
సేవకు వరప్రసాదం
సేవ చేయాలని చాలామంది అనుకుంటారు. ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకునేవారు కొందరైతే, అవకాశాన్ని సృష్టించుకునేవారు కొందరు. ముప్ఫై అయిదేళ్ళ శ్రీనివాస వరప్రసాద్ అవకాశాల్ని సృష్టించుకున్నాడు.
నేను సైతం
‘‘మా పుట్టినరోజులనే కాదు...మా పిల్లల పుట్టినరోజులు, పెళ్లి రోజులు - అన్నింటికీ వృద్ధాశ్రమాలనే వేదికలుగా మార్చేశాం. ఆ ఒక్కరోజైనా వృద్ధుల మధ్యన గడిపిన క్షణాలు సేవాభావానికి మమ్మల్ని మరింత దగ్గర చేస్తున్నాయి.’’
సేవ చేయాలని చాలామంది అనుకుంటారు. ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకునేవారు కొందరైతే, అవకాశాన్ని సృష్టించుకునేవారు కొందరు. ముప్ఫై అయిదేళ్ళ శ్రీనివాస వరప్రసాద్ అవకాశాల్ని సృష్టించుకున్నాడు. ఒకటి రెండు మార్గాలు సరిపోలేదాయనకు. పరిచయమైన ప్రతి చిన్న సేవా హృదయంతో చేయి కలిపారు. వచ్చిన ఆలోచనలన్నీ ఆచరణలో పెట్టారు. ఒక పక్క సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూనే వారాంతాన్ని సేవకు అంకితం చేశారు.
ఒకరోజు వరప్రసాద్‌కి తన స్నేహితుడి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ‘‘ఎవరో రామకృష్ణ అనే మెడికల్ స్టూడెంట్ తండ్రి అకస్మాత్తుగా చనిపోయాడట. దాంతో ఆ అబ్బాయి చదువు మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితి వచ్చిందట. ఆర్థిక సాయం చేయమని ఆన్‌లైన్‌లో కోరుతున్నాడ్రా’’ అన్నాడు. వెంటనే వరప్రసాద్ ఆ మెడికల్ స్టూడెంట్ ఇంటికెళ్లాడు. తండ్రి పోయిన బాధలో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ విద్యార్థి భుజంపై వేసిన చేయి అతను డాక్టర్ అయ్యేవరకూ తీయలేదు వరప్రసాద్.
‘‘రామకృష్ణ, అతని తల్లి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలో ఒక చిన్న షెడ్‌లో ఉండేవారు. అసలే నిరుపేద కుటుంబం. బిడ్డల్ని కష్టపడి చదివించుకుంటున్న తండ్రి ఉన్నట్టుండి చనిపోవడంతో రామకృష్ణ తన చదువుకు సాయం చేయమంటూ ఆన్‌లైన్ రిక్వెస్ట్ పెట్టాడు. విషయం తెలిశాక నా మనసు ఊరుకోలేదు. రష్యాలో అతని తదుపరి వైద్యవిద్యను పూర్తి చేయించాను. రామకృష్ణకు యశోదా ఆసుపత్రిలో ఉద్యోగం వచ్చింది. ఆ రోజు అతని కళ్లలో చూసిన ఆనందాన్ని నేనెప్పటికీ మరచిపోలేను’’ అంటూ ఆ మంచిపనిలో తాను పొందిన ఆనందాన్ని గుర్తుచేసుకున్నారు వరప్రసాద్.
నిరుద్యోగులకు అండగా...: హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉంటున్న వరప్రసాద్ తొమ్మిదేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వారాంతంలో ఏదో ఒక సేవాకార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మొదట కెఎస్‌పి వెల్‌ఫేర్ అసోసియేషన్‌ని స్థాపించారు. తోటి ఐటి ఉద్యోగుల్ని ఇందులో భాగస్వాముల్ని చేశారు. దాదాపు 3000 వేలమంది కెఎస్‌పిలో సభ్యులయ్యారు. ‘‘దీని ద్వారా నిరుద్యోగులకు ఐటి కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించే పని చేశాను. చాలామంది ఇంజనీరింగ్ విద్యార్థులు, కంప్యూటర్ డిగ్రీవాళ్లు ఉద్యోగాలవేటలో రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటి వివరాలు సేకరించి దాదాపు 70 మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇప్పించాం’’ అని చెప్పారు వరప్రసాద్.
వృద్ధుల కోసం...: ఇక ‘చేంజ్ ఆర్గనైజేషన్’ పేరుతో వరప్రసాద్ అండ్ టీమ్ చేస్తున్న సేవ ఓ ఎనిమిది వృద్ధాశ్రమాల్లో అప్పుడప్పుడు కొవ్వొత్తులను వెలిగిస్తోంది. ‘‘మా తల్లిదండ్రులు కూడా వృద్ధుల సేవను ఎక్కువగా ఇష్టపడతారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో ఉంటున్న మా నాన్నగారు నరసింహారావు తీరిక వేళల్లో దగ్గర్లో ఉన్న వృద్ధాశ్రమాలకు వెళ్లి చేతనైనంత సాయం చేస్తుంటారు. నా భార్య రాణి కూడా నాతోపాటు వృద్ధాశ్రమాలకు వచ్చి తనకు చేతనైనంత సేవ చేస్తుంటుంది’’ అని చెప్పారు వరప్రసాద్.
మరో మూడు మార్గాలలో...: ‘సంజీవనీ ల్యాబ్స్’ పేరుతో పేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే ఉచితంగా కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నారు. అలాగే నిర్మాణ్ పేరుతో పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ‘ఎడ్యుకేషన్ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్’ విభాగంలో పబ్లిసిటీ కోర్డినేటర్‌గా పనిచేస్తున్న వరప్రసాద్ ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకూ, సాయంత్రం ఆరు తర్వాత ఈ టోల్ ఫ్రీ నెంబర్‌లో అందుబాటులో ఉంటారు. ఈ మధ్యనే స్థాపించిన ‘థాట్ లీడర్స్ ఫోరమ్’ ద్వారా ఓటు హక్కు గురించి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.
ఇది కాకుండా దీని ముఖ్య లక్ష్యం బాలకార్మికులకు అండగా నిలబడడం. ఎవరైనా బాలలను కూలీలుగా పెట్టుకున్నట్లు తెలిస్తే వరప్రసాద్ బృందం అక్కడి చేరుకుని ఆ బాలల తరపున న్యాయం కోసం పోరాడుతుంది. దీంతోపాటు సేవా దృక్పథానికి కళను జోడించి రెండేళ్ల కిందట ‘శ్రీ కృష్ణదేవరాయ సాంస్కృతిక సంఘా’న్ని ఏర్పాటు చేశారు వరప్రసాద్. దీని ద్వారా కళాకారులకు అవార్డులిచ్చి ప్రోత్సహిస్తున్నారు. ఈ సేవాకార్యక్రమాలకు తోటి ఉద్యోగుల సాయం తీసుకుంటున్నారు. 35 ఏళ్లకే సేవలో ఉన్న ఆత్మసంతృప్తిని తెలుసకున్న వరప్రసాద్ మున్ముందు మరిన్ని సేవాకార్యక్రమాలు చేస్తారని ఆశిద్దాం.