సైలెంట్‌ రాకెట్‌ | Sheik Jafreen Confident of Winning Gold in Deaflympics 2021 | Sakshi
Sakshi News home page

సైలెంట్‌ రాకెట్‌

Published Sat, Oct 5 2019 3:21 AM | Last Updated on Sat, Oct 5 2019 3:21 AM

Sheik Jafreen Confident of Winning Gold in Deaflympics 2021 - Sakshi

ఆమెకు స్పష్టమైన వాక్కు లేదు.. అయినా తనకున్న ప్రతిభతో లోకం అవాక్కు అయ్యేటట్లు చేసింది. ధ్వని తరంగాలు ఆమె చెవిని తాకలేవు.. కానీ ఆమె మోగించిన విజయదుందుభి ప్రపంచమంతా ప్రతిధ్వనించింది. బధిరుల విభాగంలో టెన్నిస్‌ ఆటలో భారతదేశంలోనే నంబర్‌ వన్‌ ర్యాంకర్‌గా, ప్రపంచంలో 12వ ర్యాంకర్‌గా నిలిచిన షేక్‌ జాఫ్రీన్‌ విజయగాధ ఇది.

షేక్‌ జాఫ్రీన్‌కు పుట్టకతోనే చెవుడు. ఏమాత్రం వినిపించదు. ఇతరులు మాట్లాడితే ఆర్థం చేసుకోగలరు. అయితే సత్తా చాటేందుకు ఈవేమీ ఆమెకు అడ్డుకాలేదు. లెక్కలేనన్ని పతకాలు, ట్రోఫీలు, సర్టిఫికెట్‌లు సాధించారు. వాస్తవానికి కర్నూలులో టెన్నిస్‌ క్రీడకు వసతులు, సౌకర్యాలు లేవు. కోచ్‌ లేరు. అయినా కేవలం ఆ క్రీడ పట్ల ఆమెకు ఉన్న ఆసక్తి అంతర్జాతీయ స్థాయిలో పేరు సాధించిపెట్టింది. జాఫ్రీన్‌ క్రీడను మెచ్చి ప్రముఖ అంతర్జాతీయ క్రీడాకారిణి సానియా మీర్జా తన ఆకాడమీలో ఉచితంగా శిక్షణ పొందే అవకాశం కల్పించారు. జాఫ్రీన్‌ తండ్రి షేక్‌ జాకీర్‌ అహ్మద్‌ కర్నూలులో న్యాయవాది. ఆమె తల్లి షేక్‌ మైమున్‌ రిహాన. బి క్యాంపు ఏరియాలో నివాసం. ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు జావీద్‌ అహ్మద్‌ బీటెక్‌ పూర్తి చేశాడు.

కుమార్తె షేక్‌ జాఫ్రీన్‌ స్థానిక పాఠశాలలో చదివి, ఆరవ తరగతి నుంచి శ్రీలక్ష్మీ ఇంగ్లీషు మీడియం స్కూలులో చేరి, టెన్త్‌లో ‘ఏ’ గ్రేడ్‌తో పాసై ప్రతిభ అవార్డు సాధించింది. ఇంటర్‌ ప్రైవేటు కళాశాలలో, డిగ్రీ (బీఏ) ఉస్మానియా మహిళల డిగ్రీ కళాశాలలో పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె హైదరాబాదులోని మెహిదీపట్నం సెయింట్‌ ఆన్‌ ఉమెన్స్‌ కళాశాలలో ఎంసీఏ చేస్తున్నారు. జాఫ్రీన్‌ తండ్రి జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రికెట్‌ ఆడేవారు. ప్రతిరోజు కూతుర్ని స్టేడియంకు తీసుకెళ్లేవారు. అలా.. పక్కనే ఉన్న టెన్నిస్‌ క్లబ్‌ వైపు వెళ్లి ఆ ఆటపై మక్కువ పెంచుకుంది పద్నాలుగేళ్ల క్రితమే చిన్న వయసులో ర్యాకెట్‌ జాఫ్రీన్‌. అప్పటి నుండి టెన్సిస్‌లో మెరుపులు మెరిపిస్తోంది. జాఫ్రీన్‌ ఫోర్‌ హ్యాండ్‌ షాట్‌లో ఆరితేరారు. బలమైన షాట్లతో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టడంలో దిట్ట. ఎలాంటి శిక్షణ, మౌలిక సదుపాయాలు లేకున్నా.. దాతల సహకారంతో ఆడి తనకున్న లక్ష్యంతో రాకెట్‌లా దూసుకు పోతున్నారు.

ఊహించని వరం హైదరాబాదులోని ముర్తుజా గూడలో ఉన్న సానియా టెన్నిస్‌ అకాడమీలో శిక్షణ పొందే అవకాశం రావడం అంత సులువేమికాదు. దేశవ్యాప్తంగా పోటీ ఉంటుంది. లక్షల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. అయినా సీటు వస్తుందన్న గ్యారెంటీ లేదు. పదునైన షాట్లతో టెన్నిస్‌ క్రీడలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న జాఫ్రీన్‌ ఆట తీరును చూసి సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్‌ మీర్జా నేరుగా జాఫ్రీన్‌ తండ్రి జాకీర్‌కు ఫోన్‌ చేసి తన అకాడమీలో ఉచితంగా శిక్షణ అందిస్తామని పిలిచారు. ఆ అకాడమీలో జాఫ్రీన్‌కు ఉచితంగా సీటు లభించడం అమె ప్రతిభకు దక్కిన గుర్తింపే. అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బెంగళూరులోని జీషాన్‌ టెన్నిస్‌ అకాడమీలో జాఫ్రీన్‌ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. 2021 వరకు ఈ శిక్షణ ఉంటుంది.

ఒలింపిక్స్‌ లక్ష్యంగా సాధన
ఈ ఏడాది అక్టోబరు 12 నుంచి 19 వరకు టర్కీలోని అంతలియా సిటీలో జరిగే వరల్డ్‌ ఛాంపియన్‌షిప్, నవంబరు 1 నుంచి 12 వరకు హాంకాంగ్‌లో జరిగే ఏషియన్‌ పసిఫిక్‌ డెఫ్‌ గేమ్స్‌కు జాఫ్రీన్‌ ఎంపికయ్యారు. 2021లో దుబాయిలో జరిగే ఒలింపిక్స్‌ డెఫ్‌ విభాగంలో బంగారు పతకం సాధించడమే ముందున్న లక్ష్యంగా శిక్షణ తీసుకుంటున్నారు. టర్కీ, ఏషియన్‌ ఆటలతోపాటు ఒలింపిక్స్‌లోనూ ఆమె బంగారు పతకం సాధించి, భారతదేశం పేరును ప్రపంచానికి చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
– ఎస్‌.పి. యూసుఫ్, సాక్షి, కర్నూలు

వరుస విజయాలు.. పతకాలు
2012లో న్యూఢిల్లీలో జరిగిన 20వ జాతీయ స్థాయి డెఫ్‌ (బదిర) క్రీడాపోటీల్లో మహిళల సింగిల్స్, డబుల్స్‌ పోటీల్లో బంగారు పతకం. 2013లో  న్యూఢిల్లీ స్పోర్ట్సు అథారిటి ఆఫ్‌ ఇండియా తరపున బల్గేరియా లోని సోఫియా సిటీలో జరిగిన డెఫ్‌ ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం. జపాన్‌లో జరిగిన మొదటి రౌండ్‌లో, రెండవ రౌండ్‌లో టర్కీపై విజయం. 2014లో జర్మనీలోని హంబర్గ్‌ రాష్ట్రంలో నిర్వహించిన 2వ ఓపెన్‌ డెఫ్‌ యూత్‌ టెన్నిస్‌ కప్‌ క్రీడ పోటీల్లో సింగిల్స్, డబుల్స్‌ విభాగంలో రెండు వెండి పతకాలు.

2015లో తైవాన్‌లోని తయూనా సిటీలో జరిగిన 8వ ఆసియా పసిఫిక్‌ డెఫ్‌ క్రీడల్లో రజత పతకం. 2016లో స్లోవేనియాలోని పోర్టురోజ్‌ రాష్ట్రంలో జరిగిన స్లోవెనీయా డెఫ్‌ టెన్నిస్‌ ఓపెన్‌ డబుల్స్‌ విభాగంలో బంగారు పతకం, సింగిల్స్‌ విభాగంలో రజత పతకం. 2017లో టర్కీలో జరిగిన మిక్స్‌డ్‌ డబుల్‌ ఒలింపిక్‌లో కాంస్య పతకం. అదే ఏడాది జరిగిన స్లోవేనియా డెఫ్‌ టెన్సిస్‌ ఓపెన్స్‌లో రజిత పతకం. 2018లో టర్కీలో జరిగిన ప్రపంచ డెఫ్‌ టెన్నిస్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో 8వ స్థానం. 2019 జనవరి 27 నుంచి 31 వరకు చెన్నైలో జరిగిన సింగిల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో 23వ జాతీయ ఆటల్లో బంగారు çపతకం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement