ఏకాగ్రత.. ధ్యానం! | special story on meditation | Sakshi
Sakshi News home page

ఏకాగ్రత.. ధ్యానం!

Published Sun, May 28 2017 1:40 AM | Last Updated on Tue, Sep 5 2017 12:09 PM

ఏకాగ్రత.. ధ్యానం!

ఏకాగ్రత.. ధ్యానం!

ఆయన ఓ న్యాయమూర్తి. ఆయన ప్రతిరోజూ దొంగలను, హంతకులను, రకరకాల నేరాలు చేసే వారిని చూసి చూసి మానసిక ఒత్తిడికి లోనయ్యే వారు. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడే వారు కాదు. ఇది గమనించిన ఆయన మిత్రులు ఆయనను ఒక జెన్‌ గురువు దగ్గరకు తీసుకు వెళ్లి పరిస్థితి వివరించి... ‘‘అయ్యా! మీరే ఈయనకు ధ్యానం చేసే పద్ధతి నేర్పాలి....’’ అని గురువుని కోరారు.

జెన్‌ గురువు అలాగే అని రోజూ ఓ గంట పాటు ఆ న్యాయమూర్తికి ధ్యానం నేర్పారు.

కానీ న్యాయమూర్తి ఎంత ప్రయత్నించినా ఆలోచనలు మారడం లేదు. ధ్యానం మీద మనసు నిలపలేకపోయారు. గురువు మాటలు బుర్రకెక్కడం లేదు.

ఓ రోజు న్యాయస్థానంలో ఓ కేసు వాదనకు వచ్చింది. ఓ దొంగ పట్టపగలు ఓ అమ్మాయి మెడలో గొలుసు దొంగలించి పట్టుబడ్డాడు. పోలీసులు అతనిని పట్టుకొచ్చి న్యాయమూర్తి ముందు నిలబెట్టారు. న్యాయమూర్తి అతనిని చూశారు.

‘‘దొంగతనం నేరం... పైగా అందరి ముందూ ఓ అమ్మాయి మెడలో గొలుసు లాక్కోవచ్చా...? నిన్ను చూసిన వాళ్ళందరూ నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పరా?’’ అని అడిగారు న్యాయమూర్తి.

ఆ దొంగ తల అడ్డంగా ఊపాడు.
‘‘అయ్యా, దొంగిలిస్తున్నప్పుడు నాకు గొలుసు ఒక్కటే పెద్దగా అనిపించింది. చుట్టూ ఉన్న వారెవరూ నా కంటికి కనిపించలేదు’’ అన్నాడు దొంగ.

న్యాయమూర్తి పెనునిట్టూర్పు విడిచారు.
‘‘దొంగవెధవా! నీకు ధ్యానం బాగా తెలుసులా ఉంది... ధ్యానానికి కావలసింది ఏకాగ్రత. అది నీవు సాధించావు. అభినందనలు. అయితే అది మంచి పనులకు ఉపయోగించాలి కానీ, చెడుపనులకు ఉపయోగించ కూడదు. ఈసారెప్పుడైనా నీ ఏకాగ్రతను దొంగతనాలకు ఉపయోగించావంటే కఠిన కారాగార శిక్ష తప్పదు. ఇప్పుడు మాత్రం చిన్న జరిమానాతో వదిలిపెడుతున్నాను’’ అని చెప్పి, తాను కూడా ధ్యానంలో ఏకాగ్రత సాధించాలని మనసులోనే గట్టిగా నిశ్చయించుకున్నారు న్యాయమూర్తి. – యామిజాల జగదీశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement