మొహిసీన్‌కు డాడీ | special story to true army man Mushtaq Ahmed | Sakshi
Sakshi News home page

మొహిసీన్‌కు డాడీ

Published Wed, Feb 10 2016 10:25 PM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM

మొహిసీన్‌కు  డాడీ

మొహిసీన్‌కు డాడీ

దేశానికి సిపాయి.
అల్లాకి ముద్దుబిడ్డ.
మొహిసీన్‌కి డాడీ.
నేడు అమరుడు.
మంచుకు కన్నీళ్లుండవు.
అది కరిగి ఉంటే ముస్తాక్ బతికేవాడు.
ముస్తాక్ కుటుంబానికి కన్నీళ్లున్నాయి.
వాటికి మనం కరగాలి.

 
మూడు కారణాలు ముస్తాక్ అహ్మద్‌ను ఆర్మీ వైపు కవాతు చేయించాయి. దేశంపై ఉన్న ప్రేమ. తల్లిదండ్రులపై ఉన్న ప్రేమ. కుటుంబంపై ఉన్న ప్రేమ. దేశంపై ప్రేమతో సిపాయి అయ్యాడు. అమ్మానాన్నలపై ప్రేమతో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి వారి కల నెరవేర్చాడు. కుటుంబంపై ప్రేమతో బాధ్యతల మంచు పర్వతాన్ని భుజాలపైకి ఎత్తుకున్నాడు.

ఆ రోజు నసీమూన్‌కు బాగా గుర్తు.
‘ఎంత! ఆరు నెలల్లో మళ్లీ వస్తాను, రంజాన్‌కి’ అన్నాడు. వెళుతూ వెళుతూ కొడుకును ముద్దాడాడు. వదల్లేక వదల్లేక వెనక్కొచ్చి మళ్లీ ముద్దాడాడు. అప్పటికి సయ్యద్ మొహిసీన్ వయసు పదిహేను రోజులు. 2015 ఆగస్టు 3న పుట్టాడు. వీడ్కోలు తీసుకుంటున్నప్పుడు.. ‘ఉండిపోకూడదా..’ అన్నట్లు చూసింది భార్య. ‘మిమ్మల్ని చూడకుండా ఉండగలనా?’ అన్నట్లు భార్యాబిడ్డల్ని చూసుకున్నాడు ముస్తాక్. కానీ తాను ఇక్కడుంటే కుటుంబం మాత్రమే బాగుంటుంది. అదే సరిహద్దుకు వెళ్తే దేశమంతా భద్రంగా ఉంటుంది. అదే మాట భార్యతో అన్నాడు. బయల్దేరాడు.
   
ఏడు రోజుల నిరీక్షణ! మంచుకొండల్లో చిక్కుకున్న ముస్తాక్ ఆచూకీ కోసం తల్లిదండ్రులతో పాటు భార్య ఎదురుచూపులు! అతడు క్షేమంగా తిరిగి రావాలన్న దేశ ప్రజల ఆకాంక్ష! అన్నీ నిష్ఫలమయ్యాయి. ఆత్మీయుల హృదయాలు మూగబోయాయి. అంతలోనే కూలిపడ్డ మంచు కొండ చరియల్లోంచి పది మంది సైనికుల్లో ఒకరు బయటపడ్డారనే సమాచారం! ఎక్కడో మినుకు మినుకు మంటూ చిన్న ఆశ. ఆ వెంటనే దిగ్భ్రాంతి. మిగిలిన వారెవరూ బతికిలేరనే ప్రకటన ! ముస్తాక్ కుటుంబంలో విషాదం.
 
కన్నీరు మున్నీరు
‘...నీ ఆరోగ్యం జాగ్రత్త... బాబును బాగా చూసుకో.. ఆరునెలల్లో వస్తా.. అందరం కలసి మూడు రోజులు.. నీ పుట్టిన రోజు, నా పుట్టిన రోజు, మన అబ్బాయి పుట్టిన రోజు, మన పెళ్లి రోజు అన్నీ జరుపుకుందాం’ అని చెప్పి వెళ్లాడు. వెళ్లిన ఈ మూడు నెలల్లో ఆరంటే ఆరుసార్లు మాట్లాడాడు. అది కూడా ఒక్కొక్క నిమిషమే. డ్యూటీ ఎత్తై మంచు పర్వతాల్లో.. ప్రమాదకరమైన ప్రదేశంలో.. సియాచిన్‌లో.. అంటూ వెళ్లాడు. మొన్న ఫిబ్రవరి 3న కూడా ఫోన్ చేసి ‘బాగున్నా’ అని చెప్పాడు. ఆ తర్వాత కొద్ది గంటలకే వినలేని వార్త..’ అంటూ ముస్తాక్ భార్య నసీమూన్ కన్నీటి పర్యంతమైంది.
   
నసీమూన్‌ది నంద్యాల పట్టణంలోని సాదిక్ నగర్ . ముస్తాక్‌ది బండిఆత్మకూరు మండలం పార్నపల్లె. ఇద్దరికీ 2014 ఆగస్టు 7న వివాహమైంది. అప్పట్లో ముస్తాక్ పంజాబ్ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నాడు. వివాహం తర్వాత భార్య నసీమూన్‌ను నవంబర్‌లో తనతో పాటు పంజాబ్ తీసుకొని వెళ్లాడు. భార్య గర్భవతి కావడంతో 2015 ఏప్రిల్‌లో నంద్యాలకు తీసుకొచ్చి ఆమె పుట్టింట్లో వదిలి వెళ్లాడు. మధ్యలో ఆరు నెలల ఎడబాటు. కాన్పు సమయంలో తన దగ్గరే ఉండాలని నసీమూన్ పట్టుపట్టడంతో నెల రోజులు సెలవు పెట్టి వచ్చాడు. ఆగస్టులో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది నసీమూన్. బిడ్డను చూసుకున్న ముస్తాక్ అహ్మద్ జీవితంలో ఆనందం వెల్లి విరిసింది. దంపతులిద్దరూ కొడుకు పేరు కోసం ఆలోచించారు. అందంగా ఉన్న కుమారుడిని సయ్యద్ మొహిసీన్ అంటూ పిలుచుకున్నారు. ముస్తాక్ తిరిగి పంజాబ్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్‌లో రెండు నెలలు విధులు నిర్వహించాక 2015 డిసెంబర్‌లో తనను సియాచిన్‌కు బదిలీ చేశారని.. అక్కడ పరిస్థితి కష్టంగా ఉంటుందని, వాతావరణం అనుకూలంగా ఉండదని, ఆరునెలల తర్వాత తిరిగి వస్తానని భార్యకు ఫోన్‌లో చెప్పి ఎత్తై మంచుపర్వతాల్లోకి వెళ్లాడు ముస్తాక్.
 
సాధారణ రైతు కుటుంబం
కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలంలోని పార్నపల్లె గ్రామానికి చెందిన ఇబ్రహీం, నజీమున్నిసా దంపతుల కుమారుడు ముస్తాక్. వ్యవసాయమే ఆ కుటుంబానికి ఆధారం. నాలుగు ఎకరాల పొలం సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. చివరి సంతానమైన ముస్తాక్ బండిఆత్మకూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేశాడు. ఆ తర్వాత నంద్యాలలోని నేషనల్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుండగా ఆర్మీలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 2004లో ఉద్యోగంలో చేరి 11 ఏళ్లుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పని చేశాడు.
 
ఎముకలు కొరికే చలిలో...
మిలటరీలో ఉద్యోగం చేస్తున్న ముస్తాక్ అహ్మద్ మద్రాస్ బెటాలియన్‌లో పని చేశాడు. మంచుకొండల్లో విధులు నిర్వహించే సమయంలో ఎదురయ్యే విపత్తులను ఏ విధంగా ఎదుర్కోవాలో జమ్మూకశ్మీర్, నార్థ్‌పూ ప్రాంతాల్లో కఠోర శిక్షణ పూర్తి చేసుకున్నాడు. ముస్తాక్ చురుకుదనం చూసి ఉన్నతాధికారులు అతడిని సియాచిన్ గ్లేసియర్‌లో విధులు నిర్వహించేందుకు ఎంపిక చేశారు. పది మంది బృందంలో 9వ సిపాయిగా ఉన్న ముస్తాక్.. మంచుకొండల్లో ఫైబర్ టెంట్లను ఏర్పాటు చేసుకొని ఎముకలు కొరికే చలిలో దేశ భద్రతకే అంకితమయ్యారు. విధి నిర్వహణలో మంచు చరియలు కూలి మరణించాడు.
 
రంజాన్‌కి వస్తానన్నాడు
గత ఏడాది ఆగస్టు నెలలో విధులు నిర్వహించేందుకు వెళ్లిన ముస్తాక్ ఈ ఏడాది రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జూన్ నెలలో వస్తానని చెప్పినట్లు అతని సోదరులు మునీర్‌సాహెబ్, ముజఫర్ అహ్మద్, మగ్బుల్ తెలిపారు. సెలవుల్లో ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఇచ్చిన నాలుగు సెంట్ల స్థలంలో ఇల్లు కట్టుకోవాలని ఎన్నో కలలు కనేవాడన్నారు. తమతో మాట్లాడినప్పుడంతా ఇల్లు ఏవిధంగా ఉండాలనే విషయమై ఎన్నో ప్లాన్లు చెప్పేవాడనీ, ఇలా... తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడన్న వార్త వినవలసి వస్తుందనుకోలేదని విలపించారు.
 
అన్ని వేడుకలూ ఆగస్టులోనే!
ముస్తాక్ అహ్మద్, నసీమూన్‌లకు మరిచిపోలేని అనుభూతి ఆగస్టు నెల. ఆ నెల వారి జీవితాల్లో వెలుగులు, ఆనందాలను నింపింది. 2014 ఆగస్టు 7న వివాహం జరిగింది. ఆగస్టు 2వ తేది ముస్తాక్ అహ్మద్ జన్మదినం. ఆగస్టు 3వ తేదిన కుమారుడు సయ్యద్ మొహిసీన్ జన్మదినం, ఆగస్టు 4వ తేదిన భార్య నసీమూన్ జన్మదినం కావడం విశేషం.
 
- ఎన్.ప్రతాప్‌రెడ్డి, బండి ఆత్మకూరు,
- పి. కిరణ్‌కుమార్, నూనెపల్లి
సాక్షి, కర్నూలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement