
సన్‌మామ
ఇదిగో సూర్యుడింకా కనపడుతూనే ఉన్నాడు.
మరి అదేంటో చంద్రుడూ కనపడుతున్నాడు.
సన్ వస్తే మామ కనపడకూడదు కదా!
అదేనండి, చందమామ కనపడకూడదు కదా!
ఎక్కడైనా సూర్యుని కాంతిలో వెలిగేవాడిని చందమామ అంటారు కానీ
ఇక్కడ మామకాంతిలో వెలుగుతున్నాడు సన్!
మామలాంటి సన్‌మామ
ఇదిగో సన్‌మామ కథ.
అంతసేపూ తన వెంటే ఉన్న గౌతమ్ ఎటువెళ్లాడా అనుకుంటూ కిచెన్‌లోంచి బయటకు వచ్చి చూసిన భాగ్యకు నోటమాట రాలేదు. గౌతమ్ తన మేనమామ హరి ఫొటోను తదేకంగా చూస్తున్నాడు. ఫొటోకు ముద్దులు పెడుతున్నాడు. పై షెల్ఫ్‌లో ఉన్న ఫొటో గౌతమ్ చేతిలోకి ఎలా వచ్చిందో ఒక్క క్షణం అర్థం కాలేదు భాగ్యకు. చెయిర్ వేసుకున్నా వీడికి షెల్ఫ్ అందదు, బహుషా షెల్ఫ్ ఎక్కి ఉంటాడు. వీడి అల్లరి ఎక్కువైంది, కిందపడితే..!’ పిలవబోయి ఆగిపోయింది. ఆ ఫొటో చూస్తూ గౌతమ్ ఏడుస్తున్నాడు. అప్పుడే బయట నుంచి వచ్చిన కిరణ్ ‘‘ఏమైందిరా.. ఎందుకేడుస్తున్నావ్!’’ కంగారుగా అడిగాడు.భాగ్య, కిరణ్‌ల కొడుకు గౌతమ్. ఐదేళ్ల వయసు. ఏడాదిగా స్కూల్ కెళుతున్నాడు.
‘‘ఈ రోజు నా బర్త్ డే, కొత్త డ్రెస్ లేదు. కేక్ లేదు. నన్ను మీరు అసలు పట్టించుకోవడమే లేదు. అందరికీ పార్టీ ఎలా ఇవ్వాలి’’ ఏడుపు గొంతుతో అన్నాడు గౌతమ్. ‘‘నీ బర్త్‌డేకి ఇంకా రెండు నెలల టైముందిరా, ఇప్పుడు కాదు’’ అంది భాగ్య.‘‘కాదు, ఈ రోజే నా బర్త్ డే! నువ్వు మర్చిపోయావ్! నన్ను పూర్తిగా మర్చిపోయావ్’’ వెక్కిళ్లు పెడుతూ అన్నాడు గౌతమ్.భాగ్య ఉలిక్కిపడింది. ‘ఈ రోజు తన తమ్ముడు హరి పుట్టినరోజు. వాడు చనిపోయి ఈ రోజుకు ఏడేళ్లు. మరి, వీడేంటి? తన బర్త్ డే అంటున్నాడు..’ భాగ్య కిరణ్‌వైపు అయోమయంగా చూసింది. గత జన్మ అప్పు లు ‘‘అక్కా, అక్కా లే!’’ ఆ పిలుపుతో ఆందోళనగా లేచింది భాగ్య. బెడ్‌లైట్ వెలుగులో గౌతమ్‌ను చూసిన భాగ్య ‘‘ఏంట్రా, ఏమైంది?’’ అని అడిగింది. ‘‘నాకు ఆకలేస్తోంది, అన్నం పెట్టు’’ అంటున్న గౌతమ్‌ని ఆశ్చర్యంగా చూసింది. టైమ్ అర్థరాత్రి దాటింది. తినే పడుకున్నాడు. కానీ, ఇలా... ! ఆశ్చర్యంగా గౌతమ్‌నే చూస్తూ .. లేచి Ðð ళ్లి అన్నం, కూర కలిపి ప్లేట్ చేతికిచ్చింది. అన్నం తింటున్న గౌతమ్‌ని కన్నార్పకుండా చూస్తూ నిల్చుంది.
ఏడాదిగా గౌతమ్ ప్రవర్తన అచ్చూ హరిలా ఉంటోంది. హరి గౌతమ్ రూపంలో తన కళ్ల ముందు నిలుచున్నట్టుగా ఉంది. హరికన్నా రెండేళ్లు పెద్ద తను. తమ్ముడే అయినా కొడుకులా మారాం చేసేవాడు. పెళ్లయ్యాక తనెక్కడ దూరమైపోతానో అని చదువు, ఉద్యోగం పేరుతో తన దగ్గరే ఉండేవాడు. అన్నం తినేసి పడుకున్నా అర్థరాత్రి లేచి, ఆకలేస్తోందని మళ్లీ అన్నం తినేవాడు. అందుకే వాడి కోసం ఇంకాస్త ఎక్కువ వండి ఉంచేది. ఈ మధ్య గౌతమ్ కూడా హరిలాగే అర్థరాత్రి లేస్తున్నాడు. ఆకలేస్తోంది అన్నం పెట్టు అంటున్నాడు. బర్త్ డే అంటే హరికి చాలా ఇష్టం. పండగలా జరుపుకునేవాడు. ఏడేళ్ల క్రితం ఇదే రోజు ఫ్రెండ్స్‌తో టూర్ వెళుతుంటే కారు యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఇప్పుడు గౌతమ్ హరి బర్త్ డే రోజున కొత్త డ్రెస్ వేసుకొని కేక్ కట్ చేసి చుట్టుపక్కల వాళ్లందరికీ పంచాడు. ఎక్కడకెళ్లినా హరి ఫొటో వదలడం లేదు. ‘‘ఇది నా ఫొటో! నా దగ్గరే ఉండాలి’’ అంటున్నాడు. ‘‘నా అజాగ్రత్త వల్లే యాక్సిడెంట్ అయ్యింది’’ అని చెబుతున్నాడు. మొన్నటికి మొన్న హరి స్నేహితురాలు దారిలో కలిస్తే ఇంటికి తీసుకొచ్చింది.
తామిద్దరూ మాట్లాడుతూ కూర్చుంటే గౌతమ్ ఆమెనే చూస్తూ కాసేపటి తర్వాత లోపలికెళ్లి ఏదో పుస్తకం తీసుకొచ్చాడు. ‘‘రమ్యా, ఇదిగో నీ బుక్. అప్పుడు నిన్ను అడిగి తీసుకున్నా! తిరిగి ఇవ్వలేకపోయాను. తీసుకో.. ’’ అన్నాడు. రమ్య షాకైంది. నిజమే! ఆ బుక్ ఏడేళ్ల కిందట రమ్య హరికిచ్చింది. గౌతమ్‌ని భయం భయంగా చూస్తూ వెళ్లిపోయింది. మొన్నామధ్య ఎవరికో ఫోన్ చేసి ‘నీకు ఐదు వేల రూపాయిలు ఇవ్వాలిగా! వచ్చి తీసుకెళ్లు’ అని చెప్పాడు. ఆ వచ్చిన వ్యక్తికి నిజంగానే హరి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఆ విషయం వచ్చిన అతనూ నిర్ధారణ చేశాడు. హరి చనిపోయాడని తెలుసుకొని వెళ్లిపోయాడు. వెళుతూ వెళుతూ.. ‘‘నా ఫోన్ నెంబర్ మీ అబ్బాయికి ఎలా తెలుసు?’’ అన్నాడు ఆశ్చర్యంగా!
జ్ఞాపకాల భారం
‘‘దీనినే పునర్జన్మ అంటారు’’ అన్న కౌన్సెలర్ మాటలకు కొయ్యబారిపోయారు భాగ్య, కిరణ్‌లు.‘‘ఏంటి డాక్టర్, చనిపోయినవారు మళ్లీ పుడతారా! అలా అయితే మా తమ్ముడే నాకు కొడుకుగా పుట్టాడా? నమ్మలేకపోతున్నాను’’ ఆందోళనగా అడిగింది భాగ్య. కిరణ్ మాట్లాడుతూ ‘‘డాక్టర్ అది నిజమే కావచ్చు. కానీ, ఆ జ్ఞాపకాల వల్ల గౌతమ్ ఇప్పుడెంతో జీవితాన్ని కోల్పోతున్నాడు. తనలో తనే మాట్లాడుకుంటాడు. ఎవరితోనూ కలవడం లేదు. స్కూళ్లోనూ ఒంటరిగా ఉంటున్నాడు. వీడి ప్రవర్తన మాకు భయాన్ని కలిగిస్తుందిు. దీన్నుంచి బయటపడే మార్గం..’’ కిరణ్ మాటలు పూర్తి కాకుండానే ‘‘ఉంది’’ అన్నారు కౌన్సెలర్.
స్మృతులను తుడిచే ఎరేజర్ థెరపీ
గౌతమ్ ధ్యానప్రక్రియ ద్వారా చేతన స్థితి నుంచి అచేనత్వంలోకి.. చైతన్యం నుంచి అనంతంలోకి ప్రయాణిస్తున్నాడు. హరిగా తాను జీవించిన రోజులు ఒక్కొక్కటి వివరిస్తున్నాడు. ‘‘అక్కా, నువ్వు చెబితే వినకుండా వెళ్లిపోయాను. ఘోరమైన నొప్పిని అనుభవించాను. నీ కోసమే మళ్ళీ వచ్చాను. నువ్వు నాకు ఎన్నో ప్రమాణాలు చేశావు నన్ను ఎప్పటికీ దూరం చేయనని. కానీ, నువ్వు నన్ను మర్చిపోయావ్! చెబితే వినలేదనేగా! నన్ను క్షమించు. నాకు ఎన్నో కలలు ఉన్నాయి. వాటిని సాధించాలని ఉంది. నాకు సాయం చేయ్!’’ అక్కతో తను చేసిన తప్పులు, తిరిగి తను నేర్చుకోవాల్సిన విషయాల గురించి ఒక్కొక్కటిగా చెబుతున్నాడు. వింటున్న భాగ్య, కిరణ్‌లు చలించిపోయారు..
కౌన్సెలర్ సూచనలు మళ్లీ మొదలయ్యాయి. ‘‘హరీ.. నువ్విప్పుడు గౌతమ్‌వి. గతజన్మ జ్ఞాపకాలన్నీ ఎరేజర్‌తో తుడిచినట్టు తుడిచేయ్! ఇప్పుడు నీ మస్కిష్తం ఒక తెల్లని కాగితం. దానిపై ఈ జన్మ అనుభవాలను మాత్రమే రాసుకో...’’ అని సూచనలు ఇచ్చారు కౌన్సెలర్.
అర గంట పాటు సాగిన థెరపీ గౌతమ్ నిద్రతో పూర్తయింది. మెలకువ వచ్చిన గౌతమ్ తల్లిని చూసి హత్తుకుపోయాడు.
స్కూళ్లో టీచర్ ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్ తెచ్చి తల్లీతండ్రి చేతికిచ్చాడు గౌతమ్. అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులతో స్కూల్ టాపర్ అని పేరుతెచ్చుకుంటున్న గౌతమ్‌ని భాగ్య దగ్గరగా తీసుకొని బుగ్గమీద ముద్దిచ్చింది. మరెప్పుడూ ఆ ఇంట్లో హరి జ్ఞాపకాలు వినిపించలేదు.
కర్మభూమి
కర్మసిద్ధాంతానికి పెద్ద పీట వేసే మన దేశం ప్రాచీన సంప్రదాయం ప్రకారం కుటుంబసభ్యులలో ఎవరైనా మరణిస్తే వారు మన మధ్యే ఉంటారని, మనకోసం మళ్లీ వారు పుడతారని నమ్ముతారు. ఆ నమ్మకంతోనే చనిపోయినవారికి పిండప్రదానం చేయడం, వారి పేరు మీదుగా దాన ధర్మాలు చేయడం చూస్తుంటాం. అలాగే చనిపోయిన రోజు, పుట్టినరోజులను గుర్తుంచుకొని వారికి ఇష్టమైన వంటలన్నీ చేసి పెడుతుంటారు.
– నిర్మల చిల్కమర్రి