పిల్లల చేతికి జుట్టు అందిందంటే.. మనం మనం కాదు. మిస్ వరల్డో.. మిస్ యూనివర్సో..! మేకప్ చేసి.. రబ్బర్ బ్యాండ్ పెట్టి.. ‘అదిరెను నీ స్టెయిలే’ అని అద్దం చూపిస్తారు. ప్రియాంక జుట్టు పక్కింటి చిన్నారికి అందింది! పూర్వపురాణి ప్రెట్టీ ప్రిన్సెస్ అయింది.
ఇరవై ఏళ్ల తర్వాత ప్రియాంక చోప్రా మళ్లీ ఇప్పుడు అందాలరాణిగా సాక్షాత్కరించారు! 2000 సంవత్సరంలో లండన్‌లోని మిలీనియం డోమ్‌లో ‘మిస్ వరల్డ్’ కిరీటాన్ని దక్కించుకున్న ఈ టీనేజర్.. లాస్ ఏంజెలిస్‌లోని తన ఇంటి క్వారెంటైన్‌లో ఈ సోమవారం తన 37 ఏళ్ల వయసులో ‘ప్రెట్టీ ప్రెట్టీ ప్రిన్సెస్’ టైటిల్‌తో ధగధగలాడారు. ఆ ప్రెట్టీ టైటిల్‌ను ప్రియాంకకు ఇచ్చింది ఆరేళ్ల చిన్నారి.. స్కై కృష్ణ! ఆ పాప.. టైటిల్ ప్రదాత మాత్రమే కాదు. ప్రియాంక కనురెప్పలపై ఐ షాడో దిద్దిన బ్యూటీషియన్. ప్రియాంక తల దువ్వి చక్కగా ముడులు వేసిన హెయర్ స్టయిలిస్ట్.
ముస్తాబంతా అయ్యాక ప్రియాంక తలపై పెట్టిన ఆ ప్రెట్టీ కిరీటమూ స్కై కృష్ణ తన ఇంటి నుంచి తీసుకొచ్చిందే. నిజానికి ప్రియాంకపై ప్రయోగించిన తన మేకప్ ప్రావీణ్యానికి కొసమెరుపుగా స్కై కృష్ణ అలంకరించిన సౌందర్య మకుటం అది. ప్రియాంక మురిసిపోయారు. ‘ప్రెట్టీ ప్రెట్టీ ప్రిన్సెస్’ అని స్కై కృష్ణ మెచ్చుకుంది. ఆ అభినందనకు ప్రియాంక కళ్లింత చేసి ఆ మరపు రాని క్షణాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసుకున్నారు. ప్రియాంకకు చాలా కాలంగా స్టెయిలిస్ట్‌గా ఉన్న దివ్యజ్యోతి కూతురే స్కై కృష్ణ.
గత నెల రోజులుగా ప్రియాంక, ఆమె భర్త నిక్.. హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు. అయితే వాళ్లింటి పక్కనే ఉండే స్కై కృష్ణతో ప్రియాంక ఏ మాత్రం భౌతిక దూరం పాటించడం లేదు. ఇప్పుడీ ఫొటోలను పోస్ట్ చేయడానికి రెండు రోజుల ముందు.. మంచంపై వెల్లికిలా పడుకుని, చేతులు రెండూ వెనక్కు చాపి స్కై కృష్ణతో వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న వీడియోను ప్రియాంక పోస్ట్ చేశారు. ఆ వీడియోకు ‘నో జిమ్.. నో ప్రాబ్లం’ అని కామెంట్ పెట్టారు. గత ఏడాది ఆరంభంలో పోస్ట్ చేసిన ఇంకో వీడియోలో ఇద్దరూ స్విమ్మిగ్ పూల్‌లో ఉండి తామిద్దరిలో ఎవరు క్యూట్ అని పోటీ పడటాన్ని ఐదు కోట్ల మందికి పైగా ప్రియాంక ఫాలోవర్‌లు ఆసక్తిగా వీక్షించారు. అందులో ‘యు ఆర్ సో క్యూట్’ అని, ‘నో.. యు ఆర్ సో క్యూట్’ అని ఒకర్నొకరు అనుకుంటూ ఉంటారు. చివరికి ఆ వివాదం ‘వి ఆర్ సో క్యూట్’ అనే ఏకీభావంతో ముగుస్తుంది.
అయితే ఇప్పుడు రోజంతటిలో ప్రియాంక చేస్తున్న అందమైన పనులలో స్కై కృష్ణతో ఉల్లాసంగా గడపడం అన్నది కటి మాత్రమే. ఎప్పుడూ తీరిక లేకుండా ఉండే ఈ అంతర్జాతీయ తార.. ప్రస్తుతం హోమ్ క్వారెంటైన్‌లో మరింత తీరిక లేకుండా ఉన్నారు. కరోనా హెల్త్ వర్కర్‌లకు ఆర్థికంగా చేయూతను ఇస్తున్నారు. అయితే ఇది వ్యక్తిగతంగా ఇవ్వడం కాదు. ఆరోగ్య కార్యకర్తల సంక్షేమం కోసం పని చేస్తున్న నికార్సయిన సంస్థలకు కోట్ల రూపాయల విరాళాలు పంపుతున్నారు. బాలల విద్య, వికాసం, సంరక్షణల కోసం అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నారు. వాటి బాధ్యతలు కొన్నింటిని తనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. లాక్‌డౌన్‌లో దినసరి కూలీలకు అండగా ఉండి, అన్నివిధాలా వారిని ఆదుకునేందుకు ఏర్పాటైన రిలీఫ్ ఫండ్‌లకు భర్త నిక్‌తో కలిసి భారీగా నిధులు అందజేస్తున్నారు. బాలల సంరక్షణ కోసం టీనేజ్ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌తో కలిసి పని చేయడానికి కూడా ప్రియాంక ఏమాత్రం సంకోచించలేదు.
సమాజం కోసం పాటు పడుతున్న ప్రతి మహిళా, ప్రతి బాలికా.. ప్రియాంక దృష్టిలో సూపర్ ఉమనే. ఇప్పుడా సూపర్ ఉమన్ లిస్ట్‌లో మనం స్కై కృష్ణను కూడా చేర్చుకోవాలి. ప్రియాంక వంటి అందాల రాణిని మరింత అందంగా చేసిందంటే పెద్ద విషయమే.
Comments
Please login to add a commentAdd a comment