సాక్షి, చెన్నై : ‘అభినవ తమిళనాడు పిత’గా పేరొందిన పెరియార్ ఈవీ రామస్వామి నాయకర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అంతేకాకుండా విగ్రహం తలపై చెప్పుల జతను ఉంచి ఘోరంగా అవమానించారు. సోమవారం పెరియార్ 140వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళి అర్పించడానికి వెళ్లిన అభిమానులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
‘స్వీయాభిమాన’ ఉద్యమ నిర్మాత రామస్వామి..
తమిళనాడులోని ఈరోడ్‌లో 1879, సెప్టెంబర్‌లో ఈవీ రామస్వామి జన్మించారు. ఆయన అసలు పేరు వెంకట రామస్వామి. ఈరోడ్‌లో పుట్టినందున ఈరోడ్ వెంకట రామస్వామి అయ్యారు. ఆ తర్వాత ఆయన ప్రజల దృష్టిలో పెరియార్ రామస్వామిగా మారారు. ‘పెరియార్’ అంటే తమిళంలో గౌరవనీయులు లేదా పెద్ద అని అర్థం. పొడవాటి గుబురు గడ్డం.. ముఖాన గుండ్రటి కళ్లజోడు... ఉదారత్వం ఉట్టిపడే నవ్వు చూస్తే.. ఆయనలో ర్యాడికల్ సిద్దాంతం రగులుకుంటుందని ఎవరూ ఊహించరు.
సమాజంలో కుల, మత, వర్గ ఆధిపత్యాలపై రామస్వామి తిరుగుబాటు చేశారు. కుల, మత రహిత సమసమాజం కావాలని కాంక్షించారు. మహిళలకూ సమాన హక్కులు కావాలన్నారు. స్వతహాగా సమాజంలో అణచివేతకు గురవుతున్న ‘బలిజ’ కుటుంబానికి చెందిన పెరియార్ సమాజంలో ప్రధానంగా బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. దక్షిణ భారతానికి చెందిన ద్రావిడులపై ఉత్తరానికి చెందిన బ్రాహ్మణ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ ‘స్వీయాభిమాన ఉద్యమాన్ని’ నిర్మించారు. అగ్రవర్ణాలు ఇతర వర్గాలపై తమ ఆధిపత్యం కొనసాగించడం కోసం, వారిని తిరుగుబాటు చేయకుండా కట్టడి చేయడం కోసం దేవుళ్లను, వారి పేరిట గుళ్లూ గోపురాలను, పనికి మాలిన పురాణాలను సృష్టించారంటూ ప్రచారోద్యమాన్ని సాగించడం ద్వారా ప్రముఖ హేతువాదిగా ముద్రపడ్డారు.
రాజకీయ ప్రస్థానం..
పుట్టుకతోనే ధనవంతుడైన పెరియార్ (తండ్రి కన్నడ వ్యాపారి) ఈరోడ్ మున్సిపాలిటీ పరిధిలో పలు పదవులు నిర్వహించారు. ఆ తర్వాత 1919లో కాంగ్రెస్ పార్టీలో చేరి 1925 వరకు కొనసాగారు. తాను ఆశించిన లక్ష్యాలను సాధించాలంటే సొంతంగా సామాజిక ఉద్యమం చేపట్టడమే మార్గం అనుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. తన ఆశయాల లక్ష్య సాధన కోసం 1939లో ‘జస్టిస్ పార్టీ(1917లో ఏర్పడింది)’లో చేరారు. 1944లో ఆ పార్టీని ‘ద్రావిడదార్ కళగం’గా మార్చారు. తన లక్ష్యాలకనుగుణంగా.. ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటూ సామాజికోద్యమానికే ప్రాధాన్యతనిచ్చారు. అయితే ఎన్నికల రాజకీయాలు కూడా ముఖ్యమేనంటూ అందులో నుంచి 1949లో సీఎన్ అన్నాదురై నాయకత్వాన డీఎంకే ఆవిర్భవించింది. తర్వాత దాని నుంచి అన్నాడీఎంకే కూడా ఆవిర్భవించింది. అదే విధంగా మరుమలార్చి ద్రావిడ మున్నేట్ర కళగమ్, పెరియార్ ద్రావిడదార్ కళగమ్, థాంతై పెరియార్ ద్రావిడదార్ కళగమ్, ద్రావిడదార్ విద్యుత్తలై కళగమ్ పార్టీలు పుట్టుకొచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment