నవ్వు స్వామీ! | special chit chat actor rajendra prasad | Sakshi
Sakshi News home page

నవ్వు స్వామీ!

Published Wed, Sep 13 2017 12:04 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

నవ్వు స్వామీ! - Sakshi

నవ్వు స్వామీ!

నేను  నా దైవం

జగన్నాటక సూత్రధారి ముందు మన నాటకాలేం చెల్లుతాయి? మన నటన ఏం కనిపిస్తుందీ! చిన్నప్పుడు దుర్గమ్మ అమ్మ. పెద్దయ్యాక వెంకన్నే అయ్య. ఈ మధ్యలో.. ఆకలి సోదరుడు.. ఆశ సోదరి. నిజమే. ఈయన లైఫ్‌ ఒక నాటక రంగం. తను ఏదో చేద్దాం అనుకున్నాడు.ఎంతో చేశాడు. కానీ అదంతా.. ఆ జగన్నాటకంలోని తన పాత్ర మాత్రమే అని అర్థమైంది! నవ్వే ఆ స్వామి ముందు.. తనొక నిమిత్తమాత్రుడినని తేలిపోయింది.


నవ్వుల నటకిరీటి దైవాన్నీ నవ్వుతోనే మెప్పిస్తాడా? కామెడీతో స్వామి దగ్గర కోరినవన్నీ పొందేస్తుంటాడా? దైవాన్ని దర్శించే విధానంలో రాజేంద్రుడు అవలంబించే పద్ధతులు ఏమిటి? ఇలాంటి సందేహాలతో హైదరాబాద్‌ హైటెక్‌సిటీకి చేరువలో ఉన్న వారింటికి చేరుకున్నాం. అయ్యప్పమాలలో కనిపించిన రాజేంద్రప్రసాద్‌గారిని..

ఇది నవంబర్‌ నెల కాదుగా ఇప్పుడు దీక్ష తీసుకున్నారు?
సాధారణంగా నవంబర్, డిసెంబర్, జనవరి నెలలు మాల వేసుకునే సమయం. కానీ, ఆ నెలల్లో శబరిమలైలో భక్తులు ఎక్కువైపోతున్నారు. తొక్కిసలాట పెరుగుతోంది. ఆ రష్‌ని తట్టుకోలేకపోతున్నాను. దీనివల్ల భక్తిపోయి భయం వచ్చేస్తుంది. అందుకే ఆగస్టులో వేసుకొని సెప్టెంబర్‌లో వెళుతున్నాను. ఇప్పుడెళితే ఆ ప్రాంతం, గుడి చాలా ప్రశాంతంగా ఉంటాయి. గుళ్లోనే టవల్‌ పరుచుకొని పడుకునే అవకాశం ఉంటుంది. అయ్యప్ప దీక్ష తీసుకొని ఈ యేడాదికి 39 ఏళ్లు.  

యేటా మాల వేసుకుంటున్నారు. దీనికి ఏమిటి కారణం?
యేటా శరత్‌బాబు (నటుడు)గారు మాల వేసుకునేవారు. వారింటికి తరచూ వెళుతుండే నాకు అయ్యప్ప దీక్షలోని ఆరోగ్య రహస్యాలు, క్రమశిక్షణ విపరీతంగా నచ్చాయి. ఈ దీక్ష ద్వారా మండలం రోజులు శరీరం, మనసు పూర్తిగా శుభ్రపడతాయి. పెళ్లయిన కొత్తలో నెలరోజులకే మాల వేసుకుంటానంటే శరత్‌బాబుగారు గొడవ చేశారు వద్దని! కానీ, వినిపించుకోలేదు. అలా ఇన్నేళ్లలో ఎప్పుడూ దీక్ష మానలేదు.

 మీ దీక్ష చూస్తుంటే  సినిమాల విషయం లోనూ అంతే పట్టుదలగా ఉన్నట్టున్నారు? దేవుణ్ణి అదేపనిగా కోరుకున్నారా?
మనకు కోరిక ఉన్నది కదా అని అడిగితే దేవుడు ఇవ్వడు. మనం దేనికి అర్హులమో దేవుడు అదే ఇస్తాడు. ఆ అర్హత సాధించాలంటే మన పని మనం సక్రమంగా చేయాలి. నేను ఇంజనీరింగ్‌ చదివినా నటుడిని అవ్వాలనే కోరిక బలంగా ఉండేది. మద్రాసులోని ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి రెండేళ్లు శిక్షణ తీసుకుని, గోల్డ్‌మెడల్‌ తెచ్చుకున్నాను. అప్పుడు రామారావుగారు ‘బేష్‌’ అని భుజం తట్టి ‘నీవు దీనికి డిజర్వ్‌’ అన్నారు. అలా అర్హత వచ్చేసింది.

నటనలో అర్హత సాధించారు. అయితే, ప్రత్యేకంగా కామెడీని హీరోగా నిలబెట్టడం... దైవ నిర్ణయమేనా?
అర్హత వచ్చేసింది. దారి దొరకాలి.  రామారావుగారిని కలిసినప్పుడు ‘ఈ పరిశ్రమలో నిలబడాలంటే మీరెందుకు పనికొస్తారో ముందు తెలుసుకోండి. దేవుడి పాత్ర వేయాలంటే నేను, సాంఘిక చిత్రమంటే నాగేశ్వరరావు, రొమాన్స్‌ మూవీ అంటే శోభన్‌బాబు గుర్తుకువస్తారు. మరి మీరు..’ అని అడిగారు. దీంతో మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. వారం రోజులు తిండి తిప్పల్లేకుండా రోడ్లు పట్టుకు తిరిగాను. డల్‌గా ఉండటం చూసి స్నేహితులు ‘అమెరికన్‌ కాన్సులేట్‌లో మూవీ ఫెస్టివల్‌ జరుగుతందట.. వెళ్దాం’ అన్నారు. అక్కడ సినిమాలు చూసేందుకు మా ఇన్‌స్టిట్యూట్‌వాళ్లకు ఉచితంగా పర్మిషన్‌ ఇచ్చేవారు. చూస్తే అక్కడ చార్లిచాప్లిన్‌ ఫెస్టివల్‌. వారమంతా అవే సినిమాలు. వరుసగా ఆ సినిమాలన్నీ చూశాను. ఏడోరోజు అర్ధమైపోయింది నేనేమవ్వాలో!

ఒక యాక్షన్, ఒక రొమాన్స్‌ హీరో అవగా లేనిది నవరసాల్లో ఒకటైన హాస్యం హీరో ఎందుకు కాకూడదు అనిపించింది. మీరు గమనించారో లేదో గానీ, ఏదన్నా జరిగేటప్పుడు ముందుగానే దేవుడి నుంచి మనకు ఒక హింట్‌ వస్తుంది. నా జీవితంలో ఈ హింట్స్‌ని చాలా సార్లు గమనించాను. ‘హమ్మ స్వామీ ఇదా రూట్‌’ అని అర్థమైపోయి అదే గట్టిగా పట్టేసుకున్నా! నూటికి నూరు శాతం ఆ జాబ్‌ని సరిగ్గా చేయాలి కదా! ఆ పని చేయకుండా ఏదేదో చేస్తే ఎలా? అందుకని దొరికిన ట్రాక్‌లోనే ప్రతిదాంట్లో కామెడీ కలుపుకుంటూ వెళ్లి హీరో అయ్యాను. అందులో కూడా సమాజానికి పనికి వచ్చే విషయాన్ని చేరవేశాం. అది సంతృప్తి. ఇప్పటికీ సెలవురోజొస్తే టీవీల్లో నేనున్న సినిమాలే వస్తాయి. ఇది నా అదృష్టం.

దేవుడు దారి చూపుతాడు, హింట్స్‌ ఇస్తాడు అనుకునేటంత భక్తికి ఎక్కడ బీజం పడింది?
నా పదేళ్ల వయసులో అమ్మ చనిపోయింది. అమ్మ వచ్చి పెడితేనే అన్నం తింటానని మొండికేసేవాడిని. ఇంట్లో అందరూ విసిగిపోయారు నా చేత అన్నం తినిపించలేక. మా మేనమామ  ‘అమ్మదగ్గరకు వెడదాం రా...’ అని విజయవాడ దుర్గగుడికి తీసుకెళ్లాడు. ‘అదిగో అమ్మ’ అని అమ్మవారిని చూపించాడు. ఏదైనా ఉంటే ‘అమ్మను అడుగు’ అన్నాడు. నేను కళ్లు మూసుకొని చేతులు జోడించి ‘వచ్చి అన్నం పెట్టమ్మా!’ అని అడిగాను. అంతలోనే మా మామయ్య ‘చూడు ఎంతమంది అమ్మకు దణ్ణం పెట్టుకుంటున్నారో. వాళ్లందరికీ అమ్మ నేరుగా వచ్చి అన్నం పెట్టాలంటే ఎట్లా?’ అన్నాడు. ఆ పసిమనసులో అలా దుర్గమ్మ మా అమ్మగా స్థిరపడిపోయింది. ఏదైనా కష్టం వస్తే అమ్మ దగ్గరకు వెళ్లిపోతా! అమ్మ ముందు నుంచుని నా బాధ చెప్పుకుంటా. కళ్లలో నీళ్లు ఉబికి వస్తాయి. అక్కణ్ణుంచి బయటకు రాగానే మనసు తేలికైపోతుంది.
     
దేవుడున్నాడు అనిపించిన ఘటన ఏంటి?
పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో అవకాశాలు రాలేదు. ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. అప్పటికీ మా పెద్దన్నయ్య(గద్దె నాగేశ్వరరావు) నెలకు ఐదువందల రూపాయల సాయం చేసేవాడు. ‘గోల్డ్‌మెడల్‌ సాధించా, సంపాదిస్తున్నాను అన్నావ్, ఇంకా అన్న దగ్గర డబ్బులు తీసుకుని ఏం చేస్తున్నావ్‌! తాగి తందనాలు ఆడుతున్నావా!’ అని మా నాన్నగారు తిట్టారు. దాంతో రోషం వచ్చి మద్రాస్‌ వెళ్లిపోయా. ఇంటినుంచి డబ్బులు అడగకూడదని నిర్ణయించుకున్నా. నాకో అలవాటు ఉండేది. చిల్లర జేబులో ఉంటే తీసి ఒక హుండీలో వేస్తుండేవాడిని. హుండీని పగల గొట్టి, ఆ చిల్లర అయిపోయేలోగా అవకాశం రావాలి. లేకపోతే ఆత్మహత్యే అనుకున్నాను. ఆ చిల్లరతో రోజూ ఒక అరటిపండు, గ్లాసు మజ్జిగ మాత్రమే తీసుకోవాలనుకున్నాను.

ఆ చిల్లర మూడు నెలల వరకు వచ్చింది. ఇంక మూడు రోజులకు సరిపడా చిల్లర ఉందనగా రామా రావుగారితో సహా ప్రముఖులను కలిసి వచ్చేసి, అప్పుడు చచ్చిపోదామని అనుకున్నాను. అలా వెళ్లి.. వçస్తూ మధ్యలో పుండరీకాక్షయ్య ఇంటికి వెళ్లాను. కళ్లు తిరుగుతుంటే వాళ్లింటి అరుగు మీద కూర్చున్నాను. లోపల వాళ్లు తీసిన ‘మేలుకొలుపు’ సినిమాకు డబ్బింగ్‌ సరిగా రాలేదని కోప్పడుతున్నాడు. ఇంకొకరిని ట్రై చేయమని చెప్పి బయటకు వచ్చి నన్ను చూశారు. అప్పటికప్పుడు తీసుకెళ్లి నాచేత డబ్బింగ్‌ చెప్పించారు. బ్రహ్మాండమని ఆయన నన్ను గట్టిగా కౌగిలించుకున్నారు. నేను అలాగే స్పృహ తప్పిపడిపోయాను. ‘ఆరోగ్యం బాగో లేదా!’ అని అడిగితే.. ‘అన్నం పెట్టించండి’ అన్నాను నీరసంగా! అలా అక్కణ్ణుంచి నా జీవితం మారిపోయింది. దేవుడు మనకు ఏది కావాలో అది తప్పక ఇస్తాడు అని గాఢంగా నమ్మకం  ఏర్పడింది.
     
కనకదుర్గమ్మ, అయ్యప్ప భక్తులైన మీరు తిరుమల కొండపై కాటేజీ కట్టించారు. మీ అబ్బాయికి బాలాజీ అని పేరు పెట్టారు. వెంకన్న స్వామి మీద భక్తి ఎప్పుడు ఏర్పడింది?
గూడూరులో సెరామిక్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్న రోజులవి. అక్కడి హాస్టల్‌లో ఉండేవాణ్ణి. నెలకు ఇరవై రూపాయల స్కాలర్‌షిప్‌ వచ్చేది. గూడూరు నుంచి తిరుపతికి నేరుగా టీటీడీ బస్సులుండేవి. స్కాలర్‌షిప్‌ రాగానే గూడూరులో బస్సు ఎక్కి నేరుగా తిరుపతి వెళ్లిపోయేవాడిని. మెట్లు ఎక్కి, స్వామి దర్శనం చేసుకొని లడ్డూలు కొనుక్కొని హాస్టల్‌కి వచ్చి అందరికీ ఆ ప్రసాదం పంచిపెట్టేవాణ్ణి. ప్రతి నెలా ఇదే సర్వీస్‌. ఆ తర్వాత కాలంలో నటుడిగా. తిరుపతిలో ఎక్కువ షూటింగ్‌లు జరిగాయి. అదేంటో కొంతమంది మీద లవ్‌ అలా పుడుతుంది. స్వామికి అలా దొరికిపోయాను. (నవ్వుతూ). ఇక కాటేజీ అంటారా.. నా చేత ఆయనే ఏర్పాటు చేయించారు. మా అబ్బాయి వైకుంఠ ఏకాదశి రోజున పుట్టడంతో బాలాజీ అని, అమ్మాయి విజయదశమి రోజున పుట్టడంతో గాయత్రి అని పేరు పెట్టాను.

ఇన్నేళ్లలో నష్టపోయిందేంటి? ఆ సమయం లో దేవుణ్ణి తలుచుకున్న ఘటన.
అదేంటోనండీ.. 40 ఏళ్లు పుసుక్కున వెళ్లిపోయాయి. అలాగెలా అయిపోయాయని తెగ హాశ్చర్యపోతుంటాను. స్వామిని ‘ఏంటయ్యా.. అంత త్వరగా రోజుల్ని వెళ్లిపోనిచ్చావ్‌’ అంటుంటాను సరదాగా! ఇన్నేళ్లలో ఎక్కడకెళ్లినా నా టెంపర్‌మెంట్స్‌ని భరించి, నాకెన్నో అవకాశాలు కల్పించిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంటాను. టెంపర్‌మెంట్స్‌ ఎందుకన్నానంటే అనుకున్నది జరగకపోతే నాకు బాగా కోపం వచ్చేస్తుంది.

అయితే, దేవుడినీ మీ కోపం వదల్లేదా?
కోపంలో ఎవరైనా ఒకటే మనకి. స్వామి అందుకు మినహాయింపేమీ కాదు. విషయానికి వస్తా.. కాటేజీ ఏర్పాటులోనూ, జాప్యంలోనూ కోప్పడ్డాను స్వామి మీద. అప్పట్లో షూటింగ్‌ నిమిత్తం మద్రాస్‌కి, ఆంధ్రాకి తిరుగుతుండేవాళ్లం. మధ్యలో తిరుపతి అనుకూలంగా ఉంటుందని అక్కడే షూటింగ్‌లు ఏర్పాటు చేసేవారు. ఏ సినిమా మొదలుపెట్టినా మెట్లు ఎక్కి పైకి వెళ్లిపోయేవాడిని. అలా ఏడాదికి 9 సార్లు కొండమెట్లు ఎక్కిన సందర్భాలున్నాయి. రాత్రి 12 అయినా సరే వెళ్లిపోయేవాడిని. ఉదయాన్నే స్వామి దర్శనం చేసుకొని, తిరిగి సినిమా షూటింగ్‌కి వచ్చేసేవాడిని. అలా తిరుపతిలో షూటింగ్‌ చేస్తున్నప్పుడు ‘ఎర్రమందారం’ సినిమాకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు వచ్చింది. ఆ సందర్భంలో తిరుపతిలో ఉన్న మిత్రులు డాక్టర్‌ శివప్రసాద్, వెంకటరమణ ‘స్వామి మీకు చాలా బ్లెసెంగ్స్‌ ఇచ్చేశారు కొండమీద కాటేజీ కట్టాల్సిందేనండీ’ అన్నారు. భయమేసి వద్దండీ నా వల్లకాదు అనేశాను.

కానీ, నాకూ మనసులో పీకుతోంది. కడితే బాగుంటుంది కదా! అని. మిత్రులు ఎప్పుడు ఏర్పాట్లు చేశారో.. టీటీడీ నుంచి అంతా ఓకే అయ్యింది. సరే అనుకున్న బడ్జెట్‌లో పూర్తయితే చాల్లే అనుకొని పనులు మొదలుపెట్టేశాను. ఆ తర్వాత కష్టం అంటే ఏంటో తెలిసొచ్చింది. ఖర్చు రెట్టింపు అయ్యింది. కడుతూ కడుతూ డబ్బుల్లేక కాటేజీ సగంలోనే ఆగిపోయింది. టీటీడీ నుంచి లెటర్‌. ‘ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. ఆరునెలల్లోగా పూర్తిచేయకపోతే మేం వేరే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది’ అని. అంతే, తిరుమల వెళ్లిపోయాను. ఆ రోజు శుక్రవారం. పొద్దున్నే అభిషేకం సమయానికి స్వామి ముందుకు కూర్చున్నాను. అక్కణ్ణుంచి మొదలు.. నమ్మరు. కోపంలో చాలా అనేశాను ఆయన్ని.

‘ఏమనుకున్నావ్‌ నువ్వు.. ఎందుకు ఇందులో ఇరికించావు. నేనేమైనా బ్యాంకులు లూటీ చేసేవాడినా, రాజకీయనాయకుడినా, కాంట్రాక్టులు చేసేవాడినా..! మొహం మీద రంగేసుకొని వాళ్లు ఎంత ఇస్తే అంతలోనేగా నీకు కట్టిచ్చి ఇచ్చేది!’ ఇలా నా కడుపులోని మంటంతా కక్కేసాను. ‘ఇదిగో ఆ కాటేజీ పూర్తయితే తప్ప నేను మళ్లీ ఇక్కడకు రాను చూస్కో! ఇదే నా చివరి చూపు’ అని వచ్చేశాను. అంత కోపం. (గుండెమీద చేయి వేస్కుని) నేనెంత, ఆయనకు నేను వార్నింగ్‌ ఇవ్వడేమింటి!? ఆయనేమనుకున్నాడో.. ఈ పిచ్చోడేంటి ఇలా అని నవ్వుకున్నాడేమో..! ఆయన్ని తిట్టేసి వచ్చిన వారానికి ఓ అద్భుతం జరిగింది. ఓ ఫంక్షన్‌కి హాజరయ్యాను. అది శ్రీమంతుల ఫంక్షన్‌. అక్కడ పెద్దలు, మిత్రులు కొంతమంది కలిసి మాట్లాడుకుంటున్నారు. వాళ్లలో ఉన్నట్టుండి ఒకరన్నారు. ‘మొన్న పేపర్‌లో చూశానయ్యా.. తిరుమలలో నీ గొడవేంది?’ అన్నారు.

అసలు విషయం చెప్పాను. ‘వీలైనంత పెట్టాను. అనుకున్నదాన్నికన్నా ఎక్కువైంది. ఇక నాదగ్గర ఏమీ లేదు’ అన్నాను. అప్పటికప్పుడు వాళ్లలో ఐదుగురు మాట్లాడేసుకుని ‘రేపు చెక్‌ పంపిస్తాం. పని మొదలుపెట్టించు’ అన్నారు. అంతా పదే పది నిమిషాలు. దేవుడు అక్కడే కనిపించాడు. డబ్బు వచ్చేసింది. వెంటనే స్వామి దగ్గరకు పరుగు. వెళ్లి ఆయన ముందు చేతులు కట్టుకుని కూర్చున్నాను. కానీ, కళ్లెత్తి ఆయన్ని చూడలేకపోయాను. ఆయన ఒక కన్ను కొద్దిగా తెరిచి నన్ను చూస్తూ.. నవ్వుతూ ‘చాల్లేగానీ, మూసుకొని పనిచూడరా!’ అన్నట్టు అనిపించింది.

దేవుడిని దుఃఖంతో ప్రార్థిస్తే పలుకుతాడంటారు. కామెడీతో అడిగినా పలుకుతాడా?
ఎలా అడిగినా ఆయనకు మన ఆర్తి అర్థమైపోతే చాలు, ఇచ్చేస్తాడు. అయితే, నాకు ఇది కావాలని స్వామిని అడగలేదు. కానీ, కామెడీ కోరికలు చాలా కోరుకున్నాను. ఊరెళ్లినప్పుడు వర్షాలు లేక పంటలు ఎండిపోవడం చూస్తుంటాను. ‘ఏందీ సామీ.. మరీ అన్యాయం కాకపోతే! నీ డ్యూటీ నువ్వు చేయాలి కదా! పంటలు లేకపోతే, తిండి ఉండదు. తిండి లేకపోతే మేమంతా ఏమై పోవాలి? తెలియట్లేదా నీకిదంతా! నీకు సేవ చేయాలన్నా నీళ్లు కావాలి కదయ్యా! ఆ మాత్రం చూసుకోకపోతే ఎట్టా..  మాకు చెప్పే రైట్‌ ఉంది. మీకు వినే రైట్‌ ఉంది. వినండి.. ముందు’ అంటుంటాను. వర్షాలు దండిగా పడి పంటలు బాగా పండితే స్వామికి కృతజ్ఞతలు చెబుతుంటాను.

‘ఏమనుకున్నావ్‌ నువ్వు.. ఎందుకు ఇందులో ఇరికించావు. నేనేమైనా బ్యాంకులు లూటీ చేసేవాడినా, రాజకీయనాయకుడినా, కాంట్రాక్టులు చేసేవాడినా..! మొహం మీద రంగేసుకొని వాళ్లు ఎంత ఇస్తే అంతలోనేగా నీకు కట్టిచ్చి ఇచ్చేది!’ ఇలా నా కడుపులోని మంటంతా కక్కేసాను.

ఆర్టిస్టుగా సంతృప్తి పొందడానికి కారణం దేవుడేనా?
ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు. డబ్బింగ్‌ సినిమాల నుంచి యాక్టర్‌ వరకు. అటునుంచి ఇప్పటి సపోర్టింగ్‌ వేషాల వరకు.. ఎంతటి అద్భుత అవకాశాలు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు దేవుడు నాకు ఇస్తున్నవన్నీ బోనస్‌ అవకాశాలు.  అప్పట్లో ఏడాదికి పదహారు సినిమాలు చేసిన సందర్భాలున్నాయి. అవన్నీ హిట్టే! ‘ఒక్క సంవత్సరంలో అన్ని సినిమాలు ఎలా చేశారు’ అని అడుగుతుంటారు. ఏప్రిల్‌ 1 విడుదల సినిమా చేసే సమయంలోనే మరోవైపు ఎర్రమందారం సినిమా చేశా. ఎదుటివాడిని వేలెత్తి చూపే పనిలో ఎప్పడూ లేను. నన్ను నేను వేలెత్తి చూపుకుంటాను ‘నువ్వేం చేశావ్‌!’ అని. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని నూటికి నూరు శాతం ఉపయోగించుకున్నాను.

దేవుళ్లు సినిమాల్లో ఆంజనేయస్వామి పాత్ర వేశారు. ఆ అనుభూతి ఎలా అనిపించింది?
దాని గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదండీ. కోడిరామకృష్ణ గారు ఓ రోజు ఉదయమే ఫోన్‌ చేసి.. ఈ వేషానికి నువ్వైతే బాగుంటుంది అన్నారు. ‘ఆయనలా నాకు కండలు లేవు. నేనెలా దీనికి న్యాయం చేస్తాను’ అన్నాను. కానీ, ఆయన వినలేదు. ఆ వేషం గుహుడిలా ఉండాలని 35 వేల రూపాయలు పెట్టి డ్రెస్‌ తయారు చేయించారు. అందరం షూటింగ్‌కి భద్రాచలం వెళ్లాం. తీరా చూస్తే అనుకున్న డ్రెస్‌ నప్పలేదు. డ్రెస్‌ కోసం షూటింగ్‌ ఆగిపోయే పరిస్థితి. గుడి ముందు దుకాణాలు ఉన్నాయి.

అక్కడో ఎర్రబనీను, ఓ గళ్ల లుంగీ తీసుకున్నాను. బనీను నా సైజుకు సరిపోలేదు. అయినా అదే వేసుకున్నాను. కూర్చొనే చాప తీసి, అప్పటికప్పుడు టోపీ కుట్టేసి పెట్టుకున్నాను. దాని మీద ఎర్రటి తువ్వాలు కట్టాను. మూతికి తెల్లని రంగు. అయిపోయింది స్వామి వేషం. ఆంజనేయస్వామి గుడి ఎదురుగా షూటింగ్‌ మొదలుపెట్టాం. మంచి పేరొచ్చింది. నాకు చాలా సంతోషాన్ని, సంతృప్తిని మిగిల్చింది ఆ వేషం.   
– నిర్మలారెడ్డి చిల్కమర్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement