చెరసాలలో కృష్ణుడిని కన్న దేవకికి అండగా వసుదేవుడున్నాడు! లాక్‌డౌన్‌లో పురుడు పోసుకున్న కొంతమంది తల్లులకు అండగా ఎవరూ లేరు.. వాళ్ల గుండె ధైర్యం, పేగు బలం తప్ప!! ఆ శక్తితోనే బిడ్డలకు జన్మనిచ్చారు .. చేయి పట్టుకొనే తోడెవరూ రాకపోయినా!! పసికూన ఏడుపు వినేంత దగ్గర్లోనే తనవాళ్లున్నారనే భరోసా లేకపోయినా!!
ప్రెగ్నెన్సీ గైడెన్స్‌ను గూగుల్ నుంచి తీసుకున్నా ప్రసవమప్పుడు మాత్రం తనవాళ్లు రావాల్సిందే. బిడ్డ ఏడుపు వినేంత దగ్గర్లో ఉన్నామనే భరోసా ఇవ్వాల్సిందే. కరోనా కర్ఫ్యూ ఆ భద్రత లేకుండా చేసింది. అయినా ధైర్యం వీడలేదు ఆ తల్లులు. పండంటి బిడ్డల్ని చూసుకొని పడిన కష్టాన్నంతా మరచిపోయారు.
ఆ సంఘటనలు కొన్ని..
స్వప్నిక కౌశిక్‌ది తమిళనాడు. ప్రైవేట్ ఉద్యోగిని. గర్భనిర్ధారణ జరిగినప్పటి నుంచీ ఆమె రక్తహీనతతో బాధపడింది. ఉద్యోగానికి సెలవు పెట్టి విశ్రాంతిలోనే ఉంది. ఎనిమిది నెలలు గడిచాయి. ఈలోపు లాక్‌డౌన్ ప్రకటించారు. దాంతో హడావిడిగా తన తల్లిగారి ఊరైన చెన్నైకి వెళ్లిపోయింది. ఫ్యామిలీ డాక్టర్‌కు చూపించుకుంది. మళ్లీ వారానికి వెళ్లేసరికి ఆ డాక్టర్‌కు కరోనా డ్యూటీ పడడంతో ఆమే వేరే డాక్టర్‌ను సూచించింది. ఆమె దగ్గర ఆ వారం చూపించుకోగానే ఆమే కరోనా డ్యూటీ చేయాల్సి రావడంతో ఇంకో డాక్టర్‌కు మారాల్సి వచ్చింది స్వప్నిక. ‘ఇదంతా నరకంగా ఉండేది నాకు. మాటిమాటికీ డాక్టర్‌ను మార్చాల్సి రావడం, క్లినిక్‌కు వెళ్లే చాన్స్ లేకపోవడంతో ఫోన్‌లోనే మారిన డాక్టర్లందరికీ నా హిస్టరీ చెప్పడం, వాళ్లు అర్థం చేసుకొని ట్రీట్ చేసేలోపు మళ్లీ వాళ్లు మారడం.. ఎంత టెన్షన్ పడ్డానో దేవుడికే తెలుసు. ఒక్కోసారి డెలివరీ అయినా సవ్యం గా జరిగేనా అని భయమేసేది. అన్నట్టుగానే నా డెలివరీ టైమ్‌కి కరోనా కేసులు ఎక్కువయ్యాయి చెన్నైలో. పెద్దవాళ్లు త్వరగా ఇన్‌ఫెక్ట్ అవుతారని అమ్మ లేకుండానే హాస్పిటల్‌కు వెళ్లా. లాక్‌డౌన్‌తో మా వారూ రాలేకపోయారు. నాకు నేను చెప్పుకున్న ధైర్యమే ఆ గండం గట్టెక్కేలా చేసింది. ఈ పసిదాన్ని చూడగానే నా బాధంతా ఎగిరిపోయింది’ అని చెప్తుంది స్వప్నిక కూతుర్ని ముద్దాడుతూ.
వలస కూలీకి అటెండెంట్‌గా..
డాక్టర్ అనిత గౌర.. కర్ణాటకలోని కలబురగి(గుల్బర్గా) ఎమ్‌ఆర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో స్త్రీ వైద్యనిపుణులుగా పనిచేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ ప్రకటించేనాటికి నిండు చూలాలు. ఆమె భర్త రాజీవ్ కొనిన్ హృద్రోగనిపుణులు. కరోనా డ్యూటీలో ఉన్నాడు. దాంతో డెలివరీ కోసమని అమ్మ దగ్గరకు వెళ్లింది అనిత. అమ్మ అన్నపూర్ణ గౌర కూడా డాక్టరే. లాక్‌డౌన్ వల్ల ఎవరూ తోడులేక ప్రసవవేదనతో ఆసుపత్రి చేరిన గర్భిణీలకు తల్లీ, తోబుట్టువూ తామై డెలివరీ చేశారు ఈ అమ్మాకూతుళ్లు. ‘అమ్మ దగ్గరకు వస్తున్న పేషంట్లను చూస్తూంటే రెస్ట్ తీసుకోవాలన్న ఆలోచనే రాలేదు. నొప్పులతో వచ్చిన ఎవరినీ వెనక్కిపంపలేదు. వాళ్లలో వలస కూలీలూ ఉన్నారు. వరుసగా నాలుగు డెలివరీలు చేసిన రాత్రులూ ఉన్నాయి. ‘అలా నేను బిడ్డను కనే ముందు రోజు వరకూ డెలివరీలు చేశాను’ అంటూ చేతుల్లో ఉన్న తన బిడ్డను గుండెకు హత్తుకుంది డాక్టర్ అనితా గౌర. ఏప్రిల్ 20న ఆమెకు కూతురు పుట్టింది. అనిత పురిటినొప్పులు పడుతున్న సమయంలో ఆమె తల్లి అన్నపూర్ణ ఓ మహిళా వలస కూలీకి డెలివరీ చేస్తోంది.
పది కిలోమీటర్లు నడవలేక..
ఒడిశాలోని కలహండి కరువుకు కేరాఫ్. కరోనా లాక్‌డౌన్‌తో ఆ గిరిజన ప్రాంతానికి అందే అత్యవసరాలకూ చెక్ పడింది. ఇక్కడి కెర్పై గ్రామంలో గర్భిణీలు, చిన్నపిల్లలకు మందులు, టీకాలు లేవు. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీలు కెర్పై నుంచి ఆరోగ్యకేంద్రం ఉన్న ఊరికి బస్సు అందుకోవాలంటే పదికిలోమీటర్లు నడవాలి. వెళ్లలేక ఇళ్లల్లోనే ప్రసవించారు. ఆ గిరిజన తల్లుల పేగుబలమే ఆ బిడ్డల్ని బతికించింది. ఈ విషయం తెలిసిన అక్కడి స్వచ్ఛంద సేవా కార్యకర్తలు కొందరు ‘మందులు, ఆహారపదార్థాలను హోమ్ డెలివరీ చేద్దామన్నా రవాణా సౌకర్యాలు అందుబాటులో లేవు. దాంతో నిస్సహాయంగా ఉండిపోతున్నాం’ అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment