ఇటీవల సెల్‌ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. సెల్‌ఫోన్ కారణంగా మెదడుపై, శరీరభాగాలపై చెడు ప్రభావం ఉంటుందన్న అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దాంతో ఇది నిత్యం చర్చల్లో ఉండే ఒక (డిబేటబుల్) అంశం. ఇక సెల్‌ఫోన్ కారణంగా మన దేహంపై పడే దుష్ప్రభావాలపై ఇంకా చాలా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఆ దుష్ప్రభావాలు ఎక్కువ అన్న విషయం స్పష్టంగా ఇంకా తేలకపోయినా... దీనినుంచి రేడియేషన్ వెలువడుతుందన్నది నిర్వివాదాంశం. ఇక రేడియేషన్‌తో మనకు ప్రమాదమే అన్న విషయం కూడా తెలిసిందే. అందుకే సెల్‌ఫోన్ వాడటం తప్పనిసరిగా చేటు చేస్తుందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే... కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం అవసరమని వైద్యనిపుణులు, పరిశోధకులు/అధ్యయనవేత్తలు చెబుతుంటారు. ఆ జాగ్రత్తలివి...
- మీ మొబైల్‌ఫోన్ మీ శరీరానికి వీలైనంత దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. వీలైతే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి.
- సెల్‌ఫోన్‌ను షర్ట్ జేబులో గుండె దగ్గర, మన ప్రైవేట్ పార్ట్స్‌కు దగ్గరగా ఉండేలా ప్యాంట్ పాకెట్స్‌లో ఉంచడం అంత మంచిది కాదు. పౌచ్‌లో ఉంచడమే మంచిది. వీలైతే బ్రీఫ్‌కేసులు, హ్యాండ్‌బ్యాగులలో ఉంచడం ఇంకా బెటర్.
- సాధ్యమైనంత వరకు సెల్‌ఫోన్‌ను ఉపయోగించకుండానే పనులు జరిగేలా చూసుకోండి. మీటింగులు, కాన్ఫరెన్స్‌హాల్స్, దేవాలయాలు, ఆసుపత్రుల్లో తప్పనిసరిగా స్విచ్ ఆఫ్ చేయండి.
- పన్నెండేళ్ల లోపు పిల్లలను దీని నుంచి తప్పనిసరిగా దూరంగా ఉంచండి. అదనపు ఫీచర్లు ఉన్న సెల్‌ఫోన్‌లను పిల్లలు విపరీతంగా ఉపయోగిస్తుంటారు. పిల్లలకు గేమ్స్ ఆడటానికి కూడా సెల్‌ఫోన్ ఇవ్వకండి.
- ఎక్కువసేపు సంభాషణను కొనసాగించాల్సి వస్తే.. తప్పనిసరిగా ల్యాండ్‌లైన్‌నే ఉపయోగించాలి. ఇక సెల్‌ఫోన్‌లోనే ఎక్కువ సేపు కాల్ చేయాల్సి వస్తే తరచు ఫోన్‌ని కుడి చెవికి, ఎడమ చెవికి ఇలా మారుస్తుండాలి.
- సెల్‌ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నపుడు మాట్లాడడం ప్రమాదకరం.
- సెల్‌ఫోన్స్‌తో పోలిస్తే హెడ్ సెట్స్ నుంచి రేడియేషన్ వెలువడటం తక్కువ. అందుకే ఎక్కువసేపు మాట్లాడాల్సి వస్తే హెడ్‌ఫోన్స్ కూడా వాడటం మంచిదే.
- వినేటప్పుడు కంటే మాట్లాడేటప్పుడు మన ఫోన్ ఎక్కువ రేడియేషన్‌ను విడుదల చేస్తున్నట్టు గుర్తించారు. కాబట్టి ఎక్కువ వినడం, తక్కువ మాట్లాడడం కొంత మేలు.
- దేహంలోని మృదువైన కండరాలపై రేడియేషన్ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి హృదయానికి ఎదురుగానో, ఒళ్ళో పెట్టుకునో మాట్లాడడం వద్దు.
- ఏంటెన్నా క్యాప్స్, కీపాడ్ కవర్స్ వంటివి కనెక్షన్ నాణ్యతను తగ్గిస్తాయి. ఇది ఫోన్‌ను మరింత శక్తిమంతంగా పని చేసేందుకు ప్రేరేపిస్తుంది. తద్వారా రేడియేషన్ మరింత ఎక్కువగా విడుదలవుతుంది.
సెల్‌ఫోన్‌ను ఉపయోగించండిలా...
- సెల్‌ఫోన్‌ను అత్యవసర వినియోగానికి మాత్రమే పరిమితం చేయండి. మాట్లాడటం కంటే వాట్సాప్, మెసేజెస్ రూపంలోనే వీలైనంతవరకు ఎక్కువ సమాచారం పంపండి.
- సెల్‌ఫోన్ నెంబరును బాగా సన్నిహితులకు మాత్రమే ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా అనవసరమైన కాల్స్‌ను చాలావరకు తగ్గించుకోవచ్చు.
- పొద్దున్న లేవడానికి అలారంతో మొదలుపెట్టి రిమైండర్లు, ఆటలు, పాటలు, కాలిక్యులేటర్... ఇలా ప్రతిదానికీ సెల్‌ఫోన్ మీదే అతిగా ఆధారపడిపోవడం అడిక్షన్‌కు దారితీస్తుంది. కాబట్టి ఫోన్‌ను కేవలం సంభాషణలకు మాత్రమే పరిమితం చేయండి.
- ఎక్కువగా ఫోన్ వాడే అవసరం ఉన్నవాళ్ళు ఇంట్లో ల్యాండ్‌లైన్ కనెక్షన్ తీసుకోవడం మేలు. కనీసం ఇంట్లో ఉన్నపుడైనా సెల్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించవచ్చు.
- డ్రైవింగ్ చేస్తూ ఇయర్‌ఫోన్స్‌తోగాని మరే రకంగానూ సెల్‌ఫోన్ మాట్లాడకూడదని వ్యక్తిగతంగా దృఢమైన నిర్ణయం తీసుకోండి. అది ప్రాణానికి ప్రమాదం. అది చట్టరీత్యా నేరం కూడా. కాబట్టి వీలైనంత తక్కువగా మాట్లాడటం అన్నది మీ సెల్‌ఫోన్ వినియోగాన్ని పరిమితం చేస్తుంది. ఈ సూచనలు పాటించడం అన్నది మీ ఆరోగ్యమూ ఇటు మెడికల్‌గానూ, అటు సామాజికంగానూ చాలాకాలం బాగుండేలా చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment