సూపర్ స్టార్ పాపులారిటీ! | special story to rajini kanth meet to fans | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్ పాపులారిటీ!

Published Tue, Apr 4 2017 1:02 AM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM

సూపర్ స్టార్  పాపులారిటీ!

సూపర్ స్టార్ పాపులారిటీ!

తలైవా 'ఓటు'లాటరీ?

రజనీకాంత్‌.. కర్ణాటకలో పుట్టి, బస్‌కండక్టర్‌గా పనిచేస్తూ .. ప్రయాణికులకు టికెట్లు కట్‌ చేస్తూ .. తమిళనాడులో ప్రేక్షకుల టికెట్లు కోయించేదాకా వచ్చాడు. ఈ టికెట్లు ఇంతటితోనే ఆగుతాయా? పార్టీ టికెట్లు ఇచ్చేవరకు పోతాయా? రజనీకాంత్‌ సినిమాల్లో సన్నివేశాలు,
డైలాగులు తనని ఒక తలైవాగా మార్చాయి. ఎంత పాపులర్‌ అయ్యాడంటే షారూక్‌ ఖాన్‌ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’లోని లుంగీ డాన్స్‌ పాటను రజనీకాంత్‌కు అంకితమిచ్చేంతగా! ఇక ఇక్కడి నుంచి చూడాల్సింది తమిళనాడు రాజకీయాల్లో ఆయన కండువా బిగిస్తాడా? లుంగీ బొడ్లోకి దోపుతాడా? అనే! దోపినా ఓట్లు రాలుతాయా? రాలవా? ఈ సినిమా సన్నివేశాలు చూసి, సినిమా పాపులారిటీ పొలిటికల్‌ ‘ఓటు’లాటరీగా మారుతుందా లేదా మీరే అంచనా వేయండి!

‘నాన్నా... పందులే గుంపుగా వస్తాయి.. సింహం సింగిల్‌గా వస్తుంది!’
ఇది ‘శివాజి’లో రజనీకాంత్‌ పంచ్‌ డైలాగ్‌. అన్నట్టుగానే సినిమాల్లోకి ఆయన మందీమార్బలం ప్రోద్బలంతో రాలేదు. సింహంలా సింగిల్‌గానే ఎంట్రీ ఇచ్చారు. విజయం సాధించారు. సూపర్‌స్టార్‌ అయ్యారు. ఆ పాపులారిటియే రాజకీయాల్లోనూ ఆయన ప్రెజెన్స్‌ ఉండాలని ఆశ పడుతోంది. మరి, ‘అతిగా ఆశపడ్డ మగాడు సుఖపడినట్లు చరిత్రలో లేదు’ అని రజనీయే అన్నారు ‘నరసింహ’లో. రాజకీయాల ఆశ ఆయనది కాదు ఆయన ఫ్యాన్స్‌ది కదా అంటారా? నిజమే! ‘ఈ పడిశం, తుమ్ములు, వెక్కిళ్లు, దగ్గులు, ఆకలి, నిద్ర, మంచీచెడు, మరణం, జననం, పదవి, పట్టం, ప్రాప్తం.. ఇవేవీ అడిగి రావు. అవే వస్తాయి. అవి రావడం తెలియదు మనకు, పోవడం తెలియదు మనకు. యచ్చచ్చ.. యచ్చచ్చ.. గచ్చచ్చ.. గచ్చచ్చ..’ అంటారు ‘ముత్తు’ సినిమాలో.

‘నీతిని.. న్యాయాన్ని ఎవరి కోసమూ వదల్లేను’
ఇది ‘పెదరాయుడు’ డైలాగ్‌. ఇందులో చెల్లెలు జయంతికి, అన్న (పాపారాయుడు) రజనీకాంత్‌కి ఒక ఘర్షణ వస్తుంది. ‘అన్నయ్యా.. నువ్వు నన్ను జమీందారు కుటుంబంలో ఇచ్చావ్‌. రేపు నువ్వు ఇవ్వబోయే తీర్పు మీద ఆ వంశం పరువు, మర్యాదలు ఆధారపడి ఉన్నాయ్‌. ఏదో చిన్నతనం వల్ల తెలియక నా కొడుకు పొరపాటు చేశాడు. నువ్వు పెద్ద మనసుపెట్టి వాడిని క్షమిస్తే...’ అంటుంది జయంతి.అప్పుడు ‘పెదరాయుడూ.. మన ఇనప్పెట్టెలో మీ అమ్మది 500 తులాల బంగారం ఉంది. దాన్ని నా తోడబుట్టినదానికి తెచ్చివ్వు. చూడమ్మా.. రామాపురంలో నాకు 700 ఎకరాల కొబ్బరితోట ఉంది. దాన్ని నీకు రాసిస్తాను. అలాగే కోదాడ పక్కనున్న 200 ఎకరాల సాగుభూమి కూడా నీ పేర్న రాస్తాను.

నువ్వు కావాలంటే నాకున్న యావదాస్తినీ మీకు ధారాదత్తం చేస్తాను. అంతేకానీ మేం తరతరాలుగా నమ్ముకున్న నీతిని, న్యాయాన్ని ఎవరికోసమూ వదల్ను’ అంటారు రజనీకాంత్‌. తాను నమ్మిన సిద్ధాంతాన్ని బంధుప్రీతికి తాకట్టు పెట్టక పేదల పరం చేస్తాడు. అది నచ్చని చెల్లెలి భర్త ఆయనను తుపాకీతో కాలుస్తాడు. ప్రాణాలు వదులుతూ పాపారాయుడు తన కొడుకు పెదరాయుడికి ఒక మాట చెప్తాడు.. ‘తీర్పు చెప్పేవాడి దృష్టిలో అందరూ ఒకటే. న్యాయం మన ఊపిరి, ధర్మం మన ప్రాణం. ఎప్పుడైతే మనం తప్పుడు తీర్పు ఇచ్చామో ఆ క్షణమే మనం చచ్చిపోయినట్టు లెక్క... గుర్తుంచుకో’ అని. ఆయన రాజకీయాల్లోకి వస్తే అందరికీ న్యాయం జరుగుతుందని బహుశా ఈ డైలాగ్‌తోనే రజనీ అభిమానులు స్ఫూర్తి చెంది ఉంటారేమో. సినిమా ప్రభావం సాధారణమైంది కాదు.. అందునా హీరో ఇంపాక్ట్‌ అసాధారణం!

‘ఇచ్చిన మాట.. చేసిన ధర్మం’
పినతండ్రి కొడుకును తోడబుట్టిన వాడికన్నా ఎక్కువ చూసుకుంటాడు. కాని ఆస్తి విషయంలో ఆ తమ్ముడే వెన్నుపోటు పొడుస్తాడు. తనకున్న మిగిలిన ఆస్తినీ అతని పేరుమీదే రాసి కట్టుబట్టలతో ప్రయాణమవుతాడు. తప్పయిపోయింది అలా తమని ఒంటరిచేసి వెళ్లిపోవద్దని తమ్ముడి భార్య బతిమాలుతుంది. ‘ఇచ్చిన మాట.. చేసిన ధర్మం తిరిగి తీసుకునే అలవాటు మా వంశంలోనే లేదు’ అంటారు రజనీకాంత్‌. ఇది ‘ముత్తు’ సినిమాలోని పాపులర్‌ డైలాగ్‌. రాజకీయాల్లోకి రావాలని రజనీ మీద ఒత్తిడి తెచ్చి, ఆయనతో సరే అని ఓ మాట అనిపిస్తే.. తిరిగి వెనక్కి తీసుకోకుండా రాజకీయాల్లో కంటిన్యూ అవుతారనే నమ్మకంతోనే రజనీతో ఆయన అభిమానులు సమావేశం అవ్వాలని అనుకుని ఉంటారు. (అన్నట్లు ఈ నెల 12న రజనీ తన ఫ్యాన్స్‌ని కలవబోతున్నారు)

‘చెప్పిందే చేస్తాడు.. చేసేదే చెప్తాడు’
మరి రజనీకాంత్‌ మనసులో ఏముందో? ‘పెదరాయుడు’లో చెప్పినట్టు ‘ఈ రాయుడు చెప్పిందే చేస్తాడు.. చేసేదే చెప్తాడు’ అని ఇప్పటివరకూ చెప్పినట్లు రాజకీయాలకు దూరంగా ఉంటారా? లేక ‘అరుణాచలం’లో అన్నట్టు ‘ఆ దేవుడు శాసించాడు.. అరుణాచలం పాటిస్తాడు’ అని అభిమానుల నిర్ణయాన్ని ఆమోదిస్తారా? బికాజ్‌.. ఏ హీరోకైనా అభిమానులే దేవుళ్లు కదా! పైగా ‘ముత్తు’లో ఆయనే చెప్పారు.. ‘వాళ్లు చప్పట్లు కొడితేనే నాలాంటి వాళ్లు ఎందరో నాయకులయ్యారు’ అని. అంతేకాదు.. ‘నరసింహ’లోనూ దాన్ని నొక్కి వక్కాణించారు.. ‘నేనొక్కడినే.. కాని ఈ ఒక్కడికోసం ప్రాణాలు అర్పించడానికి ఎంతమంది  వచ్చారో చూడు’ అని. అందుకే ‘నేను ఎవరి దారికీ అడ్డురాను.. నా దారికి ఎవరినీ అడ్డుపడనివ్వను...’ అంటూ ప్రత్యర్థులకు చెప్పారు.. చూపించారు ‘నరసింహ’గా!

అదే సినిమాలో ‘మీకున్నది రాజకీయబలం.. నాకున్నది ప్రజాబలం. మీరు పోలీస్‌ శక్తితో బతుకుతున్నారు.. నేను ప్రజాశక్తితో బతుకుతున్నాను.. ఈ శక్తి ముందు మీ శక్తి జుజూబి’ అంటూ తన అభిమానుల ప్రేమను, నమ్మకాన్ని హిమాలయాలంత ఎత్తుకు ఎత్తేశారు. ఉబ్బితబ్బిబ్బైన జనం ఇప్పుడు ఆ తలైవా (నాయకుడు) ను వెండితెరను కాదు రాజకీయాలను ఏలమని అడుగుతున్నారు. ‘కష్టపడందే ఏదీ రాదు.. కష్టపడకుండా వచ్చింది నిలవదు’ అని తప్పుకుంటారా? కష్టపడి నిరూపించుకుంటారా అన్నది రియల్‌ స్క్రీన్‌ ప్లాట్‌.. రిమైనింగ్‌ స్టోరి. ‘మంచివాడు మొదట కష్టపడొచ్చు.. కాని ఓడిపోడు. చెడ్డవాడు ముందు సుఖపడొచ్చు... కాని ఓడిపోతాడు’ ఇది ‘భాషా’లో మాణిక్‌భాషా ఉరఫ్‌ రజనీకాంత్‌ ఫేమస్‌ డైలాగ్‌.

బహుశా దీన్ని తన పూర్వపు రాజకీయ అనుభవంతో చెప్పి ఉంటారు. అయితే ఈసారి సవాలుగా తీసుకుంటారా? లేక అదే సినిమాలో చెప్పినట్టు ‘పిరికివాడితో యుద్ధం చేయడం ఈ మాణిక్‌ భాషాకు నచ్చదు’ అని రాజకీయాల్లోని ప్రత్యర్థులను పిరికివాళ్లుగా జమకట్టి ‘నో పాలిటిక్స్‌’ అంటారా? ఏమైనా .. ఏ విషయమైనా ఆయన ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే అని అభిమానులు సమాధాన పడ్తారా? ‘నువ్వంటే అందరికీ ఎందుకంత ఇష్టమో తెలుసా? వయసైపోయినా నీ స్టయిల్, అందం ఏమాత్రం తగ్గలేదు’ అంటుంది ‘నరసింహ’లో నీలాంబరి. ‘పుట్టుకతో వచ్చింది ఎన్నటికీ పోదు’ అంటారు నరసింహ అలియాస్‌ రజనీకాంత్‌. రాజకీయాల్లోకి వచ్చినా రాకపోయినా.. ఆయన స్టయిల్‌ ఆయనదే. ఆయన మార్క్‌ ఆయనదే. ఆయన దారి రహదారి.. బెటర్‌ డోన్ట్‌కమ్‌ ఆన్‌ హిజ్‌ వే! హి ఈజ్‌  తలైవా!

‘ఆ దేవుడు శాసించాడు.. అరుణాచలం పాటిస్తాడు’ (‘అరుణాచలం’లో...)
‘ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే’ (‘భాషా’లో...)
‘ఇచ్చిన మాట.. చేసిన ధర్మం తిరిగి తీసుకునే అలవాటు మా వంశంలోనే లేదు’ (‘ముత్తు’లో...)
‘మీకున్నది రాజకీయబలం. నాకున్నది ప్రజాబలం. మీరు పోలీస్‌ శక్తితో బతుకుతున్నారు.. నేను ప్రజాశక్తితో బతుకుతున్నాను.. ఈ శక్తి ముందు మీ శక్తి జుజూబి’ (‘నరసింహ’లో...)
మేం తరతరాలుగా నమ్ముకున్న నీతిని, న్యాయాన్ని ఎవరికోసమూ వదల్ను (‘పెదరాయుడు’లో...)
నా దారి రహదారి.. బెటర్‌ డోన్ట్‌కమ్‌ ఇన్‌ మై వే
– సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement