చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం, ఆయన అభిమానులు ఆందోళన చేపట్టడంతో మరో నటుడు శరత్ కుమార్ స్పందించారు. రజనీకాంత్‌తో తనకు ఎలాంటి విభేదాలూ లేవని శరత్ కుమార్ ఫేస్బుక్లో వివరణ ఇచ్చారు.
రజనీకాంత్కు రాజకీయ పార్టీ పెట్టే అర్హత లేదని తాను వ్యాఖ్యానించలేదని, తన మాటలను కొందరు వక్రీకరించారని శరత్ కుమార్ చెప్పారు. రజనీ గురించి తనంతట తాను మాట్లాడలేదని, మీడియా ప్రతినిధులు పదేపదే ప్రశ్నించడంతో స్పందించానని తెలిపారు. రజనీ తనకు మిత్రుడని, ఆయన పార్టీ పెడితే మాత్రం ప్రత్యర్థిగా భావిస్తానని చెప్పారు. తమిళనాడును పాలించేది తమిళులే కావాలన్నది తన అభిప్రాయమని శరత్ కుమార్ అన్నారు. జయలలిత మరణించిన తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని చాలామంది కోరుతున్నారు. ఈ నేపథ్యంలో శరత్ కుమార్ మాట్లాడుతూ.. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ఎదిరించేవారిలో మొదట తానే ఉంటానని అన్నారు. రజనీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శరత్ కుమార్ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు.
(రజనీ రాజకీయాల్లోకొస్తే ఎదిరిస్తా: హీరో)