ఉదర'భార'తం | stomach diseases in india | Sakshi
Sakshi News home page

ఉదర'భార'తం

Published Sun, Jun 5 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM

ఉదర'భార'తం

ఉదర'భార'తం

పొట్ట పాట్లు
‘‘మేము మనిషిని నడిపిస్తాం. మేమే లేకపోతే మనిషి ఉన్న చోటనే రాయిలా పడి ఉంటాడు’’ బడాయి పోయాయి కాళ్లు. ‘‘మీ సాయంతో నడిచి వెళ్లిన వాడు ఏ పని చేయాలన్నా మమ్మల్ని నమ్ముకోవాల్సిందే. మేమే లేకపోతే కాలు గాలిన పిల్లిలా తిరుగుతాడు తప్ప వీసమెత్తు పని చేయలేడు’’ ఇంకా బడాయి పోయాయి చేతులు. ‘‘మీ ముఖం... ఎక్కడికెళ్లాలన్నా, ఏ పని చేయాలన్నా నేను దారి చూపితేనే మనిషి కదలగలిగేది’’ అంటూ కాళ్లుచేతుల కళ్లు తెరిపించాయి కళ్లు.

ఇక దేహంలో ఒక్కొక్కటి నేనంటే నేనే కీలకం అని తమ ప్రాధాన్యాన్ని గుర్తు చేసుకున్నాయి. బడాయి కబుర్లతో ఆగిపోక అన్నీ కలిసి పొట్టను ఆడిపోసుకున్నాయి. ‘తినడం తప్ప నువ్వు చేసే పనేమిటి’ అని గేలి చేశాయి. పొట్ట తీవ్రంగా బాధపడింది. మనిషిని నిజంగా తన అవసరమే లేదా అని కుమిలిపోయింది. ఏమీ తినాలనిపించలేదు, తాగాలనిపించలేదు. రోజంతా అలాగే ఉండిపోయింది.

మరుసటి రోజు...
కాళ్లు చేతులు నిస్సత్తువగా కదల్లేకపోతున్నాయి. ఏమైందో తెలియడం లేదు వాటికి. కళ్లు నీరసంతో మూసుకుపోతున్నాయి. ఒక్కొక్క భాగం ఒకదాని బాధ ఇంకోదానితో చెప్పుకున్నాయి. అంతటికీ కారణం ఆహారం లేకపోవడమే అని నిర్ధారణకు వచ్చాయి. పొట్ట కూడా తాను ఊరికే తిని కూర్చోవడం లేదని, మనిషికి చాలా అవసరమైన భాగాన్ని అని తెలుసుకుని సంతోషించింది. అప్పటి నుంచి అన్ని భాగాలూ పొట్టను గౌరవించడం మొదలుపెట్టాయి.
 
అమ్మమ్మ, నానమ్మలు ఈ కథను పిల్లలందరికీ చెప్పే ఉంటారు. బాగా అన్నం తిని ఆరోగ్యంగా పెరగాలనే సదుద్దేశంతో ఈ కథను బాగా ఒంటపట్టించేశారు కూడా. దాంతో ఈ తరం మగవాళ్లు పొట్టే ప్రధానం అనుకుంటున్నట్లు ఉన్నారు. పొట్ట పెంచని మగపురుషుడు కనిపించడం లేదు.
 
ఎనభైలకు ముందు వందలో ఇరవై మంది పొట్టరాయుళ్లు కనిపించే వాళ్లు. వాళ్లకు సౌకర్యవంతమైన, విలాసవంతమైన జీవనం గడిపేవారిగా గౌరవమూ దక్కేది. తరం మారింది. తండ్రి పొట్ట చూస్తూ పెరుగుతున్నారు కొడుకులు. ‘మీసం లేకపోయినా ఫరవాలేదు, పొట్ట పెరగకపోతే మగాణ్ననిపించుకోలేనేమో’ అన్నట్లు పొట్ట మీద ప్రేమ ‘పెంచేసుకుంటున్నారు’. సినిమా హీరోలా ఉండాలని హెయిర్‌స్టయిల్ మారుస్తారు, షర్ట్ స్టయిల్ మారుస్తారు. మీసం తీసేస్తారు. పొట్ట కరిగించకపోతే గ్లామర్ జీరోనే అని మర్చిపోతారు.
 
21వ శతాబ్దం!
ఏతావాతా తేలిందేమిటంటే... 21వ శతాబ్దపు ఆరంభంలో పొట్టకు ఎక్కడ లేని గౌరవమూ వచ్చేసింది. దేహంలో తానే ప్రధానం అన్నట్లు ముందుకు చొచ్చుకుని వచ్చేసింది. అప్పుడెప్పుడో 19, 20 శతాబ్దం వరకు బడాయి పోయిన కాళ్లు చేతులు ఇప్పుడు పొట్టకు అంగరక్షకులుగా ఆపసోపాలు పడుతున్నాయి. మనిషి నడుస్తుంటే పొట్టేమో ఠీవిగా ఉంటుంది. కొన్నిసార్లు చిన్న పిల్లల్లా చిలిపిగా చొక్కాలోంచి తొంగిచూస్తూ ఉంటుంది. అంత భారీ కాయాన్ని నడిపించలేక మోకాళ్లు అరిగిపోతున్నాయి. కాళ్ల కష్టాలను చూద్దామని కళ్లు ఆరాటపడుతుంటాయి. కానీ పాదాలు కనిపిస్తే కదా! ఇదీ మోడరన్ మగాడి రూపం.

దేహానిదేముంది బుర్ర ప్రధానం. ఐటి సాఫ్ట్‌వేర్‌లో దూసుకుపోతున్న మేధ మా సొంతం. మా బుర్రలు పాదరసంలాంటివి అని కొత్తగా బడాయి పోవాలని ఓ ప్రయత్నమైతే చేస్తోంది ఈ తరం. ‘‘అవును, నిజ్జంగా నిజం, మీవి పాదరసంలాంటి బుర్రలే. తల మీద రూపాయి పెడితే పాదరసం కంటే త్వరగా జారి కింద పడుతుంది’’ అని ఏ అమ్మాయైనా కిసుక్కున నవ్వితే ముఖం బీట్‌రూట్ రంగులోకి మారుతుంది.
 
అయినా... మగాడు మగాడే!
ఎందుకంటే?
తాను పెద్ద బెల్టుల కోసం మార్కెట్‌ని గాలిస్తూ, దువ్వెన అనే సాధనం ఒకటుంటుందని మర్చిపోయినా సరే భార్య నాజూగ్గా ఇలియానాలా ఉండాలంటాడు. ఇద్దరు పిల్లలు పుట్టి, ట్యూబెక్టమీ అయినా సరే... దేహం ఐదారు కేజీల బరువు పెరిగితే సహించలేడు. భార్య సమంతలా కరెంటు తీగలా లేదని వంకలు పెడుతుంటాడు.
 
ప్చ్... మగాళ్లకు తెలియని సంగతి ఒకటుంది. తెలిసినా అంగీకరించని సంగతి కూడా! అదేంటంటే... ఆడవాళ్లలో ఒబేసిటీ మగాళ్లకెలా నచ్చదో... మగాళ్ల బట్టతల, బాన పొట్ట కూడా ఆడవాళ్లకు నచ్చవని! ‘అయినా... అతడు మారడు, అతడి వైఖరి మారదు’. ఆ ఒక్కటీ మారితే... భర్తకు బర్త్‌డే రోజు స్లిమ్ ఫిట్ చొక్కా బహుమతిగా ఇవ్వాలనే భార్యల కోరిక తీరుతుంది. బిడ్డలు పుట్టాక స్త్రీ రూపంలో అనివార్యంగా వచ్చే మార్పులను ఏమాత్రం సహించలేరు. బద్దకం పెంచుకుని తాము పెంచుకునే పొట్టలను పరిగణనలోకి తీసుకోరు.
 - వాకా మంజులారెడ్డి
 
భార్య బరువు తగ్గినా ఆ ముఖం వెలగలేదు!
సౌదీ అరేబియా రాజధాని నగరం రియాద్. ఓ భర్త తన భార్యకు విడాకులిచ్చేశాడు. విడాకులివ్వడానికి అతడు చెప్పిన కారణం ఏమిటంటే... ఇల్లు కొనుక్కుందామని దాచిన ఎనభై వేల రియాల్‌లతో బరువు తగ్గడానికి ఆపరేషన్ చేయించుకుంది. అలాగని ఆ భార్య అమాయకురాలేమీ కాదు. టీచరుగా ఉద్యోగం చేస్తోంది. ఆమె తన దేహం మీద అంత పెద్ద ప్రయోగానికి ఎందుకు సిద్ధపడింది? ఈ సాహసం ఆమె తనకు తానే చేసిందా? అంటే... దీనికంతటికీ కారణం భర్త పోరే.

అతడు తరచుగా భార్య స్థూలకాయాన్నే ప్రస్తావించడమేనని గల్ఫ్ న్యూస్ రిపోర్ట్ చేసింది. బరువు తగ్గి సన్నగా మారి భర్తను సర్‌ప్రైజ్ చేయాలనుకున్నదామె. భర్త బదిలీ మీద వేరే ఊరికి వెళ్లడంతో ఆ సమయంలో బరువు తగ్గించే సర్జరీకి వెళ్లింది. సెలవులకు ఇంటికొచ్చిన భర్త నాజూకుగా కనిపించిన భార్యను చూసి ఉబ్బి తబ్బిబ్బై పోయాట్ట. కానీ ఆపరేషన్ కోసం తను దాచుకున్న డబ్బును ఖర్చు చేసినట్లు తెలియగానే ఆయన గారి సంతోషం ఆవిరైపోయింది. ‘స్థూలకాయం వద్దు సన్నదనమే ముద్దు’ అనడం వరకు ఓకే, కానీ తన డబ్బు తనకు అంతకంటే ముద్దు అని చెప్పకనే చెప్పుకున్నాడు. ఆ భర్త నిర్వాకాన్ని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. కానీ అతడిలో చలనం కనిపించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement