శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి యోగా!
యోగా ఎన్నో ఒత్తిడులను తొలగిస్తుంది. ఇలా ఒత్తిడులను తొలగించడం ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి దోహదపడుతుంది యోగా. మన దృష్టికేంద్రీకరణ శక్తిని పెంచుతుంది. అనేక వ్యాధుల నివారణపై అవగాహన కల్పించడంతోపాటు, యోగా గురించి ప్రపంచానికి తెలియజెప్పడానికి సంకల్పంతీసుకుంది ‘సాక్షి’. ఇందుకోసం ఈ నెల 8, 9 తేదీల్లో హైటెక్స్‌లో ‘సాక్షి లివ్‌వెల్ ఎక్స్‌పో’ పేరిట భారీ ప్రదర్శనను, అవగాహన కార్యక్రమాలను నిర్వహించనుంది.
భారత ప్రభుత్వ ప్రతిపాదనల వల్ల ఐరాస ఆధ్వర్యంలో ప్రపంచంలోని అన్ని దేశాలు 21 జూన్ అంతర్జాతీయ యోగా దినోత్సవం చేసుకున్నాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా యోగా మీద ఆసక్తి పెరిగింది. కొన్ని వేల ఏళ్లుగా మన దేశంలో యోగ సాధన చేస్తున్నా ఈ తరానికి యోగా మీద పూర్తి అవగాహన లేదంటే అతిశయోక్తి లేదు. పతంజలి మహర్షి శాస్త్రీయంగా క్రోడీకరించిన యోగాను దేశ విదేశాల్లో ప్రాచుర్యం కలగజేసిన ఘనత ప్రఖ్యాత యోగాచార్య, పద్మవిభూషణ్ బి.కె.ఎస్. అయ్యంగార్‌కు దక్కుతుంది. ఆ యోగ గురువు ప్రత్యక్ష శిష్యురాలు శ్రీమతి ఝర్నా మోహన్. ఆమె గత 35 ఏళ్లుగా ఎందరికో యోగా నేర్పిస్తున్నారు. రామకృష్ణ మఠంలో బాలబాలికలకు వ్యక్తిత్వ వికాస పాఠాలు బోధిస్తున్నారు. యోగా గురించి అనేక విషయాల ఆమె మాటల్లో...
ప్ర: యోగ అంటే ఏమిటి?
ఝర్నా : సాహిత్యపరంగానూ, సాంకేతిక పరంగానూ యోగ అంటే శరీరం, మనస్సు, ఆత్మల అపూర్వ కలయిక.
ప్ర: యోగా ఎలా పనిచేస్తుంది?
ఝర్నా : దీన్ని గురించి పతంజలి మహర్షి ‘తదాశియేత్ ప్రకాశ ఆవరణం’ అని పేర్కొన్నారు. అంటే మనను కప్పివేసిన అజ్ఞానపు ముసుగును తొలగించి, మనల్ని మనం తెలుసుకునేలా చేసేదే యోగా.
ప్ర: యోగసాధనకై మనం ఏం చేయాలి?
ఝర్నా : దీనికోసం మనకు కావాల్సింది ఒక క్రమశిక్షణ. యోగశాస్త్రమూ అదే చెబుతోంది. ‘యోగానుశాసనం’ అవసరమని పేర్కొంటోంది. మన జీవితంలోని ఈ క్షణమే అత్యంత విలువైనది అని పేర్కొంటోంది. ఎందుకంటే ఈ క్షణంలో మనం చేసే ప్రయత్నం మనకు విలువైన జ్ఞానాన్ని తెచ్చిపెడుతుంది. అలా స్థలకాలావస్థలకు అతీతంగా మనల్ని గురించిన అవగాహనను మనకు కల్పించేదే యోగా.
ప్ర: అనుశాసనం అంటే...?
ఝర్నా : ఏ విభాగంలోనైనా పనిచేసే సమయంలో మనం రూపొందించుకున్న కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని అనుసరిస్తూనే మనం పనిచేస్తాం. అలాగే యోగ ద్వారా మనలోకి మనం చేసే ప్రయాణంలోనూ మనం కొన్ని నియమాలు పాటించాలి. వాటినే యోగానుశాసన నియమాలుగా పేర్కొనవచ్చు.
ప్ర: మనలోకి మనం ప్రయాణం అంటే ఏమిటి? మనలోకి ఎందుకు ప్రయాణించాలి? ఎక్కడికీ పయనం?
ఝర్నా : మనం అంటే ఒక వ్యక్తిగా మనం కాదు. పాంచభౌతికమైన మనం పంచేంద్రియ జ్ఞానంతో మన మేధలోకీ, మన జ్ఞానంలోకి మన అహంలోకి అంటే పూర్తిగా మనలోకి వెళ్లి అన్వేషించడమే మన గురించి అన్వేషించడం. ఇక ఎందుకు అనే విషయానికి వస్తే... మనం మనకే పరిమితమై ఒక లక్ష్మణరేఖలోపలే ఉండిపోతుంటాం. మన పంచేంద్రియాలతో కనిపించేవరకే పరిమితమవుతాం. కానీ అది దాటి ఆవలకు వెళ్లాలి. ఇప్పుడు ఎక్కడికి అనే ప్రశ్న వస్తుంది. ప్రతి పయనంలోనూ ఒక బయల్దేరే ప్రదేశం, ఒక గమ్యం ఉంటాయి. కానీ ఇక్కడ మన శరీరనిర్మాణాలకు ఆవలగా, అతీతంగా అఖండ సంతోష, అక్షయానందం వైపు చేసే ప్రయాణమే యోగా. దీనికి మనమే వాహనం. ఈ ప్రయాణం ఎనిమిది దశల్లో సాగుతుంది. ఐదు అంశాలను కలిగి ఉంటుంది. త్రిగుణ సమ్మేళనమైనది. ఇవన్నీ సమ్మిశ్రీతమైన పయనమే యోగా.
ప్ర: ఈ ప్రయాణం గురించి కాస్త వివరించండి.
ఝర్నా : మనం యోగపయనాన్ని గురించి కాస్త పరికిద్దాం. ఉదాహరణకు నిటారుగా ఉండే తాడాసనాన్ని తీసుకుందాం. మనలో చాలా సమస్యలు నిటారుగా ఉండకపోవడం వల్లనే వస్తాయి. మనలో చాలామంది ఒకసారి తమ చెప్పుల వైపు చూసుకుంటే అవి రెండూ సమానంగా అరిగి ఉండవు. అంటే మనం రెండు కాళ్ల మీదా సమానమైన బరువు వెయ్యడం లేదన్నమాట.
ఇక అన్నమయకోశమైన ఈ పాంచభౌతిక శరీరాన్ని చూద్దాం. ఇందులో ఒక క్రమబద్ధత ఉంటుంది. ఇందులో ఒక లయ ఉంటుంది. ఎడమవైపునకూ, కుడివైపునకూ ఒక సమానత, సమన్వయం ఉంటాయి. కాళ్ల నుంచి పృష్టభాగం వరకూ, ఆపైన వెన్నెముకకూ, భుజాలవరకూ, మెడకూ, చేతులకూ ఈ సమన్వయం ఉంటుంది. ఒక ఆసనాన్ని అనుసరిస్తున్న వేళ మనం అంటే అదేదో కాళ్లూ, చేతులు, శరీరం, తల అనే వేర్వేరు భాగాలు కాదనీ... సంపూర్ణంగా మనం అనే ఏకరూప వ్యక్తిత్వమని తెలుస్తుంది. మనలోని త్రిగుణాలు ఒక సమత్వ నియంత్రిత దశలో ఉంటాయి. మనం సరిగా కూర్చోకుండా జారగిలబడి కూర్చుంటే అది రజోగుణం. అదే ఒక క్రమత్వంలో కూర్చుంటే సత్వం గుణం. సత్వగుణం ఉత్తమమైన స్థితి.
ప్ర: ప్రాణమయకోశం గురించి వివరించండి.
ఝర్నా : ఒక రైతు తన పొలాన్ని తడపాలనుకున్నాడనుకోండి. అతడు జలాశయం దగ్గర ఉన్న మొక్కకు మరింత ఎక్కువ నీరు, దూరంగా ఉన్న మొక్కకు తక్కువ నీరు సరఫరా అయ్యేలా చూస్తాడా? చూడడు కదా! జలాశయం నుంచి కాలువలను ఏర్పాటు చేస్తూ, చేనులోని అన్ని మొక్కలకు నీళ్లు సమానంగా అందేలా చూస్తాడు. అలాగే మనలో ఉన్న శక్తి (ఎనర్జీ)ని కూడా ఎక్కడా వృథా కాకుండా అంతటా సమాన రీతిలో ప్రవహించేలా చేసేదే ప్రాణమయకోశం.
ప్ర: మనోమయకోశం అంటే ఏమిటి?
ఝర్నా : మనం యోగసాధనలో నిటారుగా కూర్చున్నప్పుడు మన ఛాతీని కాస్త ముందుకు ఉండేలా చేస్తాం. ఇలా చేసే సమయంలో మనలోని ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. నిస్పృహతో ఉన్నవారు ఛాతీని ఎక్కుపెట్టి ఉంచలేరు. ఇలా ఛాతీని విరిచి నిల్చున్నామంటే అది మనలోని ‘థైమస్’ అనే గ్రంథిని ఉత్తేజపరుస్తుంది. ఇక మనలోని మేధోశక్తి ఈ సర్వజగత్తులో ఉన్న శక్తిని ఆనందస్వరూపంలోకి మార్చి మనలోకి ఇంకేలా చేసే స్తితి ఒనగూరుతుంది. మన మేధస్సు ఒక చోట కేంద్రీకృతమై దృష్టి అంతా ఒకేచోట నిలుస్తుంది.
ప్ర: విజ్ఞానమయకోశం అంటే వివరించండి.
ఝర్నా : యోగాను అనుసరిస్తూ మన మేధోజ్ఞానంతో మనల్ని మన నుంచి వేరు చేసుకొని మనను బయటి నుంచి చూడటాన్ని అలవాటు చేసుకోవడమే ‘స్వాధ్యాయ’. ఇలా చేయడం కోసం యోగాచార్య బీకేఎస్ అయ్యంగార్ కొన్ని సులభ మార్గాలను బోధించారు. వీటివల్ల వయసుకు అతీతంగా, ఆరోగ్యపరిస్థితితో నిమిత్తం లేకుండా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా యోగా చేయవచ్చు.
శ్రీమతి ఝర్నా మోహన్
ఈనెల 8, 9 తేదీలలో హైదరాబాద్ హైటెక్స్‌లో జరగనున్న
సాక్షి వెల్‌నెస్ ఎక్స్‌పో గురించి మరింత సమాచారం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ - 96662 84600