతం వీటి సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయి. వీటిని విద్యుదుత్పత్తికి మాత్రమే కాకుండా స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లుగానూ ఉపయోగించుకునే అవకాశముందని ఈ పరిశోధనలు చేపట్టిన శాస్త్రవేత్త రిచర్డ్ లంట్ అంటున్నారు.
 
పరికరం చిన్న...ప్రయోజనం మిన్న..!
 
వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఖర్చుతో కూడుకున్నవి, వ్యయప్రయాసలూ ఎక్కువే. కానీ ఫొటోలో కనిపిస్తున్న చిన్న పరికరాన్ని చూశారుగా... రక్త, మూత్రపరీక్షలను చిటికెలో చేసేస్తాయి. మొబైల్‌ఫోన్‌ను జత చేస్తే.. ఫలితాలను ఎక్కడికైనా పంపవచ్చు. తగిన సలహా, సూచనలు పొందవచ్చు కూడా. హార్వర్డ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ పరికరాన్ని భారతదేశంలోనే పరీక్షిస్తున్నారు. కేవలం రూ.1500తో తయారు చేయగల ఈ పరికరం ఏ మొబైల్‌ఫోన్‌తోనైనా పనిచేస్తుంది. ఏ రకమైన పరీక్ష నిర్వహించాలన్నది సెలెక్ట్ చేసుకునేందుకు, రెండు బటన్‌లు ఉంటాయి. పరీక్షించాల్సిన పదార్థంలోకి కొసను ముంచి విద్యుత్తు వోల్టేజీ పంపినప్పుడు రసాయన సమ్మేళనాలను గుర్తించి విశ్లేషణ జరుపుతుంది. మధుమేహం, మలేరియా వంటి వ్యాధులతోపాటు వాతావరణ కాలుష్యాలను, నీటి కాలుష్యాన్ని కూడా ఈ పరికరం ద్వారా గుర్తించగలగడం మరో విశేషం.
 
కరవును గుర్తించేందుకు నాసా ఉపగ్రహం...
 
నాలుగు చినుకులు పడగానే దుక్కిదున్నడం... విత్తులేయడం రైతుల పని. కురిసిన వర్షం సరిపోకపోతే పంట చేతికందకపోవడమూ కద్దు.  మరి  నేల పైభాగంలో ఎంత తేమ ఉందో తెలిస్తే? అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ మరో రెండు నెలల్లో ప్రయోగించే ‘సాయిల్ మాయిశ్చర్ ఆక్టివ్, పాసివ్ (ఎస్‌మ్యాప్)’ ఉపగ్రహం ఇదే పనిచేయనుంది. భూమికి 365 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ ప్రపంచం మొత్తమ్మీద ఉపరితల తేమను లెక్కకట్టడం దీని లక్ష్యం.  ఉపరితలం నుంచి అయిదు సెంటీమీటర్ల లోతువరకూ ఉండే తేమను గుర్తిస్తుంది ఈ ఉపగ్రహం. ఎస్‌మ్యాప్ ఒకసారికి దాదాపు 50 కిలోమీటర్ల విస్తీర్ణంలోని తేమను లెక్కిస్తుంది. రెండు మూడు రోజులకు భూమి మొత్తం వివరాలు సేకరించగలుగుతుంది. కరవు పరిస్థితులను ముందుగానే తెలుసుకొనేందుకు ఎస్‌మ్యాప్ ఉపయోగపడుతుందని నాసా శాస్త్రవేత్త నరేంద్ర దాస్ తెలిపారు.
 
కంటి పరీక్షలకు హైటెక్ కెమెరా!


బాష్ ఇంజినీరింగ్ కంపెనీ తొలిసారి కంటి పరీక్షలను సులువు చేయగల, చేతిలో ఇమిడిపోయే సరికొత్త హైటెక్ కెమెరాను  తయారు చేసింది. ఈ పరికరం తాలూకూ ఆలోచన, ఆచరణ మొత్తం భారత్‌లోనే పూర్తికావడం విశేషం. అరచేతిలో పట్టుకుని పరీక్షించగలిగేలా ఉండటం ద్వారా ఈ పరికరాన్ని ఎక్కడైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. డయలేషన్ లేకుండా (కళ్ల పరీక్షకు ముందు చుక్కల మందు వేయడాన్ని డయలేషన్ అంటారు) కూడా కళ్లను పరీక్షించగలగడం దీని మరో ప్రత్యేకత. కంటి జబ్బులను గుర్తించేందుకు అత్యాధునిక సాఫ్ట్‌వేర్ అల్గారిథమ్స్‌ను ఉపయోగించారు. కంటి ముందు, వెనుకభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను గుర్తించేలా దీని నిర్మాణంలో తగు జాగ్రత్తలు తీసుకున్నారు. కళ్లజోడు దుకాణాలు మొదలుకొని ఆసుపత్రుల వరకూ అందరూ సులువుగా ఉపయోగించవచ్చు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement