
రకుల్ వెర్సెస్ ప్రీత్
రకుల్ ప్రీత్‌సింగ్ ‘స్టార్’ రకుల్ ప్రీత్‌సింగ్‌గా మనకు పరిచయం అయ్యే ముందు ఒక సాధారణ మిడిల్‌క్లాస్ అమ్మాయి
రకుల్ ప్రీత్‌సింగ్ ‘స్టార్’ రకుల్ ప్రీత్‌సింగ్‌గా మనకు పరిచయం అయ్యే ముందు ఒక సాధారణ మిడిల్‌క్లాస్ అమ్మాయి. గొప్పగా ఆశలు, ఆశయాలు ఉన్న అమ్మాయి కూడా కాదు. అచ్చం మన పక్కింటి అమ్మాయి లాంటి అమ్మాయే. ‘దేవుడిచ్చిన అందం దేవుడే తీసుకెళ్లిపోతే అప్పుడు గర్వం గిర్వం జాన్తానై’ అనుకునే మనింటి అమ్మాయిలాంటిదే! సెలబ్రిటీ ఇంటర్వ్యూలా చెయ్యకుండా తను, తన ఆత్మ మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అని ఇలా చేశాం. రకుల్ వెర్సెస్ ప్రీత్! ఎంజాయ్!!
ప్రీత్: కాస్కో రకుల్! ఈరోజు నీతో చాలా విషయాలు బైటపెట్టించేస్తా! అవునూ ఏంటి రిలాక్డ్స్‌గా కనిపిస్తున్నావ్?
రకుల్: ఇవాళ షూటింగ్ లేదు. అందుకే జస్ట్ రిలాక్స్ అయిపోతున్నాను. షూటింగ్ ఉన్నా నాకు నో టెన్షన్ అని నీకు బాగా తెలుసు కదా! వర్క్‌ని ఎంజాయ్ చేస్తాను.
ప్రీత్: అది సరే! చిన్నప్పుడు అంత అల్లరి చేసినా, అమ్మానాన్న గ్రహించేవాళ్లు కాదు. బాగానే మ్యానేజ్ చేసేదానివి!
రకుల్: అప్పట్లో అమాయకంగా కనిపించే నా మొహమే నాకు ఫుల్ ప్రొటెక్షన్. అయినా, అమ్మా నాన్నలకు తెలియకుండా విపరీతంగా అల్లరి చేసేదాన్ని.
ప్రీత్: ఓసారి స్కూల్‌కి బంక్ కొట్టి, ఇరుక్కున్నావ్ కదూ?
రకుల్: నువ్వేదో స్కీమ్ వేసి ఇలాంటి ప్రశ్నలడుగుతున్నావ్. అవును బంక్ కొట్టాను. ఒకరోజు దొరికిపోయాను. డీబార్ చేశారు. ఇంట్లోవాళ్లకి తెలియకుండా మ్యానేజ్ చేశాను. కానీ, నా టైమ్ బాగాలేక స్కూల్లో తమ్ముడు చేసిన అల్లరికి నాన్న వస్తే ప్రిన్సిపాల్ నా వ్యవహారం బైటపెట్టారు. ఆ తర్వాత బంక్ కొట్టలేదు.
ప్రీత్: చిన్నప్పుడు డ్యాన్స్ చేయమనగానే చేయడం, పాటలు పాడమనగానే పాడడం చేసేదాన్ని. పెద్ద షో అప్ నువ్వు...
రకుల్: సిగ్గు.. గిగ్గు అని ఏదేదో అనమాకు. నాకు టాలెంట్ ఉంది కాబట్టి ప్రదర్శించా. హుషారుగా ఉండడం నాకిష్టం. అందుకే అడగ్గానే చేసేదాన్ని. అభినందించాల్సింది పోయి అసూయతో నాకు సిగ్గు లేదంటున్నావ్!
ప్రీత్: అద్దంలో మొహం చూసుకున్నప్పుడు ‘హీరోయిన్‌గా నా?’ అని ఎప్పుడూ అనుకోలేదా? అందగత్తెనని ఫీలింగా?
రకుల్: నాకు కెమెరా ముందు నిలబడాలంటే ఇష్టం. గొప్ప అందగత్తె అనిపించుకోవడం కన్నా మంచి నటి అనిపించుకోవాలనే ఉండేది.
ప్రీత్: ఇంతకీ నీలో నీకు నచ్చింది ఏంటి?
రకుల్: నా కళ్లు, నవ్వు నచ్చుతాయి. అంతా అదే చెబుతారు.
ప్రీత్: అవునూ.. ఆ మధ్య ‘బ్రూస్‌లీ’లో కొంచెం సన్నగా కనిపించావ్. ‘సరైనోడు’కి బరువు పెరగమన్నారు. ఇలా తగ్గి, పెరగాల్సి రావడంతో అసలెందుకీ జాబ్ అనిపిస్తోందా?
రకుల్: ‘సరైనోడు’ కోసం రెండు కిలోలు పెరిగాను. నెక్ట్స్ సినిమాకి కావాలంటే తగ్గుతాను. నాకదేం ప్రాబ్లమ్ కాదు. సినిమా కోసం ఎలా అయినా మారిపోతాను. షూటింగ్ లేకపోతే నాకు తోచదు. బ్రేక్ టైమ్‌లో ఏం చేయాలో తెలియక నా మ్యానేజర్లతో ఫొటోషూట్ ప్లాన్ చేయమంటుంటాను. ఇలా ఏదో ఒక పనితో ఎంగేజ్ అయిపోతాను. లేకపోతే నా వల్ల కాదు.
ప్రీత్: నువ్వెప్పుడూ ఆనందంగా ఉంటావ్ ఎలా?
రకుల్: చిన్న చిన్న విషయాలకు కూడా చాలామంది ఒత్తిడికి గురవుతారు. నేనైతే పెద్ద పెద్ద విషయాలకు కూడా టెన్షన్ పడను. ప్రెషర్‌కి గురైతే ఉపయోగం ఉండదని నా నమ్మకం.
ప్రీత్: ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యావు పొగరూ.. గట్రా...
రకుల్: ‘నో వే’... అసలు పొగరెందుకు పెరగాలి? దేవుడు నిన్ను కనికరించి, అన్నీ ఇచ్చాడు కాబట్టి అలా మారాలా? అప్పుడు అన్నీ వెనక్కి తీసేసుకుంటాడు. అందుకే ఎప్పుడూ బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి.
ప్రీత్: అంతా బాగానే ఉంది.. హీరోయిన్‌గా చిట్టి పొట్టి దుస్తులు వేసుకుంటావ్ కదా?
రకుల్: కాలేజీ డేస్‌లో కూడా నేను షార్ట్ డ్రెస్సులు వేసుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే.. ఇప్పటివరకూ ఎక్స్‌పోజింగ్ ఇచ్చి ‘ఇది నువ్వు కచ్చితంగా వేసుకుని తీరాలి’ అని ఎవరూ కండీషన్ పెట్టలేదు. వల్గారిటీకి, బ్యూటీకి మధ్య చిన్న గీత ఉంటుంది. నేను ‘బ్రూస్‌లీ’లో పొట్టి డ్రెస్సులు చాలా వేసుకున్నాను. నా ఫిజిక్ వాటికి సూట్ అయ్యింది.
ప్రీత్: ఫిజిక్ బాగుంది కదా అని గొప్పలు చెబుతున్నావ్...
రకుల్: నేనేం గొప్పలు చెప్పలేదు. అయినా బాగున్న ఫిజిక్ గురించి చెప్పుకుంటే గొప్పలు చెప్పుకున్నట్లా?
ప్రీత్: నిన్ను పడేయాలంటే అబ్బాయిలు ఏం చేయాలి?
రకుల్: కచ్చితంగా లుక్స్‌తో కాదు. నాలా మంచి మాటకారి అయ్యుండాలి. సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి. పొగరుగా బిహేవ్ చేసే అబ్బాయిలంటే మంట.
ప్రీత్: పబ్లిక్‌లోకి వెళ్లినప్పుడు అభిమానులు మాట్లాడాలని, షేక్ హ్యాండ్ ఇవ్వాలనీ కొంతమంది ఆకతాయి పనులు చేస్తారు కదా.. అప్పుడేమనిపిస్తుంది?
రకుల్: అభిమానుల్లో స్వీట్‌గా బిహేవ్ చేసేవాళ్లు చాలామంది ఉంటారు. కొంతమందైతే ‘మేడమ్... ఒక సెల్ఫీ’ అని మొహం మీద ఫోన్ పెట్టి మరీ అడుగుతారు. రిలాక్సేషన్ కోసం ఏ సినిమాకో, హోటల్‌కో వెళ్లినప్పుడు తెగ ఎగబడ తారు... ఇబ్బందే! అలాగే, ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు, ఎవరో ఇద్దరు సెల్ఫీ తీసుకుంటూ, బ్యాక్‌గ్రౌండ్‌లో మేం కనిపించేట్లు ఫొటోలు తీసి, సోషల్ మీడియో పెట్టేస్తారు.
ప్రీత్: సరదాగా కళ్లకి గ్లాసెస్ పెట్టుకుని వెళితే, రాత్రి మందు పార్టీ చేసుకుని ఉంటారని కూడా అనుకుంటారు కదూ!
రకుల్: రోజంతా షూటింగ్ చేసి, అలసిపోతుంటాం. నేనైతే షూటింగ్ కోసం 20 గంటలు కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకుంటాను. ఉదయం నాలుగున్నరకే లేచేస్తా. కళ్లల్లో ఆ అలసట కనిపించకుండా గ్లాసెస్ పెట్టుకుని వెళ్లిపోతాను. అప్పుడు ఫొటోలు తీసేసి, ఏవేవో రాసేస్తారు. దానికి బాధపడను. బాధపడటానికి జీవితంలో ఇంతకంటే పెద్ద పెద్ద విషయాలు ఉంటాయి అనుకుంటా.
ప్రీత్: మిస్ ఇండియా టైటిల్ రాకపోయినా ఎంజాయ్ చేశావట!
రకుల్: ప్రతి ఏడాదీ ముగ్గురు విన్నర్స్ ఉంటారు. కానీ, ఐశ్వర్యా రాయ్, సుస్మితా సేన్, ప్రియాంకా చోప్రా మాత్రమే లైమ్‌లైట్‌లో ఉన్నారు. మిగతావాళ్లు ఏమయ్యారు? అందుకే ఆ టైటిల్ వస్తే ఓకే.. లేకపోయినా ఓకే అనుకున్నాను. ఆ పోటీలో టైటిల్ గెల్చుకోనివాళ్లందరూ గ్రీన్ రూమ్‌లోకి వెళ్లిపోయి, ఏడ్చారు. నేను వాళ్ల దగ్గరికి వెళ్లి, ‘ఆఫ్టర్ పార్టీ ఉంది.. రెడీ అవ్వండి’ అన్నాను. వాళ్లు ఆశ్చర్యపోయి, ‘నీకు బాధగా లేదా’ అన్నారు. ‘బాధ ఎందుకు.. ఈ నెల రోజుల్లో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. ఎంతోమంది ఫ్రెండ్స్ అయ్యారు.. నాకది చాలు’ అన్నాను. గెలవడం అంటే.. కిరీటం తెచ్చుకుంటేనే కాదు. గెలవనప్పుడు కూడా ఆనందంగా ఉండటం కూడా గెలుపే.
ప్రీత్: బాగా చెప్పావ్.. అది సరే డబ్బూ, పేరు ఈ రెండింటిలో నీకేది ఆనందం ఇస్తుంది?
రకుల్: ఇంతసేపు మాట్లాడితే ఇప్పటికి మెచ్చుకున్నావ్. డబ్బు, పేరు కాకుండా ఇంకో ఆప్షన్ ఇవ్వొచ్చు కదా. నా వర్క్ మాత్రమే నాకు ఆనందం ఇస్తుంది. డబ్బు శాశ్వతం కాదు. నేను ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయిని. మా నాన్నగారి జీతం తక్కువ. అప్పట్లో మాకన్నా బాగా డబ్బున్న స్నేహితులు నాకు తెలుసు. వాళ్లు చాలా రిచ్ ఫుడ్ తినేవాళ్లు. కానీ, అన్నీ ఒంటరిగానే. వాళ్లకి ఫ్యామిలీ వేల్యూస్ తెలిసేవి కావు. నేను కాఫీ తాగినా మా అమ్మానాన్న, తమ్ముడితో కలిసి తాగేదాన్ని. ఆ ఆనందాన్ని ఎంత డబ్బిచ్చినా కొనలేం.
ప్రీత్: మామూలుగా భాష తెలియనివాళ్లని ఆటపట్టించడానికి సరదాగా బూతులు నేర్పిస్తుంటారు.. నీక్కూడా అలా జరిగింది కదా.. ఏదీ ఓ రెండు బూతులు...?
రకుల్: నువ్వన్నది కరెక్టే. నేను ముందు నేర్చుకున్నది బ్యాడ్ వరడ్సే. ఈ ఇంటర్వ్యూ అయ్యాక నాకు తెలిసిన ఆ బ్యాడ్ వర్డ్స్ చెబుతాను. తిట్టించుకోవడానికి ప్రిపేర్డ్‌గా ఉండు.
ప్రీత్: టాపిక్ మార్చేద్దాం... ఇప్పుడు బాగానే ఉన్నావ్ కదా.. మరో పదేళ్ల తర్వాత హీరోయిన్‌గా పనికి రావని అనిపించుకోవడానికి రెడీయేనా?
రకుల్: ఓ.. నాకేం బాధ లేదు. ఎవరూ ఎప్పుడూ ఒకే రకంగా ఉండలేరు కదా. వాస్తవం ఒప్పుకునే ధైర్యం ఉండాలి. అది నాకు ఫుల్‌గా ఉంది.
ప్రీత్: ధైర్యవంతురాలికి జోహార్లు.. ఓ 20 ఏళ్ల తర్వాత రకుల్ ఎలా ఉంటుంది? ఎంతమంది పిల్లలుంటారు?
రకుల్: నాకు జోస్యం తెలియదు. కానీ, ఇద్దరు పిల్లలు కావాలి. పిల్లలంటే చాలా ఇష్టం. భర్త, పిల్లలతో హాయిగా సెటిలైపోతా.
ప్రీత్: మరి.. మాంగల్యం తంతునానేనా ఎప్పుడు?
రకుల్: పెళ్లెప్పుడు? అని డెరైక్ట్‌గా అడగొచ్చు కదా. ఇంకో ఐదారేళ్ల తర్వాత చేసుకుంటా. ఎందుకంటే కరెక్ట్ టైమ్‌లో పెళ్లి చేసుకోవాలి. 29 లేకపోతే 30 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.
ప్రీత్: సినిమాలు చేయొద్దని కాబోయే భర్త అంటే.. త్యాగం చేయడానికి రెడీనా?
రకుల్: అలా అనేవాళ్లని చేసుకోను. అసలు ఫ్యామిలీ లైఫ్ కోసం నేనే బ్రేక్ తీసేసుకుంటానేమో. బాలీవుడ్ నటి కాజోల్ హీరోయిన్‌గా పీక్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. జ్యోతిక కూడా అంతే. వాళ్లు చక్కగా సెటిలయ్యారు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత జ్యోతిక సినిమా చేస్తే అందరూ చూశారు. కాజోల్, జ్యోతికలాగే రకుల్ కూడా!
ప్రీత్: అసలు ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావ్?
రకుల్: నాకన్నా చాలా ఎత్తు ఉండాలి. నేను ఫోర్ ఇంచ్ హీల్స్ వేసుకున్నప్పుడు కూడా నాకన్నా ఎత్తుగా ఉండాలి. అప్పుడే నాకన్నా పెద్దవాడు అనే ఫీలింగ్ వస్తుంది.
ప్రీత్: అయితే.. నీకు అబ్బాయిని సెలక్ట్ చేసేశాను.. ఇక ఛాయిస్ నీదే..
రకుల్: ఎవరు?
ప్రీత్: ఇంకెవరూ... మన టాలీవుడ్‌లో ఇంకా పెళ్లి కాని రానా, ప్రభాస్ సూపర్ హైట్. నువ్వు ఫోర్ ఇంచ్ హీల్స్ వేసుకున్నా.. వాళ్లు నీకన్నా ఎత్తుగానే ఉంటారు!
రకుల్: అంటే నీ ఉద్దేశ్యం ఏంటి? ఇరుకుల్లో పెట్టే పని చేయమాకు. ఇంతసేపూ నువ్వు ఏమడిగినా చెప్పాను.. ఇక చాలా ఆపు. ఇప్పుడు మనిద్దరం ఒకటే.. నువ్వు ప్రీత్ కాదు..నేను రకుల్ కాదు.. మనిద్దరం ‘రకుల్ ప్రీత్‌సింగ్’ అయిపోదాం.
- డి.జి. భవాని