పుస్తకాల గూడు కావాలా? | Special Story About Vinod Sridhar From Chennai | Sakshi
Sakshi News home page

పుస్తకాల గూడు కావాలా?

Published Mon, Jul 20 2020 12:01 AM | Last Updated on Mon, Jul 20 2020 12:01 AM

Special Story About Vinod Sridhar From Chennai - Sakshi

కాలానికి ఒక శ్రేయోభిలాషి వస్తాడు. ఈ కాలంలో వినోద్‌ శ్రీధర్‌కు మించిన శ్రేయోభిలాషి లేడు. చెన్నైలో ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు అతనికి ఫోన్‌ చేస్తున్నారు. మరుసటి రోజుకు వాళ్ల ముంగిట్లోకి అతడొక లైబ్రరీయే తీసుకొస్తున్నాడు. రెండేళ్ల క్రితం శ్రీధర్‌ ప్రారంభించిన ‘ప్రీలవ్డ్‌ బుక్స్‌ లైబ్రరీ’ ఈ లాక్‌డౌన్‌ కాలంలో గొప్ప ఊరటనిస్తోంది.

విజయలక్ష్మి అనే మహిళకు ఇద్దరు పిల్లలు. ఒకరు టెన్త్‌. ఒకరు ఇంటర్‌. ఇద్దరూ కాసేపు ఆన్‌లైన్‌ క్లాసులని కంప్యూటర్, ఫోన్‌ పట్టుకుంటున్నారు. అవి అయ్యాక వాళ్లు మళ్లీ గేమ్స్‌ కోసం వీడియోస్‌ కోసం మళ్లీ ఆ కంప్యూటర్, ఫోన్‌లో మునిగిపోతున్నారు. ‘ఇలా అయితే వీరు ఏం కాను?’ అని ఆమెకు బెంగ కలిగింది. మామూలు రోజుల్లో అయితే ఆటలో పాటలో ఫ్రెండ్స్‌తో బయట తిరగడమో ఏదో ఒకటి ఉంటుంది. ఈ లాక్‌డౌన్‌ వల్ల కదిలే పరిస్థితి లేదు. ఇంట్లో ఉంటే కుర్చీల్లో కూలబడి కంప్యూటర్‌కు అతుక్కుపోతే ఒళ్లు, బుర్ర రెండూ పాడైపోతాయి. ఆమెకు ఎవరో వినోద్‌ శ్రీధర్‌ గురించి చెప్పారు. అతడు చెన్నైలోని అశోక్‌ నగర్‌లో ‘ప్రీలవ్డ్‌ బుక్స్‌ లైబ్రరీ’ నడుపుతున్నాడు. అతనికి ఆమె ఫోన్‌ చేసింది.
ఆమె: మీరు మాకు ఎలా సాయం చేస్తారు?
వినోద్‌ శ్రీధర్‌: మీరు ఆరు వేల రూపాయలు కట్టి యాన్యువల్‌ మెంబర్‌షిప్‌ తీసుకోవాలి. మీకూ మీ పిల్లలకు ఏయే పుస్తకాలంటే ఆసక్తో, ఎటువంటి విషయాలంటే కుతూహలమో మేము తెలుసుకుంటాం. దానిని బట్టి మీ అభిరుచికి తగిన వంద పుస్తకాల ర్యాక్‌ను మీ హోమ్‌ లైబ్రరీగా మీ ఇంటికి తీసుకొచ్చి పెడతాం. మూడు నెలలలోపు మీరు ఆ పుస్తకాలను చదువుకోవచ్చు. మూడు నెలల తర్వాత కొత్త పుస్తకాలను పెడతాం. అలా సంవత్సరానికి నాలుగుసార్లు పెడతాం. 
ఆమె: మాకు అన్ని పుస్తకాలు అక్కర్లేదు. యాభై పుస్తకాల ర్యాక్‌ చాలు. ఇవ్వగలరా?
వినోద్‌ శ్రీధర్‌: అలా ఇప్పటిదాకా చేయలేదు. కాని ఆలోచిస్తాను.

వినోద్‌ శ్రీధర్‌ ఏరో స్పేస్‌ ఇంజనీరింగ్‌లో పట్టా తీసుకున్నాడు. అతడి తండ్రి ముప్పై ఏళ్లుగా పుస్తకాల స్టాల్‌ నడుపుతున్నాడు. కొడుకు ఆ వ్యాపారాన్ని అందుకుని ‘పుస్తకాలు కొనడానికి మన దగ్గరకు వచ్చే వారి కోసం ఎదురు చూసే కన్నా వారి ఇళ్లకే పుస్తకాలు చేరుద్దాం’ అని ‘ప్రీలవ్డ్‌ బుక్స్‌ లైబ్రరీ’ మొదలెట్టాడు. ఇందులో మన ఇంటికి తెచ్చి పెట్టే లైబ్రరీలో అన్ని కొత్త పుస్తకాలు ఉండవు. ఎవరో ఒకరు చదివినవి ఉంటాయి. మనం చదివాక మరో ఇంటికి వెళతాయి. ‘నాకు ఈ పని సంతృప్తిగా ఉంది’ అంటున్నాడు వినోద్‌. తన రోదసి విహారం కన్నా పాఠకులకు ఈ కాలంలో అవసరమైన కాల్పనిక విహారం అవసరమని భావిస్తున్నాడు.

వినోద్‌ శ్రీధర్‌కు కాఫీషాపుల నుంచి, కార్పొరెట్‌ సెంటర్స్‌ నుంచి కూడా లైబ్రరీ ఏర్పాటుకు ఆహ్వానాలు అందుతున్నాయి. కస్టమర్లు కాసేపు పుస్తకాలు తిరగేసేలా చేయడం మంచి విషయమే అని ఆయా వ్యాపార స్థలాల యజమానులు భావిస్తున్నారు. చెన్నైకే కాదు ప్రతి ఊరికి ఒక శ్రీధర్‌ ఉంటే పిల్లలు పెద్దలు పుస్తకాల ప్రియులుగా మారవచ్చు. పుస్తకాలు మంచిని చెబుతాయి. ఇది కూడా కరోనాను ఎదుర్కొనేందుకు ఒక రకమైన ఇమ్యూనిటీయే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement