పరిశ్రమ స్థాపించాలి... అది సమాజానికి పనికొచ్చేదై ఉండాలి. పలువురికి ఉపాధినివ్వాలి... పదిమందిలో ఆదర్శవంతంగా జీవించాలి. ప్లాస్టిక్‌లేని సమాజాన్ని నిర్మించాలి. మన పనికి భూమాత హర్షించాలి. ఇదీ వాళ్ల ఆలోచన... వాళ్ల ఆలోచనను కరోనా కొత్త మలుపు తిప్పింది. ఆరోగ్యకారకమైన త్రీ ప్లై మాస్కుల తయారీతో కోవిడ్ సైనికులయ్యారు.
ఉద్యోగం చేయాలా, పదిమందికి ఉద్యోగం ఇవ్వాలా... ఈ తరం యువతకు ఎదురవుతున్న ప్రశ్న ఇది. ‘సాఫ్ట్‌వేర్ రంగంలో క్యాంపస్‌కే ఉద్యోగాలు వస్తాయి. రెండేళ్లలో ఇల్లు, కారు కొనుక్కోవచ్చు’ అని పిల్లలకు నూరిపోస్తున్న పేరెంట్స్ ప్రభావంతో ‘పరిశ్రమ నెలకొల్పడం... పదిమందికి ఉద్యోగం ఇవ్వడం’ అనే ఆలోచన పిల్లల్లో మొగ్గ దశలోనే రాలిపోతోంది. ఇలాగ అందరూ ఇతరదేశాల సేవకే జీవితాన్ని అంకితం చేస్తుంటే... డాలర్ మారకంలో రూపాయి గలగలల కలలు సాకారం అవుతాయి. జీవనస్థాయులు మెరుగుపడతాయి కూడా. మరి... మనదేశం అభివృద్ధి చెందేదెప్పుడు? మనదేశంలో అట్టడుగున ఉన్న శ్రామికశక్తిని, సమాజంలో సగభాగమైన మహిళాశక్తిని దేశనిర్మాణంలో భాగస్వామ్యం చేసినప్పుడే దేశం అభివృద్ధి బాట పడుతుంది. ఈ సూత్రాన్ని నమ్మిన నవతరం అమ్మాయిలు శ్రుతకీర్తి, భవ్యల ప్రయత్నమే హైదరాబాద్, కుషాయిగూడలోని ఎస్‌బీ ఎకో మ్యాటిక్స్.
తడవని మాస్క్
‘‘మన కెరీర్... మనకు ఆదాయాన్ని మాత్రమే ఇస్తే సరిపోదు. సమాజానికి కూడా ఉపయోగపడాలి. అదే సమయంలో పర్యావరణ హితంగా కూడా ఉండాలి. ఈ మూడుకోణాల్లో ఆలోచించిన తర్వాత మేము నాన్ వోవన్ బ్యాగ్‌ల తయారీని ఎంచుకున్నాం. మనం కొన్న సరుకులను మాల్స్ వాళ్లు పాలిథిన్ కవర్ లేదా క్లాత్ బ్యాగ్‌లో వేసిస్తున్నారు. వీటికి ప్రత్యామ్నాయం కోసం చూశాం. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పని చేయాలి. మన బ్యాగ్ క్లాత్ బ్యాగ్‌కంటే చౌకగా ఉండాలి. అందుకే నాన్‌వోవన్ బ్యాగ్‌లను పరిచయం చేయాలనుకున్నాం. నాన్ వోవన్ అనే పదం మనకు కొత్త కానీ, మనం నిత్యం చూస్తూనే ఉంటాం. బేకరీల్లో క్యాప్‌లు, భవన నిర్మాణ రంగంలో కాళ్లకు కవర్‌లు, చేతులకు గ్లవుజ్‌లుగా వాడుతుంటారు. హాస్పిటల్‌లో వాడే పీపీఈ కిట్‌లు కూడా ఈ మెటీరియల్‌తోనే తయారవుతాయి. ఇప్పుడు ఈ మెటిరీయల్‌తో పీపీఈ కిట్‌లతోబాటు వైద్యప్రమాణాలకు అనుగుణంగా మాస్క్‌లు కూడా తయారు చేస్తున్నాం’’ అని చెప్పారు సంస్థ సీఎండీ శ్రుతకీర్తి.
మాస్కు కోసం మెషీన్‌ని మార్చుకున్నాం
‘‘మా పరిశ్రమ కోసం తొమ్మిది నెలలుగా వర్కవుట్ చేస్తున్నాం. పరిశ్రమకు అవసరమైన యంత్రాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. పని మొదలు పెట్టాల్సిన సమయానికి కోవిడ్ వ్యాధి ప్రబలింది. మార్కెట్‌లో మాస్కుల కొరత ఏర్పడింది. సామాన్యులు మాస్కుల అవసరాన్ని తెలుసుకునే సరికే వ్యాపారులు ఒక్కో మాస్కును నలభై రూపాయలకు అమ్మడం కూడా మొదలైపోయింది. నలభై రూపాయలు పెట్టి మాస్కు కొనలేని వాళ్ల కోసమే మా పని మొదలు పెడితే బావుంటుందనిపించింది. దాంతో యంత్రాల సెట్టింగులను మాస్కుల తయారీకి అనుగుణంగా మార్చాం. లాభార్జన లేకుండా మెటీరియల్ ఖర్చు మాత్రమే చార్జ్ చేసి ఒక్కోమాస్కును ఐదు రూపాయల యాభైపైసలకిస్తున్నాం. పేదవాళ్లకు మాస్కులు పంచడానికి ముందుకువచ్చే ఎన్‌జీవోలకు, దాతలకు నో ప్రాఫిట్ నో లాస్ ప్రాతిపదికన మాస్కులు చేసిస్తున్నాం. పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు మేమే ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. సామాజిక బాధ్యతతో పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలనుకున్నాం. మా తొలి ప్రయత్నమే ఇలా సమాజసేవతో మొదలు కావడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఎండీ భవ్య. – వాకా మంజులారెడ్డి
వైద్య ప్రమాణాలతో మాస్క్
మేము తయారు చేస్తున్న త్రీ ప్లై మాస్క్‌లో మూడు పొరలుంటాయి. రెండువైపులా నీలం రంగు పొరల మధ్య తెల్లటి పొర ఉంటుంది. నాన్ వోవన్ మాస్కులు అలర్జీ కలిగించవు. గాలి హాయిగా ప్రసరిస్తుంది. ఈ మాస్క్ నీటిలో నానదు. నీటిని పోసినా కూడా నీరు కారకూడదు. ఫైర్ టెస్ట్ కూడా ఉంటుంది. కాల్చినప్పుడు మంట మాత్రమే రావాలి, పొగ రాకూడదు. మండేటప్పుడు గట్టిగా ఊదినా సరే ఆ గాలికి మంట ఆరిపోకూడదు. మాస్క్ మెటీరియల్ పూర్తిగా కాలిపోవాలి. ఈ వైద్యప్రమాణాలను పూర్తిగా పాటించి తయారు చేస్తున్నాం.
పరిశ్రమలో మాస్కుల తయారీని పర్యవేక్షిస్తున్న భవ్య, శ్రుతకీర్తి
కరోనాను తిప్పికొట్టాలి...
ఎస్‌బీ ఎకో మ్యాటిక్స్ సీఎండీ శ్రుతకీర్తి శాస్త్రీయ నాట్యకారిణి కూడా. ‘కరోనాను తిప్పికొట్టాలి... లోకానికి దివిటీ పట్టాలి’ అని సృజనాత్మకంగా తెలియచేశారు. ‘‘ప్రముఖ గాయని శోభారాజ్ గారు కరోనాను పారదోలుదామంటూ సొంతంగా పాట రాసి పాడారు. ఆ పాటకు నృత్యరూపాన్నిచ్చాను. ఒక మంచి విషయాన్ని సామాన్యులకు సులువుగా చేర్చే మాధ్యమం కళ మాత్రమే. సామాజిక సంక్లిష్టతలు ఎదురైనప్పుడు కళ ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మా కళాకారుల మీద ఉంటుంది’’ అన్నారు శ్రుతకీర్తి.
కరోనా పాట పాడుతున్న శోభారాజ్ పాటకు నాట్యం చేస్తున్న శ్రుతకీర్తి
Comments
Please login to add a commentAdd a comment