అదా సంగతి | special interview with adah sharma | Sakshi
Sakshi News home page

అదా సంగతి

Published Sun, Apr 22 2018 12:43 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

special interview with adah sharma - Sakshi

అదా శర్మ.. కాన్ఫిడెన్స్‌కి కజిన్‌ సిస్టర్‌లా ఉంటారు. అసలు ఆడపిల్ల అంటేనే.. కాన్ఫిడెన్స్‌ అని ఆమె అంటారు! ప్రస్తుతం అదా చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. ఒక్కో మూవీలో ఒక్కో క్యారెక్టర్‌. క్యారెక్టర్‌కు తగ్గట్టు తనని తను మలుచుకోవడం ఎప్పటికప్పుడు కష్టమే అయినా... అనుకుంటే అయి తీరుతుందని అదా నమ్ముతారు. ఫిట్‌నెస్‌కు టాప్‌ ప్రయారిటీ ఇచ్చే ఆదా.. కొన్ని బ్యూటీ టిప్‌లు కూడా ఇస్తున్నారు. ఇవే కాదు.. ‘అదా! సంగతి’ అనిపించే విశేషాలెన్నింటినో మీరీ ఇంటర్వ్యూలో చదవొచ్చు.


రెండేళ్ల క్రితం ‘క్షణం’లో కనిపించారు. ఆ తర్వాత గతేడాది హిందీ సినిమా ‘కమాండో 2’ చేశారు. సినిమాల లెక్క తగ్గించేశారేంటి?
అదాశర్మ: ఇప్పుడు లెక్క ఎక్కువైంది. నా చేతిలో 5 సినిమాలున్నాయి. తమిళంలో ప్రభుదేవాతో ‘చార్లీ చాప్లిన్‌ 2’, హిందీలో ‘కమాండో 3’, మరో రెండు సినిమాలు, ఇంగ్లీష్‌లో ‘సోల్‌మేట్‌’ చేస్తున్నా. ఫుల్‌ బిజీ.

ఈ లిస్ట్‌లో ఒక్క తెలుగు సినిమా కూడా లేదే?
ఒకేసారి మూడు నాలుగు భాషల్లో సినిమాలంటే కష్టం. అందుకే తెలుగు సినిమా సైన్‌ చేయలేదు. బట్‌ హీరోయిన్‌గా ‘హార్ట్‌ ఎటాక్‌’తో బ్రేక్‌ ఇచ్చిన టాలీవుడ్‌కి దూరం కావడం నాకిష్టం లేదు. ఆ సినిమాలో హీరోయిన్‌ క్యారెక్టరైజేషన్‌ కొత్తగా ఉంటుంది. అలాంటి క్యారెక్టర్స్‌ కోసం ఎదురు చూస్తున్నా.

హీరోయిన్స్‌ కెరీర్‌ త్వరగా ముగిసిపోతుంది కాబట్టి.. గ్యాప్‌ లేకుండా సినిమాలు చేయాలని కొందరు అంటారు. మరి మీరు ఒక సంవత్సరం గ్యాప్‌ తీసుకోవడం తెలివైన నిర్ణయమే అంటారా?
ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్‌నే తీసుకోండి. బాలీవుడ్‌ని చాలా కాలంగా రూల్‌ చేస్తున్నారు. పరిధిని మించి ఆలోచించలేని వాళ్లు, చీప్‌ మెంటాలిటీ ఉన్నవాళ్లే ఈ ఇయర్స్‌ కౌంటింగ్‌ గేమ్‌ ఆడతారు. ఇంకొంతమంది ఉంటారు. ఎవరిదైనా సినిమా ఫ్లాప్‌ అయితే ఆనందిస్తారు.

ఎందుకంటే వాళ్ల జీవితాల్లో సంతోషం అనేది ఉండదు కాబట్టి ఇతరుల ఫెయిల్యూర్‌ని సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఇలాంటి వారి ఆలోచనల వల్ల కానీ, పనుల వల్ల కానీ మనం ఎఫెక్ట్‌ అవ్వకూడదు. బాధపడకపోవడమే ఉత్తమం అని నా ఉద్దేశం. లాస్ట్‌ ఇయర్‌ నా సినిమాల రిలీజ్‌లు లేకపోయేసరికి గ్యాప్‌ తీసుకున్నా అనుకుంటున్నారు.. అంతే.

మరి.. రేస్‌ సంగతేంటి?
ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నీ చూస్తే ఎవ్వరితోనూ పోటీ పడుతున్నట్లు మీకు అనిపించదు. అలా ఎప్పుడూ చేయను కూడా. నా కెరీర్‌ను హారర్‌ మూవీ (హిందీ మూవీ ‘1920’)తో స్టార్ట్‌ చేశాను. జనరల్‌గా హారర్‌ మూవీతో హీరోయిన్‌ అవ్వాలని ఎవ్వరూ అనుకోరు. కానీ ఆ సినిమాలో నాకు యాక్టింగ్‌కి స్కోప్‌ ఉంది కాబట్టి అదేం పట్టించుకోలేదు. నేను కథక్‌ నేర్చుకున్నాను. డ్యాన్స్‌ చాలా ఈజీగా చేయగలుగుతాను.

అయినప్పటికీ  తెలుగులో నా ఫస్ట్‌ సినిమా ‘హార్ట్‌ ఎటాక్‌’లో డ్యాన్స్‌కి స్కోప్‌ లేకపోయినా యాక్టింగ్‌కి స్కోప్‌ ఉన్న క్యారెక్టర్‌ చేశాను. నేను ‘క్షణం’ సైన్‌ చేసినప్పుడు చాలామంది రాంగ్‌ డెసిషన్‌ అన్నారు. కానీ నా దృష్టిలో నటిగా నాలో మరో కోణం చూపించుకోవడానికి చాన్స్‌ ఉన్న సినిమా అది. ‘కమాండో’ అనే హిందీ  సినిమాలో తెలుగు యాసలో మాట్లాడాను. ఇవన్నీ చూస్తే మీకే అర్థం అవుతుంది.. నేను కొత్త రకమైన పాత్రలు ఎంచుకుంటానని, ఎవ్వరితోనూ పోటీ పడనని.

సౌత్‌లో అవకాశాలు సంపాదించుకోవడం ఈజీయా? నార్త్‌లోనా?
సౌత్‌లోనే ఈజీ. మనం యాక్ట్‌ చేసిన సినిమా హిట్టయితే చాలు అవకాశాలు ఈజీగా వచ్చేస్తాయి. అయితే బాలీవుడ్‌లో అవకాశాలు ఎలా వస్తాయి? అనే విషయంలో నాకింకా క్లారిటీ లేదు. నాకు ఇక్కడ గాడ్‌ ఫాదర్‌ లేరు. అఫ్‌కోర్స్‌ సౌత్‌లోనూ లేరనుకోండి. అయినా నేను లక్కీయే. ఎందుకంటే సౌత్‌తో పోల్చితే నార్త్‌లో కాంపిటీషన్‌ ఎక్కువగా ఉన్నా నాకు అవకాశాలు వస్తున్నాయి.

హెయిర్‌ చాలా సిల్కీగా ఉంటుంది. టిప్స్‌ చెబుతారా?
ప్రతిరోజూ తలస్నానం చేస్తాను. మా అమ్మగారు వెనిగర్, బేకింగ్‌ సోడా కలిపి షాంపూ తయారు చేస్తారు. ఎక్కువసార్లు అదే వాడతాను. లేకపోతే కెమికల్స్‌ తక్కువగా ఉన్న న్యాచురల్‌ షాంపూ యూజ్‌ చేస్తాను. మోస్ట్‌లీ ‘వీగన్‌ షాంపూ’ని ప్రిఫర్‌ చేస్తాను.
 

మీ స్కిన్‌ చాలా బాగుంటుంది. ఏం చేస్తారు?
ప్రతిరోజూ వీలయినంత ఎక్కువగా నీళ్లు తాగుతాను. ఒత్తిడికి గురైనప్పుడు నా స్కిన్‌ డల్‌ అవుతుంది. అందుకే దేనికీ పెద్దగా స్ట్రెస్‌ అవ్వను. రాత్రి నిద్రపోయే ముందు కచ్చితంగా మేకప్‌ రిమూవ్‌ చేసేస్తాను. ‘హైడ్రేటింగ్‌ ఆల్మండ్‌ ఫేస్‌ ప్యాక్‌’ వాడతాను. నా స్కిన్‌కి అది బాగా సూట్‌ అవుతుంది.

ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. కానీ మీరు రచ్చ గెలిచి ఇప్పుడు ఇంట (తమిళంలో) సినిమా చేస్తున్నారు. మీ మాతృభాషలో లేట్‌గా చాన్స్‌ రావడం గురించి?
నేను పక్కా తమిళమ్మాయిని. ముఖ్యంగా ఫుడ్‌ విషయంలో చాలా పర్టిక్యులర్‌. ఎక్కడికెళ్లినా సౌత్‌ ఇండియన్‌ ఫుడ్‌ ఉండాల్సిందే. అంత ప్రేమ ఉన్నప్పుడు మదర్‌ టంగ్‌లో సినిమా చేయాలని ఎందుకు ఉండదు. ఈ నాలుగేళ్లలో కొన్ని అవకాశాలు వచ్చినా అవి అంత పెద్దగా ఎగై్జట్‌ చేయలేదు. తమిళంలో లాంచ్‌ అవ్వడానికి ‘చార్లీ చాప్లిన్‌–2’ పర్ఫెక్ట్‌ మూవీ అవుతుందనిపించి ఒప్పుకున్నాను.

ఇప్పుడు ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ హాట్‌ టాపిక్‌. దీని గురించి మీరేమంటారు?
క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడటానికి ఏమీ లేదు. ఆ కౌచ్‌ మీద ఉండాలా? వద్దా? అన్నది పూర్తిగా పర్సనల్‌ చాయిస్‌. ఫిల్మ్‌ ఇండస్ట్రీ అనే కాదు మనం అంటున్న ఈ ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ చాలా చోట్ల ఉంది. పని కోసం ‘సెక్సువల్‌ ఫేవర్‌’ చేయడానికి కొందరు వెనకాడటంలేదు. ఇంతకుముందు అన్నట్లు అది వారి చాయిస్‌. కానీ ‘ఇలా చేసే తీరాలి’ అని ఎవరినీ ఒత్తిడి చేయకూడదు. పవర్‌ని ఉపయోగించి మహిళల్ని  లైంగికంగా ఎక్స్‌ప్లాయిట్‌ చేయడం నిజంగా  హారిబుల్‌.

మీరలాంటి బ్యాడ్‌ ఎక్స్‌పీరియన్సెస్‌ ఏవైనా ఎదుర్కొన్నారా?
నో. నేనెప్పుడూ ఆ కౌచ్‌లో లేను.

ఏ హీరోయిన్‌ అయినా యాక్టింగ్‌ విషయంలో ప్రూవ్‌ చేసుకుంటేనే అవకాశాలు తెచ్చుకోగలుగుతారు. కానీ వాళ్ల కష్టం గురించి పట్టించుకోకుండా కొందరు ఈజీగా మాటలనేస్తారు. అదెలా ఉంటుంది?
బాధగానే ఉంటుంది. అయితే ‘ఇగ్నోర్‌’ చేయడం నేర్చుకోకపోతే ఇబ్బందిపడతాం. ఒకవేళ ఎవరైనా విమర్శించినప్పుడు అందులో నిజం ఉంటే అప్పుడు నన్ను నేను మార్చుకుంటా. అంతేకానీ ఊరికే మాటలనేస్తే పట్టించుకోను. ఇంత పేరు వస్తున్నప్పుడు కొంత విమర్శలూ వస్తాయి. తట్టుకోవాలి.

ఫర్‌ ఎగ్జాంపుల్‌.. హీరోయిన్లకు కాస్ట్యూమ్స్‌పై ఉన్న దృష్టి నటనపై లేదని ఒక తమిళ డైరెక్టర్‌ అన్నప్పుడు కొందరు కథానాయికలు ఖండించారు. ఇలాంటి స్టేట్‌మెంట్స్‌ విన్నప్పుడు మీ రియాక్షన్‌ ఏంటి?
ఇతరుల ఆలోచనా విధానాన్ని మార్చే శక్తి మనకు లేదు. మనది ప్రజాస్వామ్య దేశం. ఆలోచనలను వ్యక్తపరచే హక్కు అందరికీ సమానంగా ఉంది. అంతెందుకు మీ థింకింగ్, నా థింకింగ్‌ వేరుగా ఉంటాయి. హీరోయిన్ల గురించి ఆ దర్శకుడి అభిప్రాయం అదై ఉండొచ్చు. కాబట్టి ఆ స్టేట్‌మెంట్‌ ఇచ్చి ఉంటాడు. వేరేవాళ్లకు మంచి అభిప్రాయం ఉండి ఉండొచ్చు. వాళ్లు మా గురించి బాగా మాట్లాడతారు కదా. రైట్‌ మాట్లాడినప్పుడు మామూలుగా ఉంటాం. రాంగ్‌ స్టేట్‌మెంట్‌కి బాధపడతాం. డైరెక్టర్‌ అనే కాదు.. హీరోయిన్లను కించపరచే విధంగా ఎవరు మాట్లాడినా నేను సపోర్ట్‌ చేయను.

హీరోయిన్స్‌ పబ్లిక్‌లోకి వస్తే ఏదో ఒక బ్యాడ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కామన్‌. కామన్‌ గర్ల్స్‌పై అత్యాచారాలు కూడా కామన్‌ అయిపోయాయి. ఇలాంటి దారు ణాల పట్ల మీ అభిప్రాయం?
ఆ మధ్య పూనాలో. తర్వాత జమ్మూలో. దారు ణాలు ఆగడంలేదు. వీటి గురించి మాట్లాడటానికి నేను సరైన వ్యక్తిని కాదేమో. ఎందుకంటే ఓ సెలబ్రిటీగా నా చుట్టూ సెక్యూర్టీ ఉంటుంది కాబట్టి ఐ యామ్‌ సేఫ్‌. బస్సుల్లో, లోకల్‌ ట్రైన్స్‌లో ప్రయాణించే మహిళలను, బయట సమాజంలోని ఇతర స్త్రీలను ఈ విషయం అడిగితే బాగుంటుంది. మహిళలపై అఘాయిత్యాలు తగ్గాలంటే అబ్బాయిల ప్రవర్తనలో మార్పు రావాలి. అందుకు పేరెంట్స్‌ బాధ్యత తీసుకుని వారిలో నైతిక విలువలను పెంపొందించాలి. మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో చెప్పాలి. అప్పుడే కొంతైనా ఈ సమస్యకు ఓ పరిష్కార మార్గం దొరుకుతుందని నా ఫీలింగ్‌.

బరువు ఎలా పెరుగుతారు.. ఎలా తగ్గిస్తారు? ఆ సీక్రెట్‌ చెబుతారా?
బరువు పెరగడం అంటే ఫుల్లుగా తినడమే. తగ్గాలంటే మాత్రం చిప్స్, జంక్‌ ఫుడ్‌కి దూరంగా ఉండాల్సిందే. వెయిట్‌ రెడ్యూస్‌ అవ్వాలనుకున్నప్పుడు నేను డ్రై ఫ్రూట్స్‌ తీసుకుంటాను. నిజానికి నా శరీరం చాలా తొందరగా బరువు కోల్పోతుంది. తగ్గడానికి రన్నింగ్, వాకింగ్‌ చేసిన సందర్భాలు అరుదు. ‘క్షణం’లో పదహారేళ్ల కాలేజ్‌ అమ్మాయిలా నటించాల్సి వచ్చింది.

ఫేస్‌ కొంచెం చబ్బీగా ఉండాలని, ఫిజిక్‌ మాత్రం స్లిమ్‌గానే ఉండాలనీ అన్నారు. అలానే చేశా. ‘కమాండో 2’కి వచ్చేసరికి ముఖం పెద్దగా కనిపించి, బాడీ థిన్‌గా ఉండాలన్నారు. అలానే వర్కవుట్‌ చేశా. ఒక ఆర్టిస్టుగా ఇలా ట్రాన్స్‌ఫామ్‌ కావడం నాకు హ్యాపీగా ఉంటుంది.

క్యారెక్టర్‌ ఎలా డిమాండ్‌ చేస్తే అలా ఫిజిక్‌ని మార్చుకోవడానికి రెడీ అయిపోతారా?
నా ఫస్ట్‌ మూవీ ‘1920’లోని క్యారెక్టరైజేషన్‌ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ సినిమా  ఫస్ట్‌ హాఫ్‌లో ఆ కాలంనాటి మహిళలా కనిపించడానికి ఇబ్బందిపడ్డాను. సెకండ్‌ హాఫ్‌ కోసం ఏకంగా 10 కేజీల బరువు తగ్గాను. లాస్ట్‌ ఇయర్‌ చేసిన హిందీ సినిమా ‘కమాండో 2’కి అంత ఇబ్బంది పడలేదు.

నార్మల్‌ ఫిట్‌నెస్‌ మెయిన్‌టైన్‌ చేశాను. అయితే ఆ సినిమాలో నా ఫస్ట్‌ సీన్‌లో మూడు పేజీల డైలాగ్‌ చెప్పాల్సి వచ్చింది. యాక్సెంట్‌ కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ‘దంగల్‌’లో ఆమీర్‌ ఖాన్‌కు, ‘తను వెడ్స్‌ మను’లో కంగనా రనౌత్‌లకు యాక్సెంట్‌ ట్రైనర్‌గా చేసిన సునీతగారే నాకూ ట్రైనింగ్‌ ఇచ్చారు. ఫిజికల్‌గా, యాక్సెంట్‌వైజ్‌గా, మెంటల్‌గా.. ఒక క్యారెక్టర్‌ వీటిలో ఏది డిమాండ్‌ చేసినా అది చేయడానికి నేను రెడీ.

సెక్యూర్టీ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉంటారా?
నేనెక్కడికి వెళ్లినా పది మంది చుట్టూ ఉంటారు. కారు ఎక్కడానికి వెళ్లినా ఐదుగురు చుట్టూ ఉండేలా ప్లాన్‌ చేసుకుంటా. షాపింగ్‌ మాల్స్‌కు వెళ్లినప్పుడు బౌన్సర్ల సహాయం  ఉంటుంది. నా వరకు నేను సేఫ్‌గానే ఉన్నాను.

ఫైనల్లీ ఎలాంటి స్త్రీలను చూసి ఇన్‌స్పైర్‌ అవుతారు. మీరెలా ఉండాలనుకుంటారు?
కాన్ఫిడెంట్‌గా ఉండే ఆడవాళ్లంటే చాలా ఇష్టం. అలాంటివాళ్లు ఇతరులకు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తారు. నా మటుకు నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటాను. ‘అమ్మాయి’ అంటే ఇన్‌ఫీరియార్టీ కాంప్లెక్స్‌తో ఉండాలని కొందరు భావిస్తారు. అలా ఉంటే మన జీవితానికి మనమే చేటు చేసుకున్నవాళ్లం అవుతాం. అందుకే ‘బీ కాన్ఫిడెంట్‌’.

– డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement