
ఇన్షా అల్లా
తన మీద వచ్చిన అపవాదులకు అజహరుద్దీన్ నిజ జీవితంలో ఎప్పుడూ జవాబు చెప్పలేదు. వెండితెర మీద సమాధానాలు వస్తాయని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇన్షా అల్లా (వారి కొరిక నెరవేరుగాక).
గత ఆదివారం సాయంత్రం... కోల్‌కతాలో ఐపీఎల్ ఫైనల్ జరుగుతోంది. ముంబైలోని సోనీ స్టూడియోలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీతో కలిసి అజహరుద్దీన్ కూర్చున్నాడు. ఈ మాజీ కెప్టెన్ జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న సినిమా గురించిన ప్రమోషన్ కోసం ఈ ఇద్దరూ అక్కడ కూర్చున్నారు. సరిగ్గా పదంటే పదే నిమిషాల్లో ముంబైలో మీడియా ఒళ్లు విరిచింది. టాట్... భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న వ్యక్తి ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా స్టూడియోలో ఎలా కూర్చుంటాడు? అంటూ ప్రశ్నల బాణాలను వదిలింది. ఎక్కడో కోల్‌కతాలో మ్యాచ్ జరుగుతుంటే... ఇక్కడ ఓ ప్రైవేట్ చానెల్ స్ట్టూడియోలో అజహర్ కూర్చోవడం తప్పా..?
ఈ సంఘటన చెప్పడానికి కారణం ఉంది. అజహరుద్దీన్ పబ్లిక్ రిలేషన్స్ (పీఆర్) విషయంలో చాలా వీక్. నలుగురితో మాట్లాడటం, మీడియాతో సన్నిహితంగా మెలగడం తెలియదు. ఇప్పుడే కాదు... తాను క్రికెటర్‌గా, కెప్టెన్‌గా ఉన్న రోజుల్లో కూడా అంతే. మాజీ క్రికెటర్లంతా కామెంటేటర్లుగా, కోచ్‌లుగా రకరకాలుగా క్రికెట్‌తో సంపాదించుకుంటుంటే అజహర్ వెనకబడిపోవడానికి కారణం కూడా ఇదే. తనని తాను మార్కెటింగ్ చేసుకోవడం అజహర్‌కు చేతకాలేదు. నిజంగా చేతనై ఉండుంటే ఇంకా బీసీసీఐ నిషేధం అతనిపై ఉండేది కాదు.
భారత క్రికెట్‌కు అత్యుత్తమ కెప్టెన్ అజహరుద్దీన్. ఇవ్వాళ ధోని సూపర్ స్టార్ కావచ్చు. కానీ నేడు ధోని కెప్టెన్‌గా సాధించిన విజయాలను అజహర్ ఎప్పుడో 15 ఏళ్ల క్రితమే సాధించాడు. యువతలో స్ఫూర్తి నింపడానికి విజయాలు అవసరమైతే... అజహర్‌ను మించి స్ఫూర్తి నింపే క్రికెటర్ లేడు. అందుకే హైదరాబాద్‌లో అతనంటే ఆరాధన. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి స్వయంకృషితో ఎదిగి, ఎవరి మద్దతు లేకుండా భారత కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. అందుకే తనంటే అప్పట్లో యువతలో పిచ్చి క్రేజ్. మణికట్టు మాయాజాలంతో పరుగులు చేయొచ్చని క్రికెట్ ప్రపంచానికి చూపించిన మొదటి ఆటగాడు అజహర్.
క్రికెటర్‌గా అజహర్ ప్రస్థానం ఓ సాధారణ ఆటగాడి కలలా సాగింది. 1984లో ఇంగ్లండ్‌తో సిరీస్‌కు జట్టులోకి వచ్చిన అజహర్... వరుసగా ఆడిన మూడు టెస్టుల్లోనూ సెంచరీలు చేశాడు. కెరీర్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేసిన ఆ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది.
2000లో బెంగళూరులో దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచే అజహర్ ఆఖరి టెస్టు. ఆ తర్వాత ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్‌కు దూరమయ్యాడు. మ్యాచ్ ఫిక్సింగ్ కేసు కారణంగా అజహర్ చాలా నష్టపోయాడు. 99 టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత క్రికెట్ దిగ్గజం వంద మ్యాచ్‌ల మార్కును చేరుకోలేకపోయాడు. ఘనంగా ఆటకు వీడ్కోలు పలకాల్సిన క్రికెటర్ మౌనంగా తెరచాటుకు వెళ్లిపోయాడు. బీసీసీఐ నుంచి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో 2012లో హైకోర్టు నుంచి అజహర్‌కు క్లీన్‌చిట్ వచ్చింది. కానీ బీసీసీఐ నిషేధం మాత్రం ఇంకా తొలగిపోలేదు.
ఈ క్రమంలో అజహర్ కొత్త కెరీర్ చూసుకున్నాడు. 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి గెలిచాడు. ఎక్కడ హైదరాబాద్... ఎక్కడ మొరాదాబాద్. అజహర్‌కు దేశం మొత్తం క్రేజ్ ఉందనడానికి లోక్‌సభ ఎన్నిక నిదర్శనం.
బాధ్యత గల కుటుంబ పెద్ద
ఒక్కసారి భారత క్రికెట్ జట్టులోకి వస్తే రకరకాల బిజినెస్‌లు ప్రారంభించి సంపాదించుకునే అవకాశం ఉంది. దాదాపుగా ప్రతి భారత క్రికెటర్ దీనిని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. కానీ అజహర్ మాత్రం కమర్షియల్ కోణాన్ని పట్టించుకోలేదు. ఆట, కుటుంబం తప్ప మరో ధ్యాస లేకుండా గడిపాడు. అందుకే వ్యాపారాలేమీ చేయలేదు. అయితే స్నేహితుల సలహాలతో పుణే సమీపంలో భారీగా పొలాలు కొన్నాడు. ఇప్పుడు అవే అజహర్‌ను స్థితిమంతుడిగా నిలబెట్టాయి.
నిజానికి అజహర్ చాలా సాధారణ జీవితం గడిపాడు. ఓ మధ్యతరగతి కుటుంబంలో పెద్దవాడు తీసుకోవాల్సిన బాధ్యతలన్నీ తీసుకున్నాడు. తన ఇద్దరు తమ్ముళ్లకు డబ్బులు ఇచ్చి వ్యాపారాల్లో స్థిరపడేలా చూశాడు. 1996 వరకు అజహర్ సాధారణ మనిషి. కానీ ఒక్కసారి సినీ నటి, మోడల్ సంగీతా బిజ్‌లానీ ప్రేమలో పడ్డాక మొత్తం పరిస్థితి మారింది. హై ప్రొఫైల్ జీవితం అలవాటయింది. పార్టీలు, పరిచయాలు పెరిగాయి. తన క్రేజ్ తగ్గడం మొదలయ్యింది కూడా అప్పటి నుంచే. ఇప్పటికీ అజహర్ సూపర్ స్టార్. కానీ మొదటి భార్య నౌరీన్‌కు విడాకులు ఇవ్వకుండా ఉంటే ఆకాశాన్నంటిన క్రేజ్ అలాగే ఉండేది.
దీనివల్ల కొంతమంది అభిమానాన్ని పోగొట్టుకున్నాడు. అయితే బాధ్యత మాత్రం ఇప్పటికీ మరచిపోలేదు. 2011లో 19 ఏళ్ల వయసున్న చిన్న కుమారుడు అయాజుద్దీన్ మోటార్ బైక్ ప్రమాదంలో మరణించడాన్ని అజహర్ చాలాకాలం జీర్ణించుకోలేకపోయాడు. ఇప్పుడు పెద్ద కుమారుడు అసదుద్దీన్‌ను క్రికెటర్‌ను చేసే ప్రయత్నంలో ఉన్నాడు.
- జయప్రకాష్ బత్తినేని
అజహర్‌పై సినిమా
అజహర్ కథతో సినిమా వస్తోంది. ఇమ్రాన్ హష్మీ ఇప్పటికే అజహర్‌ను తలపిస్తూ బయట కూడా నడుస్తున్నాడు. ఇమ్రాన్ క్రికెట్ దుస్తులతో నడుస్తుంటే అజహర్ గుర్తొస్తున్నాడు. కచ్చితంగా ఈ సినిమా మొత్తం అజహర్‌కు అనుకూలంగానే ఉంటుంది. (మరి వ్యతిరేకంగా సినిమా తీస్తానంటే ఎవరూ ఒప్పుకోరు కదా). ఈ సినిమా కోసం క్రికెట్ ప్రపంచం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అజహర్‌ను ఫిక్సింగ్‌లో ఇరికించారనేది అతడి సన్నిహితులు చెబుతున్న మాట. అదే నిజమైతే అసలేం జరిగింది. భారత క్రికెట్‌లో అతి పెద్ద మ్యాచ్ ఫిక్సర్ అనే నింద అజహర్ మీద ఎలా పడింది? అతనేం అనుకుంటున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ సినిమాలో దొరుకుతుందేమో చూడాలి.!