కీ ప్యాడ్‌ పై ఉగాది | Celebrities join kids to Cook Ugadi Pachadi | Sakshi
Sakshi News home page

కీ ప్యాడ్‌ పై ఉగాది

Apr 6 2019 2:52 AM | Updated on Apr 6 2019 2:52 AM

Celebrities join kids to Cook Ugadi Pachadi - Sakshi

ఆ పండగ అలాగే ఉందా? తెల్లవారి వేణ్ణీళ్ల స్నానాలు, కొత్త బట్టలు కట్టుకోవడాలు, పిల్లలు మామిడి పూతకు పరుగులు, వైరు బుట్ట అందుకుని ఇంటి పెద్ద తెచ్చే సరుకులు, వంటగదిలో ఏదో ఒక పిండి వంట, ఇంటిల్లిపాది ముఖాల కళ నిండిన చిరునవ్వు... అవి అలాగే ఉన్నాయా? భౌతికంగా ఉన్నాయా? అభౌతికంగా మారిపోయాయా? ఇవాళ పండుగలన్నీ సెల్‌ఫోన్‌ నుంచి సెల్‌ఫోన్‌ వరకే నడుస్తున్నాయా? మొదటి సందడి అక్కడే మొదలవుతుందా? గతంలో కనీసం ఫోన్‌ చేసి గొంతైనా వినిపించి అభినందనలు చెప్పేవారు. ఇవాళ ఒక వాట్సప్‌ మెసేజ్‌తో సరి. అదీ సొంతగా టైప్‌ చేయరు. వేరొకరు పంపిన సందేశాన్ని ఫార్వర్డ్‌ చేయడమే. అలా చేస్తే ప్రేమ వస్తుందా? బంధం ఏర్పడుతుందా? అభిమానం కొనసాగుతుందా?  ఆప్యాయత గాఢమవుతుందా? కాని రోజులు మారాయి. మారిన రోజులతో మనమూ మారాలా... ఇలా మారక తప్పదు అని ఆలోచనలో పడాలా? నిజమైన పండగ ఉదయం సంధ్యతో గృహాప్రవేశం చేస్తుంది. కాని నెట్టింటి వసంతం మాత్రం  అర్ధరాత్రి నుంచే బీప్‌బీప్‌ మని సందడి చేస్తుంది.

నిద్ర లేచి వాట్సప్‌ తెరిస్తే కొత్త చింతపండు, తాజా వేపపువ్వు,  బెల్లం, అప్పుడే కోసిన చెరకు,  లేత మామిడి, లేలేత కొబ్బరి.. కొత్త మిరియాలు, ఉప్పుతో తయారైన ఉగాది ప్రసాదాన్ని (వాళ్లు పెట్టే మనం తినే వీలులేని) అందమైన ఇమేజ్‌తో సోషల్‌ మీడియా  పంచుతూ ఉంటుంది. ఇక శుభకాంక్షల సందేశాలకైతే చెప్పనవసరమే లేదు. ముఖ పరిచయంలేని వ్యక్తులు కూడా ముఖపుస్తకం సాక్షిగా పండగ సందర్భంగా మన శుభాన్ని కోరుతూ వాల్‌ నింపేస్తారు. అందరం కలిసి జరుపుకోవాల్సిన పండుగను అందరూ సెల్‌ఫోన్లు ధరించి, తల అందులో కూరి విడివిడిగా జరుపుకుంటూ ఆ విశేషాలను వాట్సప్‌ స్టేటస్‌గా పెట్టుకుంటూ ఆనందాన్ని షేర్‌ చేసుకుంటున్నాం!  ఓ రోజు ముందు నుంచి మొదలయ్యే పండగ ఏర్పట్లు.. పండగ రోజు ఉత్సాహాన్ని రెండు క్షణాల్లో సెల్ఫీలుగా.. గుల్ఫీలుగా కుదించుకుంటున్నాం!  నిజమే. వేగం సమయాన్ని మింగేస్తోంది. ఓపికనూ మిగల్చడం లేదు. ఆర్థికంగా ఎదగాలన్న పోటీ సెలవులనూ ఇవ్వడం లేదు.  పిల్లలలకు దొరికినా ఆ హాలిడేను పబ్జీ, జీటీఏవైసీటీ వంటి గేమ్స్‌తో పండగ చేసుకుంటున్నారు.

ఒకవేళ సెలవురోజున పండగ వచ్చినా..అలా ఇంట్లో కన్నా నెట్టింట్లోనే పండగ వాతావరణం కనిపిస్తోంది. మామిడికాయ పప్పు, పులిహోర, పూర్ణం బొబ్బట్లు, పరమాన్నపాయసాల పండగ వంటను స్విగ్గీ వండించి వడ్డిస్తోంది. సమష్టి శ్రమ.. సంతోషాలుఏ పండగైనా సమష్టి శ్రమకు సంకేతం. ఉత్పత్తి రంగంలో ఉన్న వారిని గౌరవించే ప్రక్రియ. ఒకరి మీద ఒకరం ఆధారపడుతూ.. అందరి ప్రాధాన్యంతో సమాజాన్ని సమతౌల్యం చేసే బాధ్యత. అన్నిటికీ మించి పర్యావరణ పరిరక్షణ, ప్రకృతిని అధిగమించకుండా.. దాన్ని అనుసరించే మన గమనం ఉండాలని చేసే సూచన. ప్రకృతితో మమేకమవుతూ అనుభూతి చెందాల్సిన ఈ ప్రాక్టికాలిటీ సాంకేతికత పుణ్యమాని వర్చువల్‌ ఎక్స్‌పీరియెన్స్‌కి పడిపోయింది.

అందుకే షడ్రుచుల్లోని ఏ రుచీ మనకు తెలియట్లేదు. జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసుకోడం రావట్లేదు.  పులుపు, కారం, చేదు లాంటి కష్టాలు, సమస్యలు, సంక్షభాలు ఎదురైతే చాలు తల్లడిల్లుతున్నాం.. తలకిందులవుతున్నాం. తీపిని ఎంత ఇష్టంగా తింటామో కంట నీరు రాకుండా కారాన్ని దిగమింగడమూ అంతే అవసరం. ఆ సమన్వయాన్నే నేర్పుతుంది ఉగాది. బోధపడాలంటే సోషల్‌ మీడియా ఫ్రేమ్‌లోంచి బయటపడాలి. పండగ అంటే షేరింగే.. అందరం కలిసి పంచుకునే సంతోషం. ఎఫ్‌బీ, ఇన్‌స్టాగ్రామ్స్, వాట్సప్‌లలో షేర్స్‌ కంటే ఎక్కువ ఆనందాన్నిచ్చేది. అందరికీ అందరం అనే భరోసానిచ్చేది. సమాజాన్ని మానవహారంగా మలిచేది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement