
పరమానందం పొందాలంటే..?
నచికేతా! జీవులు నిద్రపోయేటప్పుడు కూడా తాను మేలుకొని ఉండి, అనేక విషయాలను నిర్మిస్తూ, నిత్యమై, శుద్ధమై ఉండేదే పరబ్రహ్మం. అన్ని లోకాలూ అందులోనే ఉన్నాయి. దానిని దాటి ఎవరూ పోలేరు. ఆత్మ అంటే ఇదే. ఒకే అగ్ని వేర్వేరు కట్టెలలో వెలుగుతున్నట్టు ఆత్మ జీవులందరిలో వేర్వేరు రూపాల్లో కనిపిస్తుంది. వాటికి భిన్నంగా కూడా ఉంటుంది. ఒకే వాయువు జీవులలో ప్రవేశించి వివిధ రూపాల్లో కనబడుతున్నట్టు అందరిలో ఉన్న పరమాత్మ భిన్నరూపాల్లో దర్శనం ఇస్తున్నాడు.
లోకానికి అంతటికీ నేత్రంగా ఉన్న సూర్యుడు ఆ చర్మచక్షువుల రాగద్వేషాలకు అతీతంగా ఉన్నట్టు అందరిలో ఉన్న ఆత్మ స్వచ్ఛమై నిర్మలమై ఉంటుంది. పరమాత్మ సకల జీవుల అంతరాత్మగా ఉంటూ భిన్నరూపాల్లో కనిపిస్తున్నాడు. ఆ పరమాత్మ తనలోనే ఉన్నాడని తెలుసుకున్న జ్ఞానులకు శాశ్వతానందం కలుగుతుంది. దీనిని అజ్ఞానులు పొందలేరు. అనిత్యమైన వాటిల్లో నిత్యంగా, చేతనాల్లోని చైతన్యంగా ఉండే పరమాత్మను తమ ఆత్మలో దర్శించగలిగిన ధీరులు మాత్రమే శాశ్వతమైన శాంతిని పొందగలుగుతారు.
గురువర్యా! యమధర్మరాజా! నువ్వు చెప్పినట్టు రుషులు పొందే అనిర్వచనీయమైన ఆ పరమానందాన్ని నేను ఎలా తెలుసుకోవాలి? అది స్వయంప్రకాశమా? మరొక వెలుగులో కనిపిస్తుందా?
నచికేతా! అక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అగ్ని, మెరుపులు ఎవరూ ప్రకాశించరు. పరమాత్మ వెలుగులోనే ఇవన్నీ ప్రకాశిస్తాయి. సనాతనమైన ఈ రావిచెట్టు వేళ్లు పైకి, కొమ్మలు కిందికీ వ్యాపించి ఉంటాయి. ఇదే పవిత్రమూ, శాశ్వతమూ అయిన పరబ్రహ్మం. ఎవరైనా ఏదైనా దీంట్లోనే ఉన్నాయి. ఇదే ఆత్మ. పరమాత్మ నుంచే సకల ప్రపంచం ప్రాణాన్ని పొంది మళ్లీ దానిలోకే లీనమౌతోంది. పెకైత్తిన వజ్రాయుధంలా ఆత్మ మిరుమిట్లు గొలుపుతూ భయపెడుతూ ఉంటుంది. ఇది తెలుసుకున్నవారు జనన మరణాలకు అతీతంగా అమృతత్వాన్ని పొందుతారు. నాయనా! భయంతోనే అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు, వాయువు, మృత్యువు అందరూ తమ బాధ్యతలను నిర్వహించడానికి పరుగెత్తుతున్నారు.
ఆ పరబ్రహ్మాన్ని శరీరం నశించకముందే దర్శించగలిగిన మానవుడు బంధాలనుంచి విముక్తుడు అవుతాడు. లేకపోతే జన్మలు తప్పవు. లోపల ఉన్న పరమాత్మ పితృలోకంలో స్వప్నంలా, గంధర్వలోకంలో నీటిలో ప్రతిబింబంగా, బ్రహ్మలోకంలో వెలుగునీడలుగా కనిపిస్తుంది. ఇంద్రియాల విభిన్నతనూ, వృద్ధిక్షయాలనూ తెలుసుకొన్న ధీరుడు దేనికీ దుఃఖించడు. ఇంద్రియాలకన్నా మనస్సు గొప్పది. మనస్సు కంటే బుద్ధి ఉత్తమం. బుద్ధికంటే విశ్వాత్మ, దానికంటే అవ్యక్త ప్రకృతి శ్రేష్ఠం. అవ్యక్త ప్రకృతి కంటే సర్వవ్యాపకుడూ, స్త్రీ పురుషాదిలింగరహితుడూ అయిన పరమపురుషుణ్ణి తెలుసుకోగలిగిన ప్రాణికి అమృతత్వం లభిస్తుంది. ఆ పరమ పురుషునికి ఏ కోపమూ లేదు. కంటికి కనపడ డు. హృదయంలో ఉండి మనస్సును శాసించే బుద్ధికి మాత్రమే కనపడతాడు. చూడగలిగిన వారికి జననమరణాలు ఉండవు.
నచికేతా! మనస్సుతో సహా అయిదు జ్ఞానేంద్రియాలు (కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం)ఆత్మల్లో స్థిరమైనప్పుడు, బుద్ధి నిశ్చలమైనప్పుడు ఆ స్థితిని ‘పరమపదం’ అంటారు. ఇంద్రియాలను స్థిరంగా నిగ్రహించుకోవడమే ‘యోగం’. యోగి మనోవికారాలను అప్రమత్తతతో గెలుస్తాడు. యోగంలోనుంచి ఏ క్షణంలోనైనా పతనం కావచ్చు. జాగ్రత్తగా ఉండాలి. ఆత్మను మాటలతో, కళ్లతో, మనస్సుతో చూడలేరు. అది ఉన్నదని తెలుసుకున్న వారి ద్వారానే తెలుసుకోగలరు. ‘అస్తి’ ‘నాస్తి’ అనే రెండు పదాల్లోనూ ‘అస్తి’ఉంది. అది తెలుసుకున్నవారికి తత్త్వ దర్శనం అవుతుంది. మానవుడు ఎప్పుడు కోరికలను నశింపజేసుకుంటాడో అప్పుడు మరణం ఉండి కూడా లేనివాడు అవుతాడు. శరీరం ఉండగానే బ్రహ్మత్వాన్ని పొందుతాడు.
మానవుడు జీవించి ఉండగానే బంధాలను ఛేదించుకుంటే మరణం లేనివాడు అవుతాడని వేదాంతం బోధిస్తోంది. మానవ హృదయంలో నూటొక్క గదులు ఉన్నాయి. వాటిల్లో ఒకటి తలలోకి ప్రయాణిస్తుంది. దానిద్వారా మనిషి అమృతత్వాన్ని పొందుతాడు. మిగిలిన నాడులు శరీరంలో అన్ని వైపులకి ప్రయణిస్తూ అంతరించిపోతాయి. బొటనవేలు పరిమాణంలో అన్ని ప్రాణుల్లోనూ ఉండే అంతరాత్మ గురించి మానవుడు మాత్రమే తెలుసుకోగలడు. అందుకే జంతువులలో నరజన్మ శ్రేష్ఠం. ధీరుడైనవాడు వివేకంతో అంతరాత్మను దర్శించగలగాలి. అంతరాత్మయే స్వచ్ఛమూ, శాశ్వతమూ అని తెలుసుకున్న వాడు పవిత్రుడూ, శాశ్వతుడూ అవుతాడు. ఇదే బ్రహ్మవిద్య. బ్రహ్మజ్ఞానం.
ఈవిధంగా యమధర్మరాజు చెప్పినదంతా శ్రద్ధగా విన్న నచికేతుడు నిర్మలుడై, మృత్యువును జయించి పరబ్రహ్మత్వాన్ని పొందాడు. నచికేతుణ్ణి ఆదర్శంగా తీసుకుని కఠోపనిషత్తులో చెప్పిన ఆత్మజ్ఞానాన్ని గురువు సన్నిధిలో శ్రద్ధగా అధ్యయనం చేసి, అభ్యసించి, అనుభూతిని పొందినవారు జీవన్ముక్తులై బ్రహ్మజ్ఞులు అవుతారు.
ఓం సహనావవతు, సహనౌ భునక్తు
సహవీర్యం కరవావహై, తేజస్వినా వధీతమస్తు,
మా విద్విషావహై ఓం శాంతిశ్శాంతి శాంతిః
- డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్