బోళా బాలయ్య గోల తాతయ్య | special chit chat hero balakrishna | Sakshi
Sakshi News home page

బోళా బాలయ్య గోల తాతయ్య

Published Sat, May 16 2015 11:29 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

బోళా బాలయ్య  గోల తాతయ్య - Sakshi

బోళా బాలయ్య గోల తాతయ్య

అమాయకత్వం బాలయ్యకు ఆభరణం. అభిమానుల కోసం ఏదైనా చేయడానికి రెడీ... బోళా శంకరుడిలా! బహుశా ఇంత పర్సనల్... అప్‌ఫ్రంట్ ఇంటర్వ్యూ ఎప్పుడూ ఇచ్చి ఉండకపోవచ్చు.  వాళ్ల నాన్న గారి గురించి... తన గురించి... తన బిడ్డ మోక్షజ్ఞ గురించి... మళ్లీ పుట్టిన నాన్న (మనవడు) గురించి...  మనవడిని కవ్వించడానికి ఈల వేసే గోల తాతయ్య గురించి... చాలా ఆత్మీయమైన విషయాలు  మనతో పంచుకున్నారు. ఇవాళ్టి సండేలో ‘సింహ’ భాగం  బోళా బాలయ్యదే... గోల తాతయ్యదే!
 
‘లయన్’ చిత్రంలో మీరు చేసిన రెండు పాత్రల్లో గాడ్సేలాంటి పాత్ర చేస్తే మీ అభిమానులు ఫీలవుతారని అనుకోలేదా?
 
బాలకృష్ణ: కొత్తగా ఏదైనా ట్రై చేయకపోతే నాకే బోర్ కొట్టేస్తుంది. ఆ రోజుల్లో మా నాన్నగారు ఎన్నో డిఫరెంట్ రోల్స్ చేశారు. అలాగే, నేను కూడా నటుడిగా అన్నీ ట్రై చేస్తాను... అభిమానులు కోరుకున్న అంశాలు కూడా ఉండేలా చూసుకుంటాను. 

‘మీ కోసమే కథ తయారు చేశాం’ అని మీ దగ్గరికి ఎంతోమంది వస్తుంటారు... మీరెలా రెస్పాండ్ అవుతారు?

నా దగ్గరకు వచ్చినప్పుడు ‘ఈ కథ మీకోసమే..’ అని చెబుతుంటారు. (నవ్వుతూ) అప్పుడు నేను ‘కాదు.. దీన్ని వేరే హీరోల దగ్గర కూడా చెప్పారు.. నా కోసం కథ ఉంటే చెప్పండి’ అంటాను. ఎదుటి వ్యక్తి ఎంత నిజాయతీగా వ్యవహరిస్తారనేది గ్రహించేయగలుగుతాను.

ఎన్టీఆర్ మంచి కమర్షియల్ మాస్ హీరోగా ఉన్న సమయంలో... ‘గుండమ్మ కథ’లో హీరోయిన్ కోసం ఏకంగా పిండి రుబ్బేశారు.. ‘మనం నటులం.. ఎలాంటి పాత్ర అయినా చేయాలి’ అని మీకెప్పుడైనా చెప్పారా?
 
అసలలాంటి సలహాలు ఎప్పుడూ ఇవ్వలేదు. నా సినిమాలు చూడడం కానీ, ఏ సినిమాలు చేస్తున్నావ్? దాని కథ ఏంటి? అని కానీ ఎప్పుడూ అడగలేదు. ఆయన దర్శకత్వంలో సినిమాలు చేశాను. ఆ అనుభవం నాకు చాలని ఆయన అనుకున్నారేమో. నాన్నగారి దర్శకత్వంలో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చేస్తున్నప్పుడు ఓ సన్నివేశంలో శవం లేస్తుంది. ఆ సీన్‌లో కపాల మోక్షానికి లక్ష్మీ బాంబులు పెట్టారు. వాటిలో ఒక బాంబు సరిగ్గా నా కాలి మీద పడింది. కాలు కాలింది. కానీ, అది బయటపెట్టలేను. యూనిట్‌లో అందరికీ తెలిసినా సెలైంట్‌గా ఉండిపోయారు. షాట్ ఓకే అన్న తర్వాత నేను కదిలాను. ఆ తర్వాత కూడా నాన్నగారు దాని గురించి పట్టించుకోలేదు. మామూలుగా ఎవరైనా ఏం చేస్తారు? ‘అయ్యో కాలు కాలిందా..’ అని ప్యాకప్ అనీ, ఆస్పత్రికి తీసుకెళ్లమనీ.. ఏదో ఒకటి చెబుతారు కదా. కానీ, నాన్నగారు ‘ఓకే.. తర్వాత షాట్ రెడీ’ అన్నారు. ‘ఏంట్రా ఇది..’ అని చూస్తూ ఉండిపోయాను. మా నాన్నగారు ఎప్పుడూ గారాబం చేయలేదు. కష్టం నుంచి వచ్చే తృప్తి విలువ తెలుస్తూ పెరిగాను. అది ఎన్ని కోట్లిచ్చినా దొరకదు.
     
మీ నాన్నగారి నుంచి మీరు నేర్చుకున్న విషయాలు?

‘ఒరేయ్ నేను ఒక రైతు బిడ్డగా పుట్టాను. వ్యవసాయం చేశాను. పాలు అమ్మాను. సినిమాల్లోకొచ్చాను. పైకొచ్చాను. కానీ, ఇవాళ నీకు కష్టాలు లేవు. షూటింగ్‌కి ప్యాకప్ చెప్పగానే ఇంటికెళ్లిపోవచ్చు..’ అని నాన్నగారు అనేవారు. అలా కష్టాలేవీ లేవు అన్నారు కదా అని నేను నా బాధ్యతలను అస్సలు విస్మరించలేదు. నా నిర్మాతలు, సినిమాలు, అభిమానుల గురించి ఆలోచిస్తాను. కష్టంలోనే తృప్తి ఉంటుందని నమ్ముతాను.

మీ నాన్నగారు ఆచరించే వాటిలో మీరు కూడా ఆచరించే విషయాల గురించి?

ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఓ నటుడు ఎంత క్రమశిక్షణగా ఉండాలో ఆయన్ను చూసే నేర్చుకున్నా. నాన్నగారిలా తెల్లవారుజామునే నిద్రలేస్తాను. వ్యాయామం చేస్తాను. అయితే, ఆయనకన్నా పూజలు ఎక్కువగా చేస్తా. ఆయనలానే పట్టుదల ఎక్కువ.

మీరు చిన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేవారట.. ఇప్పుడు కూడా ఆడుతుంటారా?

అవును. ఫ్రెండ్స్‌తో బాగా ఆడేవాణ్ణి. సినిమాల్లోకొచ్చాక షూటింగ్‌లో షాట్ గ్యాప్‌లో ఆడుతుంటాను.  
     
మీకిష్టమైన క్రీడ అంటే క్రికెటేనా?

టేబుల్ టెన్నిస్‌లో డబుల్స్‌లో స్కూల్ చాంపియన్‌ని. సింగిల్స్‌లో రన్నరప్‌ని. బాస్కెట్ బాల్ టీమ్ కెప్టెన్‌ని. కబడ్డీ టీమ్‌కి కెప్టెన్‌ని. అప్పుడు బాగా లావుగా ఉండేవాణ్ణి. కబడ్డీ ఆటలో ఎంతమందిని అయినా సునాయాసంగా లాగేసేవాణ్ణి (నవ్వుతూ).

సినిమాలు, రాజకీయాలు, బసవ తారకం ఆస్పత్రి చైర్మన్ బాధ్యతలు.. ఎక్కువ పనుల కారణంగా విసుగనిపించదా?
 
కరెక్టే. అన్ని సమయాల్లోనూ మూడ్ ఒకే విధంగా ఉండదు. ఎప్పుడైనా నాకు విసుగు అనిపించి, దాన్ని ప్రదర్శించినా నా అభిమానులు కానీ, ఇతరులు కానీ ఫీలవ్వరు. దానిక్కారణం నన్ను పరాయి మనిషిగా కాకుండా తమ మనిషిలా భావించడమే. అదే విధంగా నాక్కూడా వాళ్ల మీద అంతే ప్రేమ ఉంటుంది.
     
మీకు త్వరగా కోపం వస్తుందనీ.. ప్రేమ కూడా అలానే అనీ అంటుంటారు.. అచ్చంగా బోళాశంకరునిలా?
 
(నవ్వుతూ). క్రమశిక్షణ విషయంలో నేను చాలా పట్టుదలగా ఉంటాను. సినిమా పరిశ్రమలో ‘దే ఆర్ ఎట్ మై మెర్సీ’. కానీ, రాజకీయాల విషయంలో. ‘ఐయామ్ ఎట్ దెయిర్ మెర్సీ’. ప్రజలెప్పుడూ ‘మమ్మల్ని అందలాలు ఎక్కించండి’ అని కోరుకోరు. కనీస అవసరాలు తీర్చమని కోరుకుంటారు. అంతే కదా. కోపం, విసుగు... ఏవైనా సరే అప్పుడున్న పరిస్థితి, ఒత్తిడి కారణంగా వచ్చేవే. అవి అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటాయ్. అంతే.

గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన మీకు సామాన్యుల కష్టాలు...
 
తెలుసు. నా ఆరో ఏట నేను హైదరాబాద్ వచ్చాను. ఆ సమయంలో రామకృష్ణ థియేటర్ కట్టిస్తున్నారు. అది కట్టినవాళ్లతోనే ఎక్కువగా గడిపేవాళ్లం. వాళ్ల కష్టాలు స్వయంగా చూశాను. నాన్నగారి సినిమా విడుదలైందంటే, ఓ పాతిక రిక్షాల్లో అందరం బయలుదేరేవాళ్లం. మొదటి రిక్షాలో మా పెద్దనాన్న, నేను, అన్నయ్య, ఇంకో అన్నయ్య కూర్చునేవాళ్లం. మిగతా రిక్షాల్లో పని చేసేవాళ్లు వచ్చేవాళ్లు. ఆ విధంగా సామాన్యులతో అనుబంధం ఎక్కువే.

షూటింగ్స్‌తో బిజీగా ఉండడంవల్ల మీ నాన్నగారు మీకు గెస్ట్‌లానే అనిపించేవారేమో?

దాదాపు అంతే. మా నాన్నగారు ఇంటికి గెస్ట్ అపియరెన్స్ ఇచ్చేవారు. నాన్న హైదరాబాద్ వస్తున్నారంటే, ‘నాన్నంట.. వస్తున్నారంట..’ అని ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లేవాళ్లం. కట్ చేస్తే.. ఆయన బయటికొచ్చి ‘ఆ వచ్చారా..’ అంటూ కారు ఎక్కేసేవారు. మమ్మల్ని కారు ఎక్కించుకునేవారు కాదు. ఒకవేళ ఎక్కించుకున్నా, ‘పనులు ఎంతవరకూ వచ్చాయి’ అని వేరేవాళ్లతో డిస్కషన్. నాన్నగారికి తెలియని విషయం లేదు. ఈ ఇంటికి డిజైన్ చేసింది కూడా ఆయనే.  ఇల్లు కట్టాలనుకున్నప్పుడు, నేల మీద ఆయన కర్రతో డిజైన్ గీసేసి, ‘ఇలా కట్టించండి’ అని వెళ్లిపోయారు. ఆ డిజైన్ గాలికి చెదిరిపోకుండా మేమంతా దడిలా నిలబడ్డాం. ఆ తర్వాత ఇంజనీర్‌ని పిలిపించి, బ్లూ ప్రింట్ తీశాం. నాన్నగారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని ఆచరించే విషయంలో చాలా పట్టుదలగా వ్యవహరిస్తారు.
     
మీ అమ్మగారి పేరు మీద ఉన్న బసవ తారకం ఆస్పత్రికి వీలైనంత న్యాయం చేయడానికి కృషి చేస్తున్నారు. అసలు మీ అమ్మగారిలో మీకు నచ్చిన కొన్ని విషయాల గురించి?
 
నా దృష్టిలో మా అమ్మగారు దేవత. నాన్నగారు ఆయన వ్యాపకాల్లో బిజీగా ఉండేవారు. మేం మొత్తం పదమూడు మందిమి. అంతమంది ఆలనా పాలనా చూడటం సులువు కాదు. నాన్నగారి కోసం మద్రాసు వెళ్లడం, మా కోసం హైదరాబాద్ రావడం.. అన్నింటినీ సక్రమంగా చేసేవారు. చివర్లో కాన్సర్ వ్యాధితో బాధపడ్డారు. అది చాలా బాధ కలిగించింది. ఇప్పుడామె జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న బసవ తారకం కేన్సర్ ఆస్పత్రికి నేను చైర్మన్‌గా ఉండటం ఆనందంగా ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ఉచితంగా కూడా చికిత్స చేస్తున్నాం.

ఓకే... ఫుడ్ విషయంలో ఏమైనా నియమాలు పాటిస్తారా?
 
ఎలాంటి నిబంధనలూ పెట్టుకోను. హాయిగా అన్నీ తింటాను. అప్పట్లో నాన్నగారు కూడా ఎలాంటి నియమాలు పెట్టుకునేవారు కాదు. డయాబెటిక్ అయిన తర్వాత కూడా ఆయన అరిసెలు తినేవారు. డబ్బాలో దాచుకుని మరీ తినేవారు. ‘ఏంటి నాన్నగారు.. డయాబెటిక్ కదా.. తినకూడదు’ అంటే... ‘కోరికలు చంపుకుని చావడం ఎందుకు? శుభ్రంగా తిని చద్దాం’ అనేవారు. నేనూ అంతే. శుభ్రంగా తింటా.

మీ సరసన ఎంతోమంది కథానాయికలు నటించారు కదా.. మీతో కెమిస్ట్రీ బాగా కుదిరిన నలుగురైదుగురి గురించి...
 
బాలకృష్ణ: విజయశాంతి, నేనూ చాలా సినిమాల్లో చేశాం. మాది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. కెమిస్ట్రీ బాగుంటుంది. ఒక పాట చేస్తుంటే నువ్వా? నేనా? అన్నట్లు పోటాపోటీగా డాన్స్ చేసేవాళ్లం. ఆ తర్వాత రమ్యకృష్ణ, రోజా, సిమ్రాన్, నయనతార.. వీళ్లందరితో కెమిస్ట్రీ కుదిరింది. హీరో వర్షిప్ అనేది సినిమాల్లో కామనే కానీ, నా సినిమాల్లో చేసే హీరోయిన్లకు కూడా మంచి పేరొస్తుంది.
     
మీ మనవడి ముచ్చట్లు తెలుసుకోవాలనుంది.. మా నాన్న మళ్లీ వచ్చారని అన్నారట?
 
(నవ్వుతూ). ఆ సమయంలో కలిగిన ఉద్వేగాన్ని మాటల్లో చెప్పడం కష్టం. జనరల్‌గా మా ఇంట్లో ఎక్కువగా గోల చేసేది నేనే. ఫ్యామిలీ ఫంక్షన్ అంటే కచ్చితంగా నేను ఉండాలని కోరుకుంటారు. ఇంకా బయట ఫంక్షన్స్‌లోనూ నా ప్రెజెన్స్‌ని కోరుకుంటారు. అంత సందడిగా ఉంటా. అందుకే, మా కుటుంబంలో ఉన్న పిల్లలు నాకు ‘గోల తాత’ అని పేరు పెట్టారు. ఇప్పుడు నా మనవడి దగ్గర కూడా గోల చేస్తున్నా.

ఆ గోల గురించి?
 
మా మనవడు ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నాడు. ఆడించడానికి ఈలలు వేస్తుంటాను. ఈల వేస్తుంటే కళ్లు అటూ ఇటూ తిప్పుతుంటాడు. అందుకే మా బావగారి (చందబ్రాబునాయుడు) దగ్గర ‘మనవడు మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు అయిపోతారు. నాకు తాత కావాలని ఏడుస్తుంటాడు. ఎందుకైనా మంచిది ఈలలేయడం నేర్చుకోండి’ అని అంటుంటాను.
     
మీ అబ్బాయి మోక్షజ్ఞ తాతను మించిన మనవడు కావాలని కోరుకుంటున్నారా?

 
కావాలనే ఉంటుంది. కానీ, అది కష్టమండీ. ఎందుకంటే, అప్పట్లో పౌరాణిక, జానపద... ఇలా ఎన్నో నేపథ్యాలు ఉండేవి. దానివల్ల నాన్నగారి తరం ఎన్నో వైవిధ్యాలు చేయడానికి కుదిరింది. ఇన్ని పాత్రలు చేసే అవకాశం తర్వాతి తరానికి ఉండకపోవచ్చు.
     
మీ నాన్నగారి నటవారసత్వాన్ని పూర్తి స్థాయిలో కొనసాగించింది మీరే. మీ అబ్బాయీ అది సాధిస్తాడనుకుంటున్నారా?
 
సాధించాలనే అనుకుంటున్నాను. కానీ, ఫ్రాంక్‌గా చెప్పాలంటే.. ఇప్పుడు పెద్దగా కథలు లేవు. పౌరాణికాలు నా తరంలోనే కంటిన్యూ చేయలేకపోతున్నా. తర్వాతి తరంలో పూర్తిగా కనుమరుగవుతున్నాయ్. ‘శ్రీరామరాజ్యం’ చేశాను. ఇక ముందు నేను కూడా పౌరాణికాలు చేయలేనేమో.
     
మరి.. మీ దర్శకత్వంలో మొదలుపెట్టిన ‘నర్తనశాల’కు ఫుల్‌స్టాప్ పెట్టేశారా?

 
అవును. ఎందుకంటే, సౌందర్యగారు లేరు. శ్రీహరిగారు లేరు. ఆ పాత్రల్లో ఎవర్నీ ఊహించలేం. అందుకని పూర్తిగా పక్కనపెట్టేశా.
     
‘సమరసింహారెడ్డి’ తర్వాత ఆల్‌మోస్ట్ హై ఓల్టేజ్ ఎమోషనల్ మూవీస్‌కే పరిమితమయ్యారు.. పూర్తి స్థాయి కామెడీ మూవీస్ చేయాలని లేదా?

 
‘సమరసింహారెడ్డి’కి ముందు ‘మంగమ్మగారి మనవడు’, ‘నారీ నారీ నడుమ మురారి’ తరహా లైటర్ వెయిన్ మూవీస్ చేశాను. కానీ, ‘సమరసింహారెడ్డి’ తర్వాత ఇంకా ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఈ సమయంలో పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్ అంటే ఆలోచించాలి. వ్యక్తిగతంగా నాకైతే కామెడీ మూవీ చేయాలని ఉంటుంది. సింహాను మించి లెజెండ్, దాన్ని మించి లయన్, దాన్ని మించి తర్వాతి చిత్రం ఉండాలని అభిమానులు కోరుకుంటారు.

శ్రీవాస్ దర్శకత్వంలో చేయబోయే ‘డిక్టేటర్’ గురించి?

కథ చెప్పాడు. కొన్ని మార్పులు సూచించాను.

మీ నూరవ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.. బోయపాటి శ్రీను ఈ చిత్రం చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది?
 
బోయపాటి చేసే అవకాశం ఉంది. కథ ఎలా ఉండాలి? సినిమా ఎలా ఉంటుంది? అనే విషయం గురించి ఆలోచించాలి. వేడి వేడిగా వడ్డిస్తాం. విచిత్రం ఏంటంటే... బోయపాటి శ్రీను నాతో మామూలుగా మాట్లాడుతున్నప్పుడు నా హావభావాలను గమనించో, నా మాటలను గమనించో కథ తయారు చేస్తుంటాడు. నా నిజజీవితం నుంచే పాత్రలు తయారు చేసుకుంటాడు.
     
బి.గోపాల్ కూడా మీకు చాలా హిట్స్ ఇచ్చారు కదా.. ఆయన దర్శకత్వంలో ఎందుకు చేయడంలేదు?

 
చేయాలనే ఉంది. ఎప్పుడు కనిపించినా కథ తయారు చేయండి అంటుంటాను. కానీ, కథ కుదరడం లేదు.

జీవితాంతం సినిమాలు చేయాలనుకుంటున్నారా? లేక ఎప్పుడైనా రిటైర్‌మెంట్ ప్రకటించాలనుకుంటున్నారా?
 
తిన్నా, నిద్రపోయినా.. ఏం చేసినా సినిమా గురించే ఆలోచిస్తాను. సినిమాలు లేకుండా ఉండలేను.
     
హీరోగానే కొనసాగాలనుకుంటున్నారా?


 అవును. హీరోగానే చేస్తాను. రెండు పాత్రలున్న సినిమాలు ఎలాగూ చేస్తున్నా కదా. అలాంటివి చేస్తా.
 
 - డి.జి. భవాని
 
మీ అబ్బాయి మోక్షజ్ఞ రంగప్రవేశం గురించి.. తను నటించే మొదటి సినిమా ఎలా ఉండాలని అనుకుంటున్నారు?

2017లో రంగప్రవేశం జరుగుతుంది. ఇంకా రెండేళ్లు ఉంది కాబట్టి, ఏమీ ఆలోచించడంలేదు. ఇప్పుడు వంట వండితే రెండేళ్లకి చల్లారిపోతుంది. చల్లారిన భోజనం ఎందుకు? వేడివేడిగా ఉండాలి. అందుకే, కథ, దర్శకులు గురించి అప్పుడు ఆలోచిస్తా.
 
మొదటి సినిమా ఎలా ఉండాలని కూడా అనుకోలేదా?

     
వయసుకి తగ్గట్టుగా ఉండాలనుకుంటున్నా. నా కెరీర్ అలానే మొదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement