బిడ్డల సంతోషమే తండ్రి సంతోషం
మనకు ఐదు ఇంద్రియాలున్నాయి. ఈ ఇంద్రియాలకు అధిదేవత విష్ణువు. అధోక్షజుడు అని కూడా అంటారు. ఈ ఇంద్రియాలు ఏర్పడడానికి అవసరమైన వ్యూహానికి అనుగుణమైన వీర్యాన్ని నిక్షేపించిన వాడు తండ్రి. ఆయన వదిలిన తేజస్సునుంచే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో సంఘాతమైన ఈ శరీరం తయారయింది. కాబట్టి తండ్రి సాక్షాత్ విష్ణువే. సమస్త సుఖదుఃఖాలకు కారణం ఆయనే.
భూమండలాన్నంతటినీ శ్రీమహావిష్ణువు రక్షిస్తుంటాడు. ఒకానొకప్పుడు ఆదివరాహమూర్తిగా దంష్ట్రల మీద పైకెత్తాడు. ఆయన సతీస్వరూపంగా భూదేవి ఉంటుంది. అటువంటి భూమి సమస్త సుఖాలకు కారణం. ఈ భూమికి ’క్షితి’ అని పేరు. ’క్ష’కారం ’ఓర్పు’కి మారువాచకం. భూదేవికి ఎంత ఓర్పంటే... మనం ఉండడానికి, బతకడానికి ఆధారంగా ఉంటుంది. ఆకలేస్తే అన్నం తింటున్నామంటే అది భూమిచ్చిన పదార్థమే. దాహమేస్తే నీళ్ళు తాగుతున్నామంటే అది భూమి చలవే.
ఊపిరి తీసుకుంటున్నామంటే అది భూమ్మీద ఉండే గాలే. తిన్నదాంట్లో శేషం మిగిలితే మళ్ళీ భూమే దాన్ని పట్టుకుంటుది. తాగిన దాంట్లో శేషం మిగిలితే భూమే పుచ్చుకుంటుంది. మనం విడిచిన గాలికూడా ప్రకృతే తీసుకుంటుంది. సకలభోగాలకూ ఆమే కారణం. అందుకే వసుంధర అని పేరు. ఆమె విష్ణువు సొత్తు. అసలు ఆనందమంతా ఆయన అనుభవించాలి. కానీ ‘అయ్యో! వీళ్ళు నా బిడ్డలు, నన్ను నమ్ముకుని ఉన్నారు’ అని అదంతా మనకిస్తున్నాడు. మనం అనుభవిస్తుంటే అది చూసి ఆయన సంతోషిస్తుంటాడు. పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు తండ్రిరూపంలో ఉంటారు. తనదైన దానిని భక్తులకిచ్చి, తన భక్తులు సంతోషిస్తుంటే చూసి ఆనందించడం విష్ణువు స్వభావం.
తండ్రి లక్షణం కూడా అదే. ఒకసారి వ్యాసరచనపోటీలో ఒక మహమ్మదీయ విద్యార్థిని రాసిన ఒక వ్యాసం చదివి కన్నీటిపర్యంతమయ్యాను. 42ఏళ్ళ తండ్రి తనకు బ్లడ్‌కాన్సరని ముందే తెలిసినా ఏనాడూ బిడ్డలకు చెప్పలేదు. వారికోసం ఆయనెంతో కష్టపడుతుండేవాడు. చివరకు చనిపోయినప్పుడు బంధుమిత్రులందరూ వచ్చి ఆయన గుండెనిబ్బరాన్ని పిల్లలపట్ల ప్రేమను పొగుడుతుంటే... అందరికీ ముందే తెలిసిన విషయం తమకు ఎందుకు చెప్పలేదని తల్లిని నిలదీశారు. ‘‘ఎలాగూ చావు తప్పదు. అప్పుడు బాధపడక తప్పదు. ముందే పిల్లలకు తెలిస్తే ఇప్పటినుంచే బాధపడతారు. వాళ్ళు బాధపడుతుంటే నా బొందిలో ప్రాణం ఉండగా నేను చూడలేను. అందుకే పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దని మీ నాన్న నా చేత ఒట్టేయించుకున్నాడు’’ అని మా అమ్మ చెప్పిందని రాసింది. అదీ తండ్రి ప్రేమంటే, అదీ విష్ణుస్వరూపమంటే.
తండ్రి స్వయంగా కష్టపడతాడు. కానీ తన బిడ్డలు మాత్రం సుఖపడాలని కోరుకుంటాడు. తాను శ్రమపడి తెచ్చింది తాను అనుభవించడు. అంతా తన బిడ్డల సంతోషానికి ఉపయోగిస్తాడు. తను స్వయంగా వాటిని అనుభవించకపోయినా, బిడ్డలు అనుభవిస్తుంటే వారి ముఖాల్లోని ఆనందాన్ని చూసి తెగ మురిసిపోతాడు.