ఇష్టం లేని ఫొటోను దాచేస్తాం. దాచడం కూడా ఇష్టం లేని ఫొటోను? చింపేస్తాం. పెళ్లి ఫొటోలో తనతో పాటు తన చదువూ ఉండాలనుకుంది గీతాంజలి. వీలవలేదు. పెళ్లయ్యాక తన ఫ్యామిలీ ఫొటోలోనైనా తన చదువు ఉండాలనుకుంది. కుదరలేదు. మొత్తం ఫొటోను చింపేయలేదు కదా. అందుకని భర్త, పిల్లల మధ్యలోంచి తనను మాత్రం తొలగించుకుంది. చావులోనైనా చదువుతో కలిసి ఉండాలనుకుందేమో ఫొటోలోంచి వెళ్లిపోయింది!
పెద్ద చదువులు, పెద్ద డిగ్రీలు అందరికీ కుదరవు. ఆడపిల్లకు అసలే కుదరవు. ఎంత సంపన్నుల పిల్లకైనా.. డిగ్రీలోనో, ఇంటర్‌లోనో, దురదృష్టం పెళ్లి పెద్దలా నెత్తిమీద కూర్చుంటే మరీ టెన్త్‌కే.. పెళ్లడ్డు పడుతుంది ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీలా! మళ్లొచ్చి చదవడానికి ఉండదు. ఆలీబాబా నలభై దొంగల రాతి గుహకు ఉండే మాయాద్వారం మూతపడినట్లుగా క్లాస్ బుక్స్ అన్నీ మూతపడి ఉంటాయి, తెల్లారే లేచి చూస్తే. వాటిని తెరవడానికి పాస్‌వర్డ్ కావాలి. ఇంకెక్కడ ఉంటుంది! పెళ్లి రోజే వేళ్లతో నీళ్ల బిందెలోని ఉంగరాన్ని వెతుకుతున్నప్పుడే పెళ్లికొడుకు ఉదారంగా బిందె లోపలి ఉంగరాన్ని పెళ్లికూతురు చేతికి చిక్కనిచ్చి, ఆమె వేలికి కలిపించకుండా ఉండే మహిమ గల చదువు ఉంగరాన్ని ఒడుపుగా లాగేసుకుంటాడు. అప్పట్నుంచీ ఆమె వేళ్లకు, చేతులకు ఇంటి పనే అలంకరణ! చదువు పూర్తి చేయకపోయినా చేతికి వచ్చిన ‘గృహిణి’ అనే డిగ్రీ సర్టిఫికెట్‌తోనే ఆమె జీవితం నడుస్తుంది, గడుస్తుంది. జీవితాంతం వరకు. అది ఆమె కోరుకోని డిగ్రీ. కోరుకోనిదైనా కాన్వొకేషన్ కోటు, హ్యాటూ పెట్టుకుని, పట్టలేని సంతోషంతో గాలిలోకి కాళ్లు ఒకవైపుకు లేపి ఎగురుతున్నట్లుగా పెళ్లి పీటలపై బలవంతపు ఫొటో తీయించుకోవలసిందే. వెడ్డింగ్ విషెస్ తలంబ్రాల్లా వచ్చి తలపైన, ముఖం మీద, కంట్లో పడుతుంటాయి. ‘పెళ్లొద్దు నాన్నా.. చదువుకుంటాను నాన్నా’ అని ఇంకా ఏడుస్తూనే ఉన్న ఆ కళ్లు ఎవరికి కనిపిస్తాయి.. పక్కనే కూర్చొని కళ్లలోకే చూస్తున్న పెళ్లికొడుక్కే కనిపించకపోతే!
‘పెళ్లొద్దు నాన్నా, చదువుకుంటాను నాన్నా’అని పదేళ్ల క్రితం గీతాంజలి కూడా ఏడ్చింది. లైఫ్‌లో చాలా ఎత్తుకు ఎదగాలనుకుంది తను. ఐపీఎస్ చేయాలనుకుంది. పదహారేళ్లు తనకి. తల్లి ఒడిలో కూర్చొని అప్పటి వరకు టెన్త్ హోమ్ వర్క్ చేసుకున్న ఆ చిన్నారి.. ఇంటర్‌లో చేరగానే ఒక్కసారిగా ఎదిగిన పిల్లలా కనిపించింది తండ్రికి. భయపడిపోయాడు. పెళ్లి చేసేయాలని తొందరపడ్డాడు. చేసేశాడు. గీతాంజలికి ఇప్పుడు ఇరవై ఆరేళ్లు. ఇద్దరు పిల్లలు. పెళ్లవకుండా ఉంటే ఇప్పటికీ తనూ ఒక పిల్లే. పెద్ద పిల్ల. ఐపీఎస్‌గా సెలక్టయ్యో, ఐపీఎస్‌కీ ప్రిపేర్ అవుతూనో ఉండేది. ఇప్పుడు కూడా ఎస్సై ఉద్యోగానికి ప్రిపేర్ అవుతూనే ఉంది. శనివారం ఆత్మహత్య చేసుకుంది! భర్త మహారాష్ట్రలో లెక్చరర్. వచ్చిపోతుంటాడు. తను, పిల్లలు హైదరాబాద్‌లో ఉంటారు. సంక్రాంతి పండక్కి అమ్మావాళ్లింటికి ఆదిలాబాద్ వెళ్లొచ్చింది. శుక్రవారం వచ్చింది. శనివారం ఉరేసుకుంది. పిల్లల్ని అనాథల్ని చేసి వెళ్లిపోయింది. పిల్లల్నేనా? తను కన్న కలల్ని, తను అల్లుకున్న ఆశల్ని, తను ఏర్పరచుకున్న ఆశయాల్ని.. అన్నిటినీ అనాథల్ని చేసింది. ఇంట్లో ఫ్యాన్‌కి వేలాడుతున్న ఆమె కాళ్లను.. పెళ్లి, పిల్లలు, సంసారం కన్నా ఎక్కువ అనుకున్న ఆమె కలలు, ఆశలు, ఆశయాలు.. ‘అమ్మా.. అమ్మా..’ అని చుట్టేసుకుని రోదిస్తున్న దృశ్యాన్ని ఊహించండి. ఏడు పేజీల సూసైడ్ నోట్ రాసింది గీతాంజలి. అది చదివి ఆమె తల్లిదండ్రుల గుండెలు బద్దలైపోయి ఉంటాయి. పదేళ్ల క్రితం పెళ్లి రోజు కూతురు చదువుతూ చదువుతూ పుట్టింట్లో వదిలేసి వెళ్లిన ఆఖరి టెక్స్ బుక్ వాళ్లకు గుర్తొచ్చే ఉంటుంది. గీతాంజలి మృతదేహాన్ని చూసి గీతాంజలి భర్త అపరాధభావంతో కుమిలిపోతూ ఉండుంటాడు. ‘కాస్త పిల్లల్ని పట్టుకోండి, ఈ ఇంపార్టెంట్ క్వొశ్చన్ ఒక్కటీ పూర్తి చేసేస్తాను’ అన్నప్పుడు.. ‘అవసరమా గీతా.. నేను చేయకపోతే కదా నీకు ఉద్యోగం’ అని తను విసుక్కుని ఉంటే అది అతడికి గుర్తుకు వచ్చే ఉంటుంది.
‘ఏడ్వని రోజు లేదు. అందుకే వెళ్లిపోతున్నా’ అని సూసైడ్ నోట్‌లో రాసింది గీతాంజలి. ‘ఆడపిల్లల మనసు అర్థం చేసుకోండి’ అని రాసింది. ‘పెళ్లొద్దంటే చేయకండి’, ‘వద్దన్న పెళ్లి చెయ్యకండి’ అని రాసింది.‘కలామ్ మాటల్ని ఆదర్శంగా తీసుకుని ఎన్నో కలలు కన్నాను. నా కలలు కలలుగానే ఉండిపోయాయి’ అని రాసింది. ‘పెద్ద చదువులు చదవాలనుకున్నాను. పెద్ద ఉద్యోగం సంపాదించాలనుకున్నాను. అంత పెద్ద చదువుతో, అంత పెద్ద ఉద్యోగంతో.. నా భర్త పక్కన తిరగాలనుకున్నాను. కానీ నాన్న, నా పెళ్లి చేసి పంపించేశాడు. ఇంటర్‌తోనే నా చదువు ఆగిపోయింది. కోరుకున్న జీవితం దక్కలేదు. ఇంతకుమించి జీవితంలో కోల్పోడానికి ఏముంటుంది?’ అని రాసింది. ‘తల్లిదండ్రులూ.. చిన్నప్పుడే మీ పిల్లలకు పెళ్లిళ్లు చెయ్యకండి’ అని రాసింది. ‘మామయ్యా.. నా పిల్లల్ని బాగా చదివించండి’ అని రాసింది. ‘బిట్టు, సాయి.. బాగా చదువుకోండి’ అని రాసింది. ఉత్తరంపై ఎన్ని కన్నీటి చుక్కల మరకలు ఉన్నాయో తెలియదు కానీ, ఉత్తరం చివర్న గీతాంజలి తన పేరును ఎలా రాసుకుందీ చదివితే ఎంతటివారికైనా దుఃఖం కట్టలు తెంచుకుంటుంది. ‘గీతాంజలి, ఐపీఎస్’ అని రాసుకుంది గీతాంజలి!!
కష్టపడి చదివి సాధించుకున్న డిగ్రీని పేరు పక్కన పెట్టుకుంటే పేరుకు వాల్యూ ఉంటుంది. గొప్పగా, గౌరవంగా ఉంటుంది. ఏ రంగంలోని ప్రసిద్ధతనైనా పరిపూర్ణం చేసే ‘తగిలింపు’.. చదువు టైటిల్! కేవీరెడ్డి బి.ఎ., కిరణ్ బేడీ ఐపీఎస్. ఒక కంప్లీట్‌నెస్! అందుకేనేమో గీతాంజలి కనీసం చావులోనైనా చదువుతో కలిసి ఉండాలని కోరుకున్నట్లుంది. ఉన్న కుటుంబంతో కలిసి జీవించాలన్న కోరిక కన్నా, లేని చదువుతో కలిసి మరణించాలని అనుకున్నట్లుంది. పెట్టుకోడానికి తన పేరు పక్కన ‘ఐపీఎస్’ అని పెట్టుకున్నా.. ఐపీఎస్‌కే తన పేరును టైటిల్‌గా పెట్టి వెళ్లిపోయింది. అందుకే ఆమె గీతాంజలి, ఐపీఎస్ కాదు. ఐపీఎస్, గీతాంజలి. ఎంత గౌరవం తెచ్చిపెట్టింది చదువుకు ఈ అమ్మాయి!
కానీ.. చేసింది ఏం మంచి పని! చదివితే వచ్చే క్వాలిఫికేషన్‌కు, ఉద్యోగం చేస్తే వచ్చే శాటిస్‌ఫాక్షన్‌కు ‘గృహిణి’ అనే డిగ్రీ, ‘గృహిణి’ అనే జాబ్.. సమానం కాకపోవచ్చు. అసలది డిగ్రీ, అసలది జాబ్ ఎలా అవుతుందనీ అనిపించవచ్చు. కష్టపడి చదివి సంపాదించిన డిగ్రీకి ఎంత విలువ ఉంటుందో, చదవాలని ఆశ ఉండీ చదివే అవకాశం లేకపోయిన డిగ్రీకీ అంతే విలువ ఉంటుంది. అయినా ప్రాణ సమానంగా ప్రేమించిన చదువు కోసం ప్రాణాన్నే తీసేసు కుంటే చదువుకు ఏం విలువ ఇచ్చినట్లనే ఆలోచన ఆఖరి నిముషంలోనైనా గీతాంజలిలో కలిగి ఉంటే ఎంత బాగుండేది!
∙మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment