చేటు చెక్కర | special story on diabetes | Sakshi
Sakshi News home page

చేటు చెక్కర

Published Wed, Sep 14 2016 11:31 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

చేటు చెక్కర

చేటు చెక్కర

రోజూ కనీసం అరగంట... లేదా వారానికి కనీసం
రెండున్నర గంటలు వ్యాయామం చేస్తే
డయాబెటిస్ అదుపులో ఉంటుంది

నేనొక ఇష్టం లేని అతిథిని. క్రమశిక్షణ గలవారి వంక కన్నెత్తి చూడలేను. ఆరోగ్య నియమాలు పాటించని వారితో స్నేహం చేయాలని చూస్తుంటాను. చెడు అలవాట్లతో దోస్తీ కట్టే ఆ స్నేహమూర్తులూ నన్ను ఇష్టపడరెందుకో. కానీ వాళ్లంటే నాకు ఇష్టం. ఏం చేద్దాం... ఆతిథ్యం స్వీకరించకపోతే నాకు గడవదు కదా. అందుకే నియమితమైన లైఫ్‌స్టైల్ లేనివారితో లైఫ్‌టైమ్ ఫ్రెండ్‌షిప్ కోసం వెళ్తుంటాను. నేను డయాబెటిస్ వ్యాధిని.

తీపి అంటేప్రాణం అనేవాళ్లు తమ ప్రాణం కోసం తీపి వదులుకునేంతగా భయపెడుతుంటాన్నేను. నేనొక టై స్టోరీ. నాదొక హారర్ స్టోరీ. ఆరోగ్యంపై గుడ్డిదనంతో వ్యవహరిస్తుంటే... నిజంగానే గుడ్డిదనం తెచ్చేలా వ్యవహరిస్తుంటా. నా గురించి నేనే (డయాబెటిస్) చెప్పుకునే కొన్ని విషయాలివి...

నేనూ, గుండెజబ్బులూ, పక్షవాతం క్లోజ్‌ఫ్రెండ్స్. నేను వచ్చిన చోటికి నా ఫ్రెండ్స్ రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ల భయం కూడా నా పట్ల భయంగా పరిణమిస్తుంటుంది.

నన్నే నిర్లక్షం చేస్తూ కళ్లతో పాటు కాళ్లూ పోవచ్చు. నేను వస్తే కాళ్లలో రక్తనాళాలు మూసుకుపోవచ్చు. నా విషయంలో కళ్లూ, కాళ్లు జాగ్రత్త అన్న మాట  కేవలం ప్రాసకోసం వాడటం కాదు... నిజంగానే అది నిజం కావచ్చు.

ఇప్పుడేదో ప్రజలంతా లైఫ్‌స్టైల్స్ తప్పడంతో నా విస్తృతి ఎక్కువైంది గానీ... మానవ నాగరికతకు చాలా ముందుగానే నా ఉనికి ఉంది. నా లక్షణాలను బట్టి నన్ను మొదట క్రీ.పూ. 1500లోనే రికార్డు చేశారు. క్రీస్తుశకం మొదటి శతాబ్దంలో  క్యాపడోసియాకు చెందిన ఆరేటియస్ అనే గ్రీకు ఫిజీషియన్ కూడా నా లక్షణాల వల్ల నన్ను గుర్తించాడు గానీ... గుర్తు తెలియని పాము ఏదో కాటేయడం వల్ల డయాబెటిస్ వస్తుందని అపోహ పడ్డాడు.

నేను ప్రధానంగా మూడు రకాలు అనుకుంటారు. టైప్-1, టైప్-2, గర్భవతులకు వచ్చే జస్టేషనల్ డయాబెటిస్ అని నాలో రకాలను వర్గీకరిస్తుంటారు. కానీ నేను ప్రధానంగా ఈ మూడు రూపాల్లోనే కనిపించినా... లేటెంట్ ఆటోఇమ్యూన్ డయాబెటిస్ ఇన్ అడల్ట్స్ (లాడా) అనీ, మెచ్యురిటీ ఆన్‌సెట్ ఆఫ్ ద యంగ్ (మోడీ) అనీ నాలో ఎన్నో రకాలు ఉన్నాయి. కాకపోతే ప్రధానంగా మూడు రకాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. టైప్-1 డయాబెటిస్ ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. ఇది జన్యులోపం వల్ల వస్తుంది. పిల్లల్లోని రోగనిరోధక వ్యవస్థే వారికి శాపంగా మారుతుంది. పాంక్రియాస్‌లోని బీటా సెల్స్‌ను వారి రోగనిరోధక వ్యవస్థ పరాయికణాలుగా ఎంచి, వాటిని నాశనం చేస్తుంది. ఫలితంగా పాంక్రియాస్ పనిచేయని స్థితికి చేరుకుని, ఇన్సులిన్ ఉత్పత్తి నిలిచిపోతుంది. దీనినే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెలిటస్ అని అంటారు.

 పాంక్రియాస్ మందగించగానే నేను యాక్టివ్ అయిపోతాను. పాంక్రియాస్ ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌కు శరీరంలోని జీవకణాలు తగిన రీతిలో స్పందించడం మానేసినా తలెత్తే మధుమేహాన్ని టైప్-2 డయాబెటిస్ అంటారు. ఇదే పరిస్థితి దీర్ఘకాలికంగా కొనసాగితే శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి దానంతట అదే నిలిచిపోయే పరిస్థితి కూడా తలెత్తుతుంది. దీనిని నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెలిటస్ లేదా అడల్డ్ ఆన్‌సెట్ డయాబెటిస్ అంటారు. కొంతమంది మహిళల్లో గర్భం దరించగానే నేను అతిథిగా వస్తుంటాను. దాన్నే  జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. ఇలాంటి వారిలో మళ్లీ నేను పర్మనెంట్‌గా వచ్చేసే అవకాశాలూ ఉన్నాయి.

 ప్రేమలో ఆకలీ దాహం ఉండవు. కానీ నేను ప్రేమనూ కాదు... ప్రేమగా చూసుకునే అవకాశమూ నా విషయంలో ఉండదు. అందుకే నేను కనిపిస్తే ప్రేమకు వ్యతిరేకమైన గుణాలు ఆకలి పెరగడం, దాహం వేయడం కనిపిస్తాయి. తరచు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు చాలామందిలో కనిపిస్తాయి. అసలు ఈ లక్షణం నుంచే డయాబెటిస్ అనే పేరు నాకు వచ్చిందట. డయాబెటిస్ అంటే మూత్రపు  ఫౌంటేన్ అనే అర్థం కూడా ఉందట.

నేను ఒంటిని సందర్శించాక కూడా చాలామందిలో లక్షణాలేవీ కనిపించవు. అందుకే 40 ఏళ్లు దాటాక ఏడాదికి ఒకసారైనా రక్తపరీక్షలు చేయించుకోవాలి.

నేను ఒంట్లో ఉంటే గాయాలు మానవు. ఎందుకంటే అవి తియ్యగా అయిపోతాయి కదా... దాంతో హాని చేసే బ్యాక్టీరియాకు ఆ గాయాలూ తియ్యగా అనిపిస్తాయి. దాంతో గాయలు తగ్గవు. అందుకే నేను ఒంట్లో ఉంటే జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే గాయమైన అవయవానికే ముప్పు.

జీవనశైలిని మార్చేయాలి
నేను (డయాబెటిస్) ఉన్నట్లుగా వైద్య పరీక్షల్లో తేలితే వెంటనే జీవనశైలిని మార్చేసుకోవాలి. హైరానా పడకుండా సమస్యపై అవగాహన పెంచుకోవాలి. ఒత్తిడిని అధిగమించేందుకు యోగా, ధ్యానం వంటివి చేయాలి.

రక్తంలో చక్కెరస్థాయి సాధారణ స్థితిలో ఉంచుకునేందుకు వైద్యుల సలహాపై క్రమం తప్పకుండా తగిన మందులు వాడుతూ ఉండాలి.

అదనపు బరువు ఉంటే అదుపులోకి తెచ్చుకోవాలి. ప్రశాంతంగా కంటినిండా నిద్రపోవాలి.

అరుదైన పరిస్థితుల్లో తప్ప సాధారణంగా వచ్చే డయాబెటిస్‌ను పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. డయాబెటిస్ వచ్చాక ఆరోగ్యకరమైన అలవాట్లతో దీనిని నియంత్రించుకోవడం తప్ప మార్గం లేదు.

అయితే, దీని గురించి ఆందోళన పడాల్సిన పనిలేదు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ, వైద్యుల సలహాలపై మందులు వాడుతూ ఉంటే పూర్తి ఆరోగ్యంతో నిండు నూరేళ్లూ బతకవచ్చు.

నన్ను గుర్తించడానికి కొన్ని పరీక్షలు
చక్కెర వ్యాధిని గుర్తించడానికి కొన్ని రకాల రక్తపరీక్షలు చేస్తారు. వాటిలో ముఖ్యమైనవి: ఫాస్టింగ్ సుగర్ టెస్ట్... కనీసం ఎనిమిది గంటల సేపు ఏమీ తినకుండా చేయించుకునే పరీక్ష ఇది. పోస్ట్ ఫుడ్ సుగర్ టెస్ట్: ఆహారం తీసుకున్న గంటన్నర లోగా పరీక్ష చేయించుకోవాలి. ర్యాండమ్ షుగర్ టెస్ట్ తిన్నా, తినకున్నా ఏదో ఒకవేళ ఈ పరీక్ష చేస్తారు. ఇవి కాకుండా, బ్లడ్ సుగర్ పరిస్థితి తీవ్రంగా ఉన్న వారికి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ కూడా చేస్తారు. అయితే డయాబెటిస్ తీవ్రంగా ఉన్నవారికి ఇది అంతగా ఉపకరించదు. ఎందుకంటే అప్పటికీ షుగర్ ఎక్కువ పాళ్లు ఉంటుంది. కాబట్టి బయటి నుంచి మళ్లీ షుగర్ ఇవ్వడం సరికాదు. నా తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే మూత్ర పరీక్ష కూడా చేస్తారు.

డయాబెటిస్‌ను తెలుసుకోవడం కోసం హెబీఏ1సీ అనే పరీక్షను సైతం చేస్తారు. ఇది 8 నుంచి 10 వారాల వ్యవధిలో చెక్కెర పాళ్లను సగటును తెలిపే పరీక్ష. దీన్ని పరగడుపున చేయాల్సిన అవసరం ఉండదు. ఇది చక్కెర వ్యాధిని  నిర్ధారణ చేయడంతోపాటు మందులు వాడుతున్నప్పుడు చికిత్స వల్ల చక్కెర అదుపులోనే ఉంటోందా లేదా అన్న విషయం కూడా తెలుస్తుంది.

 ఈ జాగ్రత్తలు పాటించండి
టైప్-1 డయాబెటిస్‌కు వైద్యుల సూచనపై ఇన్సులిన్ ఇవ్వడం మాత్రమే ఏకైక మార్గం  ఎక్కువ మందిలో కనిపించే టైప్-2 డయాబెటిస్‌ను కొద్దిపాటి జాగ్రత్తలతో నియంత్రించుకోవచ్చు  పీచు పదార్థాలు, మేలుచేసే కొవ్వులతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం, శరీరం బరువు సాధారణ స్థాయికి మించి పెరగకుండా చూసుకోవడం వంటి తేలికపాటి జాగ్రత్తలతో దీని బారిన పడకుండా చూసుకోవచ్చు  చేపలు, అవిసెగింజలు, వాల్‌నట్స్, శాకాహార నూనెల్లో మంచి కొవ్వులు ఎక్కువ వేటమాంసం (రెడ్ మీట్), వెన్న, నెయ్యి వంటి జంతు సంబంధిత కొవ్వులను చెడు కొవ్వుపదార్థాలుగా పరిగణిస్తారు. డయాబెటిస్ బారిన పడినవారు వీటికి దూరంగా ఉండటం మంచిది.  చక్కెరలు మోతాదుకు మించి ఉండే కూల్‌డ్రింక్స్, స్వీట్స్, చాక్లెట్లు వంటి వాటికి దూరంగా ఉండటంతో పాటు పొగతాగడాన్ని మానేయడం ద్వారా కూడా రక్తంలో చక్కెరల స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement