‘అందుకే అమ్మను సుత్తి ఆంటీ అని పిలిచేవారు’ | Special Story On Suthi Veerabhadra Rao | Sakshi
Sakshi News home page

ఆ చెన్నై రోజులు తిరిగిరావు

Published Wed, Jan 1 2020 1:52 AM | Last Updated on Wed, Jun 30 2021 11:34 AM

Special Story On Suthi Veerabhadra Rao   - Sakshi

‘అసలు మనం ఎవరం’... ‘తండ్రీ కొడుకులం’...‘కాదు భారతీయులం’.. ‘నీ నూనె నీ నూనే నా నూనె నా నూనే’... హైదరాబాద్, ముస్తాబాదు, సికిందరాబాదు’...‘నీ నవరంధ్రాల్లోను మైనం కూరతానురా తలకు మాసిన కుంకా’... ఇటువంటి అనేక హాస్య సంభాషణలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచారు సుత్తి వీరభద్రరావు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నాటక విభాగంలో హీరోగా నటించిన వీరభద్రరావు, జంధ్యాల మార్కు సినిమాలతో సుత్తి వీరభద్రరావుగా తెలుగు సినీ ప్రపంచంలో స్థిర పడి  పోయారు. వేలుతో కలిసి సుత్తి జంటగా ప్రేక్షకుల గుండెల్లో నేటికీ సుత్తి కొడుతూనే ఉన్నారు. నేడు(జూన్‌ 30)  సుత్తివీరభద్రరావు వర్థంతి. ఈ సందర్భంగా ఆయన కుమారుడు మామిడిపల్లి చక్రవర్తితో ఈ వారం సినీ పరివారం.

నాన్నగారికి మేం ఇద్దరు పిల్లలం. నేను, నా తరవాత చెల్లాయి విజయనాగలక్ష్మి. నా కంటె రెండేళ్లు చిన్నది. అమ్మ పేరు శేఖరి. నాన్నగారు 1971లో ఆలిండియా రేడియోలో చేరారు. నేను 1972లో పుట్టాను. నేను పుట్టాక నాన్నకు ప్రమోషన్‌ వచ్చిందని అందరితోనూ సంతోషంగా అనేవారట. మేం విజయవాడ కృష్ణలంకలో ఉండేవాళ్లం. సినిమాలలో నాన్న మామూలు వీరభద్రరావు నుంచి సుత్తి వీరభద్రరావు అయ్యాక అమ్మను అందరూ ‘సుత్తి ఆంటీ’ అని సరదాగా పిలిచేవారు. నాన్నకి సినిమా అవకాశాలు పెరగటంతో 1982లో ఆకాశవాణి ఉద్యోగం విడిచిపెట్టేసి  చెన్నై షిఫ్ట్‌ అయ్యాం. కాబట్టి ఎనిమిదో క్లాసు నుంచి చెన్నైలోనే నా చదువు కొనసాగింది. పదో తరగతిలో ఫస్ట్‌ క్లాసు వచ్చినందుకు నాన్న సంబరపడ్డారు.  నాన్న చనిపోయేనాటికి నేను ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నాను. అమ్మ చాలా మొండి మనిషి. నాన్న మరణం తాలూకు బాధను దిగమింగి, ధైర్యంగా మమ్మల్ని ముందుకు నడిపించింది.

ఇద్దరిని పోగొట్టుకున్నాను
ఎమ్‌సెట్‌లో 3000 ర్యాంకు వచ్చినా మంచి కాలేజీలో సీటు రాలేదు. నాన్న కంప్యూటర్‌ సైన్స్‌ చదవమని చెప్పారు. అందులో సీటు రాకపోవటం తో, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉద్యోగం చేస్తూ,  నైట్‌ కాలేజీలో బీఎస్సీ ఫిజిక్స్‌ చదువుకున్నాను. నేను బీఎస్సీలో చేరినప్పుడు దగ్గరి బంధువులంతా ‘బోడి బీఎస్సీ’ అని వెటకారమాడారు. అటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు ‘కొందరికి దూరంగా ఉంటేనే బాగుపడతాం’ అనిపించింది. కొద్దిగా స్థిరత్వం వచ్చాక, పై చదువుల కోసం అమెరికా వెళ్లి, అక్కడ పి.జి. డిప్లమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ చేసి, నిలదొక్కుకున్నాక, ఇండియా వచ్చేశాను. చెల్లి ఎమ్మెస్సీ మాథమేటిక్స్‌ చేశాక 2002లో వివాహం చేశాను. నా జీవితంలో త్వరగా నాన్నని పోగొట్టుకోవడం ఒక దురదృష్టమైతే, చెల్లిని పోగొట్టుకోవటం మరో బాధాకర సంఘటన. ఆమెకు బ్రెస్ట్‌ క్యాన్సరు వచ్చి కన్నుమూసింది. చెల్లెలికి ఒక కూతురు. పేరు తనుశ్రీ. పదో తరగతి చదువుతోంది.

బాధ్యతలు తీసుకున్నాను
నాన్న పోవడం వల్ల ఒక కొడుకు మీద బాధ్యతలన్నీ వచ్చి చేరతాయి. అందుకు నేను కూడా అతీతం కాదు. జీవితంలో ఒక్కో మెట్టు ఎదుగుతున్నప్పుడు నాన్నను మిస్‌ అయ్యాననే భావన కలుగుతూనే ఉంటుంది. అంతలోనే ఆయన వెంట ఉన్నట్టు భావించుకుంటాను. నా వివాహం జరిగాక, యు.కె వెళ్లి కొంతకాలం తరవాత వెనక్కు వచ్చి, 2008లో సొంత కంపెనీ ప్రారంభించాను. ప్రస్తుతం ‘ప్రొడక్ట్‌ సర్వీస్‌ మేనేజ్‌మెంట్‌’ చేస్తున్నాం.

విజయవాడలో...
విజయవాడలో ఉన్న రోజుల్లో నాన్న హనుమంతరాయ గ్రంథాలయంలో వేసే నాటకాలకు వెళ్లేవాడిని. కన్యాశుల్కం నాటకం చూసినట్టు గుర్తు. చెన్నైలో నాన్నతో గడిపిన నాలుగు సంవత్సరాలు నాకు గోల్డెన్‌ పీరియడ్‌. ఆ టైమ్‌లో సినిమా షూటింగులు, డబ్బింగులకు నాన్నతో వెళ్లేవాడిని.  శబరిమలకి వెళ్లినప్పుడు మా కారుకి ప్రమాదం జరిగింది. దేవుడి దయ వల్ల బయటపడ్డాం. అది నిజంగానే దేవుడి మహిమేనేమో అనిపిస్తుంది. నాన్నతో నాలుగు సార్లు శబరిమలకు వెళ్లడం మరచిపోలేని సంఘటన.

అందుకోసమే ఉండిపోయాం
నాన్న పోయేనాటికి నాన్నకు కొంతమంది సుమారు నాలుగు లక్షలు బాకీ ఉన్నారు. ఎవరెవరు ఇంతెంత ఇవ్వాలో నాన్న ఒక లిస్టు రాసి పెట్టారు. వాటిని తిరిగి రాబట్టుకోవటం కోసం చెన్నైలోనే ఉండిపోదాం అంది అమ్మ. నాలుగేళ్లు తిరిగితే మూడు లక్షలు తీసుకురాగలిగాను. పొద్దున్నే వెళ్లి నిర్మాతల దగ్గర నిలబడాల్సిందే. కొంతమంది నిర్మాతలు పరవాలేదు మరికొందరు ఇబ్బంది పెట్టారు.   ఆ అనుభవమే నా భవిష్యత్తుకు పునాది అనుకుంటాను. ఇదంతా చూసి, జంధ్యాలగారు బాధపడి, నిర్మాతల బదులు ఆయన ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. అమ్మ స్నేహితులు సపోర్ట్‌గా నిలబడ్డారు.

దీపావళి నాన్నతోనే
నాన్న షూటింగుల్లో ఎంత బిజీగా ఉన్నా, దీపావళికి మాత్రం మాతోనే గడిపేవారు. ఉదయమంతా షూటింగ్‌లలో బిజీగా ఉన్నప్పటికీ, చీకటి పడకుండా ఇంటికి వచ్చేసేవారు. నాన్న నటించిన చిత్రాలలో ‘పుత్తడిబొమ్మ’ బాగా ఇష్టం. ఆ సినిమాలో పెళ్లిలో ఒక పద్యం చదువుతారు. చాలా నవ్వొస్తుంది. ఆ చిత్రానికి నాన్నకు అవార్డు కూడా వచ్చింది. ‘రెండు రెళ్లు ఆరు’, ‘బాబాయ్‌ అబ్బాయి’ చిత్రాలలో నాన్న తన పాత్రను ఇంప్రొవైజ్‌ చేశారు. ‘పడమటి సంధ్యారాగం’ చిత్రంలో నాన్న డబ్బింగ్‌ చెప్పిన విధానం బావుంటుంది. కళాకారుడు కష్టాలన్నీ మరచిపోయి, వేదిక మీద ఆనందం పొందుతాడు. ఆ తరవాత ఆ ఆనందం వారి మీద స్వారీ చేస్తుంది. అందువల్లే నాన్న ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసి ఉంటారు. ఏమైనప్పటికీ నాన్నను తలచుకోవటం నాకు ఆనందంగా ఉంది.

మా దగ్గరే ఉన్నారన్న భావన...
ఎన్నడూ బాధ్యతల నుంచి పారిపోలేదు. అమ్మ ఆశీర్వాదంతో ఇంటి బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చాను. నా భార్య పేరు కిరణ్మయి చావలి. తను ఆయుర్వేదిక్‌ డాక్టర్‌. మాకు ఒక అమ్మాయి. పేరు అనన్య. నాన్న సినిమాలు టీవీలో వస్తుంటే మా అమ్మాయికి చూపిస్తుంటాను. మేం ఆ సినిమాలు  చూస్తున్నంతసేపు నాన్న మా దగ్గరే ఉన్నారన్న భావన కలుగుతుంది. నా పుట్టినరోజు నాడు నాన్న సినిమా టీవీలో వస్తే నాన్న నన్ను ఆశీర్వదించినట్లు అనుభూతి చెందుతాను. నాకు క్రియేటివ్‌ ఫీల్డ్‌ మీద ఇంటరెస్ట్‌ ఉంది. అది బహుశ నాన్న ప్రభావం కావొచ్చు. కార్టూన్లు, స్కిట్స్‌ చేశాను. ఇది హాబీ మాత్రమే. ‘బాబాయ్‌ అబ్బాయ్‌’ చిత్ర షూటింగ్‌కి Ðð ళ్తున్నప్పుడు మొదటిసారి నాన్నతో విమానం ఎక్కాను. అది నా జీవితంలో మరచిపోలేని రోజు. ఆ చిత్రంలో నాన్న ‘సీతారామ సంగ్రామం’ ఘట్టంలో ఆడవేషం వేసి పాట పాడతారు. ఆ తరవాత నాన్నకి దండ వేయాలి. నన్ను వేయమన్నారు. ఆ దృశ్యం ఎప్పటికీ మరచిపోలేను.
– సంభాషణ: వైజయంతి పురాణపండ
ఫొటోలు: షేక్‌ రియాజ్, ఏలూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement