'పోటుగాడు' ఎనీటైమ్ ఎనీ సెంటర్
బంతిని తీసుకొని గట్టిగా గోడకేస్తే అంతే గట్టిగా వెనక్కి వస్తుంది.
మరి పొటాటోని వేస్తే ఏమవుతుంది? గోడ తినేస్తుంది.
ఇట్ ఈజ్ సో టేస్టీఎక్కడైనా ఎప్పుడైనా కలిసిపోయే రకం.
అలూని ఆర్డినరీగా చూడకండి.
అబ్సల్యూట్లీ పోటుగాడు ఈ పొటాటోగారు.
స్టఫ్డ్ పొటాటో
కావల్సినవి: బంగాళదుంపలు – 4 (80శాతం ఉడికించాలి), పనీర్ – 100 గ్రాములు, నల్లమిరియాల పొడి – పావు టీ స్పూన్, జీడిపప్పులు – 8–10, మైదా – 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి – 2, అల్లం – చిన్నముక్క, క్రీమ్ – అర కప్పు, కొత్తిమీర తరుగు – 2–3 టేబుల్ స్పూన్లు, నూనె – వేయించడానికి తగినంత, జీలకర్ర – అర టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, ధనియాల పొడి – 1 1/2 టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – పావు టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్
తయారీ: ∙బంగాళదుంపల పై పొట్టు తీసి మిశ్రమం కూరడానికి (స్టఫ్) అనువుగా కత్తితో చేయాలి.
మిశ్రమం తయారీ: ∙పనీర్‌ను తరగాలి. దీంట్లో మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి, జీడిపప్పు పలుకులు, మిగిలిన ఆలూ గుజ్జు వేసి కలపాలి. ∙ఒక బంగాళ దుంప తీసుకొని సిద్ధం చేసిన మిశ్రమాన్ని అందులో కూరాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేసి, అందులో మిశ్రమాన్ని కూరిన బంగాళదుంçపను వేసి వేయించాలి. మిగతా దుంపలన్నీ అలాగే సిద్ధం చేసుకోవాలి. దుంపలు వేగిన తర్వాత గిన్నెలో అడుగున కొద్దిగా నూనె మిగిలిపోతుంది. దీంట్లో జీలకర్ర, ఇంగువ, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. దీంట్లో టొమాటో ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, కారం, మసాలా వేసి కలపాలి. ఈ మిశ్రమం బాగా వేగిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి 4–5 నిమిషాలు ఉడికించాలి. మిశ్రమం బాగా చిక్కబడ్డాక స్టఫ్డ్ బంగాళదుంపలను వేసి ఉడికించాలి. పైన కొత్తిమీర తరుగు వేసి దించాలి. ఇది చపాతీ, పరాటా, రోటీ, అన్నంలోకి బాగుంటుంది.
సూప్
కావల్సినవి: బంగాళదుంపలు – 6 (ముక్కలుగా కట్ చేయాలి), క్యారెట్లు – 2 (సన్నగా తరగాలి), కొత్తిమీర కాడలు – 6 (సన్నగా తరగాలి), నీళ్లు – 8 కప్పులు, ఉల్లిపాయ – 1 (సన్నగా తరగాలి), బటర్ క్యూబ్స్ – 6, ఉప్పు – తగినంత, మైదా – 6 టేబుల్ స్పూన్లు, పాలు – 1 1/2 కప్పు
తయారీ: ∙బంగాళదుంప, క్యారెట్, కొత్తిమీర తరుగులను నీళ్లలో వేసి స్టౌమీద పెట్టి 15–20 నిమిషాలు ఉడికించి, వడకట్టాలి. అదే పాన్‌లో ఉల్లిపాయలు, బటర్, మైదా, ఉప్పు కలిపి పాలు పోసి మరిగించాలి. మిశ్రమం చిక్కబడ్డాక ఉడికించిన కూరగాయల ముక్కలు వేసి, వడకట్టి ఉంచిన నీళ్లు పోసి కలపాలి. సూప్ కప్పులో పోసి వేడి వేడిగా అందించాలి.
బంగాళదుంప చికెన్ ఫజిట
కావల్సినవి: బంగాళదుంపలు – 2 (పెద్దవి), చికెన్ ముక్కలు – 6 (స్కిన్ లెస్, బోన్ లెస్), పెద్ద మిర్చి (పసుపు రంగువి) – పావు కప్పు, పెద్ద మిర్చి (నారింజ రంగువి) – పావు కప్పు, ఉల్లిపాయలు – అర కప్పు, కొత్తిమీర తరుగు – కొద్దిగా, కారం – కొద్దిగా, మిరియాల పొడి – చిటికెడు, జీలకర్ర పొడి – చిటికెడు, నిమ్మరసం – అర టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ – టీ స్పూన్, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – చిటికెడు
తయారీ: ∙ఆలివ్ ఆయిల్, కొద్దిగా ఉప్పు కలపాలి. బంగాళదుంప పై తొక్క తీసి పైన ఉప్పు కలిపిన ఆలివ్ ఆయిల్‌ను రుద్దాలి. ∙ఒక్కో బంగాళదుంపకు ఫాయిల్ పేపర్‌ను చుట్టి అవెన్‌లో బేక్ చేసి (ఉడికించి) తీయాలి. లోపలి దుంప గుజ్జు తీయాలి. ∙చికెన్ ముక్కలకు మిరియాల పొడి, ఉప్పు పట్టించి, 30 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత పదునైన కత్తితో అతి సన్నగా తరగాలి. ∙విడిగా స్టౌ మీద పాన్ పెట్టి ఆలివ్ ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేయించుకోవాలి. దీంట్లో చికెన్ తరుగు, కొత్తిమీర, కారం, జీలకర్ర పొడి వేసి వేయించాలి. దీంట్లో నిమ్మరసం కలపాలి. ఉడికిన బంగాళదుంపలో చికెన్ మిక్చర్‌ని కూరాలి.
నోట్: టొమాటో ముక్కలు, తరిగిన ఛీజ్, వెన్నతో అలంకరించి వడ్డించాలి.
దమ్ ఆలూ
కావల్సినవి: చిన్న బంగాళదుంపలు – 12, నూనె – 7 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ తరుగు – 1 1/2 కప్పు, అల్లం తరుగు – టీ స్పూన్, జీలకర్ర – 2 టీ స్పూన్లు, ధనియాలు – 4 టేబుల్ స్పూన్లు, పసుపు – అర టీ స్పూన్, కారం – ముప్పావు టీ స్పూన్, గరం మసాలా – టీ స్పూన్, టొమాటో ముక్కలు – కప్పు, పెరుగు – పావు కప్పు, ఉప్పు – తగినంత, వెన్న – పావు కప్పు
తయారీ: ∙బంగాళదుంపల పై పొట్టు చెక్కి, 4 –5 చోట్ల గాట్లు పెట్టాలి. వీటిని చల్లటి నీళ్లలో వేయాలి. ∙పొయ్యిమీద గిన్నె పెట్టి 5 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక బంగాళదుంపలను నీళ్లనుంచి బయటకు తీసి వేయాలి. సన్నని మంట మీద వేగనివ్వాలి. తర్వాత వీటిని పేపర్ టవల్ మీద వేయాలి. ∙అదే గిన్నెలో మిగిలిన నూనెలో జీలకర్ర, ఉల్లిపాయ తరుగు వేసి బాగా వేగాక అల్లం తరుగు వేసి వేయించాలి. దీంట్లో ధనియాల పొడి, పసుపు, కారం, గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, పెరుగు, ఉప్పు, వేయించిన బంగాళదుంపలు వేసి ఉడికించాలి. సన్నని మంట మీద కనీసం 35 నిమిషాలు ఉడకనివ్వాలి. మిశ్రమం కొంచెం లూజ్‌గా కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు కలపాలి. చివరగా క్రీమ్, మిగిలిన 2 టేబుల్ స్పూన్ల నూనె కలిపి దించాలి. కొత్తిమీర తరుగు చల్లి ఉప్పు తగినంత ఉందో లేదో సరిచూసుకొని అన్నంలోకి వడ్డించాలి.
హల్వా
కావల్సినవి: బంగాళదుంపలు – 400 గ్రాములు, పంచదార – కప్పు, నెయ్యి – 5 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి– అర టీ స్పూన్, నీళ్లు – టేబుల్‌స్పూన్, బాదం పప్పు – 10పిస్తాపప్పు – 10
తయారీ: ∙ఉడికిన బంగాళదుంపల పై పొట్టు తీసి, గుజ్జు చేయాలి. మందపాటి గిన్నెను పొయ్యి మీద పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి. దీంట్లో బంగాళదుంప గుజ్జు వేసి కలపాలి. సన్నని మంట మీద ఉడికిస్తూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత గుజ్జు బంగారు రంగులోకి మారుతుంది. దీంట్లో పంచదార వేసి కలపాలి. పంచదార కరిగాక యాలకుల పొడి, తరిగిన బాదం, పిస్తాపప్పు వేసి కలపాలి. ఈ హల్వాను వేడి వేడిగా వడ్డించాలి.
పాన్ కేక్
కావల్సినవి: బంగాళదుంప గుజ్జు (దుంపలను మెత్తగా ఉడికించి, గుజ్జు చేయాలి) – 3 కప్పులు, ఛీజ్ – పావు కప్పు, ఉల్లికాడల తరుగు – 2 టేబుల్ స్పూన్లు, గుడ్డు – 1 (గిలకొట్టాలి), మైదా – 3 టేబుల్ స్పూన్లు, మైదా – అర కప్పు, నూనె – పాన్ మీద వేయడానికి తగినంత, వెన్న – తగినంత
తయారీ: ∙పెద్ద గిన్నెలో బంగాళదుంపల గుజ్జు, ఛీజ్, ఉల్లికాడలు, గుడ్డు, 3 టేబుల్ స్పూన్ల మైదా తగినన్ని నీళ్లు పోసి ముద్దలా చేయాలి. ఈ పిండితో చిన్న చిన్న ఉండలు 12 చేయాలి. ప్రతి ఒక్క ఉండను అర ఇంచు మందంలో అదిమి, పరాటాలా చేయాలి. దీనికి మిగిలిన అర కప్పు మైదాను ఉపయోగించాలి. పాన్‌ను స్టౌ మీద పెట్టి నూనె వేసి వేడి చేయాలి. దీనిపైన సిద్ధం చేసుకున్న పాన్‌కేక్‌ను వేసి, ఒక్కోవైపు 3–4 నిమిషాలు కాల్చాలి. బాగా కాగిన తర్వాత పేపర్ టవల్‌మీదకు తీసుకోవాలి. ఈ పొటాటో పాన్ కేక్స్ మీద వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా ఉప్పును పలుచగా చల్లాలి. వెన్న పైన పెట్టి ఉల్లికాడల తరుగును కొద్దిగా చల్లి సర్వ్ చేయాలి.