మరి గదిలోకి ఎలా వెళ్లను? | special story to Marital life means hell | Sakshi
Sakshi News home page

మరి గదిలోకి ఎలా వెళ్లను?

Published Wed, May 2 2018 12:27 AM | Last Updated on Wed, May 2 2018 9:53 AM

special story to Marital life means hell - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఇంటికంటే సేఫ్‌ప్లేస్‌ ఉంటుందా?అమ్మాయికి వీధిలో భద్రత లేదు.స్కూల్లో లేదు. ఆటస్థలంలో లేదు.మరి ఇల్లయినా సేఫ్‌ప్లేస్‌ అవుతుందా?తల్లిదండ్రులకు చెప్పకపోతే ఇల్లు అన్‌సేఫ్‌ ప్లేస్‌గానే ఉండిపోతుంది. అమ్మాయిలు చెప్పుకోరు.  చెప్పాలనుకున్నా అంత నీచమైంది ఎలా చెప్పాలి?అందుకే తల్లిదండ్రులే ఇంట్లో అమ్మాయితో  అన్ని విషయాలు మాట్లాడాలి.. కనుక్కోవాలి. తెలియజేయాలి!!

మా మామయ్యలతో తప్ప పరాయి మగవాళ్లతో మాట్లాడలేదు. ఆ టైమ్‌లోనే ఈ సంబంధం వచ్చింది. అమ్మతో చెప్పి ఏడ్చాను పెళ్లి వద్దు నాకు భయం అని. పెళ్లయితే  అన్నీ సర్దుకుంటాయి ఏం కాదు అని నచ్చచెప్పింది అమ్మ.

ఏడ్చుకుంటూ అమ్మ దగ్గరికి పరిగెత్తాను. ఎందుకేడుస్తున్నావ్‌.. అంటూ అమ్మ దగ్గరకుతీసుకుంది. కలొచ్చి.. భయపడి ఉంటది అని నానమ్మ. అలాగే వెక్కుతూ అమ్మను  అతుక్కుపోయాను. దూరం నుంచి తాతయ్య.. గుడ్లురుముతూ!  

ఇప్పుడు నా వయసు 27 సంవత్సరాలు. పెళ్లయి మూడేళ్లయింది. ఆయనకు మంచి ఉద్యోగం. హైదరాబాద్‌ సంబంధం కుదిరితే ఎప్పుడంటే అప్పుడు అమ్మను చూసుకోడానికి ఉంటుంది అని ఆశపడ్డాను. దేవుడు నా కోరిక విన్నాడో ఏమో హైదరాబాద్‌నే అత్తిల్లు చేశాడు. మామూలుగా అయితే అలాంటి అత్తగారు.. భర్త.. ఆ ఇల్లు దొరికినందుకు హ్యాపీగా ఉండాలి. కాని నాకు భయం. నా జీవితం నరకం. నా వైవాహిక జీవితం అంటే నరకం.

ఆ గది
పెళ్లయ్యాక ఏ ఆడపిల్ల అయినా భర్త గదిలోకి వెళ్లాలి. కాని నాకు నా హజ్బెండ్‌ దగ్గరకు వెళ్లాలంటే భయం.  కొత్తలో బెరుకు అనుకొని సర్దుకుపోయాడు. తర్వాత సెక్సువల్‌ యాక్ట్‌ పట్ల నాలెడ్జ్‌ లేదనుకుని డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లాడు. రొమాంటిక్‌ వీడియోలు చూపించేవాడు. అయినా నాలో మార్పు లేదు. పెళ్లికి ముందు లవ్‌ ఎఫైర్‌ ఉందేమోనని అనుమానపడ్డం మొదలుపెట్టాడు. నా ఫ్రెండ్స్‌ని, బంధువులనూ అడిగాడు. నా ఫేస్‌బుక్, జీ మెయిల్, ఫోన్‌ అన్నీ చెక్‌ చేశాడు. ఎఫైర్‌ ఆనవాలేమీ దొరకలేదు. ఇక నాకు నా మామగారిని చూస్తే వణుకు వచ్చేది. నా చిన్నప్పుడు నేను చూసిన మా తాతగారిలాగే కనపడేవాడు. దాంతో మా మామగారితో సరిగ్గా మాట్లాడేదాన్ని కాను. అసలు ఆయన ఉన్న పరిసరాల్లోకి వెళ్లేదాన్నే కాను. గదిలో తలుపేసుకుని ఉండిపోయేదాన్ని ఎన్ని గంటలైనా. దాంతో మా అత్తగారు వాళ్లు నాకు పొగరని, పెద్దవాళ్లంటే గౌరవం లేదనే అభిప్రాయానికి వచ్చారు. నా ప్రవర్తన అర్థం కాక మరోవైపు దాంపత్య జీవితం లేక  నన్ను నా భర్త తన్నాడు. మళ్లీ డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లాడు. ఆవిడ ఏవేవో ప్రశ్నలు అడిగారు. చివరకు నాకు ఫ్రిజిడిటీ ఉందని తేల్చారు ఆవిడ. 

ఇలా ఎందుకు జరిగింది?
మాది జాయింట్‌ ఫ్యామిలీ. నాకు ఇద్దరు పెద్దనాన్నలు.. ఇద్దరు బాబాయ్‌లు... ఇద్దరు అత్తలు.... పెద్ద ఇల్లు.  అప్పుడు నాకు తొమ్మిదేళ్లుంటాయేమో.. ఫోర్త్‌ క్లాస్‌ సమ్మర్‌ హాలిడేస్‌. ఇంకో పన్నెండు రోజుల్లో చిన్నత్త పెళ్లి. ఆ అరేంజ్‌మెంట్స్‌ అవుతున్నాయి. ఓ మధ్యాహ్నం పూట.. మా వంటిల్లు నానుకుని పెద్ద వసారా ఉంటుంది.  అందరూ అక్కడే ఉన్నారు. నేను హాల్లో పడుకున్నా. బాగా నిద్దరలో ఉన్నా. నా మీద బరువుగా ఏదో ఉండటం.. శ్వాస ఆడనట్టు కావడంతో గాబరాపడి లేచాను. నన్నంతా ఆక్రమించుకొని మా తాతయ్య. అక్షరాలా మా నాన్న నాన్న. నేను కళ్లు తెరవగానే తన చేత్తో నా కళ్లు, నోరు మూసి తన నడుముతో నా నడుమును అదమసాగాడు. అరిచే ప్రయత్నం చేసి.. ఆయన చేతిని కొరికి.. రక్కితే అప్పుడు లేచాడు. నేను ఏడ్చుకుంటూ అమ్మ దగ్గరికి పరిగెత్తాను. ఎందుకేడుస్తున్నావ్‌.. అంటూ అమ్మ దగ్గరకు తీసుకుంది. కలొచ్చి.. భయపడి ఉంటది అని నానమ్మ. అలాగే వెక్కుతూ అమ్మను అతుక్కుపోయాను. దూరం నుంచి తాతయ్య.. గుడ్లురుముతూ! 

భయం... భయం...
భయమంటే ఏంటో తెలిసింది ఆ రోజు నుంచి. ఒంటరిగా ఉండడమంటే చచ్చేంత వణుకొచ్చేది.  నాకు తెలియకుండానే ఇంట్లో తాతయ్య నన్ను చేజ్‌ చేయడం స్టార్ట్‌ చేశాడు.  ఆడుకుంటుంటే వచ్చి వెనక నుంచి పట్టుకునేవాడు. ఆ పట్టుకోవడం ప్రేమతో.. పెద్దవాళ్లకు పిల్లల పట్ల ఉండే వాత్సల్యంలా ఉండేది కాదు. నాకు ఇబ్బందిగా.. అసహ్యంగా.. చిరాగ్గా అనిపించేది. ఎప్పుడు నా ఛాతీ మీద.. వెనక హిప్స్‌ మీద చేతులు వేయడానికి ప్రయత్నించేవాడు. అందరూ ఉన్నప్పుడు ఆయన ప్రవర్తన ఇంకో రకంగా ఉండేది. ఎప్పటికప్పుడు అమ్మకు చెప్పాలనిపించేది. కానీ తాతయ్య అంటే అందరికీ భయమే. అమ్మ, నాన్నకైతే మరీ భయం. నాన్నకు ప్రైవేట్‌ జాబ్‌. శాలరీ తక్కువగా ఉండేది. అందుకే అన్నీ సర్దుకోవాలని నాన్న అమ్మతో చెప్తూ ఉండేవాడు.  బహుశా నేను నోర్మూసుకొని భరించడానికీ అదే కారణమేమో. 

పెద్దమనిషి అయ్యాక.. 
నైన్త్‌క్లాస్‌లో ఉన్నప్పుడు పెద్దమనిషయ్యా. భోగి రోజు రాత్రి పదకొండు గంటలకు వాకిట్లో ముగ్గులేస్తున్నాం. వంటింటి గూట్లో ఉన్న నీలం రంగు తెమ్మని అత్త పురమాయిస్తే పరిగెత్తుకుంటూ వెళ్లా. రంగు తీసుకొని అదే పరుగుతో వస్తుంటే  తాతయ్య నా చెస్ట్‌ మీద చేయి వేసి ప్రెస్‌ చేస్తూ ఆపాడు. గట్టిగా అరిచా. తాతయ్యను తోసేస్తే కిందపడ్డాడు.  అందరూ పరిగెత్తుకొచ్చారు.  తాతయ్య నడుముకి బాగానే దెబ్బ తగిలింది.  హాస్పిటలైజ్డ్‌ అయ్యాడు. తెల్లవారి ఇంట్లో అంతా కలిసి నాకు క్లాస్‌ తీసుకున్నారు. అప్పుడు ధైర్యంగా చెప్పా. చిన్నప్పటి నుంచి ఆ ముసలాడి వల్ల నేను పడ్డ బాధను. అనుభవించిన భయాన్ని. అమ్మను పట్టుకొని ఏడ్చేశా. ఎవరూ నమ్మలేదు.. అమ్మా, నాన్న తప్ప. నాన్న తాతయ్యను చంపేస్తానని ఆవేశపడ్డాడు. పెద్దనాన్నలు నాన్నను తిట్టారు. నన్ను అసహ్యంగా ఈసడించుకున్నారు. ‘‘అది మదంతో ఉంది. దానికి పెళ్లి చేసేయ్‌. ఈడొచ్చే దాక కూడా ఆగేట్టు లేదు. ఎవడినైనా ఎత్తుకొని పోతది’’ అని అత్త నన్ను తిట్టింది. భరించలేని అమ్మ అత్తను చెంప పగలగొట్టింది. మమ్మల్ని ఇంట్లోంచి గెంటేశారు. 

నాన్న వెళ్లిపోయాడు.. 
మామయ్య వాళ్ల హెల్ప్‌తో ఇంకో ఇల్లు చూసుకొని మా ఫ్యామిలీ విడిగా ఉంది. వన్‌ ఇయర్‌ అయ్యేసరికి నాన్న మళ్లీ మా నానమ్మ వాళ్ల దగ్గరకు వెళ్లిపోయాడు. తాతయ్య, పెద్ద నాన్నలు ఏవో చెప్పి  నాన్నను మార్చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్న మా వంక చూడలేదు. అమ్మమ్మ వాళ్ల హెల్ప్‌తోనే చదువుకున్నా. ఇంజనీరింగ్‌ కంప్లీట్‌ చేశా. ఇంజనీరింగ్‌లో ఉన్నప్పుడు చాలా మంది అబ్బాయిలు వెంటపడ్డారు. నేను ఎవరి వంకా చూసేదాన్ని కాను.  ఈవెన్‌ మేల్‌ లెక్చరర్స్‌ అంటే కూడా భయమేసేది. మా మామయ్యలతో తప్ప పరాయి మగవాళ్లతో మాట్లాడలేదు. ఆ టైమ్‌లోనే ఈ సంబంధం వచ్చింది. అమ్మతో చెప్పి ఏడ్చాను పెళ్లి వద్దు నాకు భయం అని. పెళ్లయితే అన్నీ సర్దుకుంటాయి ఏం కాదు అని నచ్చచెప్పింది అమ్మ. కానీ సర్దుకోలేదు. సరికదా.. భయం ఎక్కువైంది. ఆయన దగ్గరికొచ్చే ప్రయత్నం చేస్తే ముసలాడి బిహేవియర్‌ గుర్తుకొచ్చి ఫిట్స్‌ వచ్చినట్టు అయిపోయేది. డాక్టర్‌ నాకు ఫ్రిజిడిటీ అని తేల్చాక నా హజ్బెండ్‌ మా అమ్మకు కాల్‌ చేశాడు వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్లిపోండని. అప్పుడైనా ఆయనకు జరిగింది చెప్పేయాలనిపించింది. కాని చెప్పలేకపోయా. ఇప్పుడు సైకియాట్రి ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నా.  ‘‘ఇంకో త్రీ మంత్స్‌ చూస్తాను. హెల్దీగా వస్తే ఓకే. లేదంటే.. ప్లీజ్‌ లీవ్‌మీ. డైవోర్స్‌ తీసుకుందాం’’ అన్నాడు. ఆ మాటకే నాకేం బాధనిపించలేదు కాని అమ్మే చాలా బాధపడుతోంది. నాకు ఈ పెళ్లి రొమాన్స్‌ ఏమీ వద్దు. హాయిగా ఉద్యోగం చేసుకొని అమ్మతో ప్రశాంతంగా బతకాలనుంది. అమ్మలేకపోతే ఉండలేను. నా వల్ల కాదు’’ అంటూ రెండు చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తూనే ఉంది చాలాసేపటి దాకా. ఎవరు ఓదార్చాలి? ఆ భయం ఎలా పోగొట్టాలి?
కనేదాన్నే కాను.. మా ఇంట్లోనే నా తండ్రి లాంటి వాడే నా బిడ్డను అలా చూస్తాడని ముందే తెలిసుంటే అసలు ఆడపిల్లను కనేదాన్నే కాను. కడుపులోనే చంపేసేదాన్ని అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఆ అమ్మాయి తల్లి.
– శరాది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement