మలయాళం మనసిలాయో అంటే... ‘మలయాళం అర్థమవుతుందా’ అని అర్థం. భాష కాని భాష ఎలా అర్థమవుతుంది? నేర్చుకుంటే అర్థమవుతుంది. మలయాళ తారలు నదియా, నజ్రియా తమ భాష కాని భాష తెలుగు నేర్చుకున్నారు. ఎంచక్కా డబ్బింగ్ చెప్పేశారు. ఫారిన్ బ్యూటీ షిర్లియా కూడా తెలుగు నేర్చుకుని, తెలుగు పలుకులు పలికారు. తియ్యగా తియ్యగా ఈ తారలు తెలుగు మాట్లాడితే, ‘పలుకే తెలుగాయె’ అనకుండా ఉండగలమా! ఇక... ఎవరెవరు ఏయే సినిమాలకు డబ్బింగ్ చెప్పారో తెలుసుకుందాం.
మలయాళం, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన నదియా ఇటీవల తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యారు. ‘మిర్చి’, ‘అత్తారింటికి దారేది’, ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ రీసెంట్‌గా ‘గని’ వంటి సినిమాల్లో ఆమె పోషించిన పాత్రలకు తెలుగు ఆడియన్స్ మంచి మార్కులే వేశారు. నదియా నటించిన తాజా చిత్రం ‘అంటే... సుందరానికీ’!. నాని, నజ్రియా హీరో హీరోయిన్లుగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. ఈ సినిమాలో నదియా కీలక పాత్ర చేశారు. అయితే ఇప్పటివరకూ తెలుగులో తన పాత్రలకు డబ్బింగ్ చెప్పని నదియా ‘అంటే...సుందరానికీ..!’లో సొంత గొంతు వినిపిస్తారు.
ఈ సినిమాలో తన పాత్రకు ఆమె ఇటీవల డబ్బింగ్ చెప్పారు. ఇక సుందరం ప్రియురాలు లీలా థామస్ కూడా తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఇంతకీ లీలా థామస్ అంటే తెలుసుగా..! అదేనండీ.. మలయాళ బ్యూటీ నజ్రియాయే. ‘అంటే.. సుందరానికీ..!’ సినిమాతో తెలుగు పరిశ్రమకు వస్తున్నారామె. అయితే తెలుగులో నటిస్తున్న తొలి సినిమాకే నజ్రియా డబ్బింగ్ చెప్పడం విశేషం. ‘‘తొలిసారిగా తెలుగులో డబ్బింగ్ పూర్తి చేశాను. చాలా హ్యాపీగా ఉంది. దర్శకుడు, నా స్నేహితుడు వివేక్ ఆత్రేయ గైడెన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా డబ్బింగ్ పూర్తి చేశాను’’ అన్నారు నజ్రియా. ఇక నదియా, నజ్రియా పలికిన తెలుగు పలుకులను జూన్ 10న థియేటర్స్‌లో వినవచ్చు. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేది ఆ రోజే.
ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయం అవుతున్న ఫారిన్ అమ్మాయిల జాబితాలో షిర్లే సేతియా ఒకరు. ఈ న్యూజిల్యాండ్ బ్యూటీ ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. నాగశౌర్య హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఇటీవల తన పాత్ర డబ్బింగ్ పూర్తి చేశారు షిర్లే. ‘‘హీరోయిన్‌గా పరిచయం అవుతున్న నా తొలి తెలుగు సినిమాకే డబ్బింగ్ చెప్పడం చాలెంజింగ్‌గా అనిపించినప్పటికీ చిత్రయూనిట్ సహకారంతో పూర్తి చేయగలిగాను. తెలుగు డబ్బింగ్ కోసం ప్రిపేర్ కావడం, ఆ తర్వాత చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది’’ అని పేర్కొన్నారు షిర్లే. అలాగే హిందీ అమ్మాయిలు అనన్యా పాండే (‘లైగర్’), మృణాళినీ ఠాకూర్ (‘సీతారామం’) తెలుగుకి పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగు తున్నాయి. మరి.. వీరు కూడా డబ్బింగ్ చెబుతారా? చూడాలి.
ఈసారి సవాల్
దాదాపు 30 సినిమాలు చేసిన తర్వాత కానీ సమంత తెలుగులో డబ్బింగ్ చెప్పలేదు. సమంతకు చిన్మయి డబ్బింగ్ ఆర్టిస్టుగా చేసేవారు. తొలిసారిగా ‘మహానటి’ సినిమాకు డబ్బింగ్ చెప్పారు సమంత. తాజాగా ‘శాకుంతలం’కి చెప్పారు. అయితే ఈసారి చెప్పిన డబ్బింగ్ సమంతకు సవాల్ అనాలి. మైథలాజికల్ ఫిల్మ్ ‘శాకుంతలం’కు గుణశేఖర్ దర్శకుడు. ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పేందుకు సమంత దాదాపు మూడు నెలలు శిక్షణ తీసుకున్నారట. ‘‘ఇది మైథలాజికల్ ఫిల్మ్ కావడంతో ఈ సినిమాలో సమంత చేసిన శకుంతల పాత్ర డైలాగ్స్ గ్రాంథికంలో ఉంటాయి. దీంతో ఉచ్ఛరణపై శ్రద్ధ పెట్టాం. అందుకే కొంత ట్రైనింగ్ తర్వాత సమంత డబ్బింగ్ చెప్పారు. అవుట్‌పుట్ బాగా వచ్చింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment