సిరి.. నడమంత్రం కాకూడదంటే..
హాలీవుడ్ సెలెబ్రిటీలపై డాలర్ల వర్షం కురుస్తుంటుంది. హీరో, హీరోయిన్ల సంగతైతే చెప్పనవసరమే లేదు. వారి నట్టింట్లో లక్ష్మీదేవి నడయాడుతూ ఉంటుంది. అయితే, ఆడంబరంగానో, అనాలోచితంగానో చేసిన ఖర్చులు, పెట్టుబడులతో ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోయి దివాలా తీసిన వారు కొందరుంటే జైలుపాలైన వారు మరికొందరున్నారు. డెమాలిషన్ మ్యాన్ వంటి సుప్రసిద్ధ సినిమాల్లో నటించిన వెస్లీ స్నైప్స్... పన్ను సంబంధ కేసుల్లో చిక్కుకుని కటకటాలపాలయ్యాడు. విమానాలు, విలాసవంతమైన కార్ల వంటివి కొనుగోలు చేసిన హీరో నికొలస్ కేజ్... ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతున్నాడు. జెన్నిఫర్ లోపెజ్, బ్రిట్నీ స్పియర్స్ కూడా వ్యాపారం చేసి చేతులు కాల్చుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ జాబితాలో చాలామందే ఉన్నారు. వీరంతా ఎందుకు పప్పులో కాలేశారని అడిగితే, ఆర్థిక నిపుణులు చెప్పిన ఐదు కారణాలివీ...
మనీ మేనేజ్‌మెంట్ తెలియదు
సెలెబ్రిటీల్లో ఎక్కువ మంది చాలా సృజనాత్మకంగా ఆలోచిస్తారు. కానీ, బిజినెస్ విషయాలకు తగినంత సమయం కేటాయించడానికి మాత్రం ఇష్టపడరు. ఫైనాన్షియల్ ప్లానర్లు, బిజినెస్ మేనేజర్ల సలహాలను వీరు తీసుకుంటారు. కానీ, వాటిని పట్టించుకోరు. తమ ఇష్టాయిష్టాల ప్రకారమే వ్యవహరిస్తారు.
తగిన అడ్వయిజర్లు లేకపోవడం
తమకు తగిన బిజినెస్, ఫైనాన్షియల్ మేనేజర్లను ఎంపిక చేసుకునే నైపుణ్యం కొంతమంది సెలెబ్రిటీలకు లేకపోవడం కూడా సమస్యలకు దారితీస్తోంది. తమ పెట్టుబడులపై అధిక ఆదాయం సంపాదించడమెలా అన్న అంశంపై వీరు దృష్టిపెట్టరు. తాము తర్వాత చేయబోయే పాత్ర గురించి ఆలోచిస్తారుగానీ, పెట్టుబడి ప్రణాళికలను పట్టించుకోరు.
నమ్మకద్రోహం
ఎంత గొప్ప సెలెబ్రిటీలైనా సాధారణ మనుషులే కదా. అందుకే, కుటుంబ సభ్యులనో, స్నేహితులనో పూర్తిగా నమ్మేసి మునిగిపోతుంటారు. చాలామంది సెలెబ్రిటీలు తమ స్నేహితులకు సాయం చేసే ఉద్దేశంతో వారిని వ్యాపారంలోకి భాగస్వాములుగానో, ఉద్యోగులుగానో తెస్తుంటారు. ఈ స్నేహితులు అవసరం తీరాక ముఖం చాటేసిన సంఘటనలెన్నో ఉన్నాయి.
డ్రగ్స్, దురలవాట్లు
సెలెబ్రిటీల పార్టీల్లో మద్యం ఏరులై పారుతుంటుంది. కొందరు డ్రగ్స్‌కు బానిసలవుతుంటారు. మద్యం, మత్తు ప్రభావంతో ఉన్న వారు తగిన వ్యాపార, పెట్టుబడి నిర్ణయాలను తీసుకోలేరు. గతంలో ఓ వెలుగు వెలిగిన కొందరు సెలెబ్రిటీలు దురలవాట్ల కారణంగా బికారులుగా మారిన సంఘటనలున్నాయి.
ఆర్భాటం
సెలెబ్రిటీలుగా మారి సంఘంలో కొంత గుర్తింపు రాగానే కుక్, డ్రైవర్, పర్సనల్ సై ్టలిస్ట్, పర్సనల్ అసిస్టెంట్... ఇలా బోలెడు మంది ఉద్యోగులను నియమించుకుంటారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడతారు. సినిమాల్లో అవకాశాలు ఆగిపోయినప్పటికీ తమకు మళ్లీ మంచి రోజులొస్తాయనే ఆశతో సిబ్బందిని కొనసాగిస్తారు. తద్వారా జేబులో చిల్లిగవ్వ మిగలని స్థితికి చేరుకుంటారు. హాలీవుడ్ సెలెబ్రిటీల కథలన్నీ సంతోషంగా ముగియవు. కానీ, మెరుగైన ఆర్థిక సలహాలు, సూచనలతో వీరి కథలు కనీసం విషాదాంతం కాకుండా ఉంటాయి.