నరికిన చెరకులు కొరికిన తియ్యన. చింత చిగురులు.. నలిపిన పుల్లన. కారము కారము.. మిరపలు కలిపిన. చేదు దిగును చెట్టెక్కి పూత రాల్పిన.వగరు చేరును లేత మామిళ్లు కోసిన.ఉగాది వచ్చును.. ఉప్పొక్కటి వేసిన.
మిరియాలఫ్రైడ్ రైస్(కారం)
కావలసినవి: బాస్మతి బియ్యం – మూడు కప్పులు; నెయ్యి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; జీలకర్ర – ఒక టీ స్పూను; ఆవాలు – ముప్పావు టీ స్పూను; నల్ల మిరియాలు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; నువ్వులు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; కరివేపాకు – 3 రెమ్మలు; ఉప్పు – రుచికి తగినంత.
తయారి:
►ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి, గంటసేపు నానబెట్టాక, నీళ్లు ఒంపేసి, తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి
►బాణలిలో నూనె లేకుండా మిరియాలు, నువ్వులు, కరివేపాకు వేసి దోరగా వేయించి తీసి, బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి
►బాణలిలో నెయ్యి వేసి కరిగాక ఆవాలు వేసి చిటపటలాడేవరకు వేయించాలి
►జీలకర్ర జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి
►ఉడికించిన అన్నం జత చేసి కలపాలి
►మెత్తగా పొడి చేసిన మిరియాల పొడి మిశ్రమం, ఉప్పు జత చేసి మరోమారు కలిపి దింపేయాలి
►అప్పడాలతో కలిపి తింటే రుచిగా ఉంటుం.
చెరకురసం ఖీర్ (తీపి)
కావలసినవి: చెరుకు రసం – 2 కప్పులు; బాస్మతి బియ్యం – ఒక కప్పు (శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి అరగంటసేపు నానబెట్టాలి); బెల్లం పొడి – అర కప్పు; పాలు – 2 కప్పులు; జీడి పప్పులు – 3 టేబుల్‌స్పూన్లు; పచ్చి కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు.
తయారి:
►ఒక పెద్ద పాత్రలో పాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి
►నానబెట్టిన బియ్యం జత చేసి ఉడికించాలి (మధ్యమధ్యలో కలుపుతుండాలి)
►చెరకురసం జత చేసి సుమారు అయిదారు నిమిషాలు ఉడికించి దింపేయాలి
►బెల్లం పొడి, కొబ్బరి తురుము, జీడిపప్పులు జత చేసి కలిపి అందించాలి.
వేప పువ్వుముద్ద కూర(చేదు)
కావలసినవి: ఎండబెట్టిన వేప పువ్వు – 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి – ఒక టీ స్పూను; రసం పొడి – ఒక టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఆవాలు – పావు టీ స్పూను; ఎండు మిర్చి – 2; కరివేపాకు – 2 రెమ్మలు; చింతపండు – నిమ్మకాయ పరిమాణంలో; బెల్లం పొడి – రెండున్నర టీ స్పూన్లు; సెనగ పప్పు – అర టీ స్పూను; మినప్పప్పు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత.
తయారి:
►అర గ్లాసు నీళ్లలో చింతపండును సుమారు పది నిమిషాలు నానబెట్టి, చిక్కటి రసం తీసి పక్కన ఉంచాలి
►స్టౌ మీద బాణలి ఉంచి, వేడయ్యాక టీ స్పూను నెయ్యి వేసి కరిగించాలి
►సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, పసుపు, ఎండుమిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాక, వేప పువ్వు వేసి దోరగా వేయించాలి
►చిక్కగా తీసిన చింతపండు రసం జత చేసి బాగా కలపాలి
►బెల్లం పొడి, రసం పొడి, ఉప్పు జత చేసి మరోమారు బాగా కలిపి, సుమారు ఏడెనిమిది నిమిషాలు స్టౌ మీద ఉంచి దింపేయాలి
►కరివేపాకుతో అలంకరించాలి
►పొంగల్, రాగి సంగడితో అందిస్తే రుచిగా ఉంటుంది.
మామిడికాయడ్రింక్ (వగరు)
కావలసినవి: మామిడికాయలు – 2; మిరియాల పొడి – చిటికెడు; నల్ల ఉప్పు – 2 టీ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; బెల్లం పొడి – 3 టేబుల్ స్పూన్లు; నీళ్లు – ఒక గ్లాసుడు; జీలకర్ర పొడి – పావు టీ స్పూను; బెల్లం పాకం – రెండు టేబుల్ స్పూన్లు; పుదీనా ఆకులు – కొద్దిగా.
తయారి:
►మామిడికాయలను శుభ్రంగా కడగాలి
►ఒక గిన్నెలో మూడు కప్పుల నీళ్లు పోసి, కడిగిన మామిడికాయలను జతచేసి, కుకర్‌లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి
►బాగా చల్లారాక, మామిడి కాయల తొక్క వేరు చేసి, మామిడి గుజ్జును చేతితో మెత్తగా చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి
►ఒక పాత్రలో ముప్పావు కప్పు నీళ్లు, మూడు టేబుల్ స్పూన్ల బెల్లం వేసి కరిగించి, స్టౌ మీద ఉంచి, ఐదు నిమిషాలయ్యాక దింపేయాలి
►బ్లెండర్‌లో నాలుగు టేబుల్ స్పూన్ల మామిడికాయ గుజ్జు, పావు టీ స్పూను జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల బెల్లం పాకం, చిటికెడు మిరియాల పొడి, పావు టీ స్పూను నల్ల ఉప్పు, ఆరేడు పుదీనా ఆకులు వేసి మిక్సీ పట్టాక, తగినన్ని చల్లని నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ తిప్పి తీసేసి, గ్లాసులలో పోసి అందించాలి.
చింతపండు పచ్చి పులుసు (పులుపు)
కావలసినవి: చింతపండు రసం – రెండు కప్పులు (కొద్దిగా పల్చగా తీసిన రసం); ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 3 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); కొత్తిమీర – చిన్న కట్ట; బెల్లం పొడి – టీ స్పూను; ఉప్పు – రుచికి తగినంత.
పోపు కోసం: ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; ఇంగువ – చిటికెడు; ఎండుమిర్చి – 2; వెల్లుల్లి రేకలు – 4; నూనె – కొద్దిగా.
తయారి:
►ఒక బౌల్‌లో చింతపండు రసం, కరివేపాకు, బెల్లం పొడి, ఉల్లి తరుగు, ఉప్పు వేసి చేతితో బాగా కలపాలి. (ఉప్పు, తీపి తగ్గినట్టుగా అనిపిస్తే, మరింత జత చేసుకోవచ్చు)
►స్టౌ మీద చిన్న బాణలి ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి కాగాక, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి
►కరివేపాకు, ఇంగువ, ఎండు మిర్చి, వెల్లుల్లి రేకలు, కరివేపాకు జత చేసి బాగా వేగిన తరవాత తీసి, తయారుచేసి ఉంచుకున్న పచ్చిపులుసులో వేసి కలపాలి అన్నంలోకి రుచిగా ఉంటుంది.
ఉగాది పచ్చడి
కావలసినవి: నీళ్లు – మూడు గ్లాసులు; చింతపండు – పెద్ద నిమ్మకాయ పరిమాణం; చిన్న చిన్న చెరకు ముక్కలు – 20; అరటి పండు – 2 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); బెల్లం పొడి – ఒక కప్పుడు; వేప పువ్వు – 2 టేబుల్ స్పూన్లు; మామిడి కాయ – 1 (తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు చేయాలి); ఉప్పు – చిటికెడు; పచ్చి మిర్చి – 4 (చిన్న చిన్న ముక్కలు చేయాలి)
తయారి:
►ముందుగా చింతపండును గ్లాసుడు నీళ్లలో నానబెట్టి, రసం తీసి ఒక గిన్నెలో పోయాలి
►మూడు గ్లాసుల మంచి నీళ్లు జతచేయాలి
►బెల్లం పొడి, ఉప్పు జత చేసి బాగా కలపాలి
►వేప పువ్వు, అరటి పండు ముక్కలు, మామిడికాయ ముక్కలు, చెరకు ముక్కలు, పచ్చి మిర్చి జత చేసి బాగా కలిపి గ్లాసులలో పోసి అందించాలి.
Comments
Please login to add a commentAdd a comment