నేను మీ కిడ్నీని | special story to kidny | Sakshi
Sakshi News home page

నేను మీ కిడ్నీని

Published Wed, Jan 6 2016 10:29 PM | Last Updated on Sun, Sep 3 2017 3:12 PM

నేను  మీ కిడ్నీని

నేను మీ కిడ్నీని

నేను ఆనంద్ కవల కిడ్నీని. నడుములోని  వెన్నుపూసకు ఇరుపక్కలా ఇద్దరం ఉంటాం. నేను మూత్రం తయారీకి మాత్రమేనని ఆనంద్ అనుకుంటూ ఉంటాడు. నిజానికి ఆనంద్ శరీరమంతటికీ నేనే మాస్టర్ కెమిస్ట్‌ను.  అంతేకాదు... శరీరంలోని ఎర్ర రక్తకణాల ఉత్పాదనలో నాకూ వాటా ఉంది. శరీర భాగాలన్నింటిలోనూ ఎక్కువ రక్తం అందేది మెదడుకు అని అందరూ అనుకుంటుంటారు. ఇది కొద్దిమేరకు మాత్రమే వాస్తవం.  నిజానికి ఎక్కువ రక్తం నాలోంచే ప్రవహిస్తుంటుంది. శరీరంలోని నీటి సరఫరాను నేనే నియంత్రిస్తుంటాను. రక్తంలోని పొటాషియమ్, సోడియమ్ క్లోరైడ్ మోతాదులను సరిచూసేదీ నేనే.
  ఆకారం చిన్నది... పని పెద్దది

నా బరువు కేవలం 140 గ్రాములే కానీ... నేను చేసే పనులను ఒక పట్టికలా రాసినా... ఒక పట్టాన అది పూర్తి కాదు. ఒకవైపు నేనూ, మరోవైపు నా హలోబ్రదర్... ఇద్దరం కలిసి వడపోత పనిని చేస్తుంటాం. నాలో కనీసం పది లక్షల వడపోత యూనిట్లు పనిచేస్తుంటాయి. ఒక్కో యూనిట్‌ను నెఫ్రాన్ అంటారు. ఇది సన్నటి తీగలుగా, చుట్టలు చుట్టినట్లుగా ఉంటుంది. తోకలాంటి ఈ సన్నటి పైపునకు ఒక తల కూడా ఉంటుంది. తీగలుగా చుట్టున ఒక పైపును సాగదీస్తే అది కనీసం 105 కిలోమీటర్ల పొడవుంటుంది. ఇంత పొడవుండే సన్నటి తీగల ద్వారా కొనసాగే ఈ వడపోత ఎంత నిరంతరాయం సాగుతుందో వివరించాలంటే తనకు తెలికుండా నేను ఆనంద్ ఒంట్లో చేసే ఒక అద్భుతం గురించి చెప్పాలి. అదేమిటంటే... ఆనంద్ ఒంట్లో ఆరు లీటర్ల రక్తం ఉందనుకుందాం. మేమిద్దరమూ కలిసి గంటకు 12 లీటర్ల రక్తాన్ని వడపోస్తాం. అంటే ఆనంద్ శరీరంలో ఉన్న మొత్తం రక్తానికి రెట్టింపు ఫిల్టర్ చేస్తాం.

చక్కెర బయటకు పోదు... పొటాషియమ్ తగ్గద
ఇంత జరుగుతున్నా శరీరంలోని అమైనో యాసిడ్స్, విటమిన్లు, చక్కెర లాంటి వాటిని బయటకు వెళ్లనివ్వం. ఇలా దేహంలో ఎన్నో వైపరిత్యాలు, అనర్థాలూ జరగకుండా మేం నిత్యం ఆపుతుంటాం. వడపోసిన పదార్థాల్లో మళ్లీ అవసరమైన వాటిని 99 శాతాన్ని తిరగి శరీరానికి అందిస్తుంటాం. కేవలం వ్యర్థాలను మాత్రమే మూత్రం రూపంలో బయటకు పోనిస్తాం. ఒకవేళ ఆనంద్ రెండు పెద్ద పెద్ద పేస్ట్రీలు తిని... తాను డయాబెటిస్ పేషెంట్ అని తన డాక్టర్‌ను నమ్మించడానికి ప్రయత్నిస్తే ఆనందే ఫూల్ అవుతాడు. ఎందుకంటే చక్కెరలను నేను అంత తేలిగ్గా బయటకు పోనివ్వను. కానీ తాను రుచి కోసం అధిక మోతాదులో తీసుకున్న ఉప్పు అంతా రక్తంలోనే ఉండిపోతుందని ఆనంద్ నమ్మితే... అతడు ఉప్పులో కాలేసినట్టే! చక్కెరలనంటే బయటకు పోనివ్వలేదుగానీ పిడుక్కీ, బియ్యానికీ లాగా... ఉప్పులకూ, చక్కెరకూ నేను ఒక్కటే మంత్రం పఠిస్తే ఆనంద్ చచ్చూరుకుంటాడు. ఆ ఉప్పు శరీరంలో ఉన్న నీటిని లాగేస్తుంది. ఫలితంగా రక్తం చిక్కబడుతుంది. ఆనంద్ రక్తాన్ని పంప్ చేయడానికి అతడి గుండె ఎంతో కష్టపడుతుంది. ఆనంద్ కడుపు నిండా తింటూ, పళ్లరసాలూ అవీ తాగుతూ తగినంత పొటాషియమ్ తీసుకుంటూ ఉంటే పర్లేదు. అతడి కండరాలు సక్రమంగా పనిచేయడానికి అది కావాలి. అతడు తన ఆహారం ద్వారా తగినంత పొటాషియమ్ తీసుకోవడం లేదనుకోండి. నేనో పిసినారిలా దాన్ని వాడుతుంటా.
 
విపరీతమైన శ్రమ... నిరంతరమైన పని
 ఆనంద్ శరీరంలోంచి నేను బయటకు తోడివేసే ప్రధానమైన వ్యర్థం ‘యూరియా’. మనం తీసుకునే ప్రోటీన్లు జీర్ణమయ్యే ప్రక్రియలో మిగిలిపోయే పదార్థమిది. ఇది శరీరంలో ఉండిపోవడం అత్యంత ప్రమాదకరం. ఒకవేళ మిగిలిపోయిందా... ఇక అంతే సంగతులు. మొదట నీరసం. తర్వాత నిదానంగా కోమా. చివరికి మరణం. అందుకే యూరియా పేరుకోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తపడతాను.
 
కిడ్నీలో రిజర్వాయర్
 కనీసం రోజుకు ఒక లీటర్‌కు తగ్గకుండా మూత్రాన్ని తయారు చేస్తాం.  నెఫ్రాన్‌ల నుంచి నిరంతర రక్తప్రవాహం కొనసాగి... అది చివర్లో ఒక అద్భుతమైన అత్యంత సూక్ష్మమైన రిజర్వాయన్‌లోకి తెరచుకుంటుంది. అది సరిగ్గా నా మధ్యలో (కిడ్నీ సెంటర్‌లో) ఉంటుంది.  ఈ రిజర్వాయర్ నుంచి మూత్రసంచి (బ్లాడర్) కి మళ్లీ నీటి పారుదల దారులుంటాయి. వీటి ద్వారా ప్రతి 10-30 సెంకడ్లకు ఒకసారి వ్యర్థాలను బయటకు నెడుతుంటాను. పగటితో పోలిస్తే... రాత్రి కాస్త మందకొడిగా పనిచేస్తుంటా. లేకపోతే మూత్రశాలకు వెళ్లడానికంటూ ఆనంద్ ప్రతి గంటకూ ఒకసారి  లేవాల్సి ఉంటుంది.

పెరిగే వయసు... తగ్గే పనితీరు
ఆనంద్‌కు 47 ఏళ్లు నిండాక... మెల్లగా నాలోనూ వయసు పెరగడం మొదలవుతుంది. నా చుట్టూ ఉండే కొవ్వు పడక మీద నేను శయనించి ఉంటాను. ఒకవేళ ఏదైనా సమస్యతో ఈ కొవ్వు పడక కరిగితే... అప్పుడు నేను పక్కకు జరుగుతాను. ఒక్కోసారి నాలో రాళ్లు కూడా పేరుకుపోతాయి. ఈ రాళ్లు క్యాల్షియమ్, యూరిక్ యాసిడ్‌తో తయారవుతాయి. రోడ్డు మీద కంకర ఉంటే ట్రాఫిక్‌కు అంతరాయం కలిగినట్లుగా ఈ రాళ్ల వల్ల మూత్రప్రవాహానికి అడ్డుకలుగుతుంది. అది  చిన్న రాయి అయితే చిదిమినట్లుగా అయిపోవడం, లేదా కిందికి జారిపోవడం  జరుగుతుంది. కానీ కంకరరాయి ఎంత పెద్దదయితే అడ్డంకి అంతగా పెరుగుతున్నట్లుగానే... నాలోని రాయితోనూ అలాంటి ప్రమాదమే ఉంటుంది. అది బఠాణీ గింజ అంత కావచ్చు. లేదా ఒక్కోసారి ద్రాక్షపండు అంత పెరగవచ్చు. రోడ్డు మీద పెద్ద పెద్ద రాళ్లను పారతో పక్కకు తీసేసినట్టే, నాలో అంతగా పెరిగిన రాళ్లనూ సర్జరీతో తొలగించాలి. లేదంటే రాయి సైజు మరీ పెద్దదయితే రిజర్వాయర్‌లో ఇరుక్కుపోతుంది. రాయి నాలోని రిజర్వాయర్ లోంచి బ్లాడర్‌లోకి జారి మూత్రప్రవాహాన్ని అడ్డుకోవచ్చు. రిజర్వాయర్‌కు లేదా బ్లాడర్ గోడలకు గానీ గాయం కావచ్చు. అదే జరిగితే ఇన్ఫెక్షన్  విలన్‌లా పొంచి ఉంటుంది. ఒకసారి ఇన్ఫెక్షన్ ఏర్పడితే అది తన సామ్రాజ్యాన్ని రిజర్వాయర్ నుంచి కిందకు  విస్తరించవచ్చు. అందుకే రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే... ఆనంద్ ద్రవాహారం ఎక్కువగా కావాలి.
 
నేను సరిగా పనిచేయడం లేదని ఎలా తెలియాలి
ఒక్కోసారి రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే యాక్సిడెంట్లలోనూ నేను గాయపడవచ్చు. లేదా ఒక్కోసారి నాలోని రక్తనాళాలూ తెగవచ్చు. ఇవేమి జరిగినా నాకు కలిగే ప్రమాదం తాత్కాలికమే. ఎందుకంటే కోలుకునే శక్తి నాలో అపారం. అయితే ఒక్కటి... వయసు పెరుగుతున్న కొద్దీ నాలోకి ప్రవహించే రక్తనాళాలు గట్టిపడవచ్చు, సన్నబడవచ్చు. వాటి మృదుత్వం తగ్గవచ్చు. ఆనంద్ గుండె పంపింగ్ సామర్థ్యమూ తగ్గవచ్చు. అప్పుడు నాలోకి వచ్చే రక్తప్రవాహ వేగం తగ్గవచ్చు. నాలో వ్యర్థాలూ పోగుపడవచ్చు. అప్పుడు నేను రక్తంలోని లవణాల పాళ్లను సక్రమంగా నియంత్రించలేకపోవచ్చు. ఇది ఆనంద్‌లోని మొదలైంది. అదృష్టవశాత్తూ నాకు ఒక అన్నదమ్ముడున్నాడు. వాడు నాకు తోడు వస్తాడు. మేమిద్దరమూ కలిసి, ఆనంద్ శరీరానికి అవసరమైన పనిని చేయగలుగుతాం. ఇంతకు ముందు తగినన్ని మందులు లేవుగానీ... ఇప్పుడు మమ్మల్ని బాగు చేయగల మందులూ ఉన్నాయి. మాకు రాబోయే సమస్యను ముందే తెలుసుకోగల పరీక్షలూ ఉన్నాయి. మాకు చెరుపు చేసే ఎన్నో సమస్యల్ని నివారించే జాగ్రత్తలూ ఉన్నాయి. ఇంతెందుకు ఆనంద్ తన బరువును నియంత్రించుకుంటూ, మంచి ఆహారం తీసుకుంటూ ఉండే చాలు. బాగా వ్యాయామం చేస్తే చాలు. నాకు రాబోయే ఎన్నో అనర్థాలు నివారితమవుతాయి. నేను ఉత్పత్తి చేసే మూత్రం రంగును గుర్తించినా, అతడి ముఖం ఉబ్బుగా ఉన్నా, కళ్లు మసకబారుతున్నా, ఒళ్లు బలహీనంగా అనిపించినా గమనిస్తే... నేను అరుస్తున్న అరుపు అతడికి వినిపించినట్టే. జరగబోయే చెరుపు దూరమైనట్టే.
 - ఇన్‌పుట్స్: డాక్టర్ పి. నాగేశ్వర రెడ్డి,
 కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్
 
మూత్రపిండం మరికొన్ని వాస్తవాలు...
కొన్ని సందర్భాల్లో కొందరు రోగుల్లో పాలకూర మాత్రమే కాదు... పాలు కూడా కిడ్నీలో రాళ్లుగా మారవచ్చు.
మనిషి బతకడానికి కేవలం 75 శాతం పనితీరుతో ఒక కిడ్నీ ఉంటే చాలు.
కిడ్నీలు రక్తపోటునూ అదుపులో ఉంచుతాయి.
కిడ్నీ కంప్యూటర్ మౌస్ అంత ఉంటుంది. కానీ కంప్యూటర్‌లోని చిప్స్ కంటే సంక్లిష్టమైన నిర్మాణంతో ఉంటుంది.
విటమిన్ ‘డి’ ఉత్పాదనను స్టిమ్యులేట్ చేసేది కిడ్నీయే.
   
కిడ్నీ పనితీరు పూర్తిగా తగ్గిపోవడం వల్ల వచ్చే జబ్బును ‘ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్’ (ఈఎస్‌ఆర్‌డీ) అంటారు. కిడ్నీలు దెబ్బతినవడం వల్ల దీర్ఘకాలం పాటు బాధపడే జబ్బును క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. రక్తపోటు సరిగా ఉన్నప్పుడు రక్తాన్ని కృత్రిమంగా శుభ్రపరిచే ప్రక్రియను ‘డయాలసిస్’ అంటారు. అదే రక్తపోటు అస్థిమితంగా ఉన్నప్పుడు కూడా రక్తాన్ని శుభ్రపరిచే ప్రక్రియను ‘కంటిన్యువస్ రీనల్ రీప్లేస్‌మెంట్ థెరపీ’ అంటారు.     
 
మందుబాబులూ జాగ్రత్త!

మద్యం తాగినప్పుడు కిడ్నీ ఎక్కువగా పనిచేసి మూత్రాన్ని ఎక్కువగా  బయటకు పంపాల్సి వస్తుంది. దాంతో ఒంట్లోని నీరంతా బయటకు పోతుంది. అది చాలా ప్రమాదం కదా. అందుకే అప్పుడు పిట్యూటరీ గ్రంథి రంగంలోకి దిగుతుంది. ‘యాంటీ-డైయూరెటిక్’ హార్మోన్‌ను వెలువరిస్తుంది. దాంతో ఒంట్లోని నీరంతా బయటకు వెళ్లకుండా ఉంటుంది. కానీ ఎంత డైయూరెటిక్ హార్మోన్ ఉత్పత్తి అవుతున్నా... ఆల్కహాల్ ఎక్కువతే యాంటీ డైయూరెటిక్ హార్మోన్ తగ్గుతుంది. ఒక్క మద్యంతోనే ఈ ప్రమాదమని అనుకుంటున్నారా? కాఫీ తాగినా అంతే. సిగరెట్‌తోనూ సేమ్ యాక్షన్.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement