సుందర దృశ్యాల సిరి... అనంతగిరి
మన దగ్గరే!
రాష్ర్టంలో పేరొందిన హిల్ స్టేషన్లలో ఒకటి అనంతగిరి. పచ్చని చెట్లతో అలరారే దట్టమైన అడవులు, గలగల పారే సెలయేర్లు... తేయాకు తోటల సుగంధాలు...ఇవీ అనంతగిరుల సోయగాలు. ఏడాది పొడవునా చల్లగా ఉండే ఈ ప్రాంతం వేసవి విడిదిగా పర్యాటకులను ఆకట్టుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఉక్కునగరంగా పేరుగాంచిన సుందరనగరం విశాఖపట్టణం. ఇక్కడి సముద్ర తీరానికి 40 కి.మీ దూరంలో ఉంది అనంతగిరి. ప్రకృతి ప్రేమికులను ఓ సరికొత్త లోకంలో విహరింపజేస్తుంది. ఇక్కడి వాతావరణం ఎప్పుడూ చల్లగా ఉండటమే కాకుండా నయనా నందకరంగా ఉండటంతో ఏడాది పొడవునా పర్యాటకుల తాకిడి ఉంటుంది.
అంబరాన్ని తాకే కొండలు, ఆ కొండలపై పచ్చని చెట్ల సోయగాలు, ఏటవాలుగా ఉండే కనుమలు, లోయలు, జలపాతాలు పర్యాటకుల మనసును రంజింపజేస్తాయి. అరకు లోయకు 17 కి.మీ దూరంలో తిరుమలగిరి పై భాగంలోని తూర్పు కనుమల్లో ఉన్న ఈ ప్రాంతానికి వెళ్లేందుకు ఘాట్ రోడ్డులలో చేసే ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. చుట్టూ కాఫీ తోటల సౌందర్యం పర్యాటకులను ఆనందసాగరంలో ఓలలాడిస్తుంది. రకరకాల పండ్ల తోటలు మనసును పరవశింపజేస్తాయి. ఇక్కడ వనమూలికలు సైతం లభ్యమవుతాయి.
భవనాశి సరస్సు
దక్షిణ బద్రీనాథ్‌గా పేరుగాంచిన తిరుమలగిరి ప్రాంతంలో భవనాశి సరస్సు ఉంది. అత్యంత పవిత్రమైనదిగా ఈ సరస్సుకు పేరు. ఈ సరస్సు వల్లే ఈ ప్రాంతానికి దక్షిణ బద్రీనాథ్ అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. అనంతగిరి నుంచి ముచికుందా నది పాయలుగా చీలి పరుగులు తీస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. కాఫీ తోటల పరిమళాలు, పక్షల కిలకిలరావాలు, సూర్యోదయ-సూర్యాస్తమయ సమయాల్లో ప్రకృతి వింతశోభతో అలరారుతూ ఉంటుంది. మామిడి తోటలు కూడా పర్యాటకులకు వింత అనుభూతిని కలిగిస్తాయి.
అనంతపద్మనాభుడు
ప్రకృతి రమణీయత ఆనంద పారవశ్యాన్ని కలిగిస్తే, ఇక్కడి వచ్చే యాత్రికులను భక్తిపారవశ్యంలో నింపుతుంది అనంతపద్మనాభస్వామి ఆలయం. ఆంధ్రా ఊటీగా స్థానికులు ప్రేమగా పిలిచే ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉండటంతో పాటు ఇక్కడి ఎత్తై ప్రాంతాలు, సెలయేర్లు, కొండలు, పెద్ద పెద్ద చెట్లు పర్యాటకులను చూపులను కట్టి పడేస్తాయి.
వెళ్లేదారి..
శ్రీకాకుళం రైల్వే స్టేషన్ నుంచి 3 కి.మీ దూరం ప్రయాణిస్తే అనంతగిరి చేరవచ్చు. విశాఖపట్టణం నుంచి బస్సు సౌకర్యం ఉంది. హైదరాబాద్, విశాఖపట్నం, ఇతర నగరాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడ బస చేసేందుకు ప్రైవేటు కాటేజీలు, హోటళ్లు, బంగళాలు అందుబాటులో ఉన్నాయి.