విశ్వప్రతిభ | special story to ex india presedent prathibha patil | Sakshi
Sakshi News home page

విశ్వప్రతిభ

Published Sun, Dec 18 2016 10:09 PM | Last Updated on Mon, Sep 4 2017 11:03 PM

విశ్వప్రతిభ

విశ్వప్రతిభ

యు.ఎన్‌.ఫౌండేషన్‌ నేతృత్వంలోని ‘ప్రపంచ మహిళా నేతల మండలి’ సభ్యురాలిగా భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ ఎంపికయ్యారు. పూర్వ, ప్రస్తుత మహిళా ప్రధానులు, మహిళా రాష్ట్రపతులు సభ్యులుగా ఉండే ఈ  మండలిలో సభ్యత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఈ సందర్భంగా ప్రతిభ జీవితంలోని కొన్ని విశేషాంశాలు, స్ఫూర్తిదాయకమైన సందర్భాలు..

ఢిల్లీకి రాజైనా అమ్మకి కొడుకే కదా! ఒక అమ్మకు అలాంటి రాజ స్థానం దొరికితే? అప్పుడైనా అంతే. అమ్మకీ నాన్నకీ కూతురు. తోబుట్టువులకు అక్క లేదా చెల్లి. భర్తకి భార్య. సంతానానికి ఆమె అమ్మే! స్వతంత్ర భారత చరిత్రలో దేశ ప్రథమ పౌరురాలి స్థానం దక్కించుకున్న మొదటి మహిళ ప్రతిభా దేవీసింగ్‌ పాటిల్‌కూ ఇది అక్షరాలా వర్తిస్తుంది. పద్దెనిమిదో శతాబ్దంలో రాజస్థాన్‌.. యుద్ధాలతో సంక్షుభితంగా మారిన సమయంలో మహారాష్ట్రకు తరలి వచ్చిన రాజుల కుటుంబం వారిది. తండ్రి నారాయణరావ్‌ పాటిల్, తల్లి గంగాబా. ఆ కాలంలో ఒక స్త్రీపట్ల ఉండే అన్ని ఆంక్షలు ఆ కుటుంబంలో ఉన్నాయి. అలాంటి రాజ కుటుంబంలో పుట్టి పెరిగినా, భారత రాష్ట్రపతి స్థానానికి ఎంపికై, రాష్ట్రపతి భవన్‌లో ప్రతిభా పాటిల్‌ అడుగుపెట్టడం ఒక చరిత్ర. ఆరు దశాబ్దాల పాటు పురుషులే అధిరోహించిన ఆ అత్యున్నత స్థానాన్ని దక్కించుకున్న మహిళ ప్రతిభాపాటిల్‌.

అక్షరం అంటే అప్పట్లో అదృష్టమే!
నారాయణరావ్‌ (నానాసాహెబ్‌) చిన్న ఉద్యోగి. అవకాశాలు కల్పిస్తే ఆడపిల్లలు కూడా ప్రతిభను రుజువు చేసుకుంటారన్న ఒక స్పృహ నానాసాహెబ్‌కు ఉండేది. గంగాబా కూడాS పిల్లల చదువుల కోసం ఆరాటపడేవారు. ఇది అదృష్టం కాదని ఎలా అనగలం? ఆడపిల్లల పట్ల వివక్ష కాకుండా, మగపిల్లలతో సమంగా వాళ్లకీ విద్యావకాశాలు కల్పించాలన్న  విచక్షణ ఉండడం కాలాన్ని జయించిన దృష్టే మరి!

ఇద్దరమ్మాయిల తోడు
ప్రతిభ స్వస్థలం జల్‌గావ్‌ జిల్లాలో ఉంది. ఆమెను ఇంటిలో ‘తాయి’ అని మురిపెంగా పిలుచుకునేవారు. నానాసాహెబ్‌కు అక్కడ నుంచి చల్సిగావ్‌ బదలీ అయింది. కుటుంబం మొత్తం తరలివెళ్లింది. అప్పటికి తాయికి ఏడేళ్లు. దగ్గరలోనే ప్రాథమిక పాఠశాల ఉండడంతో ఎలాంటి సంకోచాలు లేకుండా చేర్పించారు. కానీ అది మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. నానాసాహెబ్‌కు మళ్లీ జల్‌గావ్‌ బదలీ అయింది. కానీ ఇక్కడ దగ్గరలో ప్రాథమిక పాuý శాల లేదు. సొంతూరే అయినా బయటకు పంపడానికి మొదట తండ్రి ఇష్టపడలేదు. కానీ వీరి కుటుంబం నివాసం ఉంటున్న ఇంటి కింది వాటాలో చక్రనారాయణ్‌ అనే పోలీస్‌ అధికారి ఉండేవాడు. అతడి కూతురు కక్కూ కొంచెం దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు వెళ్లేది. అది గమనించిన గంగాబా కూతురిని కూడా పంపడం ఆరంభించింది. పక్కనే మరో బాలిక తోడు ఉంది కాబట్టి నానాసాహెబ్‌ కూడా అభ్యంతరం చెప్పలేదు.

కక్కూది క్రైస్తవ కుటుంబం. ఈమెతో కలసి ప్రతిభ చర్చిలకు కూడా వెళ్లేది. ఆ ఇద్దరూ కూడబలుక్కుని డబ్బులు కూడబెట్టి ఒక బైబిల్‌ కూడా కొన్నారు. ఇవన్నీ ఇంటిలో తెలిసినా నానాసాహెబ్‌ కుటుంబం ప్రతిభను ఆటంక పరచలేదు. కానీ కొద్దికాలానికే కక్కూ తండ్రికి బదలీ అయింది. మళ్లీ తాయిని ఒంటరితనం ఆవరించింది. విద్య కొనసాగుతుందో లేదో అనుమానం. అలాంటి సమయంలోనే మరో పోలీసు అధికారి అదే ఇంట్లో దిగాడు. అతడి కూతురు సోఫీ ఖాన్‌. వీరు మహ్మదీయులు. సోఫీ అదే స్కూలులో చేరింది. అంటే తాయి మళ్లీ పాఠశాలకు వెళ్లే అవకాశం సోఫీ రూపంలో వచ్చింది. చిన్ననాటి మిత్రులు కక్కూ, సోఫీలతో ప్రతిభ స్నేహం చిరకాలం కొనసాగింది.

‘డాక్టర్‌ ప్రతిభ’ కాలేకపోయారు
మెట్రిక్‌ తరువాత జల్‌గావ్‌లోనే మూల్జీ జైతా కళాశాలలో చేరడానికి ప్రతిభకు తండ్రి నుంచి అనుమతి లభించింది. కానీ ఆమె కోరుకున్న సైన్స్‌ గ్రూప్‌లో చేరడానికి ఆయన అంగీకరించలేదు. సైన్స్‌ గ్రూప్‌ చదివి వైద్య విద్యకు వెళ్లాలన్నది ప్రతిభ ఆశయం. తన నలుగురి సోదరులలో ఒకడు ఆబాసాహెబ్, సమీప బంధువు ఇందర్‌లాగే తాను కూడా డాక్టర్‌ను కావాలని ఆకాంక్షించారామె. కానీ అప్పుడు జల్‌గావ్‌లో వైద్య కళాశాల లేదు. కూతురిని వేరే చోటికి పంపించి వైద్య విద్య చెప్పించడం నానాకు ఇష్టం లేదు. దానితో హ్యుమానిటీస్‌లో చేరారామె.

తోడుంటేనే.. సినిమాకైనా
ప్రతిభకు సినిమాలంటే మక్కువ. ఆ సంగతి చెబితే ఎవరినో తోడిచ్చి పంపేవాడు తండ్రి. హార్మోనియం నేర్చుకుంటానంటే ట్యూటర్‌ను పెట్టి ఇంటిలోనే నేర్పించారు. అలాగే తన ఆశయానికి విరుద్ధంగా హ్యుమానిటీస్‌లో చేరినా, ఆమెలోని క్రీడాకారిణి వెలుగులోకి రావడానికి ఆ కళాశాలే ఉపకరించింది. ఆమె కాలేజీ టెన్నిస్‌ చాంపియన్‌గా గుర్తింపు పొందారు. అప్పుడు నానాను ఒప్పించి ప్రతిభను ఆ కళాశాల ప్రిన్స్‌పాల్‌గా ఉన్న వైఎస్‌ మహాజన్‌ అంతర్‌ కళాశాలల పోటీకి నాసిక్‌ కూడా తీసుకువెళ్లారు (అన్ని కట్టుబాట్ల మధ్య కూడా ఒక మహిళగా విద్యా తృష్ణను తీర్చుకోవడమే ఆ కాలంలో సాధించిన విజయమని ప్రతిభా పాటిల్‌ జీవిత చరిత్ర ‘యాన్‌ ఇన్‌స్పిరేషనల్‌ జర్నీ: ప్రతిభాదేవీసింగ్‌ పాటిల్‌ ది ఫస్ట్‌ ఉమెన్‌ ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా’ ఆవిష్కరణ సందర్భంగా డిసెంబర్‌ 20, 2010 న జరిగిన ఆవిష్కరణ సందర్భంగా నాటి రాష్ట్రపతి  ఏపీజే అబ్దుల్‌కలాం చెప్పడం ఇందుకే. రసిక్‌ చౌబే, ఛాయా మహాజన్‌ ఈ పుస్తకం రాశారు).

పెళ్లికి ముందే ఎం.ఎ., ఎమ్మెల్యే!
‘అమ్మాయి విద్యార్హతలకు తగిన వరుణ్ణి వెతకడం కష్టంగా ఉంది’ అన్నాడు నానాసాహెబ్‌ ఓరోజు. నిజమే ఆ రోజుల్లోనే ప్రతిభ ఎంఎ రాజనీతి శాస్త్రం, ఎంఎ అర్థశాస్త్రం చదివారు. అందుకు ప్రతిభ కూడా దీటుగా సమాధానం ఇచ్చారు, ‘నా ఇష్టాలను గౌరవించేవాడిని, కట్నం కోరని వాడిని, తన రాజకీయ జీవితానికి అడ్డురాని వాడిని మాత్రమే చేసుకుంటాను’. పెళ్లికి ముందే ప్రతిభకు రెండు పీజీ డిగ్రీలు వచ్చేశాయి. పెళ్లికి ముందే ఆమె పేరు పక్కన మరో మూడు అక్షరాలు కూడా చేరాయి. అవి ఎం ఎల్‌. ఏ. – అన్న అక్షరాలు. మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికైన పిన్న వయస్కురాలిగా చరిత్రకెక్కిన మహిళ ప్రతిభ.

హాస్టల్‌లో పెళ్లిచూపులు
ఆ రోజున ప్రతిభ ఎమ్మెల్యే హాస్టల్‌లో  కూర్చుని ఉన్నారు. రాజకీయాలలో ఉండేవారి వేషధారణ అలవాటైంది. అంచు కలిగిన తెల్లటి చీర కట్టుకుని, ఎంతో హుందాగా ఆమె కూర్చుని ఉన్నారు. అప్పుడే ఒక యువకుడు వచ్చి ఆమెను చూశాడు. ఆయన దేవీసింగ్‌ షెకావత్‌. రసాయనిక శాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా పొందిన విద్యావంతుడు. ఇతడే ప్రతిభ తండ్రి వెతికిన వరుడు. అంటే ఆ ఇద్దరి పెళ్లిచూపులు ఎమ్మెల్యే హాస్టల్‌లోనే అనుకోకుండా జరిగాయి. ఆయనతోనే పెళ్లయింది. ఆ వెంటనే అత్తవారింటికి కూడా ప్రతిభ వెళ్లారు.
రెండు పీజీలు చేసిన యువతి, పిన్న వయసులోనే రాజకీయాలలో అడుగు పెట్టిన వనిత, శాసనసభకు వెళుతున్న విదుషీమణి ఇంటి కోడలి పాత్రను ఎంతవరకు నెట్టుకు వస్తుందో చూడాలనే అంతా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ కాపురం ఎలా సాగుతుందోనన్న ప్రశ్న కూడా ఉంది. అలాంటి పరిస్థితిలో ఒకరోజు ప్రతిభ వంట చేసి ఇంటిల్లిపాదికి చక్కని భోజనం వడ్డించారు. సంశయాలన్ని సర్దుకున్నాయి. ఆ తర్వాత దేవీసింగ్, ప్రతిభ కలసి జల్‌గావ్‌లో, పుణేలో ఎన్నో విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. వృత్తి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల వారికి సహాయం అందించారు.

భర్తతో గొడవొచ్చి రాజీనామా!
దేవీసింగ్‌ రామ్‌సింగ్‌ షెకావత్‌  ఎంతో విద్యావంతుడు. కానీ ముక్కు మీద ఉండేది కోపం. అలాంటి వ్యక్తితో ప్రతిభ వైవాహిక జీవితం ఎలా సాగింది?  ప్రతిభ నిత్యం రాజకీయాలతో మునిగి తేలుతూ ఉంటారు. బయటకు వెళితే ఆమెకు దొరికే గౌరవాదరాలు ఎంతో భిన్నంగా ఉంటాయి. దీనిని పురుషాహంకారం భరించగలదా? ఈ ప్రశ్నలకు సంబంధించిన వాతావరణం వారి కుటుంబంలోను అడపాదడపా ఏర్పడకపోలేదు. ఏదో పని మీద పొరుగూరు వెళ్లిన దేవీసింగ్‌ ఆ రోజున ఇల్లు చేరుకున్నారు. ప్రతిభ ఎవరితోనో ఏదో విషయం తీవ్రంగా చర్చిస్తున్నారు. దేవీసింగ్‌ పిలిచారు. అది వినిపించిందా? వినిపించినా ఆమె పరాకు పడ్డారా? ఏమైనా, పొరుగూరు నుంచి వచ్చిన సందర్భంలో తన భార్య వెంటనే వచ్చి పలకరించకపోవడం దేవీసింగ్‌ను తీవ్ర ఆగ్రహానికే గురి చేసింది. ఇద్దరికీ మధ్య మాటా మాటా పెరిగింది. తీవ్ర మనస్తాపంతో ప్రతిభ రాజీనామా లేఖను రాసి నేరుగా ముఖ్యమంత్రి వసంతరావ్‌ నాయక్‌కు పంపించారు. అందులో రాజీనామాకు చూపించిన కారణం– అనారోగ్యం. నాయక్‌ను వాకబు చేస్తే నెమ్మదిగా అసలు విషయం బయటపడింది. తరువాత ఇద్దరినీ కూర్చోబెట్టి నచ్చచెప్పిన తరువాత దేవీసింగ్‌ సర్దుకున్నారు. ప్రతిభ రాజీనామాను ఉపసంహరించుకున్నారు.

దేవీసింగ్‌ ప్రతిభ రాజకీయ జీవితానికి అడ్డుకాదని చాలాసార్లు రుజువు చేసుకున్నారు. పెళ్లయ్యాకనే ఆమె న్యాయశాస్త్రం కూడా అభ్యసించారు. జల్‌గావ్‌ జిల్లా కోర్టులో కొద్దికాలం న్యాయవాదిగా పనిచేశారు కూడా. ఇద్దరూ కలసి పలు సాంస్కృతిక సంస్థలను కూడా నిర్వహించారు. పెళ్లయిన తరువాత కూడా పుట్టింటి పేరును (పాటిల్‌) ఎందుకు కొనసాగించారని ఒక వార్తా సంస్థ అడిగింది. తన నియోజక వర్గ ప్రజలకి తన పేరు అలాగే తెలుసు కాబట్టి ఆ పేరే కొనసాగిందని ఆమె జవాబిచ్చారు.  ప్రతిభ ప్రతి పుట్టినరోజుకు దేవీసింగ్‌ ఒక కానుక ఇస్తారు. అది చక్కని చీర.

భయపడుతూనే ప్రసంగం
రాష్ట్రపతి అయినా, ప్రధాని అయినా తరగతి గదులలో కొన్ని భయాలను ఎదుర్కొనక తప్పదు. కొన్ని అంశాలంటే బెదిరిపోయి కూడా ఉండవచ్చు. ప్రతిభా పాటిల్‌కు లెక్కలన్నా, సంస్కృతమన్నా చచ్చేంత భయమట. ఈ విషయాన్ని ఆమె ఒక ప్రత్యేక సందర్భంలో వెల్లడించారు. రాజస్థాన్‌ గవర్నర్‌గా ప్రతిభ పనిచేస్తున్నప్పుడు గణితశాస్త్రవేత్తల సదస్సులో ప్రసంగించడానికి పిలిచారు. సందేహిస్తూనే వచ్చారామె. తరగతి గదిలో లెక్కల క్లాసంటే హడలిపోయిన తాను, గణితశాస్త్రవేత్తల సదస్సులో ప్రసంగించడానికి భయపడుతూనే వచ్చానని అంగీకరించారు. అందుకు ఆమె చెప్పిన కారణం ప్రత్యేకంగా ఉంది. ఏ దేశంలో చూసినా రెండు రెళ్లు నాలుగే. కానీ రాజకీయాలలో మాత్రం మాత్రం రెండు రెళ్లు నాలుగు కాదని ఆమె చమత్కరించారు. బహుశా ఇది చెప్పడానికే ఆమె ఆ సదస్సుకు హాజరయ్యారేమో!

ఇల్లు... రాజకీయాలు
జ్యోతి రాథోర్, రాజేంద్రసింగ్‌ ప్రతిభా పాటిల్‌ సంతానం. నిజానికి ఈ ఇద్దరి అచ్చటా ముచ్చటా నేరుగా తల్లిద్వారా తీరలేదన్నది ఒక వాస్తవం. ఒక దగ్గర బంధువు సంరక్షణలో వీరు పెరిగారు. కొడుకు రాజకీయాలలోకి వచ్చినా కూతురు జ్యోతి మాత్రం పెళ్లి చేసుకుని ప్రశాంతంగానే వైవాహిక జీవితం గడుపుతున్నారు. రాజేంద్ర పిన్న వయసులో తల్లిదండ్రుల సాంగత్యం లేకపోవడం వల్ల కొంచెం మొండితనం అలవరుచుకుని సమస్యగా మారిపోయాడు. కానీ కొడుకును మళ్లీ దారిలో పెట్టడానికి ప్రతిభ గట్టిగానే కృషి చేయవలసి వచ్చింది. పెద్దలు, పిన్నలు అని లేకుండా అందరిని అగౌరవపరిచే ధోరణి అతడిది. ఒట్టి పెంకితనం. కొడుకును ఒక పక్క దండిస్తూనే, మళ్లీ లాలనతో అతడి తప్పును దిద్దుతూ చిరకాలం ప్రయత్నించి మొత్తానికి కొడుకును ప్రయోజకుడిని చేయగలిగారు ప్రతిభ. అంత తీరిక లేని రాజకీయాలలో ఉండి కూడా తల్లి పాత్రను కూడా ఆమె సక్రమంగా నిర్వహించారు. ‘ది ఫస్ట్‌ ఉమెన్‌ ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా రీ ఇన్వెంటింగ్‌ లీడర్‌షిప్‌’ అన్న పుస్తకంలో నైనాసింగ్‌ ఈ అంశాన్ని హృద్యంగా నివేదించారు. కొన్ని విమర్శలు వచ్చినా 28 మాసాలలో మొత్తం 30 మంది మరణదండన ఖైదీలకు ఆమె క్షమాభిక్ష పెట్టారు. కుటుంబాన్నీ, రాజకీయాలనీ సమతూకంతో నడిపిన కీర్తి ప్రతిభా పాటిల్‌ సొంతమనిపిస్తుంది. – గోపరాజు నారాయణరావు

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement