అలమేటి నటి | special chit chat heroine vanisri | Sakshi
Sakshi News home page

అలమేటి నటి

Published Thu, Oct 27 2016 10:24 PM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM

అలమేటి నటి

అలమేటి నటి

ఫస్ట్ పర్సన్

 

వాణిశ్రీ కొప్పు, వాణిశ్రీ నెక్ల్‌లెస్, వాణిశ్రీ చెవి కమ్మలు, వాణిశ్రీ ఉంగరం, వాణిశ్రీ చీరకట్టు...  వెరసి వాణిశ్రీ ఒక శిల్పం.  ఒకనాడు ఎందరో యువకుల కలల రాణి, ఎన్నో నవలల క థానాయిక వాణిశ్రీ. నెల్లూరులో పుట్టి చెన్నై చేరుకుని సినీ వినీలాకాశంలో వెలిగిన తార ఆమె.  నేటికీ ఎందరో ప్రేక్షకుల అపురూప జ్ఞాపకం. నటి సావిత్రి పై ‘సావిత్రి కళాపీఠం’ రూపొందిస్తున్న  డాక్యుమెంటరీకి క్లాప్ ఇవ్వడానికి ఇటీవల విజయవాడ వచ్చిన వాణిశ్రీ సాక్షి ‘ఫ్యామిలీ’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ....      రత్నకుమారిని వాణిశ్రీగా మార్చింది ఎస్‌విఆర్ అని  అంటారు...

     
ఆయన నన్ను మార్చలేదు. కేవలం నా పేరును మార్చారు. నా మొదటి పేరు వాణిశ్రీ కాదని అందరికీ తెలుసు. నా స్నేహితులు, మావారు కుమారి అని, బయటివారంతా వాణిశ్రీ అని పిలుస్తారు. ఎస్‌విఆర్ ‘వాణి’ అనేవారు. ఎన్‌టిఆర్ ‘వాణిశ్రీ గారు’ అనేవారు. చాలామంది ‘వాణమ్మా’ అనేవారు. 

     
ఇండస్ట్రీలో మీ స్ట్రగుల్ గురించి...
నా రంగు గురించే కదా మీరు అనడం. నేను నల్లగా ఉన్నానని హీరోయిన్‌గా ఎలా పనికొస్తానని అందరూ అనేవారు. టాలెంట్ ఉంటే ఏ డిఫెక్టూ ఏమీ చేయలేదు. నేను ఇండస్ట్రీకి వచ్చిన మొదటి రెండు సంవత్సరాలు నాకు ఇండస్ట్రీ అవసరం ఉంది. ఆ తరవాత ఇండస్ట్రీకి నేను అవసరమయ్యాను. 

       
మీ కొప్పు గురించి?
అస్వి అనే లండన్ స్టయిలిస్ట్ ఒకసారి మన పరిశ్రమకు వచ్చాడు. ఆయనకు విగ్గును శుభ్రం చేయడానికి ఇస్తే దానితో కొప్పులాంటి స్టయిల్ చేశాడు. ఇక అప్పటి నుంచి ఆయనే నాకు హెయిర్ స్టయిల్ చేయడం మొదలుపెట్టాడు. అప్పట్లో ఆయన రోజుకి 100 రూపాయలు తీసుకునేవాడు. ఔట్‌డోర్‌కు రావాలంటే 500 రూపాయలు. మిగిలిన చాలామంది ఆర్టిస్టులు రోజుకు 15 రూపాయలు తీసుకునే హెయిర్ స్టయిలిస్ట్‌ను పెట్టుకున్నారు. నేను రాజీపడేదాన్ని కాదు. నా హెయిర్ స్టయిలిస్ట్ వల్ల నా స్టయిల్ ఒకటి స్థిరపడింది.

     
మీ చీరకట్టు, ట్రెండ్ గురించి...
సన్నగా ఉండేదాన్ని. అందంగా చీర కట్టుకునేదాన్ని. వాణిశ్రీ కొప్పు, వాణిశ్రీ నెక్లెస్ అనే ట్రెండ్ ఏర్పడింది. ఆ రోజుల్లోనే రెండు చీరలు అతికి కుట్టించి మిషన్ ఎంబ్రాయిడరీ చేయించాను. బ్లౌజ్‌కి బెల్ హ్యాండ్స్ చేయించాను. ఇదంతా ఆడవాళ్లు విపరీతంగా చెప్పుకునేవారు.

     
మీ ఫుడ్ బిల్ చాలా తక్కువని చెప్పుకుంటారు...
సెట్‌లో ‘ఏంటండీ మీ బిల్లు చిన్నదిగా ఉంది. మీరేమీ తెప్పించుకోరా’ అని నన్ను అడిగేవారు. మంచినీళ్లు, పండ్లు, అన్నం అన్నీ మా అమ్మ తెచ్చేది. కొందరు హీరోయిన్లతో వాళ్ల తమ్ముళ్లు, తల్లిదండ్రులు అందరూ వస్తారు. మరి వాళ్ల బిల్లులు పెరిగిపోవా.

     
మీ ఆహార అలవాట్లు ఎలా ఉండేవి?

మొదట యూనిట్‌లో పెట్టేదే తినేదాన్ని. మేం కొంచెం స్థిమిత పడి, నాకు డబ్బు వచ్చి, కారు కొనుక్కుని, మంచి ఇల్లు అద్దెకు తీసుకున్నాక, మా అమ్మగారే వంట చేసి మాకు కారేజీ పంపేవారు. గోధుమ అన్నం, ఆకు కూరలు, చికెన్ పీస్, పెరుగు, పళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు... నా ఆహారం. షూటింగ్‌లో లైటింగ్ ఎక్కువ వేస్తారు కనుక శరీరం డీహైడ్రేట్ అయిపోతుందని అమ్మ బత్తాయి రసం తాగమనేది. షూటింగ్ అయిపోయి ఇంటికి వచ్చాక మేకప్ అంతా పోవడానికి నువ్వుల నూనె రాసుకుని స్నానం చేసేదాన్ని. సన్నగా ఉండటానికి వాకింగ్, స్కిపింగ్, డాన్స్ చేసేదాన్ని. డాన్స్ అంటే భరతనాట్యం కాదు... ఏదో ఒకపాట వేసుకుని చాలా సేపు ఎగురుతూ అదే ఎక్సర్‌సైజ్‌గా చేసేదాన్ని.

     
ఆ రోజుల్లో షూటింగ్‌లో ఎలా ఉండేది...

షూటింగ్‌కి వస్తే అందరూ సరదాగా ఉండేవాళ్లం. సూర్యకాంతం గారైతే అందరికీ పులిహోర, బూరెలు తెచ్చేవారు. ఆవిడతో ఒక అమ్మాయి వచ్చేది. తెల్లగా బొద్దుగా ఉండేది. ఆవిడను నేను ‘మంచమ్మ’ అని పిలిచేదాన్ని. ఆవిడ నన్ను ‘నా బంగారు, తినమ్మా’ అని పెట్టేది. అలాగే జి.వరలక్ష్మిగారు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు.

     
సీనియర్ నటులు మీకు సూచనలిచ్చేవారా?
ఎన్‌టిర్, సావిత్రి వంటి వాళ్లు మాకు ఎలా నటించాలి, మాలో ఏ లోపాలు ఉన్నాయి వంటివి ఏమీ చెప్పేవారు కాదు. ఎస్‌విఆర్, ఏఎన్నార్ వంటి వారు మాత్రం చెప్పేవారు.

     
షూటింగ్‌లో ఎవ రెవరు ఎలా ఉండేవారు?
ఎన్‌టిఆర్ గారు అందరినీ గౌరవ వాచకంతో పిలిచేవారు. ఆయన పాత్రలను ఆవాహన చేసుకునేవారు. యమధర్మరాజు వేషం వేసినప్పుడు ఆయన కిరీటం బరువు 12 కిలోలు. ఒకసారి తీస్తే మళ్లీ ఎలా పెడతారో తెలియదు గనక షూటింగ్ గ్యాప్‌లో కూడా కిరీటం తీసేవారు కాదు. ఆయన అలా కూర్చున్నప్పుడు ఫ్యాన్ వెయ్యమని గాని, బయటకు వెళ్తానని గాని ఏమీ అనేవారు కాదు. రంగారావుగారు మాత్రం షూటింగ్ అయిపోగానే  క్యారెక్టర్‌ను మర్చిపోయే వారు. నాగేశ్వరరావుగారు చలాకీగా ఉండేవారు. ఎన్‌టిఆర్ గారు తప్ప షూటింగ్ అయిపోగానే అందరం మామూలుగా మాట్లాడుకునేవాళ్లం.

     
ఏఎన్నార్ గారి గురించి...
ఆయన ఒక తండ్రిలా, సోదరునిలా, స్నేహితునిలా ఉండేవారు. అన్నపూర్ణ స్టూడియో కడుతున్న  సమయంలో మా సినిమా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ గ్యాప్‌లో ఆయన స్టూడియో కడుతున్న పనివాళ్ల దగ్గరకు వచ్చి మాట్లాడేవారు. అప్పుడు ఆయన్ని ‘మేస్త్రిగారు’ అనేదాన్ని. ఆయన నవ్వేవారు. అందరి మంచి చూసేవారు.

 
మిగిలినవారితో ఎలా ఉండేవారు?
మార్కస్ బార్‌ట్లే వంటి వారు అరవై ఏళ్ల వయసులో నిలబడితే నేను ఎలా కూర్చుంటాను చెప్పండి. ఆయన కెమెరామెన్. లైటింగ్ ఎరేంజ్‌మెంట్స్ చేస్తున్నంతసేపూ నేను కూడా నిల్చునేదాన్ని. నా కోసం వాళ్లు కష్టపడుతుంటే నేను కూర్చోవడమేమిటి అనుకునేదాన్ని. నన్ను చూసి మిగతావాళ్లు కూడా నిలబడేవారు. మ్యూచువల్ అండర్ స్టాండింగ్‌తో ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఉండేవాళ్లం.

     
నాగయ్య గారి గురించి...
మేం వచ్చేటప్పటికే ఆయన తండ్రి పాత్రలు వేస్తున్నారు. ఆయన్ని మేమందరం నాన్నగారు అనేవాళ్లం. మా ఇంటి నుంచి వంకాయలు, సొరకాయలు పంపేవాళ్లం ఆయనకు. లేతకాయలు ఇచ్చామని మెచ్చుకునేవారు.

     
కృష్ణ గారి గురించి...
సినీపరిశ్రమలో ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. కౌబాయ్, జేమ్స్‌బాండ్, 70 ఎం.ఎం, సినిమా స్కోప్...  లాభం వస్తుందా రాదా అని ఆలోచించేవారు కాదు.

     
‘దసరాబుల్లోడు’ చిత్రంలో ‘ఎట్టాగో ఉన్నాదె...’ పాటలో అలా ఎలా వేయగలిగారు?
ఆ పాట షూటింగ్ కోటిపల్లి రేవులో జరిగింది. అక్కడ ఎవ్వరూ లేరు. రెండు తాడిచెట్లు, మేము అంతే. అదీకాకుండా హీరాలాల్ మాస్టారు తిక్కమనిషి. ఆయన చెప్పినట్లు చేయకపోతే ఆయనకు కోపం. ఈ పాట పొద్దున్న ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు చేశాం. అప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపించింది. కెరీర్‌లో ఎదుగుతున్నప్పుడు ఇలాంటివి తప్పవు.  ఆ పాట పెద్ద హిట్ అయ్యింది. ఇప్పటికీ ఆ పాటను అరెరెరె అంటూ పాడుకుంటూనే ఉన్నారు.  ఆ సినిమా తరవాత పాత్ర ఔచిత్యం పోతుందని, మమ్మల్ని కాకుండా అలాంటి పాటల కోసం వేరేవారిని పెట్టడం మొదలు పెట్టారు.

     
మీరు తలుచుకోదగ్గ మనుషులు....
చంద్రకళ చాలా తెలివిగల మనిషి. మంచి కూచిపూడి డాన్సర్. తెలుగు, తమిళం, కన్నడం, కొంకిణీ మాట్లాడేవారు. భానుమతిగారు చాలా ప్రజ్ఞాశాలి. డెరైక్షన్, పాటలు, కెమెరా, నటన... సినీపరిశ్రమ వారితోనే ప్రారంభమైంది. ఎవరికీ భయపడని చక్రపాణి గారు  ఆవిడకు భయపడేవారు. వారిద్దరికీ ‘మిస్సమ్మ’ సినిమాలో గొడవైంది. సినిమా కొంత తీసిన తరవాత  నిన్ను తీసేస్తున్నాను, ఆ నెగిటివ్‌లు కాల్చిపడేస్తున్నాను అన్నారు చక్రపాణిగారు. అలాంటి పట్టుదల ఆయనకు. చక్రపాణిగారు సన్నగా పొడవుగా ఉండేవారు. టీబీ వచ్చి ఒక లంగ్ తీసేసినా నిబ్బరంగా జీవితం గడిపారు. ఒకసారి నన్ను పిలిచి ‘వాణిశ్రీ... ఎవరో శ్యామ్ బెనగల్ మేక ప్ లేకుండా నీతో సినిమా తీస్తున్నారటగా.. నువ్వు చెయ్యకు.. నీ ఒంటికి ఆముదం పూసి కూర్చో పెడతారు. నీ గ్లామర్‌ను నమ్ముకొని నీ మీద మేం కోట్లు ఖర్చు చేస్తున్నాం’ అన్నారు. ‘కోషిష్’ రీమేక్ అవకాశం వస్తే అది చేయడం కూడా ఆయనకు ఇష్టం లేదు. ‘అందులో జయబాధురి, సంజీవ్‌కుమార్  మూగవారిగా నటించారు. జనాలు నువ్వు, నాగేశ్వరరావు మాట్లాడుతుంటే చూడటానికి వస్తారుగాని మూగోళ్లుగా ఉంటే చూడరు’ అన్నారు. చక్రపాణి గారి మాటను గౌరవిస్తూ కోషిష్ చేయలేదు. శ్యామ్‌బెనగల్‌తో చేశాను. ఆ సినిమా ‘అనుగ్రహం’. మరాఠీ నవల ఆధారంగా రూపొందింది. సినిమా రిలీజ్ కాలేదు. అవార్డు మాత్రం వచ్చింది, బాపు దర్శకత్వంలో మేకప్ లేకుండా ‘గోరంత దీపం’ చేశాను. ఆ సినిమా చూసి అదొక మేకప్ అనుకున్నారు జనం.

     
నేటి టెక్నాలజీ ఫాలో అవుతున్నారా?
మిక్సీలు గ్రైండర్‌లు వచ్చాక సోమరితనం పెరిగిపోయింది. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాక నంబర్లు గుర్తుపెట్టుకోవడం తగ్గిపోయింది. గతంలో 150 నెంబర్లు గుర్తుపెట్టుకునేదాన్ని. సెట్‌లో ఎవరికి ఫోన్ నంబరు కావాలన్నా నన్నే అడిగేవారు. సురేష్ ప్రొడక్షన్ అనగానే టకీమని 429468  చెప్పేసేదాన్ని.

     
హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు లేవు కదా...
లేవు. కాని హీరోయిన్లు కూడా ఉన్నవాటినే చేయకతప్పదు కదా. దొరికిన క్యారెక్టర్లే బెటర్‌గా చేయడానికి ట్రై చేస్తున్నారు.

     
ఇప్పటి కథానాయికల గురించి...
అందరూ బాగానే చేస్తున్నారు. వాళ్లని మౌల్డ్ చేసే నేర్పరితనం డెరైక్టర్ చేతిలో ఉంటుంది. నాకు అనుష్క బాగా నచ్చుతుంది.

  
నేటి తరానికి మీరిచ్చే సలహా...
కష్టపడి పని చేయి. ఎవరికీ డబ్బు ఎగ్గొట్టకు. వచ్చిన డబ్బులు దాచుకో అంటూ ఆదిత్య హృదయమ్ చదువుతూ ఇంటర్వ్యూ ముగించారు వాణిశ్రీ.

 

ప్రస్తుత ఆహార విహారాలు
భోజనం, శారీరక పరిశుభ్రత, ఆహార వ్యవహారాలు... ఇవన్నీ కలిపి పేనిన దారమే మన భారతీయత. మాంసాహారం తినకూడదు. ఒక ప్రాణిని హింసించి ఆ డెడ్ సెల్స్ తిన్నామంటే ఆధ్యాత్మికత మీద మనసు నిలబడదు. ధ్యానం కుదరదు. కొంచెం అన్నం, పప్పు, నెయ్యి తింటేనే నిద్ర వచ్చేస్తుంది. ఇక మాంసం, చేపలు తింటే నిద్ర ఎక్కడ ఆగుతుంది? ప్రస్తుతం రోజూ వంట, పూజ, సూర్య నమస్కారాలు చేస్తున్నాను. పుస్తకాలు చదువుతున్నాను.

 

త్రివిక్రమ్ ఎలా చేస్తాడో చూడాలనిపిస్తుంది
త్రివిక్రమ్ కొత్తగా ఎలా తీయాలా అని ఆలోచిస్తున్నాడు.  ఆయన దర్శకత్వం చేసేటప్పుడు దగ్గర నుంచి చూడాలనిపిస్తుంది. మానవ సంబంధాల గురించి, మన సంస్కృతి గురించి బాగా చెబుతున్నాడు. బన్నీ, మహేష్‌బాబు, రవితేజ నాకు చాలా ఇష్టం. వీళ్లు నిజంగానే అలా ఉంటారా, దర్శకుడు చెప్పి ఇలా చేయిస్తూ ఉంటారా అని తెలుసుకోవడానికి వాళ్ల షూటింగ్ చూడాలనిపిస్తుంది.

 

కంకణం ఎవరికి ఇస్తున్నారు?
నాది చాలా పెద్ద జుట్టు. ‘సతీసావిత్రి’లో నా ఒరిజినల్ హెయిర్ చూడచ్చు. రోజూ తలంటుకొని, జుట్టు చిక్కు తీసేదాన్ని. ఒకసారి ఒక సన్మానసభ వారు నాకు కంకణం వేస్తామని చెప్పడానికి మా ఇంటికి వచ్చారు. అంతకు మూడు నెలల క్రితమే తిరుపతి వెళ్లి గుండు చేయించుకున్నాను. సన్మానం చేసే ఆవిడ ‘మీ జుట్టు ఏమైపోయిందండీ. అసలే మీకు స్వర్ణ కంకణం వేయాలనుకుంటున్నాము’ అంది. వెంటనే నేను ‘సన్మానం నాకు చేస్తున్నారా, నా జుట్టుకి చేస్తున్నారా’ అని అడిగేసరికి ఆవిడ అవాక్కయ్యింది. పైపై అందాలకు ప్రాధాన్యం ఇస్తే నాకు నచ్చదు.

 

 సంభాషణ: డా. వైజయంతి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement