చిక్కుల చక్కెర | Special Story On World Diabetes Day | Sakshi
Sakshi News home page

చిక్కుల చక్కెర

Published Thu, Nov 14 2019 12:38 AM | Last Updated on Thu, Nov 14 2019 12:48 AM

Special Story On World Diabetes Day - Sakshi

డయాబెటి పేరు వినగానే బెంబేలెత్తిపోతారు.  ఆరోగ్య నియమాలు పాటించకుండా, ఆహారం విషయంలో ఇష్టం వచ్చిన రీతిలో ఉంటూ, వ్యాయామం చేయని వారిలో డయాబెటిస్‌ ఎక్కుగా కనిపిస్తుంటుంది. దీని కారణంగా గుండె జబ్బులూ, కిడ్నీ సమస్యలూ, పక్షవాతం... ఇలా ఇతరత్రా జబ్బులెన్నో వస్తుంటాయి.

అన్ని అవయవాలు ప్రభావితమవుతాయి. డయాబెటిస్‌ను గురించి తప్పక తెలుసుకొని, వీలైనంతమేరకు దానిబారిన పడకుండా ఉండాలి. ఈ నెల 14న వరల్డ్‌ డయాబెటిస్‌ డే. ఈ సందర్భంగా... డయాబెటిస్‌పై అవగాహన కోసమే ఈ కథనం.

ఈ రోజుల్లో ప్రజల జీవనశైలి బాగా మారిపోవ డం వల్ల డయాబెటిస్‌ విస్తృతంగా కనిపిస్తోంది. డయాబెటిస్‌లో ప్రధానంగా మూడు రకాలు అనుకుంటారు. టైప్‌–1, టైప్‌–2లతో పాటు గర్భవతులకు వచ్చే జస్టేషనల్‌ డయాబెటిస్‌ అనే ప్రధాన రకాలను వర్గీకరిస్తుంటారు. కానీ డయాబెటిస్‌ ప్రధానంగా ఈ మూడు రూపాల్లోనే గాక...  లేటెంట్‌ ఆటోఇమ్యూన్‌ డయాబెటిస్‌ ఇన్‌ అడల్ట్స్‌ (లాడా) అనీ, మెచ్యురిటీ ఆన్‌సెట్‌ ఆఫ్‌ ద యంగ్‌ (మోడీ) అనీ ఎన్నో రకాలు ఉన్నాయి. ఈ మూడు రకాల్లోనూ టైప్‌–1 డయాబెటిస్‌ అన్నది చిన్నపిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది జన్యులోపం వల్ల వస్తుంది.

చిన్నారుల రోగనిరోధక వ్యవస్థ... వారి పాంక్రియాస్‌లోని బీటా సెల్స్‌ను  శత్రుకణాలుగా భావించి, వాటిని నాశనం చేస్తుంది. ఫలితంగా పాంక్రియాస్‌ పనిచేయక దానిలోని ఇన్సులిన్‌ ఉత్పత్తి ఆగిపోతుంది. దీనినే ఇన్సులిన్‌ డిపెండెంట్‌ డయాబెటిస్‌ మెలిటస్‌ అని అంటారు. అలా పాంక్రియాస్‌ కార్యకలాపాలు మందగించగానే డయాబెటిస్‌ వస్తుందన్నమాట. ఇక సాధారణంగా కొంత వయసు గడిచాక పాంక్రియాస్‌ ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌కు మన శరీరంలోని జీవకణాలు తగిన రీతిలో స్పందించడం మానేస్తాయి. ఇలా జరిగినప్పుడు తలెత్తే మధుమేహాన్ని టైప్‌–2 డయాబెటిస్‌ అంటారు.

ఇదే పరిస్థితి చాలాకాలం కొనసాగితే శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి దానంతట అది పూర్తిగా నిలిచిపోతుంది. దీనిని నాన్‌ ఇన్సులిన్‌ డిపెండెంట్‌ డయాబెటిస్‌ మెలిటస్‌ లేదా అడల్డ్‌ ఆన్‌సెట్‌ డయాబెటిస్‌ అంటారు. డయాబెటిస్‌ రోగుల్లో దాదాపు 90 శాతం మంది ఈ రకానికే చెందుతారు. కొంతమంది మహిళల్లో గర్భం ధరించిన సమయంలో డయాబెటిస్‌ కనిపిస్తుంటుంది. దాన్ని  జెస్టేషనల్‌ డయాబెటిస్‌ అంటారు. ఇలాంటి వారిలో ప్రసవం అయిన తర్వాత డయాబెటిస్‌ కూడా కనిపించదు. అయితే ఇలా గర్భవతిగా ఉన్నప్పుడు జెస్టెషనల్‌ డయాబెటిస్‌ వచ్చిన వారిలో వయసు పెరిగాక అది మళ్లీ వచ్చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

చికిత్స :
►డీ ఫర్‌ డయాబెటిస్, డీ ఫర్‌ డేంజర్‌... అందుకే ఈ డేంజరస్‌ డయాబెటిస్‌ ట్రబుల్‌ను వీలైనంత దూరంగా ఉంచాలి.
►టైప్‌–1 డయాబెటిస్‌కు వైద్యుల సూచనపై ఇన్సులిన్‌ ఇవ్వడం మాత్రమే ఏకైక మార్గం.
►ఎక్కువ మందిలో కనిపించే టైప్‌–2 డయాబెటిస్‌ ఉన్నవారిలో ఇన్సులిన్‌ను స్రవింపజేసే క్లోమగ్రంథిని ప్రేరేపించే మందులు ఇస్తుంటారు. అవి కూడా పనిచేయని సమయాల్లో డాక్టర్లు అవసరమైన మోతాదులో ఇన్సులిన్‌ సిఫార్సు చేస్తుంటారు. ఇలా ఇన్సులిన్‌ తీసుకోవాల్సి రావడం చాలా తీవ్రమైన దశగా చెప్పుకోవచ్చు. ఇలాంటి దశకు చేరి... ఒంటిని ప్రమాదకరమైన పరిస్థితికి గురిచేయడం కంటే కొద్దిపాటి జాగ్రత్తలతో అది రాకుండానే చాలావరకు నియంత్రించుకోవచ్చు.

నివారణ...
►అన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ను మంచి కొవ్వులుగా పరిగణిస్తారు. వీటిలో మోనో అన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్, పాలీ అన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ అనే రకాలు ఉంటాయి. ఈ రెండు రకాలూ మంచివే.
►చేపలు, అవిసెగింజలు, వాల్‌నట్స్‌లతో పాటు రై స్‌బ్రాన్‌ ఆయిల్‌ వంటి శా కాహార నూనెల్లో మంచి కొవ్వులు ఎక్కువగా ఉంటాయి.
►చక్కెరలు మోతాదుకు మించి ఉండే కూల్‌డ్రింక్స్, స్వీట్స్, చాక్లెట్లు వంటి వాటికి దూరంగా ఉండటంతో పాటు పొగతాగడా న్ని మానేయడం ద్వారా కూడా రక్తంలో చక్కెర ల స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు.
చివరగా... డయాబెటిస్‌ గురించి ఆందోళన పడాల్సి న పనిలేదు. హెల్దీ లైఫ్‌స్టైల్‌ను అనుసరిస్తూ, వై ద్యుల సలహాలపై మందులు వాడుతూ ఉంటే పూర్తి ఆరోగ్యంతో నిండు నూరేళ్లూ
బతకవచ్చు.

లక్షణాలు
డయాబెటిస్‌ ఉన్నవారిలో బాగా ఆకలి పెరగడంతో పాటు విపరీతంగా దాహం వేయడం కనిపిస్తాయి. తరచు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు చాలామందిని బాధిస్తుంటాయి. అసలు ఈ లక్షణం నుంచే డయాబెటిస్‌కు ఆ పేరు వచ్చిందని చెబుతుంటారు. ఎందుకంటే... వాస్తవానికి ‘డయాబెటిస్‌’ అంటే మూత్రపు  ఫౌంటేన్‌ అనే అర్థం కూడా ఉందట.

►డయాబెటిస్‌ రాగానే చాలామందిలో దాని తాలూకు నిర్దిష్టమైన లక్షణాలేవీ చాలాకాలం పాటు కనిపించకపోవచ్చు. అందుకే 40 ఏళ్లు దాటాక క్రమం తప్పకుండా ఏడాదికి ఒకసారైనా రక్తపరీక్షలు చేయించుకుంటే డయాబెటిస్‌ గురించీ, దాని ఉనికి ఏదైనా ఉంటే దాని గురించి తెలుస్తుంది.

►డయాబెటిస్‌ ఉన్నవారికి గాయాలు అంత త్వరగా మానవు. ఎందుకంటే  ఒంట్లోని చక్కెర రక్తప్రవాహంలో కలవడం వల్ల హాని చేసే బ్యాక్టీరియాకు ఆ పుండ్లనూ,  గాయాలను ఆశ్రయించినప్పుడు ఆ ప్రదేశాలు వాటికి చాలా రుచిగా, తియ్యగా  అనిపిస్తాయి. దాంతో ఆ బ్యాక్టీరియా అలాంటి ప్రదేశాలను వదలడానికి ఇష్టపడవు. అంతేగాక డయాబెటిస్‌ ఉన్నవారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల ఆ బ్యాక్టీరియా/హానికారక క్రిములను తుదముట్టించే శక్తి లోపిస్తుంది కాబట్టి... ఇలాంటి డయాబెటిస్‌ ఉన్నవారి దేహాలు ఆ క్రిములకు మంచి ఆవాసమవుతాయి. ఫలితంగా  గాయలు ఒక పట్టాన తగ్గవు. అందుకే డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు తమ ఒంటిపైన ఉంటే గాయలు/పుండ్ల వంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే గాయమైన సదరు అవయవానికే ముప్పు వాటిల్లి... ఆ అవయవాన్నే తొలగించాల్సిన దుస్థితి రావచ్చు. 

డయాబెటిస్‌ను నియంత్రించే యోగాసనాలివే...
యోగా మన ఆరోగ్య సంరక్షణకు ఉపకరిస్తుందన్న విషయం తెలిసిందే. కొన్ని ప్రత్యేక యోగాసనాలు సైతం చక్కెర వ్యాధిని నివారిస్తాయి... ఒకవేళ అప్పటికే చక్కెర వ్యాధి ఉన్నప్పటికీ దాన్ని నియంత్రించడానికి చాలావరకు ఉపయోగపడతాయన్నది యోగా నిపుణుల మాట. ఇందులో 1) అర్ధమత్సేంద్రాసనం, 2) చక్రాసనం... డయాబెటిస్‌ నివారణ/నియంత్రణకు తోడ్పడతాయి.

డయాబెటిస్‌ కనుగొనేందుకు పరీక్షలివి...
చక్కెర వ్యాధిని గుర్తించడానికి ఈ కింద పేర్కొన్న కొన్ని రకాల రక్తపరీక్షలు చేస్తారు.
ఫాస్టింగ్‌ సుగర్‌ టెస్ట్‌ :  కనీసం 8గంటల సేపు ఏమీ తినకుండా ఈ పరీక్ష చేయించుకోవాలి.

పోస్ట్‌ ఫుడ్‌ సుగర్‌ టెస్ట్‌: ఆహారం తీసుకున్న గంటన్నర లోగా పరీక్ష చేయించుకోవాలి.

ర్యాండమ్‌ సుగర్‌ టెస్ట్‌ : తిన్నా, తినకున్నా ఏదో ఒకవేళ ఈ పరీక్ష చేస్తారు.

ఓరల్‌ గ్లూకోస్‌ టాలరెన్స్‌ టెస్ట్‌ (ఓజీటీటీ) : బార్డర్‌లైన్‌లో ఉన్నవారికి ఈ పరీక్ష చేస్తారు.

►డయాబెటిస్‌ను తెలుసుకోవడం కోసం హెచ్‌బీఏ1సీ అనే పరీక్షను సైతం చేస్తారు. ఇది 8 నుంచి 12 వారాల వ్యవధిలో చెక్కెర పాళ్లను సగటును తెలిపే పరీక్ష. దీన్ని పరగడుపున చేయాల్సిన అవసరం ఉండదు. ఇది చక్కెర వ్యాధిని  నిర్ధారణ చేయడంతోపాటు మందులు వాడుతున్నప్పుడు చికిత్స వల్ల చక్కెర అదుపులోనే ఉంటోందా లేదా అన్న విషయం కూడా తెలుస్తుంది. డయాబెటిస్‌ తీవ్రత కూడా తెలుస్తుంది.

డయబెటిక్‌ డైట్‌...
మనం గతంలో దంపుడుబియ్యం, రాగులు, జొన్నలు, సజ్జల వంటివి తినేవాళ్లం. పాలిష్‌డ్‌ రైస్‌ తినడం మొదలుపెట్టగానే ప్రపంచంలో ఎక్కడా లేనంతగా డయాబెటిస్‌ మన దగ్గర కనపించడం మొదలైంది. డయాబెటిస్‌ నుంచి బయటపడటానికి... 
►లో గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ ఉన్న ఆహారాల్లో బ్రౌన్‌రైస్, క్వినోవా రైస్, దంపుడుబియ్యం, బొంబాయిరవ్వ ఉప్మా వంటివి ముఖ్యమైనవి. కాకపోతే ఇవి అందరికీ నచ్చవు. వీటికి మనం అలవాటుపడటానికి క్రమంగా వాటిని మన రుచిమొగ్గలకు అలవాటు చేయాలి. దీన్నే సిస్టమాటిక్‌ డీ–సెన్సిటైజేషన్‌ ఆఫ్‌ పాలెట్‌ అని అంటారు. దీనికోసం... మనం పాలిష్‌రైస్‌ ఒక గిన్నెలో వండాలి. బ్రౌన్‌రైస్‌ మరో గిన్నెలో వండాలి. మూడో గిన్నె తీసుకొని అందులో మొదట 75% పాలిష్‌రైస్‌తో వండిన అన్నం, 25% బ్రౌన్‌ రైస్‌తో వండిన అన్నం కలిపి... రెండు నుంచి మూడు వారాలు ఇలా తినాలి.

దాని తర్వాత 60% పాలిష్‌రైస్, 40% బ్రౌన్‌రైస్‌... ఇలా మరో మూడు వారాలు తినాలి. ఇలా క్రమంగా పాలిష్‌రైస్‌ శాతాన్ని తగ్గించుకుంటూ, బ్రౌన్‌రైస్‌ శాతాన్ని పెంచుకుంటూ వెళుతూ... మూడు నుంచి నాలుగు నెలల తర్వాత మొత్తం బ్రౌన్‌ రైస్‌ తినాలి. ఇలా చేయడం వల్ల మన నాలుక  బ్రౌన్‌రైస్‌ రుచికి అలవాటు పడుతుంది. ఇలా చేయడం ద్వారా మనం శాశ్వతంగా బ్రౌన్‌రైస్‌ మళ్లవచ్చు. (ఇదే పద్ధతి క్వినోవా, దంపుడుబియ్యానికి కూడా వర్తిస్తుంది). ఈ ప్రక్రియతో తెల్లఅన్నం కోసం క్రేవింగ్‌ కూడా తగ్గుతుంది.

బ్రేక్‌ఫాస్ట్‌లో తినగలిగేవి : రాగి ఇడ్లీ, రాగి దోశ, పెసరట్టు, గోధుమరవ్వ ఉప్మా, చపాతి, పొట్టుతీయని గింజలతో చేసిన బ్రెడ్, పొట్టుతియ్యని గింజల గారెలు.

డయాబెటిస్‌ ఉన్నవారితో పాటు.. దాన్ని నివారించుకోవాలనుకునేవారు తినాల్సిన పండ్లు : జామ, గ్రీన్‌ ఆపిల్, ఓ మోస్తరుగా పండిన పుచ్చకాయలు, మోస్తరుగా పండిన బొప్పాయి, దానిమ్మ, కివి, ఆరెంజెస్, నేరేడుపండ్లు. తీపి పదార్థాలు తినాలని బాగా అనిపించినప్పుడు బెర్రీస్‌ (బ్లాక్‌బెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్‌బెర్రీలు తింటే క్రేవింగ్‌ తగ్గుతుంది. వారానికి రెండున్నర గంటలకు తగ్గకుండా వ్యాయామమూ చేయాలి.

ప్రీ–డయాబెటిస్‌ కండిషన్‌ అంటే... కనీసం ఎనిమిది గంటలు ఏమీ తినకుండా జరిపే ఫాస్టింగ్‌ పరీక్షలో రక్తంలో చక్కెర 70–100 స్థాయిలో ఉంటే సాధారణ పరిస్థితిలో ఉన్నట్లు లెక్క. దానికి మంచి 126 వరకు ఉన్నా... ఇక ఆహారం తీసుకున్న గంటన్నర లోగా పరీక్ష చేయించుకునే పోస్ట్‌ లంచ్‌ పరీక్షలో చక్కెర పాళ్లు 140 కంటే మించి 180 వరకు ఉన్నా కాస్త జాగ్రత్త పడాలి.  ఫాస్టింగ్‌లో రక్తంలో చక్కెర 100–126 లోపు, పోస్ట్‌ లంచ్‌ 140–180 లోపు ఉంటే అది డయాబెటిస్‌ వచ్చేందుకు ముందు దశ (ప్రీ డయాబెటిక్‌ స్టేజ్‌)గా చెబుతారు. అలాంటివారు మంచి జీవనశైలి నియమాలు పాటిస్తూ, వ్యాయామం చేస్తే సాధ్యమైనంతవరకు డయాబెటిస్‌ను నివారించవచ్చు.
డాక్టర్‌ టి.ఎన్‌.జె. రాజేశ్,
సీనియర్‌ కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌
ఇంటర్నల్‌ మెడిసిన్‌ – ఇన్‌ఫెక్షియస్‌
డిసీజెస్, స్టార్‌ హాస్పిటల్స్,
బంజారాహిల్స్, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement