బొమ్మన్ అదిరింది | special interviwe to boman irani | Sakshi
Sakshi News home page

బొమ్మన్ అదిరింది

Published Sat, Jul 18 2015 10:55 PM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM

బొమ్మన్  అదిరింది

బొమ్మన్ అదిరింది

దుస్తులు మార్చినంత ఈజీగా ఎక్స్‌ప్రెషన్లు మార్చేస్తాడు! సూర్యుడు తొంగిచూసినంత ఈజీగా చిరునవ్వులు పొంగిస్తాడు! మబ్బు తెర వేసినంత ఈజీగా  కన్నీరు తెచ్చేస్తాడు!  మంచినీళ్లు గ్లాసులో పడినంత ఈజీగా  క్యారెక్టర్‌లోకి పడిపోతాడు!  ఇరానీకి అదెలా సాధ్యం?  జీవితం చాలా డిఫికల్ట్ అయ్యేటప్పటికి...  సినిమా ఈజీ అయిపోయింది అంటాడు.  బికాజ్ లైఫ్ ఈజ్ సినిమా, అండ్ ‘బొమ్మ’న్ ఈజ్ దేర్!
 
నా కెరీర్ టాప్ 5
మై వైఫ్స్ మర్డర్ - 2005
ఖోస్లా కా ఘోస్లా - 2006
లగేరహో మున్నాభాయ్ - 2006
3 ఇడియట్స్ - 2009
వెల్‌డన్ అబ్బా - 2010
 
హిందీలో మీరు బిజీ. ఇక్కడ చేయాలనెందుకనుకున్నట్లు?
నటుడనేవాడు అన్ని ఎక్స్‌పరిమెంట్లూ చేయాలి. బొంబాయిలోనే ఉంటే- వియ్ గెట్ ఇన్‌టు ఎ కంఫర్ట్ జోన్. మనలోని బెస్ట్ వర్క్ బయటకు రావాలంటే, ఎప్పటికప్పుడు కొత్త ఛాలెంజ్ తీసుకోవాలి. ఆ ఆకలి ఉంటే, ప్రతిరోజూ ఏదో కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తాం.
     
ఇంతకీ, తెలుగులోకి రావడం ఎలా జరిగింది?

గతంలో సౌత్ నుంచి 3 -4 ఆఫర్లు వచ్చినా, తీరిక లేక చేయలేకపోయా. దర్శక - రచయిత త్రివిక్రమ్ ఒకసారి ఫోన్ చేసి, ‘అత్తారింటికి దారేది’ స్క్రిప్ట్ చెప్పారు. ఆయన కథ చెప్పడం మొదలుపెట్టగానే, ‘దిస్ మ్యాన్ నోస్ హిజ్ సినిమా’ అనిపించింది. సినిమా మీడియమ్, ప్రపంచ సినిమా, సాహిత్యం, తీయనున్న కథ గురించి స్పష్టమైన అవగాహన ఉన్న దర్శకుడని అర్థమైంది. అలా రఘునందన్ పాత్ర చేశా.

‘అత్తారింటికి...’ అంత హిట్టయినా, వేరే ఏమీ చేయలేదేం?
 ఆఫర్లొచ్చాయి. కుదరలేదు. ఆ మధ్య దర్శక - రచయిత సంపత్ నంది బొంబాయికొచ్చారు. వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్... స్టోరీ కా బేసిక్ స్ట్రక్చర్ బోల్‌దియా! నాకు నచ్చింది. ఆ తరువాత ‘బెంగాల్ టైగర్’ టోటల్ స్క్రిప్ట్ చెప్పారు. రెండు గంటలు కూర్చొని, కబుర్లు చెప్పుకున్నాం. అతనితో మంచి బంధం ఏర్పడింది. నటిస్తున్నా.
     
మళ్ళీ హైదరాబాద్, ‘బెంగాల్‌టైగర్’ అనుభవమెలా ఉంది?

గౌరవంగా చూసే దర్శక, నిర్మాతల మంచి యూనిట్ ఇది. సంపత్ నంది వెరీ యాక్టివ్ మైండ్. హి కమ్స్ ప్రిపేర్డ్ ఫర్ ది సెట్. ఒక్కోసారి సెట్‌లో అనుకున్నదేదో చేయడానికి చటుక్కున ఇబ్బంది వస్తే, ఒకటికి నాలుగు కొత్త ఐడియాస్‌తో ముందుకొస్తాడు. ఇందులో నాది అశోక్ గజపతి అనే పవర్‌ఫుల్ విలన్ పాత్ర. దీనికి అంతకు అంత పవర్‌ఫుల్‌గా ఉంటాడు హీరో. అయామ్ ఎంజాయింగ్ వర్క్.
     
తెలుగు ఇండస్ట్రీ గురించి మీ ఒపీనియన్?

ఇక్కడివాళ్ళు పొలైట్. సిస్టమేటిక్. కష్టపడి పనిచేస్తారు. బొంబాయి సినీ పరిశ్రమలోనూ ఇప్పుడు ఆర్గనైజ్డ్‌గా పనిచేస్తున్నారు. పంక్చువల్‌గా ఉంటున్నారు. రెండు ఇండస్ట్రీలకీ పెద్ద తేడా ఏమీ లేదు. మంచి సినిమాలు చేయాలనే తపన కనపడుతోంది.

మరి వచ్చిన ఛాన్స్‌ను అంగీకరించే ముందు ఎలాంటి అంశాలు చూస్తారు? కథా, హీరోనా? దర్శకుడా? సంస్థా?
(నవ్వేస్తూ...) వాటన్నిటి కన్నా ముందు నాకు ఆ మనుషులు, ఆ వాతావరణం, వారి ప్రవర్తన కంఫర్టబుల్‌గా ఉండాలి. మనుషులు ఫ్రెండ్లీగా ఉండాలి. గర్వంతో, అహంకారంగా ప్రవర్తించేవాళ్ళతో నేను పనిచేయలేను. కాబట్టి, ఎవరితో పనిచేస్తున్నాను, ఎలాంటి యూనిట్ అనే విషయంలో నేను పర్టిక్యులర్. అదృష్టవశాత్తూ, ‘అత్తారింటికి దారేది’ టీమ్ కానీ, ‘బెంగాల్ టైగర్’ టీమ్ కానీ చాలా కంఫర్టబుల్.
  
కానీ తెలియని భాష డైలాగ్‌‌సతో ఎడ్జస్టవడమెలా?
 కో-డెరైక్టర్ దగ్గర ముందు రోజే సీన్ మొత్తం తెలుసుకుంటా. మొత్తం సీన్ వివరించాక, నా డైలాగులను ఇంగ్లీష్‌లో అడిగి, విషయం అర్థం చేసుకుంటా. ఆ తరువాత తెలుగు కల్చర్‌కి దగ్గరగా వెళ్ళడం కోసం హిందీలో తెలుసుకుంటా. అర్థం, భావం తెలిశాక, అప్పుడు తెలుగు డైలాగ్‌ను హిందీ స్క్రిప్ట్‌లో రాసుకొని, ఎలా పలకాలో ప్రాక్టీస్ చేస్తా. దానివల్ల కెమేరా ముందు ఏదో ‘వన్... టూ త్రీ’ అనకుండా సరిగ్గా డైలాగ్ చెప్పగలుగుతున్నా.

అంత శ్రమ పడకుండానే కొందరు నటిస్తున్నారుగా!
 అర్థం చేసుకోకుండా, నంబర్లంటూ నటించడమంటే, స్థానిక పరిశ్రమనూ, సంస్కృతినీ, భాషనూ అవమానించడమన్న మాటే! భాష, భావం అర్థం చేసుకుంటేనే నటన ట్రూత్‌ఫుల్‌గా ఉంటుంది. అందుకనే, ఇంత శ్రమపడతా. ఏదో ఒక రోజున తెలుగులో నేనే డబ్బింగ్ చెప్పుకోవాలని నా కోరిక. భాషకు కోచ్‌ను పెట్టుకోవాలని ఉంది.

అన్నట్లు మీరు వాయిస్ ఆర్టిస్ట్‌గానూ పనిచేసినట్లున్నారు!
 అవును. ‘ఢిల్లీ సఫారీ’ (2012)లో ఎలుగుబంటి పాత్ర సహా కొన్ని యానిమేషన్ చిత్రాల్లో గాత్రదానం చేశా. అంధుల కోసం చేసిన ఒక పబ్లిక్ సర్వీస్ ఫిల్మ్‌లో కుక్క పాత్రకు గాత్రమిచ్చా. జె.ఆర్.డి. టాటా అఫిషియల్ బయోగ్రఫీ ‘బియాండ్ ది లాస్ట్ బ్లూమౌంటెన్’ లాంటి కొన్ని ఆడియో బుక్స్ నా వాయిస్‌లో చదివా.

వాయిస్ ఆర్టిస్ట్ కన్నా ముందు థియేటర్ ఆర్టిస్ట్‌గా మీ కృషి?
ఫొటోగ్రాఫర్‌గా చేస్తున్న నన్ను రంగస్థల ప్రముఖుడు శ్యామక్ దవర్ అటు లాగారు. అలెక్ పదమ్‌సీ ‘రోష్నీ’తో అక్కడ మొదలుపెట్టా. ‘ఫ్యామిలీ టైస్’లో డబుల్ రోల్ చేశా. ‘అయామ్ నాట్ ర్యాపోపోర్ట్’లో 34 ఏళ్ళకే 75 ఏళ్ళ వాడి వేషం వేశా. ‘అయామ్ నాట్ బాజీరావ్’, ‘మహాత్మా వర్సెస్ గాంధీ’ నాటకంలో గాంధీ పాత్ర ఎంతో పేరు తెచ్చాయి. ఇలా దాదాపు 14 ఏళ్ళ పాటు నాటకాలు వేశా. ఆ ఎక్స్‌పీరియన్సే నాకు ఒక యాక్టింగ్ స్కూల్ అనుభవం.

రంగస్థల అనుభవం సినిమాల్లో ఏ మేరకు పనికొచ్చింది?
రంగస్థలంపై పని చేయడానికి చాలా డిసిప్లిన్ కావాలి. దానివల్ల సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా టైమ్ పాటించడం, వాయిస్‌ను బాగా ఉపయోగించడం, మొత్తం స్క్రీన్‌ప్లేను అవగాహన చేసుకోవడం, పాత్ర స్వభావాన్నీ, పరిధినీ అర్థం చేసుకోవడం లాంటివి అలవాటవుతాయి. రంగస్థల అనుభవంతో వచ్చినవాళ్ళు తోటి నటీనటుల్ని కూడా తమ ఎడ్వాంటేజ్‌కు తగ్గట్లు వాడుకోగలుగుతారు.
     
సినీ యాక్టర్‌గా లేటు వయసులో పెద్ద బ్రేక్ వచ్చినట్లుంది?
 నిజమే. రంగస్థలం మీద నన్ను చూసి, హ్యాండీ కామ్‌తో తీసిన ‘లెటజ్ టాక్’ అనే ఇంగ్లీష్ ఫిల్మ్‌లో నాతో నటింపజేశారు. ఆ టైమ్‌లోనే ఒకసారి దర్శక - నిర్మాత విధు వినోద్‌చోప్రా నన్ను చూసి, ‘వచ్చే ఏడాది డిసెంబర్‌కు నీ డేట్స్ కావాలి’ అంటూ, రెండు లక్షలకు చెక్ ఇచ్చారు. నాకు అర్థం కాలేదు. ఆ తరువాత ఆరు నెలలకు ఫోన్ వచ్చింది. అదే ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్’. అలా 44 ఏళ్ళ వయసులో పెద్ద బ్రేక్ వచ్చింది. ఈ పదకొండేళ్ళలో ఈ స్థాయికి వచ్చా. అయితే, నా దృష్టిలో ఎవరూ రాత్రికి రాత్రి సక్సెస్ కారు. ఇవాళ్టి సక్సెస్ వెనక ఒక జీవితకాలపు శ్రమ ఉంటుంది.

 మీరు కూడా వెయిటర్‌గా మొదలై ఎన్నోచేసి నటుడయ్యారు.
 (నవ్వేస్తూ...) నేనూ అనుకోలేదు. హోటల్‌లో వెయిటర్‌గా మొదలుపెట్టా. అక్కడ వినయం నేర్చుకున్నా. బేకరీ షాప్‌లో ఉన్నప్పుడు కస్టమర్లను చూసి మానవ స్వభావం స్టడీ చేశా. ఫొటోగ్రాఫర్‌గా లైటింగ్, మూడ్ తెలుసుకున్నా. రంగస్థలంలో నటన తెలిసింది. ఇప్పుడు సినిమాల్లో ఉన్నా. రేపేమిటో తెలియదు. ఇదో కంటిన్యుయస్ జర్నీ.
     
సీరియస్, కామెడీ, విలనీ - ఇలా అన్నీ చేశారు. ఏది కష్టం?
ఏ భావమైనా, బాగా పలికించడం ముఖ్యం. అందుకోసం బాగా ప్రిపేర్ అయిన వారికి, ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. ‘3 ఇడియట్స్’లో ఫన్నీగా చేశా. ‘లగే రహో మున్నాభాయ్’లో చాలా జాలీ క్యారెక్టర్. ‘అత్తారింటికి...’లో సీరియస్ పాత్ర. ఇప్పుడిందులో విలన్. ఒక్కోటీ ఒక్కో రకం. అందుకే, ఎన్ని సినిమాలు చేశానో లెక్కపెట్టుకోలేదు. బ్యాటింగ్ కర్తే జా రహా( హూ(. మరాఠీలోనూ చేస్తా.
     
{పస్తుతం దక్షిణాది భాషల్లో ఏమైనా ఆఫర్లున్నాయా?

తమిళ్‌లో ఆఫర్లు వస్తున్నాయి. ఏదీ సెట్ కాలేదు. తాజాగా మలయాళంలో ఆఫరొచ్చింది. హిందీలో ‘హౌస్‌ఫుల్-3’ చేస్తున్నా. షారుఖ్‌తో ‘దిల్‌వాలే’ చేయడం ఎగ్జైటింగ్‌గా ఉంది. ఏమైనా, తెలుగు సినిమా, ఇక్కడి ప్రజలు నన్ను తమ వాణ్ణి చేసుకున్నారు. అయావ్‌ు హానర్‌‌డ.
 
అమ్మే... సినిమాలకు పంపేది!
 నేను అమ్మ కడుపులో ఉండగానే నాన్న మరణించారు. నన్ను పెంచింది అమ్మే! బొంబాయిలో గ్రాంట్ రోడ్డులో మా ఇంటి దగ్గర చాలా హాళ్ళుండేవి. తప్పకుండా చూడాల్సినవన్నీ ఒక లిస్ట్ రాసి, మా అమ్మే నన్ను ఆ సినిమాలకు పంపేది. ఒక్కొక్క శాఖ పనినీ గమనించేందుకు ప్రతి సినిమా అయిదారుసార్లు చూడమనేది. అలా ఎన్ని క్లాసిక్స్ చూశానో! శివాజీగణేశన్ ‘నవరాత్రి’, ఎన్టీఆర్, ఏయన్నార్ ఫిల్మ్స్ చాలా చూశా. అమ్మకిప్పుడు 87 ఏళ్ళు. నాదగ్గరే ఉంటుంది.
 
 బేకరీలో... మా ప్రేమకథ!  

 అప్పట్లో మాకు ‘గోల్డెన్ వేఫర్స్’ అనే చిన్న బేకరీ షాపుండేది. అమ్మకు ఒంట్లో బాగా లేనప్పుడల్లా నేను షాపులో కూర్చొనేవాణ్ణి. బేకరీలో కొనుక్కోవడానికి జెనోబియా రోజూ వచ్చేది. అక్కడే మా ప్రేమ పుట్టింది. మాది చాలా సింపుల్, పాత తరహా ప్రేమకథ. ఆమె రోజూ వచ్చేది. నాకు 22 ఏళ్ళప్పుడు మా పెళ్ళయింది. మా పిల్లలు దనేష్, కయోజ్ ఇరానీ - ఇద్దరూ ఇప్పుడు సినీ రంగంలోనే ఉన్నారు. మా అమ్మ తరువాత నేను అంత ప్రేమించేది మా ఆవిణ్ణే.
 
 మనసుకు నచ్చనిది రాయడు!!
 నా ఫేవరెట్ డెరైక్టర్లంటే రాజు హిరానీ, ఫరాఖాన్. రాజు హిరానీ, నేను ఒకేసారి కెరీర్లు ప్రారంభించాం. మేమిద్దరం ఒకరి నుంచి మరొకరం నేర్చుకున్నాం. రాజు హిరానీలోని గొప్పతనం ఏమిటంటే, తన మనసుకు నచ్చనిదేదీ అతను కాగితం మీద పెట్టడు. చివరకు ఆయన రాసే హ్యూమర్ కూడా హృదయంలో నుంచి వచ్చినదే! ఫరాఖాన్ ఏమో ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు తీయడంలో దిట్ట. అదే సమయంలో ఆమె సినిమాల్లో బోలెడంత ఎమోషన్ ఉంటుంది.
 
- రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement