శ్రీవారి హుండీ...
మీకు తెలుసా?
ఏడుకొండలవాడి దర్శనానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఆ స్వామిని కన్నులారా చూసిన వెంటనే అక్కడే ఉన్న హుండీలో కానుకలను సమర్పించడం పరిపాటి. ఈ హుండీకి ఒక కథ ఉంది. అదేమిటో చూద్దాం... స్వామివారికి శ్రీవారి హుండీ ఆలయంలోని తిరుమామణి మంటపంలో ఉంది. రాగి గంగాళాన్ని శంఖుచక్రాలు, తిరునామాలు ముద్రించిన వస్త్రం లోపల ఉంచుతారు. ఆ గంగాళాన్ని హుండీ లేదా కొప్పెర అంటారు. ఈస్టిండియా కంపెనీ పాలన కాలంలో 1821, జూలై 25న ఈ హుండీని ఏర్పాటు చేసినట్లు ఆలయ పరిపాలనా విధానాలను నిర్దేశించే చట్టం బ్రూస్‌కోడ్-12 లో పేర్కొన్నారు. 1958 నవంబర్ 28న, శ్రీవారి ఒక రోజు ఆదాయం మొట్టమొదటిసారిగా లక్ష రూపాయలు దాటింది. ఇప్పుడైతే రోజువారీ హుండీ ఆదాయం కోటిన్నర దాటుతోంది.
కానుకలతో కొప్పెర నిండిన ప్రతిసారీ భక్తుల సమక్షంలో సీలువేసి పారుపత్తేదారు కానుకలు లెక్కించే పరకామణికి చేరవేస్తారు. అక్కడ సీల్ తీసి అందులోని నోట్ల కట్టలు, చిల్లర నాణాలు, బంగారు ఆభరణాలను వేర్వేరుగా లెక్కిస్తారు. లెక్కింపునకు టీటీడీ ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయిస్తుంది. తిరుమల తిరుపతిలో పనిచేసే టీటీడీ సిబ్బందికి నెలకో రోజు చొప్పున ఈ విధులు కేటాయిస్తారు. లెక్కింపు ప్రక్రియ మొత్తాన్నీ సీసీ కెమెరాలలో చిత్రీకరిస్తారు.
పరకామణిలోకి ప్రవేశించే సిబ్బందిని పంచె, బనియన్లతో మాత్రమే లోపలికి అనుమతిస్తారు. రోజుకు సుమారు 50 మంది రెండు బృందాలుగా ిషిఫ్టుల పద్ధతిలో పరకామణి లెక్కింపు కార్యక్రమంలో పాల్గొంటారు.
భద్రత తనిఖీల కారణంగా గతంలో మాదిరిగా కట్టలుకట్టలుగా హుండీలో కానుకలు పడటం లేదు.