షీ ఐ మాధవి | Special Story About CI Madhavi In Family | Sakshi
Sakshi News home page

షీ ఐ మాధవి

Published Sat, Mar 14 2020 3:59 AM | Last Updated on Sat, Mar 14 2020 5:21 AM

Special Story About CI Madhavi In Family - Sakshi

‘జరిగిందంతా నాతో చెప్పడం మీకు ఇబ్బందిగా ఉంటే మా లేడీ కానిస్టేబుల్‌తో షేర్‌ చేసుకోవచ్చు’ అని చెప్తాడు లైంగిక బాధితురాలితో ఒక ఎస్సై. కోర్టులో ... ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టేలా డిఫెన్స్‌ లాయర్‌ ప్రశ్నలు అడుగుతూంటే..  ‘బాధితురాలు స్త్రీ.. కాస్త సున్నితంగా డీల్‌ చేయండి’ అంటూ అడ్డుపడుతుంది పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌. ‘సెక్షన్‌ 375’ సినిమాలోని దృశ్యాలవి. నిజంగా కూడా పోలీస్‌ శాఖ, జ్యుడీషియరీలోనూ ఇలా ఆలోచించే వాళ్లుంటే బాగుండు అనిపిస్తుంది.  లేరు అనడానిక్కూడా లేదు.. ఉన్నారు. కొంత మంది. వాళ్లలో వాసంశెట్టి మాధవి ఒకరు. తెలంగాణ, కరీంనగర్‌ జిల్లా, హుజురాబాద్‌లో సీఐగా పనిచేస్తున్నారు. 

ఫ్యామిలీ ఫంక్షన్స్‌కు, పేరంటాలు, పెళ్లిళ్లకూ  అందునా చీరలు కట్టుకుని అటెండ్‌ అయ్యే  వీలు చాలా తక్కువ. పట్టుచీరలు కట్టుకొని ఆ ఫంక్షన్స్‌కు అటెండ్‌ అయిన మహిళలను చూసి ‘అయ్యో.. నాలా యూనిఫామ్‌ వేసుకునే చాన్స్‌ వీళ్లకు లేదే’ అనుకుంటా.. నా యూనిఫామ్‌ పట్ల గౌరవం, నా పట్ల నాకు గర్వంగా అనిపిస్తుంది.

అమ్మాయిలు భద్రంగా ఉండాలంటే మగపిల్లల ఆలోచనలు ఆరోగ్యంగా ఉండాలి. అమ్మను, తోబుట్టువులను గౌరవించడం మగపిల్లలకు నేర్పించాలి. దీని బాధ్యత పేరెంట్స్, టీచర్స్‌దే. పిల్లలకు చదువొక్కటే కాదు లోకజ్ఞానమూ కావాలి. పాఠ్యపుస్తకాలతోపాటు ఇతర పుస్తకాలు, పేపర్‌ రీడింగ్‌ పిల్లలకు అలవాటు చేయాలి. వార్తలను టీవీల్లో, సోషల్‌ మీడియాలో ఫాలో అవడం కాదు కచ్చితంగా పత్రికలనే చదివేలా చూడాలి. పేపర్‌ అనే ఎందుకంటున్నానంటే.. పేపర్‌కున్న విశ్వసనీయత ఒక కారణమైతే.. అది చదివినప్పుడు మనలో ఒక రియాక్షన్‌ ఉంటుంది. అది ఇంకో కారణం.

నా 23 ఏళ్ల సర్వీస్‌లో ఎన్నడూ పశ్చాత్తాప పడ్డ సందర్భాలు లేవు. కేవలం పొట్టకూటి కోసమే ఈ ఉద్యోగంలో చేరా. డిగ్రీ అయిపోయాక బీఈడీ చేయాలనుకుంటున్నప్పుడు అప్పటికే ఎస్‌ఐ పోస్ట్‌ కోసం ప్రిపేర్‌ అవుతున్న మా అన్నయ్య.. ‘బీఈడీ అంటే ఇంకా రెండేళ్లు పడుతుంది. నా మాట విని ఎస్‌.ఐ. పోస్ట్‌’కి అప్లయ్‌ చెయ్‌’ అంటూ ఎంకరేజ్‌ చేశాడు. అలా అన్నయ్య, నేను ఇద్దరం ఒకే బ్యాచ్‌ లో ట్రైన్‌ అయ్యాం. ఉద్యోగంలో చేరినప్పటినుంచి నా పనికి న్యాయం చేసుకుంటూ పోతున్నా’ అని చెప్పారు మాధవి.

ఆ మూడు కేసులు..
‘ పదేళ్ల కిందట 26 ఏళ్ల యువతి మీద 45 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి చేశాడు. అప్పుడు నేను ఆ జ్యూరిస్‌ డిక్షన్‌లో లేను. పదేళ్ల తర్వాత అంటే ఇటీవలే ఆ కేస్‌ ట్రయల్స్‌కు వచ్చింది. ఇప్పుడది నా జ్యూరిస్‌ డిక్షన్‌. అయితే లైంగిక దాడి తర్వాత ఆ అమ్మాయి మానసికంగా, శారీరకంగా చాలా కుంగిపోయింది. జరిగిన సంఘటన అటుంచి, ఎవరినీ గుర్తుపట్టే స్థితిలో కూడా లేదు. ఆమెకు మానసిక చికిత్స అవసరమని, మానసికంగా కుదుట పడ్డాకే ట్రయల్స్‌ మొదలుపెట్టాలని కోర్టు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నాను. మూడు నెలల తర్వాత ఆమె కుదుట పడ్డాకే.. ట్రయల్స్‌కు వెళ్లాం. ఇక్కడ ఇంకో చిక్కు వచ్చిపడింది. నేను ఎదురుగా ఉంటేనే ధైర్యంగా మాట్లాడేది. నన్నూ అనుమతించమని కోరును అభ్యర్థించి మరీ ఆమెకు అండగా నిలబడ్డాను.

ఈ ప్రయత్నాలతో ఆమె తన మీద దాష్టీకం చేసిన వ్యక్తిని గుర్తుపట్టి.. జరిగిందంతా కోర్టుకు వివరించింది. ఆ నేరస్తుడికి పదేళ్లు శిక్ష పడింది. వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలనూ డీల్‌ చేసాను. సామాన్యుల నుంచి సమాజంలో పేరున్నవాళ్ల దాకా, కొత్త పెళ్లిజంటల నుంచి 40 ఏళ్లు కాపురం చేసిన వాళ్లదాకా ఎందరికో కౌన్సెలింగ్స్‌ ఇచ్చాను. పోలీస్‌స్టేషన్‌కు రావడం ఇష్టంలేని వాళ్ల ఇళ్లకు సివిల్‌ డ్రెస్‌లో వెళ్లి మరీ కౌన్సెలింగ్‌ చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఆస్తి లాక్కొని తిండి పెట్టక అమ్మానాన్నలను కష్టపెడ్తున్న పిల్లలనూ పిలిచి మాట్లాడి పెద్దవాళ్లకు పరిష్కారం చూపించిన కేసులు ఎన్నో. ఇలాంటి పట్టణాల్లో అంతగా కనపడవు కాని పల్లెల్లో అన్నీ అవే. రోజుకు ఒక్కటైనా వస్తుంది అలాంటి కేసు.

సవాళ్లు?
నేనైతే పెద్దగా ఎదుర్కోలేదు. అలాగని డిస్క్రిమినేషన్‌కు ఈ ఫీల్డేమీ మినహాయింపు కాదు. పనికి జెండర్‌ ఉండదు,  ఏ టాస్క్‌కైనా నేను  సిద్ధమే అని నిరూపించుకోవడానికి, ఆ కాన్ఫిడెన్స్‌ను బిల్డప్‌ చేయడానికి ఎంత కష్టపడ్డానో ఆ దేవుడికే తెలుసు. మహిళలమని మనకు మనమే రిజర్వేషన్స్‌పెట్టుకుంటే అవతలి వాళ్లు మనల్ని ఈక్వల్‌గా చూడరు అని నా ఉద్దేశం.  మన పనితీరే మనకు గౌరవాన్ని, గుర్తింపునిస్తుంది. నేను జాయిన్‌ అయిన కొత్తలో మగవాళ్లు ఎవరైనా ‘మాధవి ..లేడీ ఇన్‌స్పెక్టర్‌ అని పిలిస్తే ‘ఇన్‌స్పెక్టర్‌ అంటే ఇన్‌స్పెక్టర్‌... అంతే.. మగ, ఆడ అని ఉండదు కదా అని వాదించి వారికి వారికి నచ్పజెప్పేదాన్ని.


కుటుంబ సభ్యులతో మాధవి 

విమెన్‌  ఫ్రెండ్లీ పోలీస్‌...
మొన్న తొమ్మిదేళ్ల పాప మీద లైంగిక దాడి జరిగింది. సివిల్‌ డ్రెస్‌లో వెళ్లి.. ఓపిగ్గా ఆ పాపతో మాట్లాడితే విషయమంతా చెప్పింది. బహుశా నాలో వాళ్ల అమ్మనో.. అత్తనో.. పిన్నినో చూసుకొని ఉంటుంది. అదే నా స్థానంలో మేల్‌ ఆఫీసర్‌ ఉండుంటే ఆ పాప భయంతో బిగుసుకుపోయేదేమో! న్యాయం జరిగినా, జరగకపోయినా బాధితులు మహిళలే. ఈ నిజాన్ని గ్రహించేది, అర్థం చేసుకునేదీ మహిళలే. ఇన్‌స్టంట్‌గా న్యాయం అందించే అవకాశమూ ఉంటుంది. అందుకే పోలీస్‌డిపార్ట్‌మెంట్‌లోకి ఎంత వీలైతే అంత ఎక్కువ మంది మహిళలు రావాలి. బీటెక్‌లు చదివి ఏ కాల్‌సెంటర్‌లోనో పదివేలకు ఉద్యోగం చేసేకంటే పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లోకి వస్తే.. గౌరవానికి గౌరవం, సాటి మహిళల తరపున ఉన్నామనే గర్వం రెండూ మిగులుతాయి. తల్లిదండ్రులకు నేను రిక్వెస్ట్‌ చేసేది ఒకటే.. మీ ఆడపిల్లలను పోలీస్‌ జాబ్స్‌కి ఎంకరేజ్‌ చేయండి. భయపడాల్సిందేమీ లేదు. మీ అమ్మాయి ధైర్యంగా ఉండడమే కాక పదిమంది అమ్మాయిలకూ ధైర్యాన్నివ్వగలదు.

దిశ తర్వాత మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా చేపట్టిన  కార్యక్రమాలు..
ప్రత్యేకంగా ఏమీ చేపట్టలేదు కాని డయల్‌ 100 మీద విస్తృత ప్రచారం మాత్రం చేశాం.. చేస్తున్నాం. మహిళల నుంచి వచ్చిన, వస్తున్న స్పందన చూస్తుంటే ఆనందం, ఆశ్చర్యం రెండూ కలుగుతున్నాయి. తన కొడుకు స్కూల్‌కి వెళ్లకుండా మారాం చేస్తున్నాడు కాస్త వచ్చి పిల్లాడిని బుజ్జగించండి అని ఒక అమ్మ, తొమ్మిది నెలల నిండుతున్నా డెలివరీకి తల్లిగారింటికి పంపించట్లేదు.. కొంచెం మీరొచ్చి మా అత్తగారికి కౌన్సెలింగ్‌ ఇవ్వరా అంటూ ఓ గర్భిణీ కాల్‌ చేశారు. çసమస్య ఉంటే పోలీసులను సంప్రదించాలన్న అవగాహనైతే వచ్చింది అది చాలు’’ అని సంతోషపడుతున్నారు మాధవి.

కుటుంబ నేపథ్యం..
మేం ఆరుగురం అక్కచెల్లెళ్లం, మాకు ఇద్దరన్నదమ్ములు. మా నాన్నదీ పోలీస్‌ ఉద్యోగమే. నా పదేళ్లప్పుడే మా అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి అక్కాచెల్లెళ్లమే ఇంటి బాధ్యతలను చూసుకునేవాళ్లం. మా అక్కచెల్లెళ్లం మా అత్తగారింటి వాళ్లకు చెప్పిన మాటొక్కటే..‘మా అమ్మ బతికుంటే ఒకటే అమ్మ ఉండేది.. కాని ఇప్పుడు మాకు మేం ఆరుగురం అమ్మలమే’ అని. అందుకే ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అంటే గర్వపడండి. బాగా చదివించండి.. స్వశక్తి మీద నిలబడేలా పెంచండి. నా కుటుంబానికి వస్తే మా వారు మహేష్‌ బాబు కూడా ఇన్‌స్పెక్టరే. ఇద్దరు అబ్బాయిలు రుషి ఫణీంద్ర, మీరజ్‌ చంద్ర. నేను ఈ రోజు ఈ ఉద్యోగం హాయిగా చేసుకోగలుతున్నానంటే మా అత్తగారి సహకారం వల్లే. – సరస్వతి రమ ఫొటోలు .. అల్లె నరేందర్, సాక్షి, హుజురాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement