రండి... రండి... రండి... దయచేయండి. మా ఇంట్లో టీ మధురం సుమండీ! సూటీ చినుకుల కాలం ఇదండీ! ‘దశ’దిశలు అదిరేటీతో జవాబు చెప్పండి.
డీటాక్స్ టీ
కావలసినవి: అల్లం తురుము – పావు కప్పు; నిమ్మరసం – ఒకటిన్నర టీ స్పూన్లు; లవంగాలు – 4; దాల్చిన చెక్క పొడి – ఒకటిన్నర టీ స్పూన్లు; లెమన్ గ్రాస్ తరుగు – పావు కప్పు; తులసి ఆకుల తరుగు – ఒక టేబుల్ స్పూన్; తేనె – 2 టేబుల్ స్పూన్లు
తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో నాలుగున్నర కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించాలి ∙తేనె మినహా మిగతా పదార్థాలను మరుగుతున్న నీటిలో వేసి బాగా కలిపి మరోమారు మరిగించాలి ∙తయారైన టీని నాలుగు కప్పులలోకి సమానంగా వడబోయాలి ∙ఒక్కో కప్పులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా కలిపి వేడివేడిగా అందించాలి.
పుదీనా గ్రీన్ టీ
కావలసినవి:సన్నగా తరిగిన పుదీనా – టేబుల్ స్పూన్; గ్రీన్ టీ బ్యాగ్ – 1; తేనె – టీ స్పూన్; నిమ్మ రసం – అర టీ స్పూను
తయారీ: ఒక కప్పులో బాగా మరిగిన వేడి నీళ్లు పోసి, గ్రీన్ టీ బ్యాగ్ వేసి కొద్దిసేపు ఉంచి టీ బ్యాగ్ తీసేయాలి ∙పుదీనా ఆకులు, తేనె, నిమ్మ రసం జత చేసి కలిపి వేడివేడిగా వెంటనే అందించాలి.
మష్రూమ్ టీ
కావలసినవి:సన్నగా తరిగిన మష్రూమ్స్ – అర కప్పు; ఉప్పు – చిటికెడు; మిరియాల పొడి – పావు టీ స్పూన్; బటర్ – టీ స్పూను
తయారీ: స్టౌ మీద బాణలిలో బటర్ వేసి కరిగాక మష్రూమ్స్ జత చేసి సుమారు ఐదు నిమిషాల పాటు అవి గోధుమరంగులోకి మారేవరకు వేయించాలి ∙రెండు కప్పుల నీళ్లు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి సుమారు ఐదు నిమిషాల పాటు మరిగించి దింపేయాలి వడపోసి కప్పులలో వెంటనే వేడివేడిగా అందించాలి.
హెర్బల్ కెఫెన్ ఫ్రీ టీ మసాలా టీ
కావలసినవి:చాయ్ మసాలా – అర టీ స్పూన్; టీ పొడి – 2 టేబుల్ స్పూన్లు; పంచదార – 4 టేబుల్ స్పూన్లు; లెమన్ గ్రాస్ – 2 కట్టలు (సూపర్ మార్కెట్‌లో దొరుకుతాయి); అల్లం తురుము – అర టీ స్పూన్; పాలు – 2 కప్పులు;
తయారీ: ఒక పాత్రలో రెండు కప్పుల నీళ్లు, టీ పొడి, పంచదార, లెమన్ గ్రాస్, అల్లం తురుము, చాయ్ మసాలా వేసి స్టౌ మీద ఉంచి, రెండు నిమిషాల పాటు మరిగించాలి ∙పాలు జత చేసి మరోమారు మరిగించాలి ∙టీ వడ పోసి కప్పులలో వేడివేడిగా అందించాలి.
ఆపిల్ టీ
కావలసినవి: ఆపిల్ తురుము – ఒక కప్పు; పంచదార – 2 టేబుల్ స్పూన్లు; నిమ్మరసం – అర టేబుల్ స్పూన్; గ్రీన్ టీ బ్యాగ్స్ – 2; దాల్చిన చెక్క ముక్కలు – 2 (చిన్నవి)
తయారీ: పాత్రలో మూడు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి ∙ఆపిల్ తురుము, పంచదార, నిమ్మ రసం జత చేసి బాగా కలిపి మంట తగ్గించి, సుమారు ఐదు నిమిషాలు మరిగించాలి. (మధ్యమధ్యలో కలుపుతుండాలి) ∙రెండు టీ బ్యాగ్‌లు, దాల్చిన చెక్క ముక్కలు వేసి బాగా కలిపి స్టౌ మీద నుంచి దింపి, మూత పెట్టి, పావు గంట సేపు పక్కన ఉంచాలి ∙బాగా చల్లారాక వడపోసి, ఆపిల్ స్లైస్ వేసి, చల్లగా అందించాలి.
టీ సంగారియా
కావలసినవి: టీ డికాక్షన్ – అర కప్పు; ఆపిల్ జ్యూస్ – 5 కప్పులు; నిమ్మ రసం – 8 టీ స్పూన్లు; పొడి చేసిన ఐస్ – 2 కప్పులు; పండ్ల ముక్కలు – కొద్దిగా
తయారీ: ఒక పాత్రలో టీ డికాక్షన్, ఆపిల్ జ్యూస్, నిమ్మ రసం పోసి గరిటెతో బాగా కలపాలి ∙ఐస్ పొడి, పండ్ల ముక్కలు జతచేసి, గ్లాసులలో పోసి చల్లగా అందించాలి.
ఫ్రూటీ ఐస్డ్ టీ
కావలసినవి: రెడీమేడ్ ఆరెంజ్ జ్యూస్ – కప్పు; టీ బ్యాగ్స్ – 2; పంచదార – 4 టేబుల్ స్పూన్లు; ఐస్ క్యూబ్స్ – 16
తయారీ: ఒక పాత్రలో ఒక కప్పుడు నీళ్లు పోసి మరిగించాలి ∙పంచదార, టీ బ్యాగ్స్ జత చేసి మరో రెండు నిమిషాలు మరిగించాలి. (మధ్యమధ్యలో కలుపుతుం డాలి) ∙టీను చల్లారబెట్టి టీ బ్యాగుల్ తీసేయాలి ∙బాగా చల్లారాక ఆరెంజ్ జ్యూస్, ఒక కప్పు నీళ్లు జత చేసి బాగా కలిపి, నాలుగు కప్పులలోకి సమానంగా పోయాలి ∙ఒక్కో కప్పులో నాలుగు ఐస్ క్యూబ్స్ వేసి అందించాలి. పుదీనా ఆకులతో గార్నిష్ చేయచ్చు.
హనీ జింజర్ టీ
కావలసినవి: నిమ్మ కాయ – 1; సన్నగా తరిగిన అల్లం ముక్కలు – ఒక టేబుల్ స్పూన్; మరిగించిన నీళ్లు – 2 కప్పులు; తేనె – ఒక టీ స్పూను
తయారీ: ∙నిమ్మ కాయను శుభ్రంగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ∙ఒక చిన్న పాత్రలో నిమ్మ కాయ ముక్కలు, అల్లం ముక్కలు వేయాలి ∙మరిగించిన నీళ్లు పోసి కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి ∙కొద్దిగా చల్లారాక తేనె జత చేసి కప్పులలో అందించాలి.
ఏలకుల టీ
కావలసినవి: టీ పొడి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; పంచదార – రెండున్నర టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – ఒక టీ స్పూన్; పాలు – ఒక కప్పు
తయారీ: ∙ఒక పాత్రలో ఒక కప్పు నీళ్లు, టీ పొడి, పంచదార, ఏలకుల పొడి వేసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙పాలు జత చేసి మధ్యమధ్యలో కలుపుతూ కొద్ది సేపు మరిగించి దింపేయాలి ∙కప్పులలోకి వడబోసి వేడివేడిగా అందించాలి.
చాయ్.. ఎంజాయ్
మానవుని ఆహార విహారాల యొక్క స్వరూప స్వభావాలు ఆయా ప్రాంతాల సంస్కృతులపై ఆధారపడి ఉంటాయి. సాంకేతిక విప్లవాల నేపథ్యంలో వివిధ ప్రాంతాల లేదా దేశాల మధ్య సమాచార సందేశాలు పెరుగుతూ వస్తున్నాయి. నేటి కరవాణి (సెల్ ఫోన్) యుగంలో ఇవి తృటి కాలంలో సంభవిస్తున్నాయి. ప్రాచీన సంస్కృతికి ప్రతీకౖయెన భారతదేశంలో శారీరక, మానసిక సామాజిక ఆరోగ్య విషయాలే ప్రధాన పాత్ర పోషించాయి కాని, తాత్కాలిక ఉత్ప్రేరకాలు, ఉత్తేజకాల వంటి అన్నపానీయాలకు ప్రాముఖ్యత తక్కువ. ‘టీ’ చరిత్రను పరిశీలిస్తే ఇది మన దేశానికి 16, 17 శతాబ్దాలలోనే దిగుమతి అయిన దాఖలాలు ఉన్నాయి. మన పొరుగు దేశమైన చైనా దీనికి కాణాచి. క్రీ.పూ. 59వ శతాబ్దంలో ‘టీ’ చైనా దేÔ¶ స్థుల కంటబడింది. అనంతరం దక్షిణ, తూర్పు ఆసియా ప్రాంతాలకు వ్యాపించింది. 200 సంవత్సరాల కిత్రం బ్రిటిష్ వారు కూడా గ్రహించారు. దీని సేవనను అలవాటు చేసుకోవడంతో బాటు వ్యాపార వస్తువుగా మార్చి పారేశారు.
‘టీ’ అంటే?
ఇది ఒక వెచ్చని లేదా వేడివేడి ద్రవ పదార్థంగా జగద్విదితం. ‘కేమిల్లియా సెనిన్సిస్’ అనే పేరు గల తక్కువ ఎత్తుగా పెరిగే పొదల నుండి సేకరించిన ‘ఆకులు’ నీళ్లకు జోడిస్తే కనిపించే రూపమే ‘టీ’ నామధేయంతో ప్రాచుర్యం పొందింది. రూపాంతరాలలో ‘తేనీరు, తేయాకు’లుగా వ్యవహరిస్తున్నాం. ఈ తేనీటిని చైనా భాషలో ‘చా’ అంటారు. అది పారశీకులకు వ్యాపించిన పిదప ‘చాయ్’ గా మారింది.
టీ ఆకుల స్వరూపం: వాస్తవానికి ఈ ఆకులు ‘ఆకు పచ్చ’ రంగులో ఉంటాయి. చెట్టు లేదా పొదల నుండి వేరు చేయగానే కొంచెం వంగుతాయి. బయటì ఆక్సిజన్ సంయోగం లేనంత వరకు తెలుపు రంగులో ఉంటాయి. మరి కొంత కాలవ్యవధిలో పసుపు పచ్చగా ఉంటూ, ఆకులు వంకరలు తగ్గుతాయి. ఆక్సిజన్‌ను పూర్తిగా గ్రహించిన ఆకులు నల్లబతాయి. వీటి నుండి ‘టీ’ పొడిని తయారుచేస్తారు. తక్కువ గరకుగాను, ఎక్కువ గరకుతోను, చిన్నపాటి ముక్కలుగాను తయారుచేయడం పరిపాటి. తయారీ విధానాలలోని మార్పుల వల్ల... మనకు లభించే టీ పొడి ‘తెలుపు, పసుపు పచ్చ, ఆకు పచ్చ, నలుపు’ రంగులుగా కనపడుతుంది.హెర్బల్ టీ అంటే? పైన చెప్పిన టీ ఆకులకు సంబంధం లేని వేరే వృక్షాల యొక్క ఫలాలు (రోజ్ హిప్), పువ్వులు (చమో మిల్), ఆకులు (రూయ్ బస్)... వీటిని నానబెట్టడం వంటి కొన్ని ప్రక్రియల ద్వారా తయారుచేస్తారు.
‘టీ’ని ఎలా తయారుచేస్తారు?
ఇది చాలా సులభమైన ఆచారంగా ఉండేది. కావలసిన పరిమాణంలో టీ పొడిని తీసుకొని, వెచ్చని లేదా వేడివేడి నీటిని తగినంత కలిపి, ఓ పది నిమిషాలు ఆగి వడబోస్తే టీ తయారవుతుంది. దాని సాంద్రతను బట్టి పలుచగాను, చిక్కగాను, లేత గులాబీ రంగులోను, కొంచెం నలుపు ఎరుపు రంగులలోను దర్శనమిస్తుంది. మొదట్లో ఇలాంటి టీ (తేనీటి)ని తాగే అలవాటుండేది. ఇప్పటికీ చాలా విదేశాల్లో ఇలాగే సేవిస్తున్నారు.
క్రమేణా ప్రాంతీయ ఆచారాలను బట్టి ఈ నీటికి పాలు, పంచదార కలిపారు. తాగేవారి రుచులు కొత్తదనాన్ని వెతుకుతూ... ఏలకుల వంటి సుగంధ ద్రవ్యాలను చేర్చడం మొదలుపెట్టారు. అదేవిధంగా అల్లం లేదా శొంఠి వంటివి కూడా జత కూడాయి. ఈ విధంగా ‘మసాలా టీ’ అనే పేరు కూడా వ్యాపార అభివృద్ధికి దోహదపడింది. ముందుగా టీ డికాక్షన్ తయారుచేసి చివరలో పాలు, శర్కర (పంచదార) కలపడం ఒక పద్ధతైతే, తయారీకి కావలసిన అన్ని పదార్థాలను ఒక్కసారే కలిపి మరిగించడం, వడగట్టి త్రాగటం మరొక విధానం. అవసరాలకు, ఆరోగ్యాలకు అనుగుణంగా కేవలం పలుచటి, నల్లటి టీ తాగేవారు, పాలు పంచదార కలిపి తాగేవారు, బెల్లం కూడా కలుపుకునే వారు, నల్లటి లేదా లేత గులాబీ కషాయానికి తేనె, నిమ్మ రసం కలిపి, రెండు మూడు పుదీనా ఆకులు జోడించి తాగేవారు... రకరకాలుగా ఉన్నారు. అలాగే పైన చెప్పిన ‘హెర్బల్’ టీ పొడిని సేకరించి దానిని ‘టీ’ గా చేసుకుని తాగేవారు చాలామంది ఉన్నారు.
టీ గుణధర్మాలు:
తేయాకులో తక్కువ శాతంలో ‘కెఫిన్’ అనే పదార్థం ఉటుంది. (కాఫీలో అధికంగా ఉంటుంది). ‘టీ’ లో ధియోఫిల్లిన్ అనే రసాయనిక పదార్థం అధికంగా ఉంటుంది. ఇది వాయునాళాలను వ్యాకోపింప చేసి శ్వాసక్రియను సాఫీగా చేస్తుంది. కాబట్టి ఉబ్బస రోగానికి మంచిది. వాస్తవానికి ‘టీ’ లో పోషక విలువలు శూన్యమనే చెప్పాలి. కేవలం ఔషధ విలువలే హెచ్చు. అలసిపోయిన శరీర కణాలకు, మెదడుకు తక్షణ తాత్కాలిక ఉత్తేజం కలిగించి, హుషారుగా ఉంచుతుంది. ఆకు పచ్చ, నలుపు రంగుల తేయాకులకు క్యాన్సరుని తగ్గించే గుణం ఉన్నట్లు పరిశోధనలు వెల్లడి చేస్తున్నాయి. తేయాకులోని ‘పోలిఫినాల్స్’ వల్ల దానికి కొంచెం చేదు రుచి వచ్చింది.
తేయాకులు కూడా వాతావరణ కాలుష్యానికి బలైపోతున్నాయి. అసలు గుణాలు తగ్గి, ‘ఫ్లోరైడ్ మరియు అల్యూమినియం’ ఆధిపత్యం చూపి దేహానికి హాని కలిగిస్తున్నాయి. మిగిలిన ఆరోగ్య ప్రయోజనాలన్నీ దాంట్లో చేర్చే ఇతర ద్రవ్యాలను బట్టి ఉంటాయి. తేనె బలకరం, నిమ్మ రసం పుష్టికరం, అల్లం శొంఠి వంటివి జీర్ణక్రియకు ప్రయోజనం. పాలు, బెల్లం మొదలైనవి ధాతుపుష్టిని కలిగించి, రక్తవర్థకంగా తోడ్పడతాయి.ప్రస్తుతం ‘ఇరానీ చాయ్’ చాలా ప్రాచుర్యంలో ఉంది. అందులో కలిపే అసలు ద్రవ్యం ఇంకా రహస్యమే. (గంజాయి, నల్లమందు, ఎముకల పొడి వంటివి కలుపుతారని అందరూ ఊహించుకొని సంభాషించుకుంటారు).
ఆయుర్వేదం: ఇది క్రీ.శ. 16వ శతాబ్దం అనంతరం మనకు సంక్రమించింది.‘ప్రియ నిఘంటువు’ అనే గ్రంధంలో ఇలా ఉంది:‘చాయం సాయం ప్రాతః ప్రాయః మనుజైః ప్రయుజ్యతే త్వధునా‘ఉష్ణం విబంధ జననం స కషాయం స్ఫూర్తిదం క్షణికమ్‘‘ఉదయం, సాయంత్రం కొంచెం సేవించడం మనుషులకు అలవాటైంది. శరీరానికి వేడి చేసి క్షణిక ఉత్సాహాన్ని ఇస్తుంది. కొంచెం వగరు, చేదు రుచితో ఉండి మలబంధకం చేస్తుంది కనుక ‘అతిసార’ వ్యాధికి మంచిది. అంటే – అధిక విరేచనాలను తగ్గిస్తుంది. యోగరత్నాకరుడు తేయాకులను ‘శ్యామపర్ణి’గా అభివర్ణించాడు. (అంటే నీలి రంగు ఆకు అని అర్థం)
గమనిక: ఈ గుణాలు కేవలం వేడి నీటిలో తేయాకును కలిపిన ‘ఫాంటము’ అనబడే ద్రావకానికి ఉంటాయి. మిగిలిన ద్రవ్యాలేమీ కలపకూడదు.గుర్తుంచుకోవలసిన సారాంశం: పాలు శర్కర కలుపంగ వలదు సుమ్మిగోరు వెచ్చని నీటిలో కోరినంతకలుపు తేయాకు పొడిని చెలిమి మీరకనుమ! లాభములు మసాల దినుసులందు.
– డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు
మీ వంటలకు ఆహ్వానం
మీరూ గొప్ప చెఫ్ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారు చేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జతచేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్... ఎవరైనా వంట చేసి లొట్టలేయిం చవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్‌కమ్.mail: familyvantakalu@gmail.com లేదా పోస్టు ద్వారా పంపండి.
మా చిరునామా: సాక్షి వంటలు,
సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1,
బంజారాహిల్స్, హైదరాబాద్–34.
Comments
Please login to add a commentAdd a comment