నదియా‘థెరపీ’
సేవ
నదియా ఫాల్కా.. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజిస్ట్. గోవాలోని ఏ పిల్లల ఆసుపత్రికి వెళ్లి అడిగినా నదియా గురించి బోలెడన్ని విశేషాలు చెబుతారు. ఆటిజమ్‌తో ఇబ్బందిపడుతున్న పిల్లల దగ్గరికి వెళ్లి వైద్యం చేస్తున్న నదియా ప్రత్యేకత ఏంటంటే... వైద్యులకు, తల్లిదండ్రులకు ఆ జబ్బు గురించి అవగాహన కల్పించడం కోసం ప్రతి ఆసుపత్రి చుట్టూ తిరగడం. స్పీచ్ థెరపీలతో సరిపెట్టకుండా ఆటిజమ్ బాధితుల కోసం ప్రత్యేకంగా కొన్ని బొమ్మల్ని తయారుచేశారామె. అన్నింటికంటే ముఖ్యంగా ఈ జబ్బుని ముందుగా గుర్తించడంలో విఫలమవుతున్న వైద్యులు, అవగాహన లేని తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌లు చేస్తున్నారు.
‘‘బిడ్డకు రెండు మూడేళ్లు వచ్చాక గాని...ఆటిజమ్ బాధితుడని తెలుసుకోలేకపోవడం దురదృష్టకరం. ఈ విషయంలో మనదేశ వైద్య విధానం, ప్రజల అవగాహన చాలా వెనకబడి ఉందనే చెప్పాలి. ఎన్నో రకాల పరీక్షలు చేసి గాని ఆటిజమ్ ఉందని చెప్పలేకపోతున్నారు. అలా కాకుండా బిడ్డపుట్టగానే ‘యూనివర్సెల్ హియరింగ్ స్క్రీనింగ్’ పేరుతో కొన్ని రకాల పరీక్షలు చేస్తే బిడ్డ పరిస్థితి గురించి వివరంగా తెలిసిపోతుంది. దీనిపై అవగాహన పెంచడం కోసం నేను ప్రత్యేకంగా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాను.
పట్ణణవాసులకు కొంత అవగాహన వస్తోంది కానీ, పల్లె ప్రజలకు దీని గురించి ఇంకా చాలా తెలియాల్సి ఉంది’’ అని చెప్పారు నదియా. ఆటిజమ్‌పై అవగాహన కల్పిస్తూ...తాను చేస్తున్న వైద్యంలో కూడా ఆధునిక పద్ధతులను పరిచయం చేస్తున్నారు నదియా. ‘‘ఆటిజమ్ పిల్లలకు స్పీచ్ థెరపీతో పాటు రకరకాల బొమ్మలసాయంతో కూడా వారి జ్ఞాపకశక్తిలోపాన్ని, వినికిడి లోపాన్ని అధిగమించవచ్చు. దాని కోసం నేను కొన్ని ప్రత్యేకమైన బొమ్మల్ని తయారుచేశాను. చాలామంది నా లాంటి వైద్యులకు వీటి అవసరం ఉంది.
అందుకే ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఫర్ టాయిస్’ వారిని కలిసి నా ఆలోచన గురించి చెప్పాను’’ అని వివరించారు నదియా. వృత్తిలో కొత్త మెలకువలను తెలుసుకుంటూనే గోవాలోని అన్ని ఆసుపత్రులూ తిరుగుతూ ఆటిజమ్ పిల్లలను అక్కున చేర్చుకుంటున్న నదియా లాంటి వైద్యుల ఆలోచనలు ఆదర్శప్రాయమే కాక ఆచరణయోగ్యం కూడా!