
ఆ సాయంత్రం కోడలికి వినిపించేలా కొడుకుతో పెద్దగా.. ‘ఇంట్లో ఆడమనిషి పొద్దున్నే లేచి ఒడ్లు దంచి, బియ్యం చేసి, అన్నం వండాలి. కానీ నీ భార్య కాళ్లూ చేతులు ఊపుతూ ఆడలాడుతోంది’ అని చెప్పింది.
నానమ్మాళ్ వయసు 99 ఏళ్లు. ఇప్పటికే తనే పనులన్నీ చేసుకుంటారు. పొలం పనులు, ఇంటి పనులు అన్నీ! వంట చేయడం, గిన్నెలు కడగడం ఆమెకసలు పనులే కావు. ఇంత శక్తీ తనకు తినే ఆహారం కన్నా, ఊపిరి ‘పీల్చి వదిలే’ సాధన వల్లే వస్తుందని నానమ్మాళ్ చెబుతారు. యోగాలో ఉచ్ఛాసనిశ్వాసాలకున్న శక్తి అది. నానమ్మాళ్ యోగా టీచర్. ఆమెది తమిళనాడు. కోయంబత్తూర్‌లోని జమీన్ కల్యాణపురంలో రైతు కుటుంబంలో జన్మించారు. గత మూడేళ్లలో వరుసగా ‘నారీ శక్తి పురస్కార్’ (2016), యోగా రత్న (2017), పద్మశ్రీ (2018) అవార్డులు అందుకున్నారు నానమ్మాళ్.
రోజూ ఉదయాన్నే ఐదు గంటలకల్లా నిద్ర లేస్తారు నానమ్మాళ్. వెంటనే కాలకృత్యాలు ముగించుకుంటారు. వేప పుల్లతో పళ్లు తోముకుంటారు. ఆ వెంటనే గోరు వెచ్చని నీటిలో జిలకర కలుపుకుని తాగేస్తారు. నానమ్మాళ్ యోగ విద్యను అంత తేలిగ్గా ఏమీ సాధించలేదు. పెళ్లయిన కొత్తలోనైతే మెట్టినింట్లో ఆమె అత్తగారి కంట పడకుండా యోగా చెయ్యవలసి వచ్చింది. ‘ఏమిటీ ఆటలు!’ అని గద్దించేవారావిడ. ఓ రోజు నానమ్మాళ్ తలుపు చాటున యోగాభ్యాసం చేస్తుంటే గాలికి ఒక తలుపు తెరుచుకుని, ఆ దృశ్యం అత్తగారి కంట పడింది. కోడల్ని అప్పటికేమీ అనలేదు. కానీ ఆ రోజంతా మాట్లాడ్డం మానేశారు. కోడలు ఎదురొస్తే కోపంతో ముఖం తిప్పుకున్నారు. ఆ సాయంత్రం కోడలికి వినిపించేలా కొడుకుతో పెద్దగా.. ‘ఇంట్లో ఆడమనిషి పొద్దున్నే లేచి ఒడ్లు దంచి, బియ్యం చేసి, అన్నం వండాలి. కానీ నీ భార్య కాళ్లూ చేతులు ఊపుతూ ఆడలాడుతోంది’ అని చెప్పింది.
గత యాభై ఏళ్లుగా నానమ్మాళ్ యోగా నేర్పిస్తున్నారు. వేలమంది ఆమె దగ్గర నేర్చుకున్నారు. ఆమె పిల్లలు, ఆ పిల్లల పిల్లలు కూడా నానమ్మాళ్ దగ్గరే యోగాభ్యాసం చేశారు. ఆమె దగ్గర యోగా నేర్చుకున్నవారిలో 600 మంది ఇప్పుడు దేశ విదేశాల్లో యోగా గురువులు! వీరిలో 36 మంది ఆమె సొంత కుటుంబ సభ్యులే. పద్మశ్రీ అవార్డును అందుకున్నప్పుడు తననుఅంతా అభినందిస్తుంటే.. ‘నా ఆరోగ్యమే నాకు అన్నిటికన్నా బెస్ట్ అవార్డ్’ అని నానమ్మాళ్ చిరునవ్వులు చిందించారు. ఆమె తన తండ్రి నుంచి, ఆయన తన తాతల దగ్గర్నుంచి యోగాను ఔపోశన పట్టారు. జీవితకాలంలో తనకు ఒక్కనాడూ ఆసుపత్రికి వెళ్లే అవసరం రాలేదంటే అది యోగా మహిమేనని ఆమె అంటారు. నానమ్మాళ్‌కు ఆరుగురు పిల్లలు. వాళ్లందరి పిల్లలకూ ఆమే పురుడుపోశారు. ఎనిమిదవ యేట తండ్రి నుంచి యోగా నేర్చుకున్న నానమ్మాళ్ 50 ఆసనాలలో ప్రావీణ్యం సంపాదించారు.
Comments
Please login to add a commentAdd a comment