భలే భలే మగాడు ఎక్కడ?
ఇంటర్వ్యూ
‘అందాల రాక్షసి’గా అందరికీ పరిచయమయ్యింది. ‘దూసుకెళ్తా’నంటూ మొదటే చెప్పింది.
నిజంగానే ఇప్పుడు దూసుకు పోతూ అందరి మనసులనూ దోచుకుంటోంది.
కానీ మీ మనసు ఎవరైనా దోచారా అంటే మాత్రం...
అలాంటి మగాడు ఇంకా దొరకలేదు అంటోంది.
లావణ్య ఇంకా ఏమేం చెప్పిందో తెలుసుకోవాలనుంటే ఇది చదవండి...
* మీ బ్యాగ్రౌండ్?
మాది డెహ్రూడూన్. నాన్న హైకోర్టులో న్యాయవాది. అమ్మ టీచర్. నాకు ఒక అన్న, ఒక అక్క. ఇంట్లో నేనే చిన్నదాన్ని కావడంతో గారాబం ఎక్కువే.
* కావాలనే నటి అయ్యారా లేక చాలా మందిలా ఏదో అవ్వాలనుకుని..?
మొదట్నుంచీ నటనంటే ఇష్టమే. కాకపోతే చదువు అయ్యాకే అలాంటివన్నీ అన్నారు నాన్నగారు. దాంతో మొదట డెహ్రాడూన్‌లో స్కూల్ చదువు ఫినిష్ చేశాను. తర్వాత ముంబై లోని నేషనల్ కాలేజీలో ఎకనమిక్స్ చదువుతూ మోడలింగ్ చేయడం మొదలుపెట్టాను. 2006లో ‘మిస్ ఉత్తరాఖండ్’ టైటిల్ కూడా గెలుచు కున్నాను. తర్వాత ‘ష్... కోయీ హై’, ‘ప్యార్ కా బంధన్’ సీరియల్స్‌లో చాన్స్ వచ్చింది. ఆపైన ‘అందాల రాక్షసి’లో నటించే చాన్స్ దొరికింది. అప్పట్నుంచీ ఇలా కంటిన్యూ అయిపోతున్నా.
* కానీ మొదటి సినిమాకి రెండో సినిమా ‘దూసుకెళ్తా’కి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. ఎందుకు? చాన్సులు రాలేదా?
రాక కాదు, నచ్చక చేయలేదు. వచ్చిన అవకాశాలేవీ నాకు నచ్చలేదు. ‘భలే భలే మగాడివోయ్’లో డిఫరెంట్ రోల్ దొరికేసరికి ఎస్ చెప్పాను. నచ్చితే చిన్న క్యారెక్టర్ అయినా చేస్తాను తప్ప పేరు రాని పాత్రలు ఎంత పెద్దవైనా చేయను.
* ప్రస్తుతం ఏం చేస్తున్నారు?
‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ చేశాను. మరికొన్ని చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. చెప్పాలంటే ప్రస్తుతం బిజీబిజీగానే ఉన్నా.
* తీరిక వేళల్లో ఏం చేస్తుంటారు?
సినిమాలు బాగా చూస్తాను. హారర్, థ్రిల్లర్స్ అంటే బాగా ఆసక్తి. టీవీ కూడా ఎక్కువగానే చూస్తా. అలాగే వంట చేయడం చాలా ఇష్టం. వంట చేసి అందరికీ వడ్డించాలని ఆశపడుతుంటా.
* మీ గ్లామర్ సీక్రెట్?
వెజిటేరియన్‌ని కాబట్టి ఫ్యాటీ ఫుడ్ తినేది తక్కువే. రాజ్‌మా చావల్, చోళే బతూరా లాంటివి ఇష్టం. అయితే ఇదే తినాలి అని లేదు. ఏదైనా తింటాను. బరువు పెరగకుండా వ్యాయామం చేస్తాను. ఎందుకంటే కడుపు మాడ్చుకుంటే గ్లామర్ రాదు. పైగా ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి అన్నీ తినాలి. వ్యాయామమూ చేయాలి.
* మీ ఇష్టాయిష్టాల గురించి చెప్పండి?
ఆరెంజ్, తెలుపు, నలుపు రంగులంటే ఇష్టం. జీన్స్, టీషర్ట్స్, చీరలు ధరించడం ఇష్టం. బ్రేస్‌లెట్స్, ఉంగరాలు బాగా కలెక్ట్ చేస్తుంటాను. షేక్‌స్పియర్ నవలలంటే పడి చస్తాను. రోమియో జూలియెట్ నా ఫేవరేట్. ముంబై, ఢిల్లీ, న్యూయార్క్, లండన్‌లు నచ్చుతాయి. బీఎండబ్ల్యూ, స్కోడా, బెంజ్ కార్లలో తిరగడానికి ఇష్టపడతాను. ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమా మళ్లీ మళ్లీ చూస్తూనే ఉంటాను. లత, ఆశాజీల పాటలంటే చెవి కోసుకుంటాను. చాలా? (నవ్వుతూ) ఇప్పటికే చాలా చెప్పేశాననుకుంటా.
* దేవుణ్ని నమ్ముతారా?
బాగా నమ్ముతాను. మా ఇంట్లో పూజలు, వ్రతాలు క్రమం తప్పకుండా జరుగుతాయి. నేనూ పూజ చేస్తాను. అయితే మూఢ భక్తురాలిని మాత్రం కాదు. గుడికి వెళ్లినట్టే చర్చికి వెళ్తాను. దర్గాలకూ వెళ్తాను. అన్ని మతాలూ ఒక్కటే నాకు. మతమంటే ఒక నమ్మకమే కదా!
* మీ బలం, బలహీనత?
నా ఆత్మవిశ్వాసమే నా బలం. ఇది చేయగలనో లేదో అన్న ఆలోచన నాకెప్పుడూ ఏ విషయంలోనూ రాదు. ఏదైనా అనుకుంటే చేసేయడమే. బలహీనత అంటే... అందరినీ గుడ్డిగా నమ్మేస్తుంటాను. తర్వాత బాధపడ్తాను.
* ఇతరుల్లో నచ్చేది, నచ్చనిది?
నిజాయతీ ఉన్నవాళ్లు, కష్టపడి పని చేసేవాళ్లు నచ్చుతారు. బద్ధకస్తులన్నా, శుభ్రంగా ఉండనివాళ్లన్నా ఇష్టముండదు. కుటిలంగా ఉండేవాళ్లంటే అసహ్యం.
* మీ గురించి ఎవరికీ తెలియనిది?
నేను చాలా సాఫ్ట్‌గా, కూల్‌గా కని పిస్తాను. కానీ నిజానికి టామ్‌బాయ్ టైప్. అమ్మాయిలా కంటే అబ్బాయిలా ఎక్కువ ప్రవర్తిస్తాను. బాగా అల్లరి చేస్తాను.
* ఇంతకీ... ఎవరినైనా ప్రేమించారా?
ఎక్కడా... ప్రేమించాలంటే తగినవాడు దొరకాలిగా! నాకు కావలసిన భలే భలే మగాడు ఎక్కడున్నాడో మరి!