taminadu
-
ఆహరం మానేసి.. 102 ఏళ్ల వృద్ధురాలి సల్లేఖన వ్రతం
సాక్షి,తిరువొత్తియూరు(తమిళనాడు): తిరువన్నామలై జిల్లా వందవాసి సమీపంలో జైన మతానికి సంబంధించిన వృద్ధురాలు (102). గత కొన్ని రోజులుగా ఆహార, పానీయాలు తీసుకోకుండా (సల్లేఖన వ్రతం)ముక్తి మార్గంలో జీవ సమాధి పొందారు. ఈమెకు దేవదత్త, సుశీల, నాగరత్నం, కస్తూరిబాయి, సాందన, గౌరి అనే ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. ఈమె ఎరుపూర్ గ్రామంలో తన ఇంటిలో నివాసం ఉంటున్నారు. శతాధిక వృద్ధురాలు అయినప్పటికీ ఆమె ఇప్పటి వరకు కంటికి అద్దాలు లేకుండా పుస్తకాలు చదవగలిగే సామర్థ్యం కలిగి ఉన్నారు. ఈ క్రమంలో విజయలక్ష్మి తాను జీవ సమాధి కావాలని నిర్ణయించుకున్నారు. దీంతో గత 11వ తేదీ వంద వాసి, పొన్నూరు కొండ దిగువ భాగంలో ఉన్న కుంద, కుందర విశాఖచారిని జైన ఆశ్రమానికి వెళ్లి.. అక్కడ అన్నపానీయాలు మాని ముక్తి కోసం ఆమె జైనమతంలోనే అత్యంత ఉత్కృష్టమైన సల్లేఖన వ్రతం చేశారు. ఈ క్రమంలో ఆదివారం తుదిశ్వాస విడిచి జీవ సమాధి పొందారు. -
రజనీ పార్టీ ‘మక్కల్ సేవై కట్చి’ !
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పార్టీ పేరు ‘మక్కల్ సేవై కట్చి’ (ప్రజాసేవ పార్టీ) అని తెలుస్తోంది. ఈ నెలాఖరులో పార్టీ, చిహ్నం వెల్లడి, వచ్చే ఏడాది జనవరిలో పార్టీ స్థాపన అంటూ ఇటీవల ఆయన వెల్లడించారు. రజనీ మక్కల్ మన్రం నిర్వాహకులు ఢిల్లీలోని చీఫ్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయం(సీఈసీ)లో పార్టీ పేరు, చిహ్నంపై రెండు వారాల క్రితం దరఖాస్తు చేశారు. తమిళనాడు రాష్ట్రం నుంచి కొత్తగా నమోదైన 9 పార్టీల పేర్లు, వాటికి కేటాయించిన చిహ్నాలను ఎన్నికల కమిషన్ సోమవారం విడుదల చేసిన జాబితా మంగళవారం బహిర్గతమైంది. ఆ జాబితాలో 8వ స్థానంలో మక్కల్ సేవై కట్చి పేరు, ఆటో చిహ్నం ఉంది. చెన్నై శివారు 20 కిలోమీటర్ల దూరంలోని ఎర్నావూర్ బాలాజీ నగర్‌ను పార్టీ ప్రధాన కేంద్రంగా ఈసీ వద్ద రిజిస్టర్ చేయడంతో ఇది రజనీ పార్టీనేనా అనే అనుమానాలు తలెత్తాయి. ఈసీకి సమర్పించిన పత్రాల్లో నిర్వాహకుడు రజనీకాంత్ అని ఉండడంతో అది రజనీ పార్టీనేనని మంగళవారం ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే పార్టీ చిహ్నంగా ఆటోరిక్షాగా కేటాయింపు జరిగింది. ‘బాబా’ చిత్రంలో రజనీ తరచూ చూపించే అరచేతివేళ్లను, సైకిల్‌ను చిహ్నంగా ఇచ్చేందుకు ఈసీ నిరాకరించినట్లు సమాచారం. దీన్ని రజనీ సహా ఎవ్వరూ ధ్రువీకరించలేదు. అలాగని ఖండించనూ లేదు. పార్టీ అధిష్టానం ప్రకటించేవరకు పేరు, చిహ్నంపై మక్కల్ మన్రం నిర్వాహకులు స్పందించరాదని పార్టీ నేతలు ప్రకటన విడుదల చేశారు. రజనీతో కలిసి పనిచేయడానికి సిద్ధం రజనీకాంత్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ మక్కల్ నీది మయ్యం నేత కమల్‌హాసన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తమిళనాడులోని కోవిల్ పట్టిలో మీడియా ప్రశ్నలకు కమల్ సమాధానాలు ఇచ్చారు. అనేక కారణాలతో ఎందరో రాజకీయ పార్టీలు పెడుతున్నట్టు గుర్తు చేశారు. తాను మాత్రం తమిళనాట మార్పు నినాదంతో రాజకీయాల్లోకి వచ్చానని, రజనీ కూడా అదే నినాదంతో వస్తున్నట్టుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి, ఇగోలను పక్కన పెట్టి కలిసి పనిచేయడానికి సిద్ధం అనిప్రకటించారు. -
అందుకే వాళ్లిద్దరూ మృతి చెందారు: సీబీఐ
చెన్నై: తమిళనాట ప్రకంపనలు రేపిన తండ్రీకొడుకుల కస్టడీ డెత్ కేసులో సీబీఐ కోర్టుకు కీలక విషయాలు వెల్లడించింది. సత్తాన్‌కుళంకు చెందిన జయరాజ్, బెనిక్స్ పదునైన గాయాల కారణంగానే మృతి చెందినట్లు పేర్కొంది. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం బెనిక్స్ ఒంటిపై 13 గాయాలు, జయరాజ్ శరీరంపై 17 గాయాలు ఉన్నట్లు పేర్కొంది. కాగా కస్టడీ డెత్ కేసులో అరెస్టైన సత్తాన్‌కుళం పోలీసు స్టేషను అధికారులు ముత్తురాజ్ మరుగన్, థామస్ ఫ్రాన్సిస్ బెయిలు మంజూరు చేయాల్సిందిగా ఇటీవల మద్రాసు హైకోర్టు మధురై బెంచ్‌ను ఆశ్రయించారు. (చదవండి: కస్టడీ డెత్ కేసు: కరోనాతో ఎస్ఎస్ఐ మృతి) ఈ సందర్భంగా.. తగిన ఆధారాలతో కోర్టు ముందు హాజరైన సీబీఐ అధికారి.. విచారణలో భాగంగా మురుగన్, థామస్ జయరాజ్, బెనిక్స్లను తీవ్రంగా కొట్టినట్లు ఇద్దరు మహిళా హెడ్ కానిస్టేబుళ్లు వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు దాదాపు 38 మందిని విచారించామని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో పోలీసు అధికారులు తండ్రీకొడుకులు చిత్రహింసలకు గురిచేసినట్లు తేలిందన్నారు. లోతైన గాయాల కారణంగానే వారిద్దరు మృతి చెందినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైందని కోర్టుకు తెలిపారు. ఇక కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఎస్ఐ పాల్దురై ఇటీవల కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే.(చదవండి:రాత్రంతా చిత్ర హింసలు.. రక్తపు మరకలు) కాగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సత్తాన్‌కుళానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(31)లను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని చిత్ర హింసలు పెట్టడంతో మరణించిన విషయం విదితమే. ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు సర్కారు అభ్యర్థన మేరకు ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించేందుకు అనుమతినిచ్చింది. దీంతో విచారణ వేగవంతం చేసిన దర్యాప్తు సంస్థ.. కస్డడీ డెత్ కేసులో సత్తాన్‌కుళం పోలీస్ స్టేషనుకు చెందిన 10 మంది పోలీసు అధికారులను అరెస్టు చేసింది. -
నాలాగ ఎంతోమంది ఉన్నారు: ఉదిత్ సూర్య
సాక్షి ప్రతినిధి, చెన్నై: నీట్‌గా పరీక్ష రాసి వైద్య విద్యను అభ్యసించాల్సిన విద్యార్దులు వక్రమార్గాన్ని ఎన్నుకుని ఎట్టకేలకు దొరిపోతున్నారు. తప్పుటడుగులు వేస్తున్న తమ పిల్లలను సరిదిద్దాల్సిన తండ్రులే తప్పిదాలకు పోయి పోలీసులకు చిక్కిపోతున్నారు. నీట్ పరీక్ష మోసంలో తాజాగా ఒక విద్యార్ది, ఇద్దరు విద్యార్దులు తమ తండ్రులతో సహా మొత్తం ఆరుగురు జైలుపాలయ్యారు. దీంతో నీట్ మోసం వ్యవహారంలో అరెస్ట్‌ల సంఖ్య తొమ్మిదికి చేరింది. కష్టపడి చదివి నీట్ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులు కావాలనే లక్ష్యం పక్కదోవపట్టగా చెన్నైకి చెందిన ఉదిత్ సూర్య అనే విద్యార్దిని, అతడి తండ్రి డాక్టర్ వెంకటేశన్‌ను సీబీసీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, పోలీసుల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న ఉదిత్ సూర్య తనలాగ ఎందరో అని చెప్పడం అధికారులను కలవరానికి గురిచేసింది. మరి కొందరు విద్యార్దులు సైతం నకిలీ విద్యార్ది చేత నీట్ పరీక్ష రాయించి వైద్యసీటు సంపాదించారని సీబీసీఐడీ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. వారు ఎవరెవరో కూడా చెప్పడంతో పోలీసులు వారిని పట్టుకునేందుకు సిద్ధం అవుతున్నారు. చెన్నైకి చెందిన విద్యార్దిని అభిరామి, విద్యార్దులు ప్రవీణ్, రాహుల్ సైతం ఉదిత్ సూర్య తరహాలో మరోవ్యక్తి చేత పరీక్ష రాయించి సీటు సంపాదించినట్లు ప్రాధమిక విచారణలో తేలింది. విద్యార్దిని అభిరామి తిరుప్పోరూరు సమీపం అమ్మాపేటలోని సత్యసాయి వైద్య కళాశాలలో, విద్యార్దులు ప్రవీణ్ క్రోంపేటలోని బాలాజీ వైద్య కళాశాలలో, రాహుల్ కాంట్రాకొళత్తూరులోని ఎస్ఆర్ఎమ్ వైద్యకళాశాలలో చదువుతున్నారు. ఉదిత్ సూర్య తండ్రి డాక్టర్ వెంకటేశన్ లాగానే ఈ ముగ్గురు విద్యార్దులు తండ్రులు సైతం తమ పిల్లల కోసం మోసానికి పాల్పడ్డారు. ప్రవీణ్ తండ్రి రూ.23 లక్షలు చెల్లించాడు. మిగిలిన ఇద్దరు రూ.20 లక్షలు చొప్పున ఇచ్చుకున్నారు. ఈ ముగ్గురు విద్యార్దుల తండ్రులు బ్రోకర్‌కే డబ్బులు ఇచ్చుకున్నారు. అభిరామి తండ్రి మాధవన్, ప్రవీణ్ తండ్రి శరవణన్, రాహుల్ తండ్రి డేవిస్‌లను సైతం సీబీసీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆరుగురినీ తేనీ సీబీసీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించగా మోసానికి పాల్పడినట్లు అంగీకరిస్తూ వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ ఆరుగురినీ శనివారం ఉదయం 11 గంటలకు తేనీ కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు పంపారు. నీట్ మోసం కేసులో ఇప్పటి వరకు నలుగురు విద్యార్దులు, నలుగురు తండ్రులు లెక్కన మొత్తం ఎనిమిది మందిని తమిళనాడులో అరెస్ట్ చేశారు. ఉదిత్ సూర్యకు సహకరించిన నీట్ బ్రోకర్ జార్జ్జోసెఫ్ను కేరళలో రెండురోజుల క్రితం అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన రబీ, తమిళనాడు వానియంబాడికి చెందిన మహమ్మద్ షఫీ అనే మరో ఇద్దరు బ్రోకర్లను అరెస్ట్ చేసేందుకు సీబీసీఐడీ సిద్దం అవుతోంది. కాగా ఇర్ఫాన్ అనే మరో విద్యార్ది సైతం ఇదే తరహా మోసంతో వైద్యసీటు సంపాదించినట్లు అధికారులకు సమాచారం అందండంతో విచారణ జరుపుతున్నారు. -
ఔరా... ఐరా!
నయనతార నటిస్తున్న తాజా ద్విభాషా (తమిళ, తెలుగు) చిత్రం ‘ఐరా’. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇందులో నయనతార డ్యూయల్ రోల్ చేశారు. సుదర్శన్, సుందరామ్మూర్తి, రవీంద్రన్, కార్తీక్ కీలక పాత్రలు పోషించారు. తమిళనాట ‘లక్ష్మీ’ అనే షార్ట్ ఫిల్మ్‌తో మంచి పేరు సంపాదించుకున్న కేఎమ్ సర్జున్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా సెకండ్ లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. అలాగే ఈ నెల 5న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ‘ఐరా’ టీజర్‌ను ఔరా అనిపించేలా చిత్రబృందం కట్ చేశారని కోలీవుడ్ టాక్. ఇప్పుడు రిలీజ్ చేసిన సెకండ్ లుక్ కూడా ఔరా అనేలానే ఉందని అభిమానులు అంటున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్‌లో విజయ్ హీరోగా రూపొందనున్న సినిమాలో, శివ కార్తీకేయన్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో ఆమె కథానాయిక. ఇంకా ఆమె చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే... డిసెంబర్ 28కి ఇండస్ట్రీలో 15ఏళ్లను పూర్తి చేసుకున్నారు నయన. నటిగా ఆమె వయసు 15 అన్నమాట. ఆమె నటించిన ‘మనసునక్కారే’ మలయాళ చిత్రం 2003లో డిసెంబర్ 28న విడుదలైన సంగతి తెలిసిందే. 15 ఏళ్లయినా నయన క్రేజ్ తగ్గలేదనడానికి ఆమె చేతిలో సినిమాల లిస్టే ఉదాహరణ. -
పెరియార్ విగ్రహానికి ఘోర అవమానం
సాక్షి, చెన్నై : ‘అభినవ తమిళనాడు పిత’గా పేరొందిన పెరియార్ ఈవీ రామస్వామి నాయకర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అంతేకాకుండా విగ్రహం తలపై చెప్పుల జతను ఉంచి ఘోరంగా అవమానించారు. సోమవారం పెరియార్ 140వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళి అర్పించడానికి వెళ్లిన అభిమానులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ‘స్వీయాభిమాన’ ఉద్యమ నిర్మాత రామస్వామి.. తమిళనాడులోని ఈరోడ్‌లో 1879, సెప్టెంబర్‌లో ఈవీ రామస్వామి జన్మించారు. ఆయన అసలు పేరు వెంకట రామస్వామి. ఈరోడ్‌లో పుట్టినందున ఈరోడ్ వెంకట రామస్వామి అయ్యారు. ఆ తర్వాత ఆయన ప్రజల దృష్టిలో పెరియార్ రామస్వామిగా మారారు. ‘పెరియార్’ అంటే తమిళంలో గౌరవనీయులు లేదా పెద్ద అని అర్థం. పొడవాటి గుబురు గడ్డం.. ముఖాన గుండ్రటి కళ్లజోడు... ఉదారత్వం ఉట్టిపడే నవ్వు చూస్తే.. ఆయనలో ర్యాడికల్ సిద్దాంతం రగులుకుంటుందని ఎవరూ ఊహించరు. సమాజంలో కుల, మత, వర్గ ఆధిపత్యాలపై రామస్వామి తిరుగుబాటు చేశారు. కుల, మత రహిత సమసమాజం కావాలని కాంక్షించారు. మహిళలకూ సమాన హక్కులు కావాలన్నారు. స్వతహాగా సమాజంలో అణచివేతకు గురవుతున్న ‘బలిజ’ కుటుంబానికి చెందిన పెరియార్ సమాజంలో ప్రధానంగా బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. దక్షిణ భారతానికి చెందిన ద్రావిడులపై ఉత్తరానికి చెందిన బ్రాహ్మణ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ ‘స్వీయాభిమాన ఉద్యమాన్ని’ నిర్మించారు. అగ్రవర్ణాలు ఇతర వర్గాలపై తమ ఆధిపత్యం కొనసాగించడం కోసం, వారిని తిరుగుబాటు చేయకుండా కట్టడి చేయడం కోసం దేవుళ్లను, వారి పేరిట గుళ్లూ గోపురాలను, పనికి మాలిన పురాణాలను సృష్టించారంటూ ప్రచారోద్యమాన్ని సాగించడం ద్వారా ప్రముఖ హేతువాదిగా ముద్రపడ్డారు. రాజకీయ ప్రస్థానం.. పుట్టుకతోనే ధనవంతుడైన పెరియార్ (తండ్రి కన్నడ వ్యాపారి) ఈరోడ్ మున్సిపాలిటీ పరిధిలో పలు పదవులు నిర్వహించారు. ఆ తర్వాత 1919లో కాంగ్రెస్ పార్టీలో చేరి 1925 వరకు కొనసాగారు. తాను ఆశించిన లక్ష్యాలను సాధించాలంటే సొంతంగా సామాజిక ఉద్యమం చేపట్టడమే మార్గం అనుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. తన ఆశయాల లక్ష్య సాధన కోసం 1939లో ‘జస్టిస్ పార్టీ(1917లో ఏర్పడింది)’లో చేరారు. 1944లో ఆ పార్టీని ‘ద్రావిడదార్ కళగం’గా మార్చారు. తన లక్ష్యాలకనుగుణంగా.. ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటూ సామాజికోద్యమానికే ప్రాధాన్యతనిచ్చారు. అయితే ఎన్నికల రాజకీయాలు కూడా ముఖ్యమేనంటూ అందులో నుంచి 1949లో సీఎన్ అన్నాదురై నాయకత్వాన డీఎంకే ఆవిర్భవించింది. తర్వాత దాని నుంచి అన్నాడీఎంకే కూడా ఆవిర్భవించింది. అదే విధంగా మరుమలార్చి ద్రావిడ మున్నేట్ర కళగమ్, పెరియార్ ద్రావిడదార్ కళగమ్, థాంతై పెరియార్ ద్రావిడదార్ కళగమ్, ద్రావిడదార్ విద్యుత్తలై కళగమ్ పార్టీలు పుట్టుకొచ్చాయి. -
నానమ్మాళ్ @ 99
ఆ సాయంత్రం కోడలికి వినిపించేలా కొడుకుతో పెద్దగా.. ‘ఇంట్లో ఆడమనిషి పొద్దున్నే లేచి ఒడ్లు దంచి, బియ్యం చేసి, అన్నం వండాలి. కానీ నీ భార్య కాళ్లూ చేతులు ఊపుతూ ఆడలాడుతోంది’ అని చెప్పింది. నానమ్మాళ్ వయసు 99 ఏళ్లు. ఇప్పటికే తనే పనులన్నీ చేసుకుంటారు. పొలం పనులు, ఇంటి పనులు అన్నీ! వంట చేయడం, గిన్నెలు కడగడం ఆమెకసలు పనులే కావు. ఇంత శక్తీ తనకు తినే ఆహారం కన్నా, ఊపిరి ‘పీల్చి వదిలే’ సాధన వల్లే వస్తుందని నానమ్మాళ్ చెబుతారు. యోగాలో ఉచ్ఛాసనిశ్వాసాలకున్న శక్తి అది. నానమ్మాళ్ యోగా టీచర్. ఆమెది తమిళనాడు. కోయంబత్తూర్‌లోని జమీన్ కల్యాణపురంలో రైతు కుటుంబంలో జన్మించారు. గత మూడేళ్లలో వరుసగా ‘నారీ శక్తి పురస్కార్’ (2016), యోగా రత్న (2017), పద్మశ్రీ (2018) అవార్డులు అందుకున్నారు నానమ్మాళ్. రోజూ ఉదయాన్నే ఐదు గంటలకల్లా నిద్ర లేస్తారు నానమ్మాళ్. వెంటనే కాలకృత్యాలు ముగించుకుంటారు. వేప పుల్లతో పళ్లు తోముకుంటారు. ఆ వెంటనే గోరు వెచ్చని నీటిలో జిలకర కలుపుకుని తాగేస్తారు. నానమ్మాళ్ యోగ విద్యను అంత తేలిగ్గా ఏమీ సాధించలేదు. పెళ్లయిన కొత్తలోనైతే మెట్టినింట్లో ఆమె అత్తగారి కంట పడకుండా యోగా చెయ్యవలసి వచ్చింది. ‘ఏమిటీ ఆటలు!’ అని గద్దించేవారావిడ. ఓ రోజు నానమ్మాళ్ తలుపు చాటున యోగాభ్యాసం చేస్తుంటే గాలికి ఒక తలుపు తెరుచుకుని, ఆ దృశ్యం అత్తగారి కంట పడింది. కోడల్ని అప్పటికేమీ అనలేదు. కానీ ఆ రోజంతా మాట్లాడ్డం మానేశారు. కోడలు ఎదురొస్తే కోపంతో ముఖం తిప్పుకున్నారు. ఆ సాయంత్రం కోడలికి వినిపించేలా కొడుకుతో పెద్దగా.. ‘ఇంట్లో ఆడమనిషి పొద్దున్నే లేచి ఒడ్లు దంచి, బియ్యం చేసి, అన్నం వండాలి. కానీ నీ భార్య కాళ్లూ చేతులు ఊపుతూ ఆడలాడుతోంది’ అని చెప్పింది. గత యాభై ఏళ్లుగా నానమ్మాళ్ యోగా నేర్పిస్తున్నారు. వేలమంది ఆమె దగ్గర నేర్చుకున్నారు. ఆమె పిల్లలు, ఆ పిల్లల పిల్లలు కూడా నానమ్మాళ్ దగ్గరే యోగాభ్యాసం చేశారు. ఆమె దగ్గర యోగా నేర్చుకున్నవారిలో 600 మంది ఇప్పుడు దేశ విదేశాల్లో యోగా గురువులు! వీరిలో 36 మంది ఆమె సొంత కుటుంబ సభ్యులే. పద్మశ్రీ అవార్డును అందుకున్నప్పుడు తననుఅంతా అభినందిస్తుంటే.. ‘నా ఆరోగ్యమే నాకు అన్నిటికన్నా బెస్ట్ అవార్డ్’ అని నానమ్మాళ్ చిరునవ్వులు చిందించారు. ఆమె తన తండ్రి నుంచి, ఆయన తన తాతల దగ్గర్నుంచి యోగాను ఔపోశన పట్టారు. జీవితకాలంలో తనకు ఒక్కనాడూ ఆసుపత్రికి వెళ్లే అవసరం రాలేదంటే అది యోగా మహిమేనని ఆమె అంటారు. నానమ్మాళ్కు ఆరుగురు పిల్లలు. వాళ్లందరి పిల్లలకూ ఆమే పురుడుపోశారు. ఎనిమిదవ యేట తండ్రి నుంచి యోగా నేర్చుకున్న నానమ్మాళ్ 50 ఆసనాలలో ప్రావీణ్యం సంపాదించారు. -
మహిళా జర్నలిస్ట్ పై మంత్రి వ్యాఖ్యలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ఆరోగ్యమంత్రి సి.విజయభాస్కర్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. అన్నాడీఎంకే పార్టీ గురువారం నిర్వహించిన సమావేశానికి హాజరైన విజయభాస్కర్ బయటికొస్తుండగా.. భేటీలో తీసుకున్న నిర్ణయాల విషయమై ఓ మహిళా జర్నలిస్ట్ ఆయనను ప్రశ్నించారు. దీంతో ప్రశ్నల్ని తప్పించుకునేందుకు ‘మేడమ్ మీరు కళ్లద్దాల్లో చాలా అందంగా ఉన్నారు’ అని విజయభాస్కర్ వ్యాఖ్యానించారు. తానెప్పుడూ కళ్లద్దాలు ధరిస్తానన్న ఆమె సమావేశంలో పార్టీ నిర్ణయాలపై మళ్లీ మంత్రిని ప్రశ్నించింది. దీంతో విజయభాస్కర్ ‘మీరు ఈరోజు చాలా అందంగా ఉన్నారు’ అని జవాబిచ్చారు. సమావేశం విషయమై పార్టీ త్వరలోనే ప్రకటన విడుదల చేస్తుందనీ, దీనిపై అన్నాడీఎంకే సీనియర్ నేతలు మాట్లాడతారని స్పష్టం చేశారు. అయినా ఆ మహిళా జర్నలిస్ట్ ప్రశ్నలు అడగటం మానకపోవడంతో ‘మీరు చాలా అందంగా ఉన్నారు’ అని మంత్రి మరోసారి చెప్పారు. తన వ్యాఖ్యలపై తీవ్రదుమారం చెలరేగడంతో విజయభాస్కర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రశ్నల్ని తప్పించుకునే క్రమంలోనే తానలా అన్నట్లు చెప్పారు. వ్యాఖ్యలు ఆమెను బాధపెట్టి ఉంటే క్షమాపణలు కోరుతున్నానన్నారు. -
శశికళా?....పన్నీరా?
-
రాజ్‌భవన్ గుప్పిట్లో రహస్యం తలైవీ?...తలైవా?
-
రాజ్‌భవన్ గుప్పిట్లో రహస్యం తలైవీ?... తలైవా?
. తమిళనాడు గవర్నర్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ . విద్యాసాగర్‌రావును కలసిన పన్నీర్, శశికళ - శాసనసభలో బల నిరూపణకు అవకాశమివ్వాలని పన్నీర్ విన్నపం - ఎమ్మెల్యేల పరేడ్‌కు శశికళకు అవకాశం ఇవ్వని గవర్నర్ - ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాలను సమర్పించిన చిన్నమ్మ - తాజా పరిణామాలతో కేంద్రానికి నివేదిక పంపిన గవర్నర్ - పన్నీర్‌కు బలపరీక్ష అవకాశం ఇస్తారా?.. శశికళతో ప్రమాణం చేయిస్తారా? - కేంద్రం ఏం సూచిస్తుంది? గవర్నర్ ఏం చేస్తారు? - తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? - రెండు మూడు రోజుల్లో గవర్నర్ నిర్ణయం అంటున్న విశ్లేషకులు చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న తమిళ రాజకీయాలు రాజ్‌భవన్‌కు చేరాయి. మూడురోజులుగా ఎత్తులు పైఎత్తులతో ముఖ్యమంత్రి పదవికోసం పోటీ పడుతున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గురువారం సాయంత్రం ఇన్చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్‌రావుతో విడివిడిగా భేటీ అయ్యారు. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాలను సమర్పించిన శశికళ సీఎంగా ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. అంతకుముందే గవర్నర్‌ను కలిసిన పన్నీర్ సెల్వం తాను రాజీనామాను ఉపసంహరించుకుంటానని, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని, శాసనసభలో బలపరీక్షకు తనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వారిద్దరి వాదనలనూ సావధానంగా విన్న విద్యాసాగర్‌రావు నిర్ణయం ప్రకటించకుండా మరింత ఉత్కంఠకు తెరలేపారు. తాజా పరిణామాలు, తన అభిప్రాయాలతో ఆయన గురువారం రాత్రి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. గవర్నర్ ఏం నివేదిక పంపారు? కేంద్రం ఏ మార్గదర్శనం చేస్తుంది? గవర్నర్ నిర్ణయం ఏమిటి? తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి తలైవీ (నాయకురాలు)నా? తలైవా (నాయకుడు)నా?... అనే ప్రశ్నలకు సమాధానంకోసం ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు శిబిరంలోని ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు శశికళ వర్గం, ఆకర్షించేందుకు పన్నీర్‌వర్గం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. పన్నీర్ తన దూకుడును పెంచి శశికళను ఆత్మరక్షణలో పడేసేందుకు యత్నిస్తున్నారు. తమకు అవకాశం ఇవ్వకపోతే నేరుగా రాష్ట్రపతి ఎదుట ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించేందుకు శశికళ వర్గం ఏర్పాట్లు చేసుకుంటోంది. కేంద్రం ఆదేశాలతో గవర్నర్ జాప్యం చేయడం వల్లనే ఈ సంక్షోభం ఏర్పడిందని ఇప్పటికే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన కూడా ఈ వివాదాన్ని ఇంకెంతోకాలం పొడిగించలేరని, 2, 3 రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించక తప్పదని... సంక్షోభానికి సమాధానం దొరుకుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తమ వాదనలు వినిపించిన పన్నీర్, శశికళ తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించడానికి సమయం ఇవ్వాలని శశికళ బుధవారమే గవర్నర్‌ను ఫోన్లో కోరారు. ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం కూడా తన వాదన వినిపించేందుకు సమయం అడిగారు. అయితే గురువారం మధ్యాహ్నం వరకు గవర్నర్ ఇద్దరికీ సమయం కేటాయించలేదు. ఈలోపే ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, డీపీజీ రాజేంద్రన్‌తో తాజా పరిణామాల గురించి వివరాలు తెలుసుకున్నారు. గవర్నర్‌ను కలిసేందుకు సాయంత్రం ఐదు గంటలకు పన్నీర్ సెల్వంకు, రాత్రి ఏడు గంటలకు శశికళకు సమయం కేటాయిస్తున్నట్లు గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాజ్ భవన్ వర్గాలు వారికి సమాచారం అందించాయి. అయితే ఆ తర్వాత శశికళ అపాయింట్మెంట్ను రాత్రి 7:30కి మార్చారు. ఎమ్మెల్యేలతో కాకుండా ఐదారుమందితోనే రావాలని రాజ్‌భవన్ నుంచి వచ్చిన వర్తమానం శశికళను నిరుత్సాహానికి గురి చేసింది. గవర్నర్ గురువారం సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకున్న వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో తాజా పరిస్థితులపై చర్చించారు. అనంతరం పన్నీర్‌తో 20 నిమిషాలు, శశికళతో 30 నిమిషాలు గవర్నర్ భేటీ అయ్యారు. శశికళ మద్దతుదారులు తనతో బలవంతంగా రాజీనామా లేఖపై సంతకం చేయించారని పన్నీర్ గవర్నర్‌కు తెలిపారు. . నిర్బంధం నుంచి ఎమ్మెల్యేలు బయటపడితే తనకే మద్దతిస్తారని, అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశమివ్వాలని కోరారు. మరోవైపు మెజారిటీ ఎమ్మెల్యేల నిర్ణయం ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తనకు అవకాశం ఇవ్వాలంటూ శశికళ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాలను సమర్పించారు. వారిద్దరి వాదనలూ ఆలకించిన గవర్నర్ తాను అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి పంపారు. అయితే రాజ్‌భవన్ లోపల నుంచి బయటకు రాగానే అంతా మంచే జరుగుతుందని పన్నీర్ సెల్వం ధీమా వ్యక్తం చేయడం... శశికళ చిరునవ్వు లేకుండా బయటకు రావడం, మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించడం êంటి దృశ్యాలు అనేక రకాల చర్చలకు దారి తీశాయి. కేంద్రంతో పోరాటానికి శశికళ సిద్ధం రాజ్యాంగాన్ని కాపాడాల్సిన గవర్నర్ కేంద్ర ప్రభుత్వం మాట విని పన్నీర్ సెల్వంకు బలపరీక్షకు అవకాశం ఇచ్చినా, తనతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించకుండా వాయిదా వేసినా కేంద్ర ప్రభుత్వం మీద దండ యాత్ర చేయాలని శశికళ శిబిరం నిర్ణయించింది. శుక్రవారం సాయంత్రం వరకు వేచి చూసి గవర్నర్ నిర్ణయం తమకు అనుకూలంగా లేకపోతే ఎమ్మెల్యేలతో ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎదుట పరేడ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బుధవారం రాత్రే 20 మంది ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నారు. గవర్నర్ ఏం చేస్తారో! తమిళనాడులో అన్నా డీఎంకేను తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రధాని మోదీ పన్నీర్‌తో నాటకం ఆడిస్తున్నారని శశికళ మద్దతుదారులు ఇప్పటికే బహిరంగంగా ఆరోపణలు చేశారు. అయితే ఈ వివాదంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందర్ రాజన్, కేంద్రమంత్రి వెంకయ్య వివరణా ఇచ్చారు. ఈ నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్ రావు రాష్ట్ర రాజకీయ పరిణామాలపై కేంద్రానికి నివేదిక పంపడం మరో వివాదానికి దారి తీసే పరిస్థితి కనిపిస్తోంది. రాజ్యాంగం ప్రకారం అయితే గవర్నర్ శశికళతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించాలి. అక్రమాస్తుల కేసులో ఆమెకు ఇంకా శిక్ష పడనందువల్ల ఆమెను సీఎం చేయడానికి అడ్డంకి కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కానీ అదే కేసును బూచిగా చూపి కేంద్రం ఆమెను వేచి చూడాలని చెప్తే.. పన్నీర్‌కు పరోక్షంగా కొండంత మేలు చేసినట్లు అవుతుంది. ఈ సమయంలోపు శశికళ శిబిరంలోఉన్న ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకోవడానికి పన్నీర్‌కు అవకాశం లభిస్తుంది. లేదా పన్నీర్ సెల్వంకు బలపరీక్షకు అవకాశం ఇచ్చినా శశికళ తన శిబిరాన్ని కాపాడుకోవడం కష్టమే. ఏ విధంగానైనా పన్నీర్‌కు తగినంత మద్దతు వచ్చేంతవరకూ ఈ సందిగ్ధతను గవర్నర్ సాగదీయవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టు గానే పన్నీర్ దూకుడు పెంచారు. ప్రభుత్వంతో పాటు పార్టీని హస్తగతం చేసుకునే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. శశికళ విధేయులుగా ముద్రపడిన వారిమీద వేటు వేస్తూ, ఆమె వ్యతిరేకులైన ఇద్దరు ఐఏఎస్‌లపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ స్పష్టమైన సంకేతాలు పంపిస్తున్నారు. దీంతోపాటు చిన్నమ్మ నివాస ముంటున్న పోయెస్ గార్డెన్‌ను జయలలిత స్మారకభవనంగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాలన్నీ శశికళను ఆత్మరక్షణలో పడేశాయి. వీడని ఉత్కంఠ పోయెస్ గార్డెన్లో ఆదివారం మధ్యాహ్నం పన్నీర్ సెల్వంతో సీఎం పదవికి రాజీనామా చేయించడం, వెనువెంటనే చిన్నమ్మ శశికళను శాసనసభా పక్ష నాయకురాలిగా ఎన్నుకోవడం చక చకా జరిగిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం కోసం శశికళ గవర్నర్‌ను సంప్రదించడం, ఊటీలో విహార యాత్రలో ఉన్న ఆయన చెన్నైకి రాకుండా నేరుగా ఢిల్లీ వెళ్లడంతో రాజకీయం వేడెక్కింది. ఈలోపే మంగళవారం రాత్రి పన్నీర్ సెల్వం తిరుగుబాటు జెండా ఎగుర వేయడంతో తమిళనాడు రాజకీయాలు వేగంగా మలుపులు తిరిగాయి. రాష్ట్రంలో పాలనాపరమైన సంక్షోభం ఏర్పడినా గవర్నర్ చెన్నైకి రాకుండా ముంబైలో ఉండిపోవడం రాజకీయ దుమారం రేపింది. ప్రధాని మోదీ మీద, గవర్నర్ విద్యాసాగర్‌రావు మీద ప్రత్యక్ష యుద్ధానికి దిగేందుకు శశికళ తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో రాష్ట్రపతి వద్దకు వెళ్లే ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విషయం గుర్తించిన గవర్నర్ గురువారం తన చెన్నై పర్యటనను అధికారికంగా వెల్లడించారు. ఆయన చెన్నైకి చేరుకుని పన్నీర్, శశికళతో చర్చించాక వెంటనే ఈ వివాదానికి తెర దించుతారని రాజకీయ వర్గాలు, ప్రజలు భావించారు. అయితే గవర్నర్ ఈ వివాదానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పరిష్కారం కోరడంతో అన్నా డీఎంకే రాజకీయ సంక్షోభానికి తెర దిగలేదు. గవర్నర్ రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తారా? లేక కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే అది చేసి తానూ రాజకీయ నాయకుడేనని చాటుకుంటారా? అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. శాసనసభా పక్ష నాయకునిగా ఒకరిని ఎన్నుకున్నాక ప్రమాణస్వీకారాన్ని కేంద్రం తమ రాజకీయ ప్రయోజనాలకోసం వ్యూహాత్మకంగా జాప్యం చేయడమే సంక్షోభానికి కారణమని న్యాయవాది, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు. వీళ్ల రాజకీయ లక్ష్యాన్ని నెరవేర్చుకునే సాధనలో భాగంగానే అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు, ప్రజల మనోభావాలను సాకుగా చూపుతున్నారని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇది భవిష్యత్తులోవిపరిణామాలకు దారితీయవచ్చని, తమకు నచ్చని వారిని అడ్డుకోవడానికి గవర్నర్‌ను ఓ సాధనంలా వాడుకునే దుస్సంప్రదాయానికి దారితీయవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. -
రొంబ రాజకీయం