దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న తమిళ రాజకీయాలు రాజ్‌భవన్‌కు చేరాయి. మూడురోజులుగా ఎత్తులు పైఎత్తులతో ముఖ్యమంత్రి పదవికోసం పోటీ పడుతున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గురువారం సాయంత్రం ఇన్‌చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్‌రావుతో విడివిడిగా భేటీ అయ్యారు. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాలను సమర్పించిన శశికళ సీఎంగా ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. అంతకుముందే గవర్నర్‌ను కలిసిన పన్నీర్ సెల్వం తాను రాజీనామాను ఉపసంహరించుకుంటానని, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని, శాసనసభలో బలపరీక్షకు తనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.