తెలుగు సినిమా నచ్చితేనే...నాకు నచ్చుతాడు! | Special Interview with Adah Sharma | Sakshi
Sakshi News home page

తెలుగు సినిమా నచ్చితేనే...నాకు నచ్చుతాడు!

Published Sun, Aug 23 2015 1:01 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

తెలుగు సినిమా నచ్చితేనే...నాకు నచ్చుతాడు! - Sakshi

తెలుగు సినిమా నచ్చితేనే...నాకు నచ్చుతాడు!

ఇంటర్వ్యూ
సినిమాల్లో అదాశర్మతో హీరోలు ప్రేమలో పడుతుంటారు.
వెండితెర మీద ఆమెను చూసి కుర్రకారు ప్రేమలో పడుతుంటారు. కానీ అదాశర్మ మాత్రం అంత తేలికగా ప్రేమలో పడనంటోంది. తన ప్రేమను పొందాలంటే ఆ యువకుడికి కొన్ని ప్రత్యేక క్వాలిటీస్ ఉండాలంటోంది.
సినిమాను ప్రేమించేవాణ్నే తానూ ప్రేమిస్తానంటోంది. ఆమె చెప్పిన మరిన్ని కబుర్లు... రీడ్ అండ్ ఎంజాయ్!

 

యాక్టింగ్‌లోకి ఎలా?
ఎనిమిదో తరగతి చదివేటప్పుడు నేను ఆర్కిటెక్ట్ అవ్వాలనుకునేదాన్ని. లేదంటే నాకు జంతువులంటే చాలా ఇష్టం కాబట్టి సర్కస్‌లో చేరితే బాగుంటుందను కునేదాన్ని. తొమ్మిదో తరగతిలోకి వచ్చాక ఎందుకో సినిమాల మీద చాలా ఆసక్తి పెరిగింది. దాంతో నటినయ్యి తీరాలనుకున్నా. పదో తరగతి పూర్తయినప్పట్నుంచీ ఆడిషన్స్‌కి వెళ్లడం మొదలుపెట్టా. చాలాసార్లు రిజెక్ట్ అయ్యాక  బాలీవుడ్ చిత్రం ‘1920’లో నటించే చాన్స్ వచ్చింది.
 
తెలుగులో నటించడం ఎలా ఉంది?
‘హసీ తో పసీ’ సినిమా చేస్తున్నప్పుడు ‘హార్ట్ అటాక్’లో నటించే చాన్స్ వచ్చింది. చాలా తెలుగు సినిమాలు హిందీలోకి డబ్ అవుతుంటాయి. దాన్ని బట్టి తెలుగు ఇండస్ట్రీ ఎంత పెద్దదో నాకు తెలుసు. ఇక పూరి లాంటి పెద్ద దర్శకుడి సినిమా అంటే మాటలు కాదు. అందుకే వెంటనే ఓకే అనేశా. సినిమా రిలీజయ్యాక వచ్చిన రెస్పాన్స్ చూసి నిజంగానే హార్ట్ అటాక్ వచ్చింది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో కూడా మంచి రోల్. ఇప్పుడు ‘ఆది’తో చేస్తున్నా. తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.

బాలీవుడ్, టాలీవుడ్... రెండిటికీ తేడా?
అక్కడ హిందీ మాట్లాడతారు, ఇక్కడ తెలుగు మాట్లాడతారు.. అంతే తేడా. కాకపోతే ఇక్కడ సెట్స్‌లో లేడీ టెక్నీషియన్స్ కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

మీ ఫిట్‌నెస్ సీక్రెట్?
ఫిట్‌నెస్ కోసం పెద్దగా ఏం చేయను. స్వతహాగా డ్యాన్సర్‌ని కాబట్టి అదే నాకు పెద్ద వ్యాయామం. ఆహారం విషయంలో కూడా మరీ ఎక్కువ నియమాలేవీ లేవు. సౌత్ ఇండియన్ ఫుడ్‌ని కడుపారా ఆరగిస్తా. సాంబారన్నమన్నా, రసం అన్నమన్నా మహా ఇష్టం. రోజూ ఆ రెండిలో ఏదో ఒకటి ఉండాల్సిందే.

అందం గురించి మీ కామెంట్?
అది శారీరకంగా ఉండదు. మన వ్యక్తిత్వాన్ని బట్టి, మన ప్రతిభని బట్టి మనం అందంగా కనిపిస్తాం అని నేను నమ్ముతాను. మనసు అందమైనది కాకపోతే శరీరం ఎంత అందంగా ఉన్నా అది అందమనిపించుకోదు.

ఫ్రీ టైమ్‌లో ఏం చేస్తుంటారు?
నేను అస్సలు కుదురుగా ఉండను.  ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. అయితే సినిమాలు, లేకపోతే నాకెంతో ఇష్టమైన డ్యాన్‌‌స ప్రాక్టీస్‌లో మునిగి తేలుతుంటాను. పియానో కూడా వాయిస్తాను. ఇక తీరిక దొరికిందంటే అదీ ఇదీ అని లేకుండా టీవీలో వచ్చే ప్రతి సినిమా చూస్తుంటాను. రిలీజైన ప్రతి సినిమాకీ వెళ్తాను.

మీ ఫస్ట్ క్రష్?
లియొనార్డో డికాప్రియో. చిన్నప్పుడు ‘టైటానిక్’ చూసీ చూడగానే అతనితో ప్రేమలో పడిపోయాను. నా బెడ్‌రూమ్ గోడల నిండా అతని పోస్టర్లు అంటించేశాను.

మరి ఇప్పుడో?
ఇప్పుడు ప్రేమించేంత సమయం లేదు. ప్రేమకు తగిన సమయం కూడా ఇది కాదు. ప్రస్తుతం మనసంతా కెరీర్ మీద. ప్రేమ కేవలం స్క్రీన్ మీద!

ఒకవేళ ప్రేమిస్తే ఎలాంటివాడు కావాలి?
నేను ఎవరినైనా ప్రేమించాలంటే అతనిలో ముఖ్యంగా మూడు క్వాలిటీస్ ఉండాలి. తను కచ్చితంగా మూగ జీవాల్ని ప్రేమించేవాడై ఉండాలి. హిందీ సినిమాలతో పాటు తెలుగు సినిమాలను కూడా సమానంగా ఇష్టపడేవాడై ఉండాలి. అలాగే సున్నిత మనస్కుడు అయి ఉండాలి.

జంతువులంటే ఎందుకంత ప్రేమ?
నేను స్వతహాగా వెజిటేరియన్‌ని. అందుకని అందరినీ వెజ్ తినమని చెప్పను. మన కడుపు నింపుకోవడం కోసం నోరు లేని జంతువుల్ని చంపడం అన్యాయం అనిపిస్తుంది నాకు. అలాగే కొన్ని రకాల పనుల కోసం వాటిని కొందరు హింసిస్తూ ఉంటారు. అది కూడా అనైతికం అనిపిస్తుంది నాకు. అందుకే శాకాహారాన్ని ప్రోత్సహించ డంతో పాటు జంతు పరిరక్షణ పట్ల కూడా దృష్టి పెట్టాను. ‘పెటా’ తరఫున ప్రచారం చేస్తున్నాను.                    
 
సాక్షి ఫన్‌డే మీద మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయండి. ప్రియదర్శిని రామ్, ఎడిటర్, ఫన్‌డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. ఫోన్: 040-23256000 funday.sakshi@gmail.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement