
ఆమె అతణ్ణి పెళ్లాడాలనుకుంది
లవ్ స్టోరీ
ప్రేమ కథలు స్ట్రేంజ్‌గా ఉంటాయి. డాన్సర్‌గా, నటిగా, కమెడియన్‌గా సుదీర్ఘమైన ప్రస్థానం కొనసాగించిన అరుణ ఇరానీ కూడా ఒకసారి ప్రేమలో పడింది. పడటమే కాదు పెళ్లాడాలని అనుకుంది కూడా. ఎవర్నో తెలుసా? క్యారెక్టర్ యాక్టర్ శ్రీరాం లాగూను. ఆయన మరాఠి నాటక రంగ దిగ్గజం. అంతే కాదు, సినీ రంగంలో పెద్దమనిషి. అరుణ ఇరానీ ఆయన మీద మనసు పారేసుకుంది. నోరు తెరిచి పెళ్లి చేసుకోమంది. ఆయన కంగారు పడి అరుణ పేరెత్తితే చుట్టుపక్కల లేకుండా వెళ్లిపోయేవాడు. పాపం అని అరుణ వదిలేసింది. అరుణ జీవితంలో చాలామంది పురుషులు తారసపడ్డారు. కమెడియన్ మెహమూద్‌ను ఆమె పెళ్లాడిందని, వాళ్లిద్దరూ కలిసి జీవిస్తున్నారని మీడియా కథనాలు రాసింది. వాళ్ల పోబడి కూడా అలాగే ఉండేది. వాళ్లిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఎవరు ఎవరిని ఉపయోగించుకున్నారో చెప్పడం కష్టం. కాని కుటుంబాన్ని నిలబెట్టడానికి అరుణ చాలా కష్టాలు పడింది.
ఆమెకు ఏమాత్రం డాన్స్ రాదు. కాని డాన్సర్‌గా ఉంటూ క్లబ్‌సాంగ్స్‌కు గంతులేసే అమ్మాయిలకు డిమాండ్ ఉందని తెలిసి నేర్చుకుంది. ‘బాబీ’లో ‘మై షాయర్ తో నహీ’ పాటకు డాన్స్ చేయడంతో ఆమె ఎక్కువమంది ప్రేక్షకులకు తెలిసింది. అరుణకు ఇప్పుడు దాదాపు 70 ఏళ్లు. కాని సినిమాల్లోనూ టీవీల్లోనూ నేటికీ రెండు షిఫ్ట్‌లు పని చేస్తోంది. దర్శకుడు ఇంద్రకుమార్ (దిల్, బేటా ఫేమ్) ఈమె సోదరుడే.