కానుకల హుండీకి సీలువేయటంలో నిర్లక్ష్యం | Srivari, Hundi, Seel | Sakshi
Sakshi News home page

కానుకల హుండీకి సీలువేయటంలో నిర్లక్ష్యం

Published Mon, Aug 29 2016 11:03 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

ఇలా లక్కలతో సీలు వేయాలి... తిరుమల ఆలయంలో కానుకలతో నిండిన హుండీకి సీలు వేస్తున్న అధికారులు (ఫైల్‌ఫొటో)

ఇలా లక్కలతో సీలు వేయాలి... తిరుమల ఆలయంలో కానుకలతో నిండిన హుండీకి సీలు వేస్తున్న అధికారులు (ఫైల్‌ఫొటో)

–శ్రీవారి ఆలయ అధికారులపై  మండిపడ్డ టీటీడీ చైర్మన్‌ 
– విజిలెన్స్‌ విచారణకు ఆదేశం
సాక్షి, తిరుమల: భక్తులు భక్తి శ్రద్దలతో శ్రీవేంకటేశ్వర స్వామివారికి ముడుపులు, కానుకల రూపంలో చెల్లించిన  హుండీ భద్రపరిచే విషయంలో తిరుమల ఆలయ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. కానుకలతో నిండిన హుండీకి ఆలయ నిబంధనల ప్రకారం సీలు వేయకుండా వదిలేసిన ఘటన సోమవారం వెలుగుచూసింది. దీనిపై టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు. 
తిరుమల ఆలయంలో రోజూ రూ.2 నుండి 3.5 కోట్ల వరకు హుండీ (కొప్పెర) కానుకలు లభిస్తున్నాయి. ఇలా ఏటా టీటీడీకి రూ.వెయ్యికోట్ల నగదు, రూ.300 కోట్ల విలువైన బంగారు, వెండి, ఇతర ఆస్తులు లభిస్తున్నాయి. భక్తుల రద్దీ బట్టి  ఆలయంలో 7 నుండి 10 హుండీలు కానుకలతో నిండుతుంటాయి.  ఇలా కానుకలతో నిండిన హుండీని సోమవారం ఉదయం 10.20 గంటలు  తొలగించి, దానిస్థానంలో కొత్త హుండీ ఏర్పాటు చేశారు. తొలగించిన హుండీని ఆలయ  నిబంధనల ప్రకారం విధి నిర్వహణలో ఉన్న సంబంధిత  ఆలయ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో  హుండీకి తాడుతో గట్టిగా కట్టాలి. అధికారితోపాటు భక్తుల సమక్షంలో లక్కతో ఆలయ అధికారిక సీలు వేయాల్సి ఉంటుంది. అలాంటి నిబంధనలు పాటించలేదు.  నిర్లక్ష్యంగా కేవలం జనపనార పురిదారంతో హుండీని చుట్టి పక్కన పెట్టేశారు. తర్వాత  ఉదయం 11.20 గంటలకు టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి హుండీ వద్దకు వచ్చి కానుకలు సమర్పించారు. సమీపంలోనే నిండిన హుండీ సీలు లేకుండా , కేవలం పురిదారంతో మాత్రమే ఉండటాటాన్ని గుర్తించారు. ఈ ఘటనపై చైర్మన్‌ సంబంధిత ఆలయ అ«ధికారులపై మండిపడ్డారు. వీఎస్‌వో రవీంద్రారెడ్డిని అక్కడికి పిలిపించి జరిగిన సంఘటనపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు. భక్తులు సమర్పించే కానుకల్లోనూ బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఎలా? అంటూ అక్కడి సిబ్బందిని మందలించారు. భక్తులు సమర్పించే కానుకలు కాపాడటంలో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో వ్యవహరించాలని సూచించారు. హుండీ కానుకలు భద్రత, లెక్కింపుల్లో టీటీడీ ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు ప్రత్యేక సూచనలు చేసినప్పటికీ ఆలయ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించటం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement